
భారత్, చైనాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్ధాయి చర్చలు షురూ
సాక్షి, న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను నివారించడంతో పాటు ఇరువైపులా సైనిక బలగాల ఉపసంహరణ కోసం మంగళవారం లడఖ్‌లోని చుసుల్‌లో భారత్-చైనాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్ధాయి చర్చలు జరగనున్నాయి. ఈ ఏడాది మేలో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత సీనియర్ సైనికాధికారుల భేటీ జరగడం ఇది మూడవసారి. గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన అనంతరం జూన్ 22న చివరిసారిగా జరిగిన సమావేశంలో వాస్తవాధీన రేఖ వెంబడి సమస్యాత్మక ప్రాంతాల్లో ఇరు దళాలు వెనక్కితగ్గేందుకు అంగీకారం కుదిరింది.
ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చినా గల్వాన్ లోయ సహా పలు ప్రాంతాల్లో డ్రాగన్ సేనల కార్యకలాపాలకు బ్రేక్‌పడలేదు. ఆయా ప్రాంతాల్లో చైనా సేనలు పూర్తిగా వెనక్కిమళ్లాలని, వ్యూహాత్మక ప్రాంతాల్లో యథాతథ స్ధితి కొనసాగించాలని తాజా చర్చల్లో భారత్ డిమాండ్ చేయనుంది. ఇక మంగళవారం నాటి సమావేశం వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ భూభాగంలో జరగనుంది. ఇక ఇరు దేశాలు సరిహద్దుల్లో బలగాలు, యుద్ధవిమానాలతో సన్నద్ధమైన క్రమంలో తాజా భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. చదవండి : చైనా కుట్ర : అజిత్ దోవల్ ఆనాడే హెచ్చరించినా..