
చైనా తీరును తప్పుపట్టిన అమెరికా
వాషింగ్టన్ : డ్రాగన్‌పై వీలుచిక్కినప్పుడల్లా విరుచుకుపడుతున్న అమెరికా మరోసారి చైనా తీరుపై మండిపడింది. భూటాన్ భూభాగంపై చైనా తెరపైకి తెచ్చిన వాదన, భారత్ భూభాగంలోకి ఇటీవల చొచ్చుకురావడం చూస్తే డ్రాగన్ ఉద్దేశాలు వెల్లడవుతున్నాయని అగ్రరాజ్యం ఘాటు వ్యాఖ్యలు చేసింది. చైనా దుందుడుకు వైఖరిని ప్రస్తావిస్తూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు భారత్-చైనా సరిహద్దు వివాదానికి కేంద్ర బిందువైన తూర్పు లడఖ్‌లో సేనల ఉపసంహరణ దాదాపు పూర్తయిందని, సరిహద్దుల్లో పరిస్ధితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని చైనా పేర్కొనడం పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఉద్రిక్తతలు సమసిపోయి క్షేత్రస్ధాయిలో పరిస్థితి చక్కబడిందని, సరిహద్దుల్లో సేనల ఉపసంహరణ పూర్తయినట్టేనని భారత్‌లో చైనా రాయబారి సన్ వెడాంగ్ వెల్లడించారు. అయితే చైనా వాదనతో భారత్ విభేదించింది. సరిహద్దుల్లో సేనల ఉపసంహరణపై కొంత పురోగతి కనిపించినా ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ఈ దిశగా తదుపరి చర్యలు చేపట్టేందుకు ఇరు దేశాల సీనియర్ కమాండర్లు త్వరలో సమావేశమవుతారని చెప్పారు. చదవండి : అక్కడ బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరణ