
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
అభిప్రాయం
తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి మళ్లీ భూమ్మీదకు చేరారు. చాలామంది సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌లో ఇరుక్కుపోయారని అన్నారు. ఈ వర్ణన అంత సరైంది కాదు. ఐఎస్‌ఎస్‌లో దీర్ఘకాలం ఉండటం ఇదే మొదటిసారి కాదు. సుమారు పాతికేళ్లుగా మనుగడలో ఉన్న ఐఎస్‌ఎస్‌లో నిత్యం యూఎస్, రష్యా, యూరప్, జపాన్ వ్యోమగాములు ఉంటూనే ఉన్నారు. ఒక్కొక్కరి కాలావధి వేర్వేరుగా ఉండవచ్చు.
కనీసం 4 నుంచి 8 మంది వ్యోమగాములు జీవశాస్త్ర, బయోమెడికల్, మొక్కలకు సంబంధించిన ప్రయోగాలు చేస్తూ వచ్చారు. గత వారం కొద్ది కాలమైనా సరే... దాదాపు 11 మంది వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌లో గడిపారు. పరిశోధనలు చేయడంతోపాటు ఉపగ్రహాలను ప్రయోగించడం, ఐఎస్‌ఎస్ నిర్వహణ పనులు చేశారు వీరందరూ! స్పేస్ వాక్స్ ద్వారా ఐఎస్‌ఎస్ వెలుపల ఉండే రోబో చేతుల మర మ్మతులు కూడా ఉన్నాయి ఈ పనుల్లో! వ్యోమగాములు నిత్యం ఐఎస్‌ఎస్‌లో ఉంటారు కాబట్టి వారికి ఆహారం, ఇతర సరుకుల రవాణా ఎప్పటికప్పుడు జరిగింది.
అంతరిక్ష కేంద్రంలో సునీత, విల్మోర్‌లు 286 రోజుల పాటు ఉండటం చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ... కొత్త కాదు. ఫ్రాంక్ రూబియో విషయాన్నే తీసుకుంటే... 2023 సెప్టెంబరులో ఆయన 371 రోజులపాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి రికార్డు సష్టించారు. ఈ క్రమంలో ఆయన 2022లో మార్క్ వెండే హే 355 రోజుల రికార్డును బద్దలు కొట్టారు. అయినప్పటికీ సోవియట్ యూనియన్ కాస్మోనాట్ల రికార్డులతో పోలిస్తే ఇవి తక్కువ.
సోవియట్ యూనియన్ ప్రయోగించిన ‘మిర్’ అంతరిక్ష కేంద్రమే... కాలక్రమంలో ఇతర దేశాల భాగస్వామ్యంతో ఐఎస్‌ఎస్‌గా రూపాంతరం చెందిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. భౌతిక శాస్త్రవేత్త, కాస్మోనాట్... వలేరీ పోల్యాకోవ్ 1994–95లో ఎకాయెకిన సుమారు 437 రోజులపాటు మిర్ స్టేషన్‌లో గడిపారు. ప్రస్తుతం చైనా సిద్ధం చేసిన అంతరిక్ష కేంద్రం టియాన్ గాంగ్‌లో ముగ్గురు వ్యోమగాములు 139 రోజులుగా ఉంటు న్నారు. వీరిలో కాయ్ షూజీకి అంతరిక్షంలో 320 రోజులు గడిపిన అనుభవం ఉంది.
లక్ష్యాల్లో ఒకటి అదే...
అంతరిక్ష కేంద్రం ఏర్పాటు లక్ష్యాల్లో ఒకటి– దీర్ఘకాలం అంతరిక్షంలో గడపడం. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ సమయం గడిపితే మనకేం అవుతుందన్న విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇలా ఎక్కువ కాలం అక్కడ గడిపినప్పుడు ఎముకలు, కండరాలు బలహీనపడతాయన్న విషయం మాత్రం ఆందోళన కలిగించే వ్యవహారమే.
1970లలో శాల్యూట్, స్కైల్యాబ్‌లతో ప్రయోగాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ అంశాలకు సంబంధించి బోలెడంత సమాచారం సేకరించారు. బయో మెడికల్ సమాచా రాన్ని సేకరించడమే లక్ష్యంగా పలు పరిశోధనలు జరిగాయి. ఉదాహరణకు ప్రస్తుత అంతరిక్ష యాత్రలో విల్మోర్ సైక్లింగ్, రోయింగ్, రెసిస్టెన్స్ వ్యాయామాలను కలిపి చేయగల ఒక పరికరాన్ని ఐఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేయడానికి సాయ పడ్డారు.
ఎక్కువ సమయం ఇక్కడ గడపాల్సిన వ్యోమ గాములు ఈ పరికరం ద్వారా వ్యాయామాలు చేస్తే కండ రాలు, ఎముకలు మరీ గుల్లబారకుండా ఉంటాయి. గుండెకూ మేలవుతుంది. గుండె కొట్టుకునే వేగం, శ్వాస, రక్త పోటు వంటి... గుండె–రక్తనాళాలకు సంబంధించిన డేటాను సేకరించడానికీ, ఉష్ణోగ్రతలను వ్యోమగాములు వేసుకునే దుస్తుల్లో ఉంచిన సెన్సార్‌ల ద్వారా రాబట్టేందుకూ ఉద్దేశించిన ప్రయోగం కూడా జరిగింది. భవిష్యత్తులో మనిషి జాబిల్లిపై, అంగారకుడిపై నివసించాల్సి వస్తే... ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వారి పరమావధిగా ఉండనుంది.
1970, 1980లలో సోవియట్ యూనియన్ , అమెరికన్ల అంతరిక్ష కేంద్రాల అనుభవం తరువాత ఇది చాలా ఖరీదైన వ్యవహారమని వారికి అర్థమైంది. ఈ కారణంగానే ఐఎస్‌ఎస్ నిర్మాణం, నిర్వహణ రెండింటినీ అంతర్జాతీయ స్థాయికి చేర్చి పలు దేశాలు పాల్గొనేలా చేశారు. నాసా, కెనడా స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ ఏజెన్సీ, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లొరేషన్ ఏజెన్సీ, రాస్కోమాస్‌లు ఐఎస్‌ఎస్ నిర్వహణ బాధ్యతలు చేపట్టాయి. ఆయా ఏజెన్సీలు అందించిన పరిక రాల నిర్వహణ బాధ్యత వారిదే.
2000వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ అరవై ప్రయోగాల ద్వారా ఐఎస్ ఎస్‌ను 21 దేశాలకు చెందిన 260 మంది వ్యోమగాములు సందర్శించారు. భారత్ వ్యోమగామి శుభాంశు శుక్లా కూడా త్వరలోనే ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్నారు. ఐఎస్‌ఎస్ 2030 వరకూ పని చేయనుంది. చైనా ఇప్పటికే ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోగా... 2035 నాటికి ఒక కేంద్ర నిర్మాణానికి భారత్ ప్రయత్నిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో మొదలైన అంతరిక్ష కేంద్రం ఏర్పాటు ఆలోచన ఈ అంతర్జాతీయ ప్రాజెక్టు!
అంతరిక్ష ప్రయోగాల విషయంలో అమెరికా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలోనే ప్రయోగాలు జరగనున్నాయి. స్పేస్ ఎక్స్, బోయింగ్ వంటివి సరుకు రవాణా కోసం ప్రత్యే కమైన నౌకలను సిద్ధం చేయనున్నాయి. నాసాతో కలిసి పని చేస్తున్న ఈ రెండు సంస్థలూ ఐఎస్‌ఎస్ నిర్వహణతోపాటు జాబిల్లి, అంగారకుడిపైకి చేరే ప్రయత్నాలు చేస్తున్నాయి.
స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా మారిన నేపథ్యంలో బిలియనీర్ జేర్డ్ ఐసాక్‌మాన్ నాసా అధ్యక్షుడు అయ్యే పరిస్థితుల్లో ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష ప్రయోగాల్లో మరింత ఎక్కు వగా పాల్గొనే అవకాశాలున్నాయి. వీరందరూ సునీత, విల్మోర్‌ల అనుభవం నుంచి లబ్ధి పొందనున్నారు.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment