
ఐఎస్‌ఎస్‌లో కొత్త సహచరులను ఆలింగనం చేసుకుంటున్న సునీత తదితరులు
స్పేస్‌ఎక్స్ క్రూ క్యాప్సూల్‌లో వచ్చిన వ్యోమగాములకు సునీత, విల్మోర్ వెల్‌కమ్
కేప్ కనావెరాల్: తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను భూమికి తీసుకొచ్చేందుకు స్పేస్‌ఎక్స్, నాసా సంయుక్తంగా ప్రయోగించిన క్రూ క్యాప్సూల్ ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైంది. అందులో వెళ్లిన నలుగురు వ్యోమగాములు అన్నె మెక్‌క్లెయిన్, నికోల్ అయేర్స్ (అమెరికా), తుకుయా ఒనిషీ (జపాన్), కిరిల్ పెస్కోవ్ (రష్యా) ఆదివారం ఉదయం ఐఎస్‌ఎస్‌లో అడుగు పెట్టారు.
వారికి సునీత, విల్మోర్ సాదర స్వాగతం పలికారు. స్పేస్‌స్టేషన్ హ్యాచ్‌ను తెరచిన విల్మోర్ వ్యోమనౌక గంటను మోగించి వారిని స్వాగతించారు. వారింతా పరస్పరం హత్తుకుని, కరచాలనం చేసుకుని హర్షాతిరేకాలు చేశారు. ‘‘ఇది అద్భుతమైన రోజు. స్నేహితుల రాక మాకెంతో ఆనందాన్నిచ్చింది’’ అని మిషన్ కంట్రోల్‌తో విల్మోర్ చెప్పుకొచ్చారు. ఐఎస్‌ఎస్‌లో నిర్వర్తించాల్సిన విధులను వారికి సునీత, విల్మోర్ కొద్ది రోజుల పాటు విడమర్చనున్నారు.
అనంతరం వాళ్లు బాధ్యతలు స్వీకరిస్తారు. వారం తర్వాత సునీత, విల్మోర్ క్రూ క్యాప్సూల్‌లో భూమికి తిరిగొస్తారు. వారితో క్యాప్సూల్ ఫ్లోరిడా తీర సమీపంలో సముద్ర జలాల్లో దిగనుంది. అప్పటిదాకా ఐఎస్‌ఎస్‌లో 11 మంది వ్యోమ గాములు సేవలందించనున్నారు. బోయింగ్ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగంలో భాగంగా గత ఏడాది జూన్‌లో సునీత, విల్మోర్ ఐఎస్‌ఎస్‌కు వెళ్లడం తెల్సిందే. వారు ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా స్టార్‌లైనర్ సాంకేతిక సమస్యలతో ఆలస్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment