న్యూఢిల్లీ: ఒకవైపు చర్చల ప్రక్రియ కొనసాగిస్తూనే.. మరోవైపు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)కి ఇరువైపులా బలగాలు, ఇతర సైనిక సంపత్తి మోహరింపును భారత్, చైనాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. భారత సైన్యంతో పాటు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) కూడా సరిహద్దు కేంద్రాలకు సుశిక్షితులైన అధికారులు, ఇతర సిబ్బందిని తరలిస్తోంది. ఆర్మీకి మద్దతుగా మరిన్ని ఐటీబీపీ బలగాలను సరిహద్దులకు తరలించాలని శనివారం లెఫ్ట్‌నెంట్ జనరల్ పరంజిత్ సింగ్, ఐటీబీపీ చీఫ్, మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ ఎస్‌ఎస్ దేశ్వాల్ లేహ్‌ను సందర్శించిన అనంతరం నిర్ణయించారు.
‘జూన్ 15 ఘటనకు ముందే కొన్ని కంపెనీల బలగాలను లద్దాఖ్‌కు పంపించాం. ఇప్పుడు మరిన్ని బలగాలను తరలించాలని నిర్ణయించాం’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సైనిక కేంద్రాల్లో ఆర్మీకి సహకారంగా ఐటీబీపీ నుంచి ప్లటూన్ల స్థానంలో కంపెనీలను మోహరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఘర్షణాత్మక గల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితి నేటికి కూడా ఉద్రిక్తంగానే ఉంది. రెండు దేశాల మిలటరీ అధికారుల మధ్య జరుగుతున్న చర్చల్లో.. ఏప్రిల్ 30, 2020 నాటికి ఉన్న యథాతథ స్థితి నెలకొనాలని భారత్ డిమాండ్ చేస్తోంది.
గల్వాన్, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్‌లోని 14, 15, 17 పెట్రోలింగ్ పాయింట్స్(పీపీ)లో బలగాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే, పీపీ 14, పీపీ 15 దగ్గరలో చైనా పలు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది. అలాగే, పీపీ 17 వద్దకు పెద్ద ఎత్తున సైనికులను తరలించింది. దాంతో, పీపీ 17 వద్ద భారత్ కూడా సైనికుల సంఖ్యను పెంచింది. ప్యాంగ్యాంగ్ సరస్సులోని ‘ఫింగర్ 4’ వరకు చైనా దళాలు చేరుకున్నాయి. అక్కడికి చైనా బోట్లు, ఇతర వాహనాలను కూడా తరలించింది. దాంతో భారత్ కూడా అక్కడ దళాలను మోహరించింది.
చర్చలు జరపండి
లండన్: భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘పరిస్థితి తీవ్రంగా, ఆందోళనకరంగా ఉంది’ అని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ బుధవారం పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. పరిస్థితిని బ్రిటన్ నిశితంగా గమనిస్తోందన్నారు. వివాద పరిష్కారానికి చర్చలు జరపాలని భారత్, చైనాలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment