ఇరుదేశాల మిలిటరీ సంబంధాలు పునరుద్ధరించాలని చెప్పడం ద్వారా అమెరికా, చైనా తమ మధ్య అంతరం తగ్గిందన్న సంకేతాన్ని పంపాయి. అమెరికా దగ్గరవుతున్న నేపథ్యంలో రష్యా మనకు దూరమవుతున్నట్లు గతేడాది కొన్ని అపోహలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, రష్యాతో మన సంబంధాలు గాఢమైనవి. పైగా... తాజాగా భారత్, రష్యా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైన భావన కలిగింది.
రష్యా, చైనా, అమెరికా మధ్య సంబంధాలు బహుముఖమైనవి మాత్రమే కాదు, సంక్లిష్టమైనవి కూడా. ఈ మూడింటి మధ్య సంబంధాల్లో వచ్చే మార్పుల ప్రభావం భారత్‌పై కచ్చితంగా ఉంటుంది. ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో భారత్ అటు రష్యాపైనా, ఇటు అమెరికాపైనా ఆధారపడి ఉంది. కానీ, అగ్రదేశాల సరసన నిలవాలన్న భారత ఆకాంక్ష నెరవేరాలంటే దేశ సైనిక సామర్థ్యం ఇతరులపై ఆధారపడేలా ఉండరాదు.
భారతదేశం గొప్ప ఆత్మవిశ్వాసంతో 2024 లోకి అడుగుపెట్టింది. కొత్త ఏడాది తొలి వారంలోనే ఆదిత్య–ఎల్1 విజయవంతంగా సూర్యుడి హాలో కక్ష్యలో ప్రవేశించడం, ఉత్తర అరేబియా సముద్రంలో పైరేట్లను తరిమికొట్టేందుకు భారత నేవీ నాటకీయమైన తీరులో ఆపరేషన్లు చేపట్టడం, అన్నీ శుభసూచనలే. 2023–24లో జీడీపీ వృద్ధి రేటు ఆరోగ్యకరమైన రీతిలో దాదాపు 7.3 శాతం వరకూ ఉండవచ్చునని జాతీయ గణాంక శాఖ ప్రకటించిన విషయమూ సంతోషకరమైన సమాచారమే. అన్నింటికీ మించి భారత్ విజయాలను గుర్తిస్తూ, చైనా వార్తా పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ఒక కథనమూ ప్రచురించింది. భారత్ చాలా వేగంగా సామాజిక, ఆర్థిక వృద్ధి సాధిస్తోందని ఇందులో అభిప్రాయపడింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వ్యూహాత్మక శక్తిగా భారత్ ఎదుగుతోందని కొనియాడింది.
రెండూ ముఖ్యమే!
అయితే, ఈ విజయాలను ఆస్వాదించే క్రమంలో మనం గత ఏడాది ఆఖరులో జరిగిన కొన్ని అవాంఛనీయ ఘటనల గురించి మరచిపోరాదు. అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా... ప్రాంతీయంగానూ ఇతర దేశాలతో మన సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేయగల ముఖ్యమైన సంఘటనలు అవి. వ్యూహాత్మక లక్ష్యాలను కాపాడుకోవడంలో, సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ సత్తాను ప్రశ్నించే అవకాశమూ వీటికి ఉంది.
భారత విదేశీ వ్యవహారాల విధానాన్ని స్థూలంగా పరిశీలిస్తే... అమెరికాకు దగ్గరవడం... అదే సమయంలో రష్యాకు నెమ్మదిగా దూరంగా జరగడం అని అనిపిస్తుంది. ఉక్రెయిన్ , రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్ మౌనం వహించడం ఈ భావనకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే సూక్ష్మస్థాయిలో అర్థం చేసుకోవాల్సిందేమిటి అంటే... భారత్ అటు రష్యాపైనా, ఇటు అమెరికాపైనా ఆధారపడిఉందీ అని. ఇరు దేశాలూ మన మిలిటరీకి అవసరమైన ఆయుధాలు, టెక్నాలజీలు అందిస్తున్నాయి. ఈ పరిమితుల దృష్ట్యానే భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని వ్యక్తం చేయలేకపోతోంది. మరీ ముఖ్యంగా పొరుగుదేశం చైనాను దృష్టిలో ఉంచుకున్నప్పుడు.
అయితే 2023 చివరి నాటికి అంతర్జాతీయ వ్యవహారాల్లో పరిస్థితులు కొంచెం వేగంగా మారిపోయాయి. వాటి ప్రభావం ఈ ఏడాది మనపై కచ్చితంగా పడనుంది. నవంబరులో అమెరికా అధ్య క్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య శాన్ఫ్రాన్సిస్కోలో ‘ఏపీఈసీ’ సమావేశాల్లో కీలకమైన చర్చలు జరిగాయి. ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాల మధ్య ఏర్పడ్డ ప్రతిష్టంభన కొద్దిగా తొలగిన సూచనలు కనిపించాయి. ఇక డిసెంబరు చివరివారంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ రష్యా వెళ్లి, ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సెర్గీ లావరోవ్‌తో సమావేశమయ్యారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలం మాదిరిగానే రష్యాతో భారత్ తన సంబంధా లను దృఢతరం చేసుకునేందుకు నిబద్ధమై ఉందని జైశంకర్ రష్యా మంత్రి సెర్గీకి నొక్కి చెప్పినట్లు వార్తలొచ్చాయి.
సంక్లిష్టం... బహుముఖం...
రష్యా, చైనా, అమెరికా మధ్య సంబంధాలు బహుముఖమైనవి మాత్రమే కాదు... చాలా సంక్లిష్టమైనవి కూడా. ఈ మూడింటి మధ్య సంబంధాల్లో వచ్చే మార్పుల ప్రభావం భారత్‌పై కచ్చితంగాఉంటుంది. ప్రపంచ స్థాయిలో మన ప్రస్థానాన్ని, దిశను మార్చేయగల శక్తి వీటి సొంతం. ఈ సంబంధాల్లోనూ అమెరికా– చైనా మధ్య ఉన్నవి మరింత కీలకం. బైడెన్, జిన్పింగ్ ఇటీవలి శిఖరాగ్ర సమావేశంసందర్భంగా కొన్ని అంశాలపై స్థూలంగా ఏకాభిప్రాయానికి రాగలి గారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు ఇందుకు అడ్డు కాకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.
ఇరుదేశాల మిలిటరీల మధ్యసంబంధాలు పునరుద్ధరించాలని చెప్పడం ద్వారా అమెరికా, చైనారెండూ తమ మధ్య అంతరం తగ్గిందన్న సంకేతాన్ని పంపాయి. రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–గాజా యుద్ధాలకు సమీప భవిష్యత్తులో ఒక అర్థవంతమైన పరిష్కారం లభించగలదన్న ఆశ సమీప భవి ష్యత్తులో కనబడని నేపథ్యంలో, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో దేశాలకు ఊరటనిచ్చే అంశమిది. స్థానిక పరిస్థితులు, ఉన్న పరిమితు లను దృష్టిలో ఉంచుకుని ఇరువురు నేతలు తమ మధ్య అంతరాలను పక్కనబెట్టి ఈ రకమైన రాజీకి వచ్చి ఉండవచ్చు.
చైనా–అమెరికా మధ్య మిలిటరీ స్థాయిలో యుద్ధం లేదా చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకున్నా దాని విపరిణామాలు తీవ్రంగా ఉండేవి. కాబట్టి తాత్కాలికంగానైనా ఈ ఉపశమనం దక్కడం ముఖ్యమైన విషయం అవుతుంది. తైవాన్ విషయంలో ఇరు దేశాలు మెత్తపడిందేమీ లేకున్నా భారత్ దృష్టిలో మాత్రం చైనా–అమెరికా మధ్య వైరం కొంతైనా తగ్గడం ఎంతో కీలకమైంది.
సొంతంగా ఎదిగినప్పుడే...
అమెరికా ఇండో–పసఫిక్ వ్యూహంలో భారత్ ప్రధాన భాగస్వామి అన్న అంచనా ఉంది. మరి చైనా– అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడటం భారత్‌కు ఏమైనా నష్టం చేకూరుస్తుందా? అవకాశమైతే ఉంది. పైగా ద్వైపాక్షిక స్థాయిలో ఇరు దేశాల మధ్య గత ఏడాది చివరిలో కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తమ పౌరుడు ఒకరిని చంపేందుకు భారత్ కుట్ర పన్నిందని అమెరికా ఆరోపించింది. ఈ కోణంలో చూస్తే భారత్ మీద అమెరికాకు కొంత అసంతృప్తి ఉన్నట్లు స్పష్టమవుతుంది.
1970లలో హెన్రీ కిసింజర్ అమెరికా విదేశాంగ మంత్రిగా ఉండగా, అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ చైనాతో సంబంధాలను మెరుగుపరచుకునే ప్రయత్నం చేశారు. ఇది కాస్తా భారత్, యునైటెడ్ సోవియట్ రిపబ్లిక్ మధ్య బంధాలు గట్టిపడేలా చేసింది. సోవియట్ వారసురాలిగా కొనసాగిన రష్యాతో ఆ సంబంధాలు ఇప్పటికీ కొన సాగుతున్నాయి. భారత త్రివిధ దళాలకు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారుగా మారింది. అమెరికా దగ్గరవుతున్న నేపథ్యంలో రష్యా మనకు దూరమవుతున్నట్లు 2023లో కొన్ని అపోహలైతే ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజాగా కూడా భారత్, రష్యా సంబంధాల్లో సరి కొత్త అధ్యాయం ఒకటి మొదలు కానున్నట్లు తెలుస్తోంది.
భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కాంక్షిస్తోంది. అలాగే అగ్రరాజ్యాల సరసన నిలవాలని కూడా ఆశిస్తోంది. అయితే మిలిటరీ విషయాల్లో విదేశాలపై ఆధారపడుతూంటే భారత్ ఆశలు, ఆకాంక్షలు నెరవేరడం కష్టం. అమెరికా, రష్యా, చైనా తమ స్వప్రయోజనాల కోసం ప్రయత్నించినా ద్వైపాక్షిక స్థాయిలో దగ్గరి సంబంధాలు కలిగి ఉండటం మనకు అవసరం. మన రాజకీయ, దౌత్య చతురతకు ఇది నిజంగానే ఒక సవాలు!
వ్యాసకర్త సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
- కమడోర్
సి. ఉదయ భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment