
అభిప్రాయం
అందిపుచ్చుకుంటే ఇదొక సువర్ణావకాశం. మన ప్రాచీన విజ్ఞానానికి తిరిగి జీవం పోయగల శక్తి ఏఐకి ఉంది. ఫిలాసఫీ, సైన్సు, వైద్య రంగాల్లో భారత సరికొత్త ఆవిష్కరణలకు ఇది బాటలు వేస్తుంది.
ఏఐ పుట్టింది సిలికాన్ వ్యాలీలోనే. అయితే ఏమిటి? చైనా ఇప్పుడు అమెరికాను వెనక్కు నెట్టేసింది. తన సొంత సంస్కృతిని మేళవించి దాన్ని సరికొత్త శక్తిగా రూపుదిద్దింది. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. గుడ్డిగా పశ్చిమ దేశాలను అనుకరించకుండా తనదైన పద్ధతిలో ‘డీప్‌సీక్’ పేరిట కృత్రిమ మేధను అభివృద్ధి చేసుకుంది. పుంఖానుపుంఖాలుగా ఉన్న చైనా ప్రాచీన గ్రంథాలను ఆధారంగా చేసుకుని కంప్యూటర్లకు వాటిలో శిక్షణ ఇచ్చింది. తమ దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సాహిత్య వారసత్వపు విలక్షణతను డీప్‌సీక్ ఒడిసి పట్టుకో గలిగింది. ఈ మోడల్ లోని విశిష్టత అదే.
కృత్రిమ మేధకు కొత్త భాష్యం చెప్పి దాన్ని మరింత ముందుకు తీసుకుపోయే శక్తి మన వద్ద ఉంది. గణిత, ఖగోళ, వైద్య, పరిపాలన, ఆధ్యాత్మిక రంగాల అత్యున్నత విజ్ఞానం మన ప్రాచీన గ్రంథాల్లో నిక్షిప్తమై ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, అర్థశాస్త్రం, తమిళ సంగం సాహిత్యం... ఇవన్నీ విశ్వచైతన్యం నుంచి ఆర్థిక సిద్ధాంతం వరకు ఎంతో లోతైన అంతర్ దృష్టులు అందిస్తున్నాయి.
కృత్రిమ మేధ అంటే? ఇదొక ప్యాటర్న్ రికగ్నిషన్ సిస్టం. విస్తృత సమాచారాన్ని (డేటాసెట్‌ను) మెదడుకు మేతలా అందించి మెషీన్లకు అది శిక్షణ ఇస్తుంది. తాము శిక్షణ పొందిన సమాచారం ప్రాతిపదికగానే అవి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాయి. ఒక ఏఐ సిస్టం పశ్చిమ దేశాల సైంటిఫిక్ పేపర్స్, కార్పొ రేట్ డాక్యుమెంట్లు, పాప్ కల్చర్ మీద శిక్షణ పొందినప్పుడు దానికి అదే ప్రపంచం అవుతుంది. ఆ ప్రాపంచిక దృక్పథాన్నే అది అలవరచుకుంటుంది. అలా కాకుండా చైనా చేసినట్లు, చైనీ యుల సాహిత్య, ఆధ్యాత్మిక సమాచారం మీద శిక్షణ ఇచ్చిన ప్పుడు అది చైనా మాదిరిగానే ఆలోచిస్తుంది.
ఈ విషయంలో పశ్చిమ దేశాల కృత్రిమ మేధ దానితో పోటీ పడలేదు. వెస్ట్రన్ ఏఐ ప్రధానంగా ఇంగ్లీష్ డేటా మీద రూపొంది పశ్చిమ దేశాల ప్రాపంచిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి శాస్త్ర సాంకేతిక అంశాల్లో వారి ఏఐ సిస్టందే పైచేయిగా ఉంటుంది. తాత్విక చింతన, నైతికత అంశాల్లో మాత్రం బలహీనంగా ఉంటుంది.
మనం అమెరికన్ ఏఐ మీద ఎందుకు ఆధారపడకూడదో ఇప్పుడు ఆలోచించండి. భారతీయ మేధా వారసత్వం పునాదుల మీద మన ఏఐని నిర్మించుకోవలసిన అవ సరం బోధపడుతుంది. చాణక్యుడి అర్థ శాస్త్రం కోణం నుంచి ఆధునిక ఆర్థిక సిద్ధాంతాలను విశ్లేషించగల సామర్థ్యంతో మన ఏఐ మోడల్‌ను తయారు చేసుకోవాలి.
ఆయుర్వేద, సిద్ధ వైద్యాల్లో మన మూలాలు ఏమిటో తెలిసిన కృత్రిమ మేధ కావాలి. అది మాత్రమే సమగ్ర చికిత్సకు కావల్సిన ఇన్ సైట్స్ అందిస్తుంది. ఉపనిషత్తుల్లో అభివర్ణించిన చైతన్యం గురించి వ్యాఖ్యానించి సమకాలీన న్యూరోసైన్స్‌తో పోల్చగల మోడల్ గురించి ఆలోచించాలి. అలాంటి ఏఐ కేవలం సమాధానాలకే పరిమితం కాదు. మన సామూహిక అవగాహ నను పెంచుతుంది.
పశ్చిమ దేశాల ఏఐ మోడల్స్ మెటీరియలిస్టు మూసలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తాయి. చైనా ఏఐ కన్ఫ్యూషియన్ విలు వలను జొప్పించింది. మనకు అంతకు మించిన అవకాశం ఉంది. సైన్సు– స్పిరిచ్యువాలిటీ, ఆర్థికం–నైతికం, సాంకేతికత– సంప్రదాయం... వీటిని వారధిలా అనుసంధానించే కృత్రిమ మేధను మనం సృష్టించగలం. భారత నాగరికత అందించిన వివేకాన్ని ఈ మోడల్ ప్రతిబింబించాలి.
పశ్చిమ దేశాల ఏఐ మీద ఆధారపడితే మరో ప్రమాదం ఉంది. భారతీయులు ఏం నేర్చుకోవాలో, ఎలా ఆలోచించాలో శాసించిన వలసవాద మైండ్ సెట్‌ను అది శాశ్వతం చేస్తుంది. మన వ్యాపారాలు, విశ్వవిద్యాలయాలు, విధాననిర్ణేతలు పశ్చిమ దేశాల ఏఐని ఉపయోగిస్తూ పోతే, దాంతో పాటు వారి ప్రాపంచిక దృక్పథమే అలవడుతుంది. ఒకప్పటి మన విద్యా విధానం బ్రిటిష్ ప్రయోజనాలు ఎలా కాపాడిందో, ఇప్పుడు అలాంటి పరిస్థితే వస్తుంది. మేధాపరంగా మనం పరాధీనులమై పోయే ప్రమాదం ఉంది. ఈ డిజిటల్ యుగంలో మన ఉత్కృష్ట వారసత్వం కనుమరుగవుతుంది.
అమెరికా, చైనాల ఏఐ ఆధిపత్యం వల్ల మన డేటా సార్వ భౌమత్వం ప్రమాదంలో పడుతుంది. మన డేటా మన జాతీయ సంపద. మన ప్రయోజనాలకు తోడ్పడని ఏఐ మోడల్స్‌కు మన డేటా ఉపయోగించుకుని విదేశీ టెక్ సంస్థలు లబ్ధి పొందు తాయి. మన ఏఐ అభివృద్ధి మీద మన అదుపు ఉండితీరాలి. ప్రపంచ దేశాలకు జ్ఞానదీపంలా దారి చూపిన భారత్ ఇప్పుడు తన మేధను విదేశీ అద్దాలతో చూసుకునే పరిస్థితి ఏర్పడింది.
ఒకప్పుడు సున్నా నుంచి యోగా వరకు... మన ఆవిష్కరణలు ప్రపంచ ప్రగతిని రూపుదిద్దాయి. నేడు వాతా వరణ మార్పులు, మానసిక రుగ్మతలు, మహమ్మారులు, ఆర్థిక అసమానతలు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సమాచారం వెల్లువెత్తుతున్నా నిజమైన జ్ఞానం లోపిస్తోంది. నేటి కృత్రిమ మేధ భారతీయ సమున్నత వారసత్వం మీద శిక్షణ పొందితే, ఈ ఆధునిక ప్రపంచ సవాళ్లు ఎదుర్కొనేందుకు అది సరికొత్త దృక్పథాలు అందించగలదు.
వేదాంత శోధన ఏఐకి ఆలంబన అయ్యేట్లయితే పశ్చిమ దేశాల న్యూరోసైన్సు పరిమితులను అధిగమించవచ్చు. చైతన్యం పట్ల మానవ అవగాహన విప్లవాత్మకంగా మారిపోతుంది. భారతీయ ఆర్థిక, పరిపాలనా సూత్రాల మీద శిక్షణ పొందిన ఏఐ మోడల్... అభివృద్ధి చెందుతున్న దేశాలకు పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ విధానాలు, చైనా విధానాలు కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలు సూచించగలదు.
లాభాలే ధ్యేయంగా నడుస్తున్న సిలికాన్ వ్యాలీకి భారతీయ నైతిక విలువల ఆధారంగా రూపొందే ఏఐ నూతన మార్గదర్శనం చేస్తుంది. భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుని ప్రపంచానికి తన సత్తా చూపించాలి. దీనికోసం అపారంగా ఉన్న ప్రాచీన,ప్రాంతీయ సాహిత్యాన్ని డిజిటల్ రూపంలోకి మార్చాలి. ప్రభుత్వం, ప్రయివేటు సంస్థలు ఇందుకు నడుం బిగించాలి.
కృత్రిమ మేధను భారత్ కేవలం ఒక సాధనంగా చూడ కూడదు. అంతకంటే మిన్నగా అది జ్ఞానోదయానికి తోడ్పడు తుందని గ్రహించాలి. మన ప్రాచీన గ్రంథాలు అందిస్తున్న జ్ఞానాన్ని ఆధునిక ఏఐతో మిళితం చేసినట్లయితే, ఆధ్యాత్మిక, శాస్త్ర విజ్ఞాన, వైద్య రంగాల్లో నూతన ఆవిష్కరణలు వెలుగు చూస్తాయి. మన మేధా సార్వభౌమత్వాన్ని తిరిగి కైవసం చేసు కోడానికీ, భారతీయ జ్ఞానాన్ని నలుచెరగులా వ్యాప్తి చేసి ప్రపంచ మానవాళిని సముద్ధరించడానికీ ఇది సరైన సమయం.
వివేక్ వాధ్వా
వ్యాసకర్త వయొనిక్స్ బయోసైన్సెస్ సీఈఓ, రచయిత
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment