
ఎట్టకేలకు ఐఎస్‌ఎస్‌కు బయల్దేరిన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్
కేప్ కెనావెరాల్: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమికి తిరిగి రానున్నారు. వారిని వెనక్కు తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్ సంస్థ ‘నాసా’ సహకారంతో క్రూ–10 మిషన్ ప్రారంభించింది. అమెరికాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున ఫాల్కన్–9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపింది.
ఇందులో నలుగురు వ్యోమగాములు అన్నె మెక్‌క్లెయిన్, నికోల్ అయేర్స్ (అమెరికా), తుకుయా ఒనిషీ (జపాన్), కిరిల్ పెస్కోవ్ (రష్యా)లున్నారు. వారు ఆర్నెల్లపాటు ఐఎస్‌ఎస్‌లోనే ఉంటారు. గత సెప్టెంబర్‌లో స్పేస్‌ఎక్స్ వ్యోమనౌకలో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన ఇద్దరు వ్యోమగాములతో కలిసి సునీత, విల్మోర్ తిరిగొస్తారు. వాతావరణం అనుకూలిస్తే ఆ నలుగురూ వారం రోజుల్లో తిరిగొచ్చే అవకాశం ఉంది. వారు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో దిగుతారు.
వారం అనుకుంటే...
బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగంలో భాగంగా 2024 జూన్ 5న సునీత, విల్మోర్ ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎనిమిది రోజుల్లో వెనక్కి రావాలి. కానీ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అది వీలవలేదు. స్పేష్‌షిప్ థ్రస్టర్లు విఫలమవడంతో పాటు హీలియం గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తించారు. మరమ్మత్తులకు ప్రయత్నించినా లాభం లేకపోయింది.
దాంట్లో వారిని వెనక్కు తీసుకురావడం ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరించడంతో స్టార్‌లైనర్ ఖాళీగానే తిరిగొచి్చంది. తర్వాత వారిని తీసుకొచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించినా కుదర్లేదు. చివరికి ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఈ అంశం ప్రచారాస్త్రంగా మారింది. తాము అధికారంలోకి వస్తే సునీ త, విల్మోర్‌ను సాధ్యమైనంత త్వరగా రప్పిస్తా మని జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ప్రక టించారు.

ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వారిని తీసుకొచ్చేందుకు స్సేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సాయం కోరారు. మస్క్ చొరవ తో క్రూ–10 మిషన్ ప్రారంభమైంది. అంతా అనుకున్నట్లు జరిగితే వారం రోజుల్లో సునీత, విల్మోర్ మళ్లీ భూమిపై అడుగుపెడతారు.
Comments
Please login to add a commentAdd a comment