భారత్- చైనా సరిహద్దు ‘చిచ్చు’కు కారణం? | What Drove to India And China Dispute | Sakshi
Sakshi News home page

భారత్- చైనా సరిహద్దు ‘చిచ్చు’కు కారణం?

Published Tue, Jun 23 2020 7:45 PM | Last Updated on Tue, Jun 23 2020 7:46 PM

What Drove to India And China Dispute - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు వివాదం, ఇతర రాజకీయ అంశాల కారణంగా భారత్, చైనా దేశాల మధ్య 1962లో జరిగిన యుద్ధం పునరావృతం కారాదనే ఉద్దేశంతో భారత్‌ చొరవతో ఇరుదేశాలు పలు చర్యలు తీసుకున్నాయి. అందులో భాగంగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. యుద్ధానంతరం ఇరు దేశాల సరిహద్దు వివాదం పరిష్కారానికి అప్పటి భారత ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ న్యాయ–చారిత్రాత్మక వైఖరిని అవలంబించారు. ఇరు దేశాల మధ్య మరింత మెరుగైన సంబంధాల కోసం ప్రధాని రాజీవ్‌ గాంధీ 1988లో చైనా పర్యటనకు వెళ్లి అప్పటి చైనా నాయకుడు డెంగ్‌ జియావోపింగ్‌తో చర్చలు జరిపారు. పర్యవసానంగా ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడింది.   

ఆ ఆతర్వాత ఇరుదేశాలు సైనిక బలగాలను ఉపయోగించకుండా, కాల్పులు జరపకుండా ఉండేందుకు 2013లో చైనా, భారత్‌ దేశాలు ‘బార్డర్‌ డిఫెన్స్‌ కొపరేషన్‌ అగ్రిమెంట్‌’ చేసుకున్నాయి. 2014లో చైనా అధ్యక్షుడు షిజిన్‌పింగ్‌ భారత్‌ను సందర్శించినప్పుడు ‘డెవలప్‌మెంటల్‌ పార్టనర్‌షిప్‌’ ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణమే కొనసాగింది. అప్పుడప్పుడు పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తోందన్న కారణంగా చైనా పట్ల దేశం పట్ల ద్వేషం పెరిగినా అది అంతట్లోనే చల్లారిపోయేది. ఎప్పుడులేని విధంగా ఇప్పుడు భారత్‌ పట్ల చైనా దురుసుగా వ్యవహరిస్తోంది. ఎందుకు? భారతీయ విద్యార్థుల అంతర్జాతీయ చదువులు, అమెరికాలో భారతీయ టెకీలకు ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు విదేశాంగ విధానంలో మొగ్గు చూపడం, రానున్న ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని ట్రంప్‌.. మోదీవైపు మొగ్గుచూపడం చైనాకు కంటగింపుగా మారిందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అది కంటగింపు కాదని, చైనాకు కడుపు మంట అని, ఆసియా దేశాలన్నీ ఒక్కతాటిన నడవాల్సిన సమయంలో భారత్‌ పాశ్చాత్య దేశమైన అమెరికాకు దగ్గరవుతుండడం చైనా మంటకు కారణమని కొందరు విశ్లేషకులు అంటున్నారు.

2015లో ‘ఢిల్లీ డిక్లరేషన్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌’ కుదుర్చుకోవడం, 2016లో ‘లాజిస్టిక్స్‌ ఎక్స్ఛేంజ్‌ మెమోరాండమ్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌’ చేసుకోవడం, 2018లో ‘కమ్యూనికేషన్స్‌ కంపాటిబిలిటీ అండ్‌ సెక్యూరిటీ అరెంజ్‌మెంట్స్‌ కదుర్చుకోవడం, ఆ తర్వాత ‘బెసిక్‌ ఎక్స్ఛేంజ్‌ అండ్‌ కోపరేషన్‌ అగ్రిమెంట్‌ ఫర్‌ జియో స్ఫేషియల్‌ కోపరేషన్‌’ తుది ఒప్పందంపై సంతకానికి సిద్ధమవడం, నమస్తే ట్రంప్‌ పేరిట ఫిబ్రవరి నెలలో 300 కోట్ల రూపాయల డాలర్లతో సైనిక ఒప్పందం కుదుర్చుకోవడం అమెరికావైపు భారత్‌ మొగ్గు చూపిందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. (‘బాయ్ కాట్ చైనా’ సాధ్యమేనా?)

చైనాలోని వుహాన్‌లో ఉద్బవించిన కరోనా వైరస్‌ కారణంగా ఆ దేశ ప్రజలు జిన్‌పింగ్‌ ప్రభుత్వం పట్ల మండిపడుతున్నారని, వారి దృష్టిని మళ్లించడం కోసం జిన్‌పింగ్‌ సరిహద్దు వివాదాన్ని రాజేశారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌ను రాష్ట్రాన్ని విభజించి లద్ధాఖ్‌ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం కూడా వ్యూహాత్మకంగా తమకు విరుద్ధమని చైనా భావిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (చైనా జనరల్ ఆదేశంతోనే భారత్ పై దాడి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement