బీజింగ్ : సరిహద్దుల్లో ప్రతిష్టంభనను నివారించేందుకు భారత్-చైనాల మధ్య జరుగుతున్న సైనిక చర్చల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందని బీజింగ్ బుధవారం వెల్లడించింది. ఈనెల 6న ప్రారంభమైన సైనిక అధికారుల స్ధాయి చర్చల్లో వ్యక్తమైన సానుకూల ఏకాభిప్రాయం దిశగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే చర్యలను ఇరు దేశాలూ చేపట్టాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హు చునింగ్ చెప్పారు. కాగా బుధవారం జరిగే తాజా చర్చలకు ముందు తూర్పు లడఖ్‌లో పలు ప్రాంతాల్లో భారత్, చైనా దళాలు కొంతమేర వెనుతిరిగాయని భారత్ ప్రకటించిన క్రమంలో చైనా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
సరిహద్దు ప్రతిష్టంభనకు శాంతియుతంగా తెరదించే క్రమంలో ఇరు దేశాల సేనలు వెనక్కిమళ్లాయా అని ప్రశ్నించగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరు దేశాలు చర్యలు చేపడుతున్నాయని చునింగ్ వ్యాఖ్యానించారు. భారత్-చైనాలు ఇటీవల సరిహద్దు సమస్యలపై పరస్పర అవగాహనతో సంప్రదింపులు జరుపుతూ సానుకూల ఏకాభిప్రాయానికి వచ్చాయని ఆమె పేర్కొన్నారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన 10 వేల బలగాలను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) ఉపసంహరించుకున్నపుడే సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉందని భారత్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment