
ఐఎస్‌ఎస్‌లో బుచ్ విల్మోర్‌తో సునీతా విలియమ్స్
సైన్స్ చరిత్రను తిరగేస్తే యాదృచ్ఛికంగా జరిగిన ఆవిష్కరణలు కోకొల్లలు కనిపిస్తాయి. ఎనిమిది రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) వెళ్లిన భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలం అక్కడే గడపడమూ ఈ కోవకే చెందుతుంది. ఎందుకంటే... మనిషి యుగాలుగా ఆశిస్తున్న, ఆకాంక్షిస్తున్న గ్రహాంతరయానమనే స్వప్నాన్ని ఈ యాత్ర మరికొంత దగ్గర చేసింది మరి!
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు తిరిగి భూమిని చేరిన రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. అంత రిక్ష ప్రయోగాల్లో ఇదో చరిత్రాత్మక ఘట్టంగానే చూడాలి. బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు రావడం, సకాలంలో వాటిని సరిదిద్దే అవకాశం లేకపోవడంతో ఈ ఇద్దరు వ్యోమగా ములు మునుపెవ్వరూ గడపనంత అత్యధిక సమయాన్ని ఐఎస్‌ఎస్‌లో గడపాల్సి వచ్చింది. భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూండే ఐఎస్‌ఎస్‌లో ఉండటం అంత ఆషా మాషీ వ్యవహారం కానేకాదు.
అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంటుందిక్కడ. దీనివల్ల శరీరంలోని ద్రవాలన్నీ ఉండాల్సిన చోట కాకుండా... శరీరం పైభాగంలోకి చేరుతూంటాయి. ఇరవై నాలుగు గంటలకు ఒకసారి సూర్యోదయ, సుర్యాస్తమయాలను చూసే మనిషి... ఐఎస్‌ఎస్‌లో వీటిని పదహారు సార్లు చూడాల్సి వస్తుంది. ఇది కాస్తా వ్యోమగాముల నిద్రపై ప్రభావం చూపుతుంది.
కంటినిండా కునుకు లేక... కుటుంబానికి దూరంగా... ఇరుకైన చిన్న గదిలో నెలలపాటు గడపడం ఎంత కష్టమో మనం ఊహించనైనా ఊహించ లేము. ఊపిరి తీసుకోవడం మొదలుకొని కాలకృత్యాలు తీర్చుకోవడం వరకూ ప్రతి ఒక్కటి మానసికంగానూ, భౌతికంగానూ సవాలే! ఇంతటి శ్రమకోర్చి మరీ వీరు భూమికి తిరిగి వస్తూండటమే ఈ అంతరిక్ష ప్రయో గాన్ని మిగిలిన వాటికంటే ప్రత్యేకమైందిగా మారుస్తోంది.
తొమ్మిది నెలలు చేసిందేమిటి?
గత ఏడాది జూన్‌లో సునీత, విల్మోర్‌లు ఇద్దరూ ఐఎస్‌ఎస్‌కు ప్రయాణమైనప్పుడు వారి వద్ద ఎనిమిది రోజు లకు సరిపడా ప్రణాళికలైతే సిద్ధంగానే ఉన్నాయి. ఏ ఏ ప్రయోగాలు చేపట్టాలి. ఐఎస్‌ఎస్ నిర్వహణ తాలూకూ పనులు ఏమిటి? అన్నది వీరికి తెలుసు. కానీ అనూహ్యంగా వారి తిరుగు ప్రయాణం నిరవధికంగా వాయిదా పడింది. దీంతో వారికి ఎదురైన సరికొత్త సవాలు అంతకాలం ఏం చేయాలి? అన్నది.
నాసా పరిశోధకుల సలహా సూచనల మేరకు వీరు ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారు 150 వరకూ పరిశోధనలు చేపట్టారు. జీవ వ్యవస్థలపై సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి ప్రభావం, అంతరిక్షంలో మొక్కల పెంపకం, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు అంతరిక్షంలో ఎలా ప్రవర్తిస్తాయి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేశారు.
అంతేకాదు... భవిష్యత్తులో మనిషి సుదీర్ఘకాలం పాటు అంతరిక్ష ప్రయాణాలు చేపట్టాల్సి వస్తే... అంతరిక్ష నౌకల్లో అగ్ని ప్రమాదాల్లాంటివి జరక్కుండా ఉండేందుకు... మంటలు ఎలా వ్యాపిస్తాయి? అన్న విషయంపై పరిశోధనలు నిర్వహించారు కూడా! దీంతో పాటే గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల శరీరంలోని కండరాలకు జరిగే నష్టాన్ని నివారించేందుకు యూరో పియన్ ఎన్ హాన్‌్సడ్ ఎక్స్‌ప్లోరేషన్ ఎక్సర్‌సైజ్ డివైజ్(ఈ4డీ)ని పరీక్షించారు.
ఈ పరికరం సైక్లింగ్, రోయింగ్‌లతోపాటు రెసిస్టెన్స్ ఎక్సర్‌సైజ్‌ల ద్వారా వ్యోమగాముల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. అలాగే గ్రహాంతర ప్రయాణాలకు కీలకమైన నీటి పునర్వినియోగం, ప్రత్యేకమైన సూక్ష్మజీవుల ద్వారా మనిషికి అవసరమైన పోషకాల ఉత్పత్తి వంటి అంశాలపై కూడా ప్రయోగాలు చేశారు.
సౌర కుటుంబం మొత్తమ్మీద మనిషి జీవించేందుకు జాబిల్లి తరువాత కొద్దోగొప్పో అనుకూలతలున్న గ్రహం అంగారకుడు. స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఇంకొన్నేళ్లలోనే మనిషిని అంగారకుడిపైకి చేరుస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐఎస్‌ఎస్‌లో సునీతా, విల్మోర్‌లు గత తొమ్మిది నెలలుగా చేసిన ప్రయోగాలకు, పరిశోధనలకు ప్రాధాన్యం ఏర్పడుతోంది.
సుదీర్ఘకాలం పాటు అంతరిక్షంలో ఉండటం భౌతికంగా, మానసికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఈ తొమ్మిది నెలల ప్రయాణం తరువాత శాస్త్రవేత్తలకు కొంత స్పష్టత ఏర్పడి ఉంటుంది. దీని ఆధారంగా భవిష్యత్తులో అంగారక ప్రయాణం జరిగే అవకాశాలు లేకపోలేదు. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మన ఎముకలు పెళుసుబారుతాయి.
కండరాలు, దృష్టి బలహీనపడతాయి. అలాంటప్పుడు ఏ రకమైన వ్యాయామాల ద్వారా నష్టాన్ని పరిమితం చేయవచ్చునన్నది సునీత, విల్మోర్‌ల పరిశోధనల ద్వారా తెలిసింది. అంతరిక్షంలో ఉండే విపరీతమైన రేడియోధార్మికత నుంచి వ్యోమ గాములను రక్షించుకునేందుకు కూడా వీరి ప్రయోగాలు సాయపడతాయి.
వ్యోమగాముల త్యాగాల గురుతులు...
ఎట్టకేలకు సునీత, విల్మోర్‌లు భూమిని చేరనున్నార న్నది అందరికీ సంతోషం కలిగించే వార్తే. కాకపోతే ఆ ఇద్దరు వ్యోమగాములు ఇప్పటివరకూ ఉన్న సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి వాతావరణం నుంచి సాధారణ పరిస్థితులకు ఎలా అడ్జెస్ట్ అవుతారన్నది ఒక ప్రశ్న. ఇది మరోసారి వారి సహనాన్ని, దృఢ చిత్తాన్ని పరీక్షించనుంది. వ్యోమగాముల శ్రమ, వేదన లను గమనిస్తే మానవ కల్యాణం కోసం వారు ఇంత త్యాగం చేస్తున్నారా? అనిపించకమానదు.
సునీత, విల్మోర్‌లు ఇద్దరూ 300కుపైగా రోజులు అంతరిక్షంలో గడపడం ఒక రికార్డే. అయితే ఇది వారి వ్యక్తిగత మైంది కాదు. మానవ సంకల్పానికి లభించిన విజయమని చెప్పాలి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా), స్పేస్–ఎక్స్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భాగస్వా ములైన సుమారు 15 దేశాల శాస్త్రవేత్తలు అందరి ఉమ్మడి విజయం. ‘చందమామ రావే... జాబిల్లి రావే’ అంటూ పాట లకే పరిమితమైన ఒక తరం మాదిరిగా కాకుండా... ‘గ్రహ రాశులను అధిగమించి, ఘనతారల పథము నుంచి... గగ నాంతర రోదసిలో గంధర్వ గోళగతులు దాటి’ అంటూ సాగే నవతరానికి స్ఫూర్తి కూడా!
– గిళియార్ గోపాలకృష్ణ మయ్యా, సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment