
సాక్షి, న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ వెంట సేనలను పూర్తిగా ఉపసంహరించేంత వరకూ చైనాతో సాధారణ కార్యకలాపాలు జరగవని రష్యాలో భారత రాయబారి వెంకటేష్ వర్మ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్స్ ప్రకారం నియంత్రణ రేఖ వెంబడి చైనా సైనిక దళాలు పూర్తిగా వెనక్కిమళ్లేంతవరకూ ఆ దేశంతో ఎలాంటి వాణిజ్య, సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించబోమని డ్రాగన్‌కు స్పష్టం చేశామని రష‍్యన్ వార్తాసంస్థతో మాట్లాడుతూ వర్మ పేర్కొన్నారు. విస్తరణవాదానికి కాలం చెల్లిందని, ఇది అభివృద్ధి యుగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను భారత రాయబారి వర్మ గుర్తుచేశారు.
భారత్-రష్యాల మధ్య ఉమ్మడి ప్రయోజనాలను ఇరు దేశాలు కాంక్షిస్తున్న క్రమంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్ధిరత, ఆర్ధిక సౌభాగ్యం వెల్లివిరుస్తున్నాయని అన్నారు. ఈ ప్రాంత ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఏ ఒక్క దేశం వ్యవహరించరాదని అన్నారు. కాగా గల్వాన్ లోయలో భారత్-చైనా సేనల మధ్య జూన్ 15న జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్ధితిని రష్యాకు భారత్ ఇటీవల వివరించింది. మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం విక్టరీ డే ప్రదర్శనలో పాల్గొనేందుకు జూన్‌లో మాస్కోను సందర్శించారు. చదవండి : ‘చైనాను మార్చకుంటే అది మనల్ని మింగేస్తుంది’
Comments
Please login to add a commentAdd a comment