LAC
-
ఇండియా-చైనా సరిహద్దుల్లో డ్రోన్ కదలికలు: హిమాచల్ మంత్రి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న ఇండియా-చైనా సరిహద్దుల్లో డ్రోన్ కదలికలను గుర్తించినట్లు హిమాచల్ ప్రదేశ్ మంత్రి జగత్ సింగ్ నేగి తెలిపారు. సరిహద్దుల్లో పొరుగు దేశం చైనా.. డ్రోన్లను నిఘా, గూఢచర్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బోర్డర్లో డ్రోన్ల కదలికల విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కిన్నౌర్ జిల్లాలోని షిప్కి లా , రిషి డోగ్రీ గ్రామాల్లో డ్రోన్ కార్యకలాపాలను గుర్తించాం. సరిహద్దు ప్రాంతానికి సమీపంలో తరచుగా డ్రోన్లు ఎగురుతున్నట్లు గత వారంలో కూడా గుర్తించాం. షిప్కిలా, రిషిడోగ్రి గ్రామాల్లో వాస్తవ నియంత్రణ రేఖ వరకు రహదారి నిర్మాణం పురోగతిలో ఉంది. ..పొరుగుదేశం చైనా ఈ డ్రోన్ల ద్వారా నిఘా, గూఢచర్యానికి పాల్పడే అవకాశాన్ని తోసిపుచ్చలేం. డ్రోన్లను పోలీసులు, ఆర్మీ సిబ్బంది సైతం చూశారు. చైనా డ్రోన్లు భారత గగనతలంలోకి చొరబడటం చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి’ అని అన్నారు.ఇక.. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్, లాహౌల్, స్పితి గిరిజన జిల్లాలు చైనాతో 240 కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాయి. -
లఢక్: ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశృతి.. ఐదుగురు జవాన్లు మృతి
లఢక్: దేశ సరిహద్దుల్లోని లఢక్‌లో ఇండియన్ ఆర్మీ నిర్వహించిన యుద్ధ విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. యుద్ధ ట్యాంక్ ఓ నది దాటుతూ విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా నీటీ ప్రవాహం పెరిగింది.Indian Army T-72 Tank with Mine Trawler in Ladakh near LAC.. pic.twitter.com/A0rDfJY2rK— Vivek Singh (@VivekSi85847001) June 2, 2024 దీంతో యుద్ధట్యాంక్‌లో ఉన్న ఐదుగురు జవాన్లు నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈఘటన లేహ్‌కు 148 కిలోమీటర్ల దూరంలో దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో టీ-72 యుద్ధ ట్యాంక్‌కు ప్రమాదం జరిగినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ‘‘ ప్రమాద సమయంలో ఐదుగురు ఆర్మీ జవాన్లు యుద్ధట్యాంక్‌లో ఉన్నారు. ఒకరు జూనియర్ కమిషన్డ్ అధికారి, నలుగురు జవాన్లు ఉన్నారు. గాలింపు చర్యల్లో ఒక్క జవాన్ మృతదేహం లభించింది. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’’ అని రక్షణ శాఖ తెలిపింది. గతేడాది ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్.. లేహ్ జిల్లాలోని కియారీ సమీపంతో లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో జూనియర్ కమిషన్డ్ అధికారితో సహా తొమ్మిది మంది సైనికులు మృతి చెందారు. -
ఆగని డ్రాగన్ దురాశ
ఇది ఆందోళన రేపే వార్త. తక్షణమే అడ్డుకట్ట వేయడానికి ఆలోచించాల్సిన వార్త. పొరుగు దేశం చైనా ‘వాస్తవాధీన రేఖ’ (ఎల్ఏసీ) వెంట తన వైపున మరో 175కు పైగా గ్రామాలను నిర్మిస్తోందట. మన అరుణాచల్ ప్రదేశ్‌కు అభిముఖంగా సాగుతున్న ఈ కొత్త నిర్మాణాలు ఇప్పటికే ఎల్ఏసీ వెంట డ్రాగన్ సాగించిన 628 ‘షియావోకాంగ్’ (సంపన్న గ్రామాలు)కు అదనం. ఎల్ఏసీ వెంట తన బలం, బలగం పెంచుకొనేందుకు బీజింగ్ మరోసారి దుష్టపన్నాగం పన్నుతోంది. అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ పత్రిక ప్రచురించిన ఈ కథనం సంచలనం రేపుతోంది. ఈశాన్యంలోని అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు జమ్ము–కశ్మీర్లో లద్దాఖ్ ప్రాంతం వెంట కూడా చైనా వైపున కొత్త గ్రామాలు వెలుస్తున్నాయి. ఇది అత్యంత ఆందోళనకరమైన పరిణామం. వెరసి, రానురానూ ఎల్ఏసీ మరింత వివాదాస్పదం కానుంది. ఇది మన బలగాలు, స్థానికులు తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అంశం. నిజానికి, వాస్తవాధీన రేఖ అనేది భూతలంపై స్పష్టంగా నిర్ణయించిన సరిహద్దు ఏమీ కాదు. చైనీయుల నియంత్రణలో ఉన్న భూభాగాన్నీ, భారత నియంత్రిత భూభాగాన్నీ వేరుపరచే ఊహాత్మక సరిహద్దు రేఖ. దీన్ని వాటంగా చేసుకొని, ఊహాత్మక సరిహద్దయిన ఎల్ఏసీ వెంట సైనిక సన్నద్ధతను పెంచుకోవాలనీ, ఆ క్రమంలో అక్కడ మరింత భూభాగంపై తమ హక్కును ప్రకటించుకోవా లనీ చైనా కుటిల ప్రయత్నం. అందుకే, ఆ జగడాలమారి దేశం ఎల్ఏసీ వెంట తన వైపున గ్రామాలకు గ్రామాలు నిర్మిస్తూ వస్తోంది. దాదాపుగా 900 ఎల్ఏసీ గ్రామాలను నిర్మించాలనేది చైనా వ్యూహం. అందులో 200 దాకా గ్రామాలు భారత సరిహద్దుకు సమీపంలో కట్టాలని దాని ప్రయత్నం. ఆ భారీ ప్రయత్నంలో భాగమే ఇప్పుడీ కొత్త నిర్మాణాలు. ఆ గ్రామాలు ఇటు గస్తీ పాయింట్లుగా, అటు భారత్‌తో ఘర్షణ తలెత్తితే చేతికి అందివచ్చే సైనిక స్థావరాలుగా ఉపకరిస్తాయనేది బీజింగ్ ఎత్తుగడ. చైనా సైనిక వ్యూహం మాట అటుంచితే, కొత్త ఆవాసాలతో అనేక దీర్ఘకాలిక ప్రభావాలున్నాయి. అది మన దేశాన్ని మరింత కలవరపెడుతోంది. గమనిస్తే, భారత – చైనాల మధ్య 2005 నాటి ‘సరి హద్దు రక్షణ సహకార ఒప్పందం’ (బీడీసీఏ) ఉంది. ‘‘సరిహద్దు ప్రాంతాల్లో స్థిరపడ్డ ప్రజానీకం ప్రయోజనాలను ఇరుపక్షాలూ సంరక్షించాలి’’ అని బీడీసీఏలోని ఏడో ఆర్టికల్ పేర్కొంటోంది. ఎప్పుడైనా ఎల్ఏసీని కచ్చితంగా నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తే, అప్పటికి జనావాసాలైన ఈ కొత్త గ్రామాలను కదిలించడానికి వీలుండదు. ఆ అంశాన్ని అడ్డం పెట్టుకోవాలనేది డ్రాగన్ దురా లోచన. అలా తన ప్రాదేశిక హక్కుల వాదనకు బలం చేకూర్చేలా ఈ కొత్త గ్రామాలు, అక్కడ తెచ్చి పెట్టిన జనాభాను వాడుకోవాలనేది దాని పన్నాగం. చైనా వైపు కడుతున్న ఈ కొత్త గ్రామాలకు ఎదురుగా భారత్ వైపున కూడా గ్రామాలు లేకపోలేదు. అయితే, వాటిలో జన సంఖ్య అంతంత మాత్రమే! విస్తరణ కాంక్షతో ఊగుతున్న చైనా ఈ గ్రామాల నిర్మాణంతో ఆగడం లేదు. టిబెట్‌లో, ఎల్ఏసీ సమీప ప్రాంతాల్లో పెద్దయెత్తున ప్రాథమిక వసతి కల్పన ప్రాజెక్టులను చేపడుతోంది. ఇప్పటికే తన 14వ పంచవర్ష ప్రణాళిక (2021 –25)లో భాగంగా సిచువాన్ – టిబెట్ రైల్వేలైను సహా హైస్పీడ్ రైల్వే వ్యవస్థను విస్తరించే పని పెట్టుకుంది. అలాగే, వాస్తవాధీన రేఖ వెంట, భారత భూభాగానికి సమాంతరంగా సాగే రెండు జాతీయ రహదారులను (జీ–219, జీ–318) అప్‌గ్రేడ్ చేసే పనులూ కూడా ఆ ప్రణాళికలో భాగమే. వాటిలో ఒకటి (జీ–219) లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్‌లకు ఎదురుగా ఉంటే, మరొకటి (జీ–318) అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్లకు అభిముఖమైనది కావడం గమనార్హం. తద్వారా ఒకపక్క టిబెట్‌ను తమలో భాగంగా ప్రచారం చేసుకోవడం, మరోపక్క ప్రాథమిక వసతుల పెంపు అనే రెండూ చైనా పెట్టుకున్న లక్ష్యాలు. అసలు 1959 మార్చి 28న దలైలామా నేతృత్వంలోని టిబెటన్ ప్రభుత్వాన్ని అక్రమంగా రద్దు చేసి, టిబెట్‌ను ఆక్రమించుకున్న చరిత్ర బీజింగ్ది. కానీ, మొన్న షిజాంగ్ (టిబెట్)లో ప్రజాస్వామ్య సంస్కరణకు 65వ వార్షికోత్సవం అంటూ ఎల్ఏసీ వెంట డ్రాగన్ సంబరాలు జరపడం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమే! టిబెట్ నుంచి తైవాన్ దాకా అన్నీ తమవేననే డ్రాగన్ రాజ్య విస్తరణ వాదం ప్రపంచానికి కొత్త కాదు. చైనా సాగిస్తున్న ఈ కొత్త గ్రామాల నిర్మాణం నాటకాన్ని సైతం భారత్ గతంలోనే గమనించకపోలేదు. అందుకనే ఆ జనావాసాలను బీడీసీఏ కింద సరిహద్దు చర్చల నుంచి మినహాయించా లని తేల్చిచెప్పింది. డ్రాగన్ మాత్రం తన వంకర బుద్ధి వదులుకోలేదు. భారత్‌లోని లద్దాఖ్‌కు అభి ముఖంగా తాను చట్టవిరుద్ధంగా దురాక్రమణ చేసిన ప్రాంతాల్లోనూ చకచకా గ్రామాలు కట్టే పని చేస్తూనే ఉంది. ఇందుకు ప్రతిగా మన దేశం ఎదురుదాడికి దిగింది. ‘సచేతన గ్రామాల పథకం’ పేర ఆ సరిహద్దులోని మన జనావాసాలను ఏడాది పొడుగూతా జనంతో ఉండే ఆధునిక పర్యాటక ఆకర్షణలుగా మార్చాలని ప్రయత్నిస్తోంది. అయితే అదింకా పూర్తి కాలేదు. పనులు సాగుతూనే ఉన్నాయి. తరచూ కయ్యానికి కాలుదువ్వే చైనాకు ముకుతాడు వేయడానికి మనం చేయాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. క్లిష్టమైన హిమాలయ ప్రాంతాల్లో మనం మనవైపు నిర్మిస్తున్న గ్రామాలు సైతం నిర్మానుష్యంగా మిగలకుండా స్థానిక ప్రజలు ఆవాసం ఉండేలా చూడాలి. దురాక్రమణలు జరగకుండా ఉండాలంటే, స్థానికులు ప్రతి ఒక్కరిలో తామే సరిహద్దును కాపాడే సైనికులమనే భావన కల్పించాలి. మాతృభూమి పరిరక్షణ స్ఫూర్తి రగిలించాలి. అది జరగాలంటే, ముందుగా లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న ప్రజానీకపు న్యాయమైన కోరికలను మన్నించాలి. ప్రాంతీయ సంస్కృతి, ఆకాంక్షలకు అనుగుణంగా మన ఢిల్లీ పాలకులు వ్యవహరించాలి. సొంత ఇంటిని చక్కదిద్దు కొని, పొరుగు ప్రత్యర్థిపై పోరాడే క్రమంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా అన్ని పక్షాలూ కలసిరావాలి. -
భారత – చైనా బంధం బలపడేనా?
సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే! అయితే గల్వాన్ ఘర్షణలు చైనా ప్రణాళికాబద్ధంగా జరిపినవన్న భారత్ అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ పీఎల్ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు? అయితే ఎల్ఏసీ అమరిక గురించి భారత్‌కు కచ్చితమైన ఆలోచన ఉంది. ఎల్ఏసీ గురించి సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. వార్షిక వరల్డ్ పీస్ ఫోరమ్‌లో పాల్గొనడానికి నేను ఈ నెల ప్రారంభంలో బీజింగ్‌లో ఉన్నాను. ఆ సమావేశంలోనే అదనంగా భారత్–చైనా సరిహద్దు సమస్యపై ఒక ఆంతరంగిక చర్చ జరిగింది. దీనికి పలువురు చైనా విద్వాంసులు హాజరయ్యారు. ప్రస్తుత, మాజీ చైనా అధికారులు కొందరితో సంభాషణకు కూడా వీలు కలిగింది. ఇవి భారత్–చైనా సంబంధాలకు సంబంధించిన అవకాశాల గురించి చైనా అవగాహన విష యంలో ఒక కొత్త గవాక్షాన్ని అందించాయి. సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే. చైనీయుల ప్రకారం, సరిహద్దు పరిస్థితి ‘స్థిరీకరించబడింది’. ఘర్షణకు సంబంధించిన కొన్ని అంశాలను పరిష్కరించడంలో పురోగతి సాధించామనీ, అయితే మరికొన్ని మిగిలి ఉన్నా యనీ భారతదేశం గుర్తిస్తోంది. 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలకు ముందు ఉన్న యథాతథ స్థితికి తిరిగి రావడానికి చైనా సుముఖంగా ఉన్నట్లు ఎవరూ భావించడం లేదు. భారత–చైనా సరిహద్దు ప్రశ్న (2005) పరిష్కారానికిగానూ రాజకీయ పారామితులు, మార్గదర్శక సూత్రంతో సహా – వాస్తవాధీన రేఖను (ఎల్ఏసీ) స్పష్టం చేయడం కోసం ఉమ్మడి కసరత్తును చేపట్టేందుకు – అనేక శాంతి భద్రతల ఒప్పందాలను ఇరుపక్షాలు అంగీకరించినప్పటికీ, చైనీయులు అలా చేయడానికి నిరాకరించారు. భూభా గాన్ని ‘కొద్దికొద్దిగా కొరుక్కు తింటూ’ చైనాను భారతదేశం దూరంగా నెడుతోందని ఒక ఆరోపణ వచ్చినప్పుడు, భారత్ చేపట్టడానికి సిద్ధంగా ఉన్న ఎల్ఏసీ స్పష్టీకరణ ద్వారా అటువంటి కబళింపును కచ్చి తంగా నిరోధించవచ్చని ఎత్తి చూపడం ద్వారా ఒకరు దీనిని ప్రతిఘటించారు. దీనికి సమాధానం ఏమిటంటే, 2004లో జరిగిన సమా వేశంలో ఈ కసరత్తు ప్రారంభమైనప్పుడు, చైనా ప్రాదేశిక క్లెయిమ్‌లను బలహీనపర్చగల ‘అతిశయోక్తి’ క్లెయిమ్‌లను భారతదేశం పశ్చిమ సెక్టార్లో ముందుకు తెచ్చింది. ఎల్ఏసీని సరిగా స్పష్టం చేయకపోవడం వల్ల భారత్ అధీనంలో ఉన్న భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి సందిగ్ధతలను ప్రదర్శించగల వీలు చైనాకు కలుగుతుంది. అయితే ఎల్ఏసీ అమరిక గురించి భారత్‌కు కచ్చితమైన ఆలోచన ఉంది. కొన్ని అంశాల్లో ఎల్ఏసీకి సంబంధించి ‘భిన్నమైన అవగాహనలు’ ఉన్నాయని మనం చెప్పు కోకూడదు. భారత్ పేర్కొన్నట్లుగా ఎల్ఏసీపై పోటీ పడటంలో చైనా పక్షానికి కొంత సమర్థన ఉందని ఇది పరోక్షంగా అంగీకరిస్తుంది. ఎల్ఏసీ అమరికలో మనం పరిగణించే వాటిపై చైనీస్ పక్షాన్ని పోటీ పడనివ్వండి. ఎల్ఏసీ ఎక్కడ ఉందనే దాని గురించి మనకు సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. మొత్తంమీద, సరిహద్దు వద్ద ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉంది. అయితే రెండు వైపులా భారీ సైన్యాన్ని మోహరించే అవకాశం లేదు. ఎల్ఏసీ వైపు చైనా నిర్మించిన తాజా శాశ్వత, పాక్షిక–శాశ్వత నిర్మాణాలను కూల్చి వేయడం, తొలగించడం కూడా అసంభవం. భారత్ అలవర్చుకోవా ల్సిన మెరుగైన సామర్థ్యానికి ఇవి సూచికలా పనిచేస్తాయి. భవిష్యత్‌లో ఏం జరగవచ్చో సూచించే రెండు ఘటనలు కూడా ఉన్నాయి. సరిహద్దు సమస్యపై తరచూ వ్యాఖ్యానించే చైనా మాజీ పీఎల్ఏ అధికారి ఒకరు, గల్వాన్ ఘర్షణలు చైనా బలగాలు ముంద స్తుగా, ప్రణాళికాబద్ధంగా జరిపిన ఆపరేషన్ అని భారత్ భావిస్తున్న అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ నాతో అన్నారు. నేను ఇంతకు ముందు ఇది వినలేదు. పీఎల్ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు? ప్రస్తుతం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కమిషన్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ ఆఫీస్ డైరెక్టర్‌గా ఉన్న వాంగ్ యీ(జూలై 25నే తిరిగి విదేశాంగ మంత్రి అయ్యారు) ఇటీవల జకార్తాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో జరిపిన భేటీలో, ‘నిర్దిష్ట సమస్యలు మొత్తం సంబంధాన్ని నిర్వచించనివ్వకుండా, సరిహద్దు సమస్యకు ఇరు పక్షాలు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలి’ అన్నారు. ఇది చైనా వైఖరికి పునఃప్రకటన. అయితే, ‘భారత పక్షం చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకునేలా, సరిహద్దు సమస్యకు ఇరుపక్షాలకు ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటుందని ఆశిస్తున్నట్లు’ ఆయన కొనసాగించారు. ఆ ప్రాంతం చైనా సార్వభౌమ భూభాగమనీ, దానిని కాపాడు కుంటామనీ చైనా ప్రకటనలు పేర్కొంటున్నాయి కాబట్టి గల్వాన్ సంఘటన నేపథ్యంలో, ఇది సాపేక్షంగా సామరస్యపూర్వకమైన భాషగా కనిపిస్తోంది. దీంతో సంబంధాలు ‘మెరుగుపర్చుకునే’ అవ కాశం లేకుండా పోయింది. మారిన భాషను మనం అతిగా వ్యాఖ్యా నిస్తున్నామేమో! కాలమే దీన్ని తేల్చి చెబుతుంది. ప్రధాని మోదీ వాషింగ్టన్ లో ఉన్నత స్థాయి అధికారిక పర్యటన విజయవంతంగా ముగించిన తర్వాత వెంటనే బీజింగ్‌లో నా సంభాషణలు జరిగాయి. భారత్–అమెరికా సంబంధాల్లో పురోగతిపై చైనా ఆందోళన స్పష్టంగా కనిపించింది. చైనాను నిలువరించే అమెరికా వ్యూహంలో భారత్ భాగమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియాలో ‘నాటో’ పాత్రకు భారతదేశం మద్దతు ఇస్తుందా అనేది నాకు వారు సంధించిన ఒక ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం, నాటో అనేది యూరోపియన్ భద్రతకు సంబంధించినదనీ, ఆసియాన్ నేతృత్వంలోని యంత్రాంగాలతో సహా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి ఆసియా అనేక యంత్రాంగాలను కలిగి ఉందనీ నేను చెప్పాను. గ్లోబల్ సౌత్ నుండి చైనాను మినహాయించాలని భారతదేశం ప్రయత్నిస్తున్నదా అనే ఆందోళన కూడా వారిలో ఉంది. తాము గ్లోబల్ సౌత్‌లో భాగమా, కాదా అనేది నిర్ణయించుకోవాల్సింది చైనాయేనని నేను చెప్పాను. త్వరలో జరగనున్న జీ20 సదస్సు సన్నాహాల్లో భాగంగా, గ్లోబల్ సౌత్ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు మోదీ చొరవ తీసుకోవడం చైనాను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్థికపరమైన చిక్కులను కలిగించవచ్చు కాబట్టి, చైనాకు ‘అభివృద్ధి చెందుతున్న దేశం’ హోదాను నిరాకరించే అమెరికా ప్రయత్నాల గురించి వారు ప్రస్తావించారు. చైనా చేసిన మరొక ఫిర్యాదు ఏమిటంటే, ‘షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్’ (ఎస్సీఓ) సమావేశాన్ని భారత్ వ్యక్తిగత స్థాయిలో కాకుండా, క్లుప్తంగా ఆన్ లైన్ సదస్సును నిర్వహించడం ద్వారా దాని ‘స్థాయిని తగ్గించింది’ అని. ఇది అమెరికా ప్రభావంతో జరిగిందనే అనుమానం చైనాకు ఉంది. మొత్తంమీద, చైనా తన గురించి తాను అస్పష్టంగానే ఉందనే భావన కలుగుతుంది. అదే సమయంలో భారత్ తన ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రావీణ్యతనూ, చురుకుదనాన్నీ ప్రదర్శించిందనే అభిప్రాయం ఉంది. పెట్టుబడి, సాంకేతికత ప్రవాహానికి భారతదేశం కొత్త గమ్యస్థానంగా మారినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో, ఇది చైనా ఆర్థిక అవకాశాల గురించి గుర్తించిన ఒక నిర్దిష్ట నిరాశా వాదానికి సంబంధించినది కావచ్చు. ఇది భారతదేశం పట్ల చైనా వైఖరిలో మార్పును సూచిస్తుందా? ఇకపై సంఘటనలు ఎలా వెల్లడవుతాయో చూద్దాం. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ మాజీ కార్యదర్శి,ఆనరరీ ఫెలో, సీపీఆర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
చైనాపై నమ్మకం సన్నగిల్లింది.. అజిత్ ధోవల్
జోహన్నెస్‌బర్గ్ : వచ్చే నెలలో దక్షిణాఫ్రికా వేదికగా బ్రిక్స్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సన్నాహాల్లో భాగంగా మొదట జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)ల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న భారత జాతీయ భద్రతాధికారి అజిత్ దోవల్ చైనా తన నమ్మకాన్ని పోగొట్టుకుందని వ్యాఖ్యానించారు. ఈ సారి జరగబోయే బ్రిక్స్ సమావేశాల్లోనైనా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చైనా తరపున ఆ దేశ విదేశీ వ్యవహారాల కమిషన్ డైరెక్టర్ వాంగ్ యీ, భారత్ తరపున జాతీయ భద్రతాధికారి అజిత్ ధోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరిద్దరూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి, సరిహద్దు వివాదం తోపాటు మరికొన్ని కీలక అంశాల గురించి చర్చించారు. ఈ సందర్బంగా నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వద్ద పరిస్థితిని పరిష్కరించడానికి చైనాతో కలిసి పని చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ధోవల్ వాంగ్‌కు స్పష్టం చేశారు. ఢిల్లీ బీజింగ్ ల మధ్య సంబంధాలు మరింత మెరుగుపర్చాల్సిన ఆవశ్యకత ఉందని, రెండు దేశాల మధ్య సామరస్యత ప్రపంచ శాంతికి కూడా దోహదపడుతుందని అన్నారు. దీనికోసం బీజింగ్ మాతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సరిహద్దులో పరిస్థితి యథాస్థితికి రావాలంటే చైనా ముందు దూకుడు తగ్గించాలని, ఇప్పటికే వారు నమ్మకాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. అప్పుడే భారత్, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తాయని మరోసారి గుర్తు చేశారు. దీనికి స్పందిస్తూ వాంగ్ యీ ఏమన్నారంటే.. చైనా కూడా ధోవల్ ప్రస్తావించిన అంశాలపై సానుకూల దృక్పథంతోనే ఉందని రెండు దేశాల మధ్య సంబంధాలు సుస్థిరమైతే శాంతిని స్థాపించవచ్చని అన్నారు. ఇది కూడా చదవండి: మంత్రి ఇంట్లో చోరీ.. కంప్లైంట్ ఇస్తే తిరిగి తన మెడకే చుట్టుకుని.. -
‘సూపర్’ డ్యామ్ నిర్మాణంలో వెనక్కి తగ్గని చైనా? భారత్‌ను కలవరపెడుతున్న తాజా నివేదికలు!
టిబెట్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు (ఎల్‌ఎసి) సమీపంలో గల యార్లంగ్-త్సాంగ్పో నది (భారతదేశంలో దీనిని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు) దిగువ ప్రాంతాలపై ‘సూపర్’ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా తన ప్రణాళికలను కొనసాగిస్తున్నదంటూ మరోమారు నివేదికలు వెలువడ్డాయి. భారత సైనిక స్థావరాల సరిహద్దుకు దగ్గరగా.. ప్రముఖ భౌగోళికరాజకీయ నిపుణుడు బ్రహ్మ చెల్లానీ నిక్కీ ఇటీవల..చైనా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను రహస్యంగా నిర్మించడం సాధ్యం కాదని అన్నారు. కాగా చైనా రూపకల్పనలోని ఈ మెగా ప్రాజెక్ట్ 60 గిగావాట్ల సామర్థ్యం కలిగి భారత సైనిక స్థావరాల సరిహద్దుకు దగ్గరగా ఉంది. కాగా చైనా చేపడుతున్న ఈ ఆనకట్ట నిర్మాణ కార్యకలాపాల నివేదికలు మీడియాలో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఈ ప్రాజెక్టుల స్థాయిని, భౌగోళిక పరిధిని చైనా ఎప్పుడూ వెల్లడించనందున అవి రహస్యంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద నదిపై.. బ్రహ్మపుత్ర నది కైలాష్ పర్వతం సమీపంలోని అంగ్సీ హిమానీనదంపై ఉద్భవించింది. 3,969-కిలోమీటర్ల పరిధి కలిగివుంది. దీని ఉపనది యార్లంగ్-త్సాంగ్పో వైవిధ్యమైన వాతావరణ, జలసంబంధమైన మండలాలను కలిగి ఉన్న ఒక ప్రధాన నదీ వ్యవస్థగా అలరారుతోంది. ఇది టిబెట్ అటానమస్ రీజియన్ (టీఏఆర్) నుంచి విభిన్న ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. యార్లంగ్ జాంగ్బో బ్రహ్మపుత్రగా భారతదేశంలోకి ప్రవహిస్తుంది. చివరకు బంగ్లాదేశ్‌లో డెల్టాను ఏర్పరుస్తుంది. తూర్పు దిశలో అనేక ఉపనదులను తనలో కలుపుకున్న తరువాత నది ఈశాన్యం వైపుకు మారుతుంది. హిమాలయాల తూర్పు చివర పర్వత ప్రాంతాల మధ్య పెద్ద ఇరుకైన మార్గం గుండా వెళ్లి తిరిగి చైనాను దాటుతుంది. భారత వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)కు ఇరువైపులా 5,000 మీటర్ల పరిధిలో విస్తరించి భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు లోతైన గార్జ్ (యార్లంగ్ త్సాంగ్పో గ్రాండ్ కాన్యన్) ఏర్పడుతుంది. నీటి విడుదల పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద నది (సెకనుకు 19,825 క్యూబిక్ అడుగులు). ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం.. గత రికార్డులు బద్దలు కొడుతూ.. ‘ఇది చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమకు ఒక చారిత్రాత్మక అవకాశం’ యార్లంగ్-త్సాంగ్పో/బ్రహ్మపుత్ర వద్ద నది భారతదేశంలోకి ప్రవేశించే ముందు ఉన్న ప్రదేశంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని చైనా యోచిస్తోందని సమాచారం. నవంబర్ 2020లో ఆనకట్ట గురించిన నివేదికలు వెలువడినప్పుడు చైనీస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్.. ‘చైనా యార్లంగ్-త్సాంగ్పో నదిపై ఒక జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఇది ఆసియాలోని ప్రధాన జలాల్లో ఒకటి. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ గుండా కూడా వెళుతుంది’ అని పేర్కొంది. కాగా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా ఛైర్మన్.. ‘చరిత్రలో దీనికి సమానమైనది లేదు. ఇది చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమకు ఒక చారిత్రాత్మక అవకాశం. ఈ ఆనకట్ట 300 బిలియన్ల ఆదాయాన్ని అందించగలదని’ ప్రకటించారు. బీజింగ్ రూపొందించిన స్వచ్ఛమైన శక్తి లక్ష్యాలను చేరుకోవడంలో ఇది సహాయపడుతుందన్నారు. ఈ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన రిపోర్టులు మరోమారు చర్చల్లోకి వచ్చాయి. నీటి దోపిడీలో నిమగ్నమైన చైనా చైనా తమ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరతను నివారించేందుకు ఈ నదిని ఉత్తరం వైపు మళ్లించే అవకాశం కూడా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఫలితంగా భారతదేశానికి పలు చిక్కులు తలెత్తనున్నాయి. పర్యావరణ సమస్యలు తలెత్తడంతోపాటు బ్రహ్మపుత్ర నీటి ప్రవాహం తగ్గుతుందని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. చైనా పలు ప్రధాన నదుల నుండి జలవిద్యుత్ ఉత్పత్తి చేయడానికి దాదాపు 100 డ్యామ్‌ల ప్రణాళికలను కలిగి ఉందని భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు బ్రహ్మ చెల్లానీ తెలిపారు. టిబెటన్ పీఠభూమి నుండి ప్రవహించే అన్ని ప్రధాన నదులపై బహుళ డ్యామ్‌లను నిర్మింపజేస్తూ నీటి దోపిడీలో చైనా నిమగ్నమై ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా యార్లంగ్-త్సాంగ్పో నదిపై పలు ప్రాంతాల్లో చైనా చిన్న డ్యామ్‌లను నిర్మించడం ప్రారంభించింది. ఇప్పుడు అతిపెద్ద ఆనకట్టలను నిర్మించడానికి ప్రణాళికలు జరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అస్థిరతకు మరింత ఆజ్యం పోస్తూ.. ఈ ఏడాది జనవరిలో జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ పలు ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి, టిబెట్‌లోని మబ్జా జాంగ్బో (త్సాంగ్పో) నదిపై భారత్-నేపాలీ-చైనీస్ సరిహద్దు ట్రైజంక్షన్‌కు ఉత్తరంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో డ్యామ్ నిర్మిస్తున్నట్లు ధృవీకరించారు. ఇది ఆనకట్ట నిర్మాణ కార్యకలాపానికి సంబంధం లేనప్పటికీ, ఇది హిమాలయ సరిహద్దులోని పలు విభాగాలలో కొనసాగుతున్న అస్థిరతకు మరింత ఆజ్యం పోస్తున్నదన్నారు. యూఎన్ కన్వెన్షన్ ఆన్ నాన్-నేవిగేషనల్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్‌కోర్స్ ఆధారంగా రూపొందించిన అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ నదిలో జోక్యానికి వీటో అవకాశం కల్పించలేదు. చైనా ధోరణిపై భారత్ అప్రమత్తం 2002లో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం చైనా.. యార్లంగ్-త్సాంగ్పో/బ్రహ్మపుత్ర జలసంబంధ సమాచారాన్ని మే, అక్టోబర్ మధ్య భారత్‌తో పంచుకోవాలి. తద్వారా వర్షాకాలంలో భారీ ప్రవాహం తలెత్తినప్పుడు భారతదేశం అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే 2017 డోక్లామ్ సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత చైనా నది నీటి ప్రవాహ స్థాయిలను భారత్‌తో కమ్యూనికేట్ చేయడాన్ని అకస్మాత్తుగా నిలిపివేసింది. ఈ నేపధ్యంలో చైనా ధోరణి విషయంలో భారత్ అప్రమత్తమైంది. ప్రస్తుతం యార్లంగ్-త్సాంగ్పో-బ్రహ్మపుత్ర మార్గంలో చైనా చేపడుతున్న ఆనకట్ట నిర్మాణం పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింతగా పెంచే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి..! -
చైనా సరిహద్దు ఉద్రిక్తత: ఈ సారి కూడా రక్షణ రంగానికి ప్రాధాన్యత?
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధఙంచిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. అటు రానున్న ఎన్నికలు, ఇటు మోదీ సర్కార్‌కు చివరి వార్షిక బడ్జెట్ కానున్న నేపథ్యంలో రక్షణ రంగంతో పాటు పలు రంగాలు ఈ బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నాయి. భారత సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గత బడ్జెట్లలో రక్షణ వ్యయానికి ప్రాధాన్యతనిచ్చింది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)వద్ద చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య బడ్జెట్ 2023 రక్షణ రంగ కేటాయింపులు 10-15 శాతం పెరగవచ్చని అంచనా. 10-15 శాతం పెరగనున్న కేటాయింపులు ఈ బడ్జెట్లో రక్షణ వ్యయం 10-15 శాతం పెరుగుతుందని రక్షణ రంగం అంచనా వేసింది. రక్షణ రంగంలో, ముఖ్యంగా దేశీయ ఉత్పత్తికి సంబంధించి, పరికరాలు, ఆర్ అండ్ డికి సంబంధించిన ఆర్డర్లు వంటి వాటిని అంచనా వేస్తుంది. అదే సమయంలో, ప్రభుత్వ దేశీయ కంపెనీలు తయారీని పెంచడానికి మరింత ప్రోత్సాహాన్ని అందించవచ్చు. 25 శాతం వృద్ధిని, రక్షణ బడ్జెట్ రూ. 6.6 లక్షల కోట్ల వరకు పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలపై దృష్టి దీంతోపాటు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ కూడా బడ్జెట్లో దృష్టి సారించనుంది. రక్షణ రంగంలో ఎంఎస్ఎంఈ భాగస్వామ్యం మరింత పెరగాలని భావిస్తోంది. పరిశోధన అభివృద్ధి కోసం ప్రకటించిన ప్రోత్సాహకాలు లేదా విధానాలతో పాటు, కొత్త పరికరాల సేకరణకు కూడా బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో పెంపును నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా రక్షణ మంత్రిత్వ శాఖకు గతేడాది రూ.5.25 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్‌ను కేటాయించారు. అలాగే రక్షణ రంగంలో పరిశోధనలకు 25 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది రూ.2.33 లక్షల కోట్లు కేటాయించగా, రక్షణ మంత్రిత్వ శాఖకు రూ.2.39 లక్షల కోట్లు కేటాయించారు. రక్షణ శాఖ పెన్షన్ బడ్జెట్ రూ.1.19 లక్షల కోట్లుగా ఉంది. 'మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్' లో భాగంగా దేశీయ పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో దేశీయ స్థాయిలో సామర్థ్య విస్తరణకు రక్షణ రంగం పెద్దపీట వేసింది. -
సైనికుల ఘర్షణపై స్పందించిన చైనా.. ఏమందంటే?
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద భారత్, చైనా సైనికుల నడుమ ఘర్షణ తెలెత్తడంతో మరోమారు సరిహద్దు వివాదం తెరపైకి వచ్చింది. ఈ నెల 9న చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. మన సైన్యం వారి ప్రయత్నాలను తిప్పికొట్టింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైనికుల ఘర్షణ తర్వాత తొలిసారి స్పందించింది చైనా. భారత్ సరిహద్దులో పరిస్థితులు ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా స్థిరంగా ఉన్నాయని ప్రకటించింది. ‘మాకు ఉన్న సమాచారం మేరకు చైనా-భారత్ సరిహద్దులో పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయి. సరిహద్దు వివాదంపై ఇరు పక్షాలు దౌత్య, మిలిటరీ మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తున్నాయి.’ అని పేర్కొన్నారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్. తవాంగ్ సెక్టార్లో సైనికుల ఘర్షణపై పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రకటన చేశారు. చైనా కుతంత్రాన్ని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయన ప్రకటన చేసిన కొద్ది సేపటికే చైనా స్పందించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: తవాంగ్ ఘర్షణ: చైనా సరిహద్దులో భారత ఫైటర్ జెట్స్ గస్తీ -
‘మీకేం వీటో పవర్ ఇవ్వలేదు’.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కి 100 కిలోమీటర్ల దూరంలో భారత్- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న 18వ విడత ‘యుద్ధ అభ్యాస్’ సైనిక ప్రదర్శనను చైనా వ్యతిరేకించటాన్ని తిప్పికొట్టింది భారత్. ఇలాంటి విషయంలో మూడో దేశానికి తాము ‘వీటో’ అధికారం ఇవ్వలేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్-అమెరికా ప్రతిపాదనకు చైనా ‘వీటో’ పవర్ ఉపయోగించి అడ్డుకున్న విషయాన్ని సూచిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఔలి ప్రాంతంలో భారత్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘యుద్ధ అభ్యాస్’ మిలిటరీ ప్రదర్శనను బుధవారం వ్యతిరేకించింది చైనా విదేశాంగ శాఖ. భారత్-చైనా మధ్య 1993,1996లో జరిగిన సరిహద్దు నిర్వహణ ఒప్పందాన్ని ఉల్లంఘస్తున్నట్లు పేర్కొంది. దానికి కౌంటర్ ఇచ్చారు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి. 1993, 96 ఒప్పందాలు ఈ మిలిటరీ ప్రదర్శనకు వర్తించవని స్పష్టం చేశారు. 2020, మేలో చైనా బలగాలు చేసిన ఉల్లంఘనలను గుర్తు చేసుకోవాలన్నారు. సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించటం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటం ద్వారా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇదీ చదవండి: వీడియో: గుజరాత్ భారీ రోడ్‌షో మధ్యలో ఆగిన ప్రధాని మోదీ కాన్వాయ్! ఎందుకంటే.. -
ఎల్ఏసీకి అతి సమీపంలో చైనా యుద్ధ విమానాలు.. భయంతోనే అలా!
సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ చైనా కవ్వింపు చర్యలను ఆపడం లేదు. తూర్పు లద్దాఖ్ సరిహద్దులోని వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో యుద్ధ విమానాలలో చక్కర్లు కొడుతోంది. గత మూడ్నాలుగు వారాల్లో భారత సైన్యాన్ని కవ్వించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. భారత రక్షణ యంత్రాంగం గుట్టును తెలుసుకునేందుకే డ్రాగన్ దేశం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చైనాకు భారత సైన్యం దీటుగా బదులిస్తోందని సైనిక వర్గాలు తెలిపాయి. డ్రాగన్ దేశం ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా, భద్రతా ముప్పు వాటిల్లేలా చేసినా క్షణాల్లో తిప్పికొట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నాయి. సరిహద్దుకు అతి సమీపంలో మిగ్ 29, మిరాజ్ 2000 యుద్ధ విమానాలకు మోహరించినట్లు వెల్లడించాయి. అదే సమయంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉద్రిక్తతలు పెరగకుండా చూస్తున్నట్లు పేర్కొన్నాయి. భయంతోనే.. అయితే డ్రాగన్ దేశ సైన్యం భయంతోనే యుద్ధ విమానాలతో చక్కర్లు కొడుతున్నట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. లద్దాక్ సెక్టార్లో భారత సైన్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్‌గ్రేడ్ చేసిందని, చైనా సైన్యానికి సంబంధించిన కార్యకలాపాలను అత్యంత సమీపం నుంచి పసిగడుతోందని చెప్పాయి. ఆ భయంతో చైనా యుద్ధ విమానాలతో వాస్తవాధీన రేఖకు సమీపంలో చక్కర్లు కొడుతున్నట్లు పేర్కొన్నాయి. జూన్ 24-25 మధ్య చైనా కవ్వింపు చర్యలు మొదలయ్యాయని, జులై 17న ఇరు దేశాల మధ్య జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. భారత్ కూడా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నిఘాను మరింత పటిష్టం చేసినట్లు సమాచారం. చదవండి: సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్ -
చైనా వక్రబుద్ధి?.. మరో అక్రమ వంతెన నిర్మాణం
చైనా తన వక్రబుద్ధిని మరో సారి ప్రదర్శించింది. భారత్‌ను ఎలాగైనా దెబ్బకొట్టేందుకు దొంగ ప్రయత్రాలు చేస్తోంది. ఇందులో భాగంగా తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో వేగంగా నిర్మాణాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో పాంగాంగ్ సరస్సుపై ఖుర్నాక్ వద్ద వంతెన నిర్మాణం పూర్తి చేసింది. తాజాగా ఈ బ్రిడ్జ్‌ను దగ్గరలోని సైనిక స్థావరానికి అనుసంధానించేలా రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. ఖుర్నాక్ సమీపంలో గతేడాది సెప్టెంబర్ చివరి వారం నుంచి డ్రాగన్ వంతెన నిర్మాణం ప్రారంభించింది. ఇది ఏప్రిల్ తొలివారంలో పూర్తయింది. దీంతో ఖుర్నాక్ నుంచి దక్షిణ ఒడ్డుకు 180 కిలోమీటర్ల దూరం కాస్తా.. 50 కిలోమీటర్లకు తగ్గిపోయింది. 1962 నుంచి చైనా అక్రమ ఆక్రమణలో కొనసాగుతున్న ప్రాంతాల్లో ఈ వంతెనను నిర్మించింది. ఇది వరకే ఈ వంతెన నిర్మాణంపై.. ‘భారత ప్రభుత్వం ఈ అక్రమ ఆక్రమణను ఎప్పటికీ అంగీకరించలేదు’ అని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటులో తెలిపారు. పాంగాంగ్ సరస్సు సమీపంలోని కీలక స్థానాలపై నియంత్రణ సాధించడం కోసం చైనా ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత ఆగస్టు 2020 నాటి పరిస్థితి ఎదురైనప్పుడు భారత సాయుధ బలగాలు ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలో భాగంగా ఈ వంతెన నిర్మాణమని చేపట్టింది. దీంతో స్పంగూర్ సరస్సు వద్దనున్న చైనా దళాలకు అత్యవసరమైనప్పుడు ఖుర్నాక్, సిరిజాప్లలోని స్థావరాల నుంచి అదనపు మద్దతును వేగంగా అందించే అవకాశం లభించింది. చదవండి: PM Modi-PM Danish: డెన్మార్క్ ప్రధాని నివాసంలో మోదీ చర్చలు.. వీడియో వైరల్ Further developments to the new Chinese bridge at #PangongTso, recent imagery shows roadworks have begun (as mapped in the quoted tweet) to join the bridge most likely to Rutog, giving #China's PLA troops in the area quicker connectivity through the terrain https://t.co/xLDhDTefvL pic.twitter.com/ELwWr6xE1N — Damien Symon (@detresfa_) May 2, 2022 Incase you're still wondering why the new bridge at #PangongTso matters, here's an explainer on its implications & potential advantages it holds for #China's troops in the area, very likely a lesson learnt from #India's maneuvers at Rezang La in 2020 https://t.co/wsQwQuHQT9 pic.twitter.com/xoAzkWIhqY — Damien Symon (@detresfa_) January 4, 2022 -
భారత్ – చైనా చర్చలు
China-India: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద 22 నెలల క్రితం తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోవడానికి భారత–చైనాల మధ్య శుక్రవారం మరోసారి చర్చలు జరిగాయి. వరసక్రమంలో ఇవి 15వ దఫా చర్చలు. రెండు నెలల క్రితం జరిగిన చర్చల వల్ల ఎలాంటి ఫలితమూ కనబడకపోవడం కారణంగా ఈ చర్చల ప్రక్రియపై కొంత నిరాశా నిస్పృహలు ఏర్పడిన మాట వాస్తవమే. అయితే చర్చలకు వేరే ప్రత్యామ్నాయం ఉండదు కనుక ఇవి కొనసాగక తప్పదు. 2020 మే నెల మొదటి వారంలో ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య తొలిసారి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు దేశాలూ భారీయెత్తున సైన్యాన్నీ, ఆయుధ సామగ్రినీ తరలించాయి. ఆ ఏడాది జూన్ నెలలో చైనా సైనికులు రాళ్లు, ఇనుపరాడ్లతో దాడికి దిగినప్పుడు మన జవాన్లు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మన సైనికుల ఎదురుదాడిలో చైనా సైన్యం కూడా తీవ్రంగా నష్టపోయిందన్న కథనాలు వెలువడ్డాయి. సైన్యం స్థాయిలోనూ, దౌత్యపరంగానూ చర్చోపచర్చలు జరిగాక నిరుడు ప్యాంగాంగ్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో రెండు దేశాలూ సైన్యాలను ఉపసంహ రించుకున్నాయి. గోగ్రాలో కూడా ఇది పూర్తయింది. హాట్ స్ప్రింగ్స్ (పెట్రోలింగ్ పాయింట్–15) ప్రాంతాలనుంచి ఉపసంహరణ విషయంలో చైనా నానుస్తోంది. అలాగే డెస్పాంగ్ బల్జ్, డెమ్చోక్ లతో సహా మరికొన్న చోట్ల కూడా ఉపసంహరణ మొదలుకావాల్సి ఉంది. దశాబ్దాల తరబడి ఎల్ఏసీపై ఏకాభిప్రాయం కుదరక ఇరు దేశాల మధ్యా అడపాదడపా ఉద్రిక్తతలు అలుముకుంటున్నాయి. మాస్కోలో 2020లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశాల సందర్భంగా మన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి సమావేశమయ్యాక ఇరు దేశాల మధ్యా పరస్పరం చర్చలు జరగాలని నిర్ణయించారు. విభేదాలు వివాదాలుగా మారకుండా చూడాలనీ, ఇప్పటికే కుదిరిన ఒప్పందాలను గౌరవించాలనీ అవగాహన కుదిరింది. కానీ ఆ నిర్ణయానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది చైనాయే. సరిహద్దుల్లో దీర్ఘకాలం సైన్యాలను మోహ రించడం వల్ల అనుకోని సమస్యలు వచ్చిపడతాయి. ఉద్రిక్తతలు పెరుగుతాయి. అవి ఘర్షణలకు దారితీస్తాయి. వర్తమాన రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే అందుకు తార్కాణం. ఇరుగు పొరుగు దేశాలు రెండూ భాగస్వాములుగా మెలగాలితప్ప ప్రత్యర్థులుగా కాదని చైనా విదేశాంగమంత్రి గతంలో అన్నారు. కానీ ఆచరణలో అందుకు సంబంధించిన జాడలు కనబడవు. అమెరికా రూపొందించి అమలు చేస్తున్న ఇండో–పసిఫిక్ వ్యూహం సారాంశం ఆసియాలో మరో నాటో రూపకల్పన తప్ప మరేమీ కాదని ఆయన ఈమధ్య చేసిన వ్యాఖ్య కీలకమైనది. ఇండో–పసిఫిక్ వ్యూహంలో భాగంగా అమెరికా చొరవతో ఏర్పాటైన చతుర్భుజ కూటమి (క్వాడ్)లో భారత్ భాగస్వామి. దీంతోపాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా మధ్య నిరుడు సెప్టెంబర్‌లో ‘ఆకస్’(ఆస్ట్రేలియా, యూకే, అమెరికా) ఒప్పందం కుదిరింది. ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గా ములు సమకూర్చడంతోపాటు ఇతరత్రా అంశాల్లో సైతం హామీ ఇవ్వడం ఈ ఒప్పందం సారాంశం. ఇది కూడా ఇండో–పసిఫిక్ వ్యూçహానికి సంబంధించిందే. ఇదికాక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్, అమెరికా భాగస్వాములుగా ‘ఫైవ్ ఐస్’ పేరుతో రక్షణ సంబంధమైన నిఘా, అంతరిక్ష నిఘా వగైరాలకు సంబంధించి మరో ఒప్పందం ఉంది. ఇవన్నీ తనను చుట్టుముట్టి కట్టడి చేయడానికేనని చైనా బలంగా విశ్వసిస్తోంది. అయితే చైనా ఆరోపిస్తున్నట్టు ఇప్పటికైతే క్వాడ్ సైనిక కూటమి కాదు. ఇండో–పసిఫిక్ ప్రాంత దేశాలు కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, వాతావరణ మార్పులు, కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి వంటి అంశాలకు మాత్రమే అది పరిమిత మైంది. ఇది ముందూ మునుపూ ఏమవుతుందన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సైనిక కూటములు ఏర్పడటం, కయ్యానికి కాలుదువ్వడం వంటి పరిణామాలు ఎవరికీ మంచిది కాదు. అందుకు ప్రస్తుత ఉక్రెయిన్ ప్రత్యక్ష ఉదాహరణ. సామరస్య పూర్వకంగా సంప్రదింపులు జరుపుకోవడం, ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని అన్వేషించడం ఉత్తమమైన మార్గం. కానీ సమస్యలో భాగమైన అన్ని పక్షాలూ అందుకు నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. అవతలి పక్షానికి విశ్వాసం కల్పించాలి. కానీ ఎల్ఏసీ విషయంలో మాత్రమే కాదు... బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) పేరిట రూపకల్పన చేసిన బృహత్తర ప్రాజెక్టులో సైతం చైనా మన వ్యూహా త్మక ప్రయోజనాలను దెబ్బతీసే ఎత్తుగడలు అనుసరించింది. ఇండో–పసిఫిక్ వ్యూహం తన కట్టడి కోసమే ఉనికిలోకొచ్చిందన్న సందేహం చైనాకు ఉండటం వల్లే ఎల్ఏసీ వద్ద యధాతథ స్థితిని దెబ్బతీసి, మన దేశాన్ని చికాకుపరచడం మొదలుపెట్టింది. ఇది తెలివితక్కువ పని. నిజానికి వివాదంలో మూడో పక్షం ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తున్నట్టు అనుమానం కలిగితే సత్వరం ఆ వివాదాన్ని పరిష్కరించుకోవడం విజ్ఞుల లక్షణం. చైనాకు అది కొర వడింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇరుగుపొరుగుతో సఖ్యంగా ఉండాలని చైనా నిజంగా కోరుకుంటే అందుకు సంబంధించిన సంకేతాలు కనబడాలి. చర్చల్లో విశాల దృక్పథంతో వ్యవహ రించడం, అక్కడ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తదుపరి చర్యలుండటం అవసరం. భారత్ –చైనా మధ్య జరుగుతున్న చర్చలు సాధ్యమైనంత త్వరలో ముగిసి ఒక సానుకూల ఫలితం వస్తుం దనీ, అది రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాలకు మార్గం సుగమం చేస్తుందనీ ఆశించాలి. -
చైనా తీరు ప్రపంచానికే ఆందోళనకరం!
మెల్బోర్న్: చైనా తీరు ప్రపంచానికే ఆందోళనకరంగా మారుతోందని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్. జయశంకర్ అన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి జయశంకర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో చైనా, భారత సరిహద్దుల్లో చోటుచేసుకున్న పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో చైనా చేసుకున్న రాతపూర్వక ఒప్పందాలను చైనా ఉల్లంఘించిన కారణంగానే సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలను మోహరించడం, వారి అత్యుత్సహం వల్లే రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. శనివారం క్వాడ్ సమావేశంలో భాగంగా భారత్, చైనా మధ్య లడఖ్ ప్రతిష్టంభన గురించి చర్చ జరిగిందా అని విలేఖరులు ప్రశ్నించారు. దీనికి జయశంకర్ స్పందిస్తూ.. రెండు దేశాల మధ్య చర్చ జరిగిందని తెలిపారు. సరిహద్దు దేశాల మధ్య సమస్యలపై వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని వెల్లడించారు. 2020 ఏప్రిల్ లో చైనా నిబంధనలను ఉల్లంఘించి భారత భూ భాగంలోకి చొరబడిన కారణంగానే ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు. సరిహద్దు ఉగ్రవాదం గురించి తీవ్ర ఆందోళనలు ఉన్నాయని దీని గురించి బహుపాక్షిక వేదికల్లో ఉగ్రవాద వ్యతిరేక సహకారానికి తమ భాగస్వామ్యం ఉంటుందని సూచించారు. దేశాల సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ అంతర్జాతీయ జలాల్లో నావిగేషన్ స్వేచ్ఛ, భద్రతను ప్రోత్సహించడం కోసం క్వాడ్ పనిని కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్టు జైశంకర్ చెప్పారు. ఈ సమావేశంలో సభ్య దేశాలు(భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్) రక్షణ, భద్రతా సహకారంలో పురోగతిపై క్లుప్తంగా చర్చించాయి. -
కవ్విస్తున్న డ్రాగన్‌తో కష్టాలు
అసలే సంబంధాలు అంతంత మాత్రమైనప్పుడు, కొద్దిపాటి కవ్వింపు చర్యలైనా పరిస్థితిని క్లిష్టతరం చేస్తాయి. భారత్‌తో సరిహద్దు వెంట చైనా తాజా చర్యలు అచ్చం అలాగే ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు చైనా తన సొంత నామకరణాలు చేస్తూ, డిసెంబర్ 30న చేసిన ప్రకటన అలాంటి చర్యల్లో ఒకటి. అలాగే, ఆంగ్ల సంవత్సరాదికి గల్వాన్ లోయలో చైనా సైనికులు తమ దేశ పతాకావిష్కరణ చేసి, ‘ఒక్క అంగుళం భూమినైనా వదిలేది లేదు’ అని పేర్కొన్న వీడియోలు కాక రేపుతున్నాయి. ఇక, జనవరి 1 నుంచి చైనా సరికొత్త సరిహద్దు చట్టం తెచ్చింది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట సైనిక, పౌర వినియోగాలకు వీలుగా చైనా మరిన్ని నమూనా సరిహద్దు గ్రామాలను నిర్మించనుంది. వెరసి, దేశ ఉత్తర సరిహద్దుల్లో భారత్ మరిన్ని సవాళ్ళను ఎదుర్కోక తప్పేలా లేదు. అరుణాచల్‌ను ‘దక్షిణ టిబెట్’ పేరిట తమ అధికారిక చైనీస్ పత్రాలు, భౌగోళిక పటాల్లో ప్రమాణీకరించాలని డ్రాగన్ చూడడం దురాలోచన. ‘అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం’ అని మన ప్రభుత్వం ఘాటుగా చైనాకు చెప్పాల్సి వచ్చింది. 2017 ఏప్రిల్‌లో కూడా చైనా ఇలాగే అరుణాచల్‌లోని 6 ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టింది. అప్పట్లో దలైలామా భారత సందర్శనతో ఈ కడుపుమంట చర్యకు దిగింది. గతవారం పలువురు భారత పార్లమెంట్ సభ్యులు ప్రవాసంలో ఉన్న టిబెటన్ పార్లమెంట్ ఉత్సవానికి హాజరయ్యారు. దానికి ప్రతిచర్య అన్నట్టుగా అరుణాచల్‌లోని 25 జిల్లాల్లో 11 జిల్లాలకు విస్తరించిన తాజా పేర్ల జాబితా వెలువడింది. అందులో 8 పట్నాలతో పాటు, 4 కొండలు, 2 నదులు, ఓ కొండ కనుమ ఉన్నాయి. జాగ్రత్తగా చూస్తే, మొత్తం అరుణాచల్ అంతటి పైనా తనదే పట్టు అని పునరుద్ఘాటించడానికే చైనా ఈ నిర్ణీత స్థలాలను ఎంపిక చేసుకుంది. భారత్, భూటాన్లతో భౌగోళిక సరిహద్దులను ఏకపక్షంగా పునర్లిఖించే ప్రయత్నంలో భాగంగానే చైనా కొత్త సరిహద్దు చట్టం తెచ్చినట్టు కనిపిస్తోంది. ఒక పక్క ఆ చట్టం, మరోపక్క భారత్‌తో వివాదం ఉన్న భూసరిహద్దుల్లో 2017 నుంచి 628 ‘షియావోకాంగ్’ నమూనా గ్రామాల నిర్మాణం ఆందోళన రేపుతున్నాయి. సరిహద్దు సమస్యకు ‘సైనిక పరిష్కారం’ అనే పరిస్థితిని చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) సృష్టిస్తోందా అనిపిస్తోంది. చైనా అత్యున్నత శాసన నిర్మాణ వ్యవస్థ ‘నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్’ స్థాయీ సంఘం నిరుడు అక్టోబర్ 23న ఈ కొత్త సరిహద్దు చట్టానికి ఆమోదముద్ర వేసింది. మొత్తం 7 అధ్యాయాలు, 62 అధికరణాలున్న చట్టం ఇది. ‘చైనాలోని భూసరిహద్దు ప్రాంతాల రక్షణ, వినియోగం కోసం’ అంటూ ఈ చట్టం తెచ్చామన్నారు. దాదాపు 22,457 కిలోమీటర్ల మేర భూసరిహద్దును 14 దేశాలతో చైనా పంచుకుంటోంది. మంగోలియా, రష్యాల తర్వాత చైనాకు మూడో అతి పెద్ద సరిహద్దు భారత్‌తోనే! తూర్పు లద్దాఖ్ సరిహద్దు అక్సాయ్ చిన్‌లో భారత భూభాగంలో 38 వేల కి.మీ.ల భాగాన్ని చైనా ఆక్రమించుకుందని దీర్ఘకాలంగా మన దేశ ఆరోపణ. ఇది కాక, 1963లో పాకిస్తాన్ తాను ఆక్రమించుకున్న భారత భూభాగంలో 5,180 కి.మీ.ల మేర చైనాకు కట్టబెట్టింది. ఆ సరిహద్దు సమస్యలు సాగుతుండగా, లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో 2020 జూన్ 15న భారత, చైనా సేనల మధ్య హింసాత్మక ఘర్షణ రేగింది. గత 45 ఏళ్ళుగా ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఆ ఘర్షణలో 20 మంది భారత సైనికుల మరణం, ఇరుదేశాల మధ్య సైనిక ప్రతిష్టంభన, 20 నెలలుగా అనేక విడతలుగా దౌత్య, సైనిక వర్గాల చర్చలు నడుస్తున్న చరిత్ర. గతంలో లౌక్యంగా దౌత్యం నడుపుతూ వచ్చిన బీజింగ్ తన ఆర్థిక, సైనిక సంపత్తితో ఇప్పుడు ఏ దేశాన్నైనా అయితే మిత్రుడు, కాదంటే శత్రువు అన్న పద్ధతిలోనే చూస్తోంది. ఒక పక్క సరిహద్దు గ్రామాల నిర్మాణంతో ఇరుకున పెడుతూనే, రాజకీయ స్థాయిలో మన దేశానికీ – పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్‌లకూ మధ్య చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తోంది. మాల్దీవులు, శ్రీలంకల్లో, ఇంకా చెప్పాలంటే హిందూ మహాసముద్రంలో భారత ప్రాబల్యాన్ని తగ్గించాలని చూస్తోంది. అందుకే, జాతీయ భద్రత భారత్ ముందున్న సవాలు. భారతీయ ప్రాంతాలకు చైనీయుల కొత్త నామకరణం ప్రతీకాత్మకమే కావచ్చు. కానీ, తద్వారా సరిహద్దు వివాదాలపై చైనా సరికొత్త వైఖరి ఏమిటన్నది అర్థమవుతోంది. అదీ కీలకం. కొత్త సరిహద్దు చట్టం తీసుకురాక ముందు నుంచీ భారత్‌తో దూకుడుగా ఉన్న చైనా... అవసరమైతే ఇక ఈ చట్టాన్ని సాధనంగా వాడుకుంటుంది. ఏ దేశమైనా తమ భూభాగాన్ని రక్షించుకోవడం చేసే పనే. చైనా ఆ పనే చేస్తానంటోంది. కానీ ఆ భూభాగం ఏమిటన్నదే ప్రశ్న. ఇప్పటి దాకా చర్చలతో ఎల్ఏసీ సహా సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవాలని చూశారు. ఇప్పుడిక బలప్రయోగంతో డ్రాగన్ ఆ పని చేయాలనుకుంటోందన్న మాట. ఈ చట్టం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది అందుకే. సైనిక స్థాయిలో భారత్ ఇప్పటికే అమెరికాకు దగ్గరై, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలసి చతుర్భుజ కూటమి ‘క్వాడ్’లో పాల్గొంటూ చైనాకు చెక్ పెట్టాలనుకుంటోంది. ఆర్థిక స్థాయిలో చైనా ప్రాబల్య మున్న ఆసియా ప్రాంత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ‘ఆర్సీఈపీ’కి భారత్ దూరంగా నిలిచింది. బ్రిటన్, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇజ్రాయెల్ లాంటి వ్యూహాత్మక భాగస్వాములతో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద ప్రయత్నాల్లో ఉంది. ఇక, జాతీయ భద్రతలో చైనా ముప్పు తప్పించుకోవాలంటే దేశమంతటా ఒక్క తాటిపైకి రావాలి. మతప్రాతిపదికన మనుషులను కేంద్రీకృతం చేసే రాజకీయం అందుకు ఇబ్బంది అని గ్రహించాలి. సరిహద్దు భద్రతే సర్వోన్నతమని గుర్తించాలి. -
సరిహద్దుల్లోకి చైనా రోబోట్లు
న్యూఢిల్లీ: డ్రాగన్ దేశం చైనా సరిహద్దుల్లో మరో కుయుక్తికి తెరలేపింది. అతి శీతల, ఎత్తైన పర్వత ప్రాంతంలో భారత సైన్యంతో ధీటుగా తలపడలేని పీఎల్ఏ (చైనా సైన్యం) మెషిన్ గన్లను బిగించిన రోబోట్లను రంగంలోకి దించింది. ఆయుధాలను, ఇతర సరఫరాలను చేరవేయగలిగే మానవరహిత వాహనాలను అత్యధిక భాగం ప్రతిష్టంభన కొనసాగుతున్న తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోనే ఉంచినట్లు్ల సమాచారం. షార్ప్ క్లా అనే పేరున్న రోబోట్‌కు తేలికపాటి మెషిన్‌గన్ బిగించి ఉంటుంది. దీనిని రిమోట్‌తో ఆపరేట్ చేయవచ్చు. మ్యూల్–200 అనే మరో రోబో కూడా మనుషులతో అవసరం లేకుండానే ఆయుధాలను ఉపయోగించగలదు. టిబెట్ ప్రాంతంలో మోహరించిన మొత్తం 88 ‘షార్ప్ క్లా’రోబోల్లో 38, మ్యూల్ రకానికి చెందిన 120 రోబోల్లో అత్యధికం తూర్పులద్దాఖ్ ప్రాంతంలోనే చైనా మోహరిం చినట్లు సమాచారం. వీటికితోడుగా, సాయుధ బలగాలను తరలించే వీపీ–22 రకానికి చెందిన మొత్తం 70 వాహనాలకు గాను 47 వాహనాలను సరిహద్దుల్లోకి తీసుకువచ్చినట్లు మీడియా పేర్కొంది. అంతేకాకుండా, అన్ని రకాల ప్రాంతాల్లో మోర్టార్లు, శతఘ్నులు, హెవీ మెషిన్గన్ల వంటివాటిని తరలించేందుకు లింక్స్ రకం వాహనాలను కూడా సైన్యానికి తోడుగా సరిహద్దుల్లోనే చైనా ఉంచిందని సమాచారం. -
సరిహద్దుల్లో మరోసారి బరితెగించిన చైనా
న్యూఢిల్లీ: చైనా మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. సరిహద్దు సమస్యలపై భారత్‌తో చర్చలు జరుపుతూనే దొంగ దెబ్బ తీయాలని కుయుక్తులు పన్నింది. గత వారంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో యాంగ్త్సే సరిహద్దుల వెంబడి దాదాపుగా 200 మంది చైనా బలగాలు భారత్ భూభాగంలోకి రావడానికి ప్రయత్నించాయి. అయితే, భారత్ వారిని సమర్థవంతంగా అడ్డుకొని వెనక్కి పంపినట్టు ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల బలగాల మధ్య కాసేపు ఘర్షణ నెలకొంది. ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి కూడా దిగారు. ‘‘ఇరు సైన్యాలు పరస్పరం భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారు. కొన్ని గంటల సేపు ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం కొనసాగింది. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లిపోయాయి’’అని ఆ వర్గాలు తెలిపాయి. రోజూ నిర్వహించే పెట్రోలింగ్‌లో భాగంగానే చైనా సైనికులు మన భూభాగంలోకి రావడానికి ప్రయత్నించడాన్ని సైనికులు గుర్తించారు. ఈ సందర్భంగా కొందరు చైనా సైనికుల్ని భారత సైనికులు కొన్ని గంటలసేపు నిర్బంధించి ఉంచారని కూడా వార్తలు వచ్చాయి. స్థానిక కమాండర్ల స్థాయిలో చర్చలు ఒక కొలిక్కి రావడంతో చైనా సైనికుల్ని భారత్ విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జూ లిజియాన్‌ను ప్రశ్నించగా అలాంటి విషయమేదీ తనకు తెలియదని బదులిచ్చారు. తూర్పు లద్దాఖ్ వివాదంపై రెండు దేశాల అత్యున్నత స్థాయి మిలటరీ చర్చలు మరో విడత జరగడానికి కొద్ది రోజుల ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల డ్రాగన్ దేశం సరిహద్దుల వెంబడి సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో బారాహోతి సెక్టార్లో కూడా 100 మంది చైనా జవాన్లు భారత్ భూభాగంలోకి 5 కిలోమీటర్ల మేర ప్రవేశించి వంతెనను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది మే 5వతేదీన లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వెంబడి జరిగిన హింసాత్మక ఘటనతో రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఆ తర్వాత పలు దఫాలుగా రెండు దేశాల మధ్య మిలటరీ అధికారులు, దౌత్యప్రతినిధుల, విదేశాంగ మంత్రులు మధ్య చర్చలు జరిగాయి. ఫిబ్రవరిలో పాంగాంగ్ సరస్సు పరిసరాల నుంచి ఇరు దేశాలు బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకున్నాయి. ప్రస్తుతం ఇరుపక్షాలకు చెందిన 50 వేల నుంచి 60 వేల బలగాలు సరిహద్దుల వెంబడి మోహరించి ఉన్నాయి. -
'సరిహద్దుల్లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం'
న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి భారత వాయుసేన సిద్ధంగా ఉందని ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి చెప్పారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఇంకా మూడు స్థావారాల్లో వైమానిక బలగాలను మోహరించి ఉందని, వారిని దీటుగా ఎదుర్కోవడానికి భారత్ కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా ఉందని తెలిపారు. అక్టోబర్ 8న సంస్థ వార్షికోత్సవం ఉండడంతో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా మౌలిక సదుపాయాలను బాగా పెంచుతోందని, అయినప్పటికీ భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి త్రివిధ బలగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రఫేల్ యుద్ధ విమానాలు, అపాచీ హెలికాప్టర్లు, ఇతర అత్యాధునిక ఆయుధాలు వచ్చి చేరడంతో వాయుసేన మరిం త బలోపేతమైందని చౌధరి చెప్పారు. చదవండి: (కశ్మీరీ పండిట్ కాల్చివేత) ఇక పాక్ డ్రోన్లతో దాడుల్ని ముమ్మరంగా చేస్తోందని దానిని ఎదుర్కోవడానికి యాంటీ డ్రోన్ వ్యవస్థల్ని మరింత పెంచుతున్నామని తెలిపారు. రష్యాలో తయారైన ఉపరితలం నుంచి గగనతలానికి లక్ష్యాలను ఛేదించే ఎస్–400 క్షిపణులు ఈ ఏడాది వైమానిక దళం అమ్ముల పొదిలోకి చేరతాయని చెప్పారు. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్లు ఆరు రానున్నాయని, వచ్చే పదేళ్లలో 35 యుద్ధ స్క్వాడ్రాన్లు కూడా వచ్చి చేరుతాయని చెప్పారు. వాయుసేనని మొత్తంగా ఆధునీకరించి చైనా, పాక్ దురాగతాల్ని నివారిస్తామని చౌధరి వివరించారు. చదవండి: (13 మంది హజారాలను తాలిబన్లు అన్యాయంగా చంపేశారు) -
లద్దాఖ్‌లో ‘వజ్ర’ రెజిమెంట్
న్యూఢిల్లీ: చైనా కవ్వింపు చర్యలతో భారత్ అప్రమత్తమైంది. వాస్తవా«దీన రేఖ వెంబడి డ్రాగన్ దేశం భారీగా సైన్యాన్ని ఆయుధ సంపత్తిని మోహరిస్తుండగా దీటుగా ప్రతిచర్యలు ప్రారంభించింది. లద్దాఖ్ సెక్టార్‌లోని ఫార్వర్డ్ ప్రాంతాల్లో మొట్టమొదటి కె–9 వజ్ర శతఘ్నులతో కూడిన బలగాలను తరలించింది. ఈ సెల్ఫ్ ప్రొపెల్డ్ శతఘ్నులకు 50 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఛేదించే శక్తి ఉంది. ‘పర్వతప్రాంతాల్లోనూ కె–9 వజ్ర విజయవంతంగా పనిచేస్తున్నట్లు ప్రయోగ పరీక్షల్లో రుజువైంది. ఇటీవలే ఉత్పత్తయిన ఈ హొవిట్జర్ల మొత్తం రెజిమెంట్‌ను ఇక్కడ మోహరించాం. ఇవి చాలా సహాయకారిగా ఉంటాయి’అని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ తెలిపారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ‘చైనా వైపు పరిణామాలను నిత్యం కనిపెట్టి చూస్తున్నాం. తూర్పులద్దాఖ్‌తోపాటు, మన తూర్పు కమాండ్ పరిధిలో చైనా గణనీయంగా బలగాలను మోహరించింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. ఈ పరిస్థితుల్లో ఎలాంటి దుందుడుకు చర్యనైనా తిప్పికొట్టేందుకు ఉపక్రమించాం. ఆర్మీ, ఆయుధ సంపత్తి మోహరింపుతోపాటు మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచాం’అని ఆర్మీ చీఫ్ వెల్లడించారు. కాగా, దక్షిణకొరియా తయారీ కె–9 థండర్‌కు దేశీయంగా అభివృద్ధి చేసిన రూపమే కె–9 వజ్ర. ఈ శతఘ్నులను ముంబైకి చెందిన లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ దక్షిణకొరియా సంస్థ భాగస్వామ్యంతో ఉత్పత్తి చేస్తోంది. భారత్–చైనాల మధ్య వాస్తవా«దీన రేఖ వెంబడి 3,488 కిలోమీటర్ల మేర వివాదం నడుస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్ కూడా తనదేననీ, అది దక్షిణ టిబెట్‌లోని భాగమేనని చైనా వాదిస్తుండగా భారత్ ఖండిస్తోంది. గత ఏడాది పాంగాంగో సరస్సు ప్రాంతంలో జరిగిన తీవ్ర ఘర్షణల అనంతరం సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రెండు వైపులా వేలాదిగా బలగాలను సరిహద్దుల్లోకి తరలించాయి. -
లక్కీ బిజినెస్
ఈ ప్రాంత మహిళల నుంచి ఎంతో నేర్చుకోవాలి.. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.. నిత్యం చేసుకునే పనులే కాకుండా అదనంగా కొత్త పని చేస్తున్నారు. తమ పని ద్వారా ఏడాదికి పాతిక వేల నుంచి లక్షన్నర వరకు అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు. ఇప్పుడు కాదు... కొన్ని తరాలుగా వారు ఈ వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఆనందంగా ఉంటున్నారు. చిన్నిచిన్ని Mీ టకాలే వీరికి ఈ పెద్ద మొత్తాన్ని అందిస్తున్నాయి. జార్ఖండ్ సిమ్డెగా జిల్లాలో ఉంటున్న ఆమ్రెన్షియా బార్లా కుటుంబం కొన్ని తరాలుగా లక్కతో వ్యాపారం చేస్తున్నారు. లక్క అనేది గుగ్గిలం వంటి రసం... కొన్ని రకాల కీటకాల నుంచి స్రవిస్తుంది. గుడ్లు పెట్టి పొదగడానికి సిద్ధంగా ఉన్న కర్రను రైతులు తీసుకువచ్చి పెద్దపెద్ద చెట్లకు కట్టడంతో లక్క సాగు ప్రారంభమవుతుంది. సౌందర్య సాధనాల నుంచి ఆయుధాల తయారీ వరకు లక్కను పుష్కలంగా ఉపయోగిస్తారు. అనేక రకాల చెట్ల మీద లక్కను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పళ్ల చెట్లు, నీడనిచ్చే బెర్రీ, కుసుమ, పలాస, సాల వృక్షాల మీద వీటి సాగు విస్తృతంగా జరుగుతుంది. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం వస్తోంది. 2016 లో ఆమ్రెన్షియా ‘లైవ్లీహుడ్ ప్రొమోషన్ సొసైటీ’ అనే ఒక స్వయం సహాయక సంఘంలో చేరారు. అక్కడ ‘మహిళా కిసాన్ స్వశక్తికారణ్ పరియోజన’ సంస్థ వారి దగ్గర లక్కను శాస్త్రీయంగా పెంచటంలో శిక్షణ పొందారు. ఇప్పుడు ఆమ్రెన్షియా సంప్రదాయ పద్ధతుల్లో సంపాదించిన దాని కంటె మూడు రెట్లు అధికంగా ఆదాయం పొందుతున్నారు. ఆమ్రెన్షియా వంటివారు సుమారు 73 వేల మంది మహిళలు ఉన్నారు. వీరంతా సంవత్సరానికి పాతిక వేల నుంచి యాభై వేల రూపాయల దాకా సంపాదిస్తున్నారు. ‘‘శాస్త్రీయ విధానంలో వ్యవసాయం చేయటం వల్ల ఉత్పత్తి పెరిగింది. గతంలో నాకు ఏడాదికి పదివేల రూపాయలు మాత్రమే వచ్చేది. ఇప్పుడు సీజన్లో ఏడాదికి అరవై వేల రూపాయల దాకా ఆదాయం వస్తోంది. రెండుసార్లు లక్క సాగు చేస్తున్నాం’’ అంటున్నారు. లతేహార్కు చెందిన ఆశ్రిత గురియా ఏడాదికి ఒకటిన్నర లక్షలు సంపాదిస్తున్నారు. ‘‘మాకు సూచించిన పద్ధతులను ఉపయోగించడం ద్వారా రెట్టింపు ఉత్పత్తి చేయగలుగుతున్నాం. అలాగే మాకు 5 కేజీల లక్కవిత్తనాలు కూడా అందిస్తున్నారు’’ అంటున్నారు మరో మహిళా రైతు రంజీతాదేవి. గుగ్గిలం, మైనం, లక్క... వీటిని కీటకాల నుంచి తయారు చేస్తారు. ఉన్ని, పట్టు, వైన్ వంటివి అందంగా కనపడటానికి ఈ పదార్థాలే కారణం. ఆయుర్వేద ఔషధాలలోనూ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే చెక్క వస్తువులకు పాలిష్ పెట్టడానికి కూడా ఉపయోగిస్తారు. సౌందర్య సాధనాల తయారీలో వీటిని చాలా ఎక్కువగా వాడతారు. ఇప్పుడు ఈ మహిళలు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
‘ఎల్ఏసీ’ని తేలుస్తాం : రాంమాధవ్
సాక్షి, హైదరాబాద్ : పాకిస్తాన్‌తో సరిహద్దు వెంబడి ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) తరహాలో చైనాతో సరిహద్దు వెంబడి వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)ను తేల్చేందుకు ప్రధాని ధృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారని బీజేపీ సీనియర్ నేత, ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ వి.రాంమాధవ్ తెలిపారు. భారత భూభాగంలో 60 ఏళ్లుగా జరిగిన చైనా ఆక్రమణలను అప్పటి ప్రభుత్వాలు నిలువరించకపోయాయని ఆయన విమర్శించారు. అవేర్నెస్ ఇన్ యాక్షన్ ఆధ్వర్యంలో ‘ఇండో–చైనా స్టాండ్ ఆఫ్: ది రోడ్ అహెడ్’అనే అంశంపై శనివారం హైదరాబాద్‌లో జరిగిన చర్చా కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలసి రాంమాధవ్ హాజరై మాట్లాడారు. ‘‘60 ఏళ్లుగా ఎల్ఏసీని నిర్వచించలేకపోయాం. కానీ ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే ఎల్ఏసీని నిర్వచిస్తుంది. ఏ భూభాగం ఎవరికి చెందుతుందో చైనాతో చర్చిస్తుంది’’అని రాంమాధవ్ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధి కోసమే ప్రైవేటు పెట్టుబడులు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రధాని శ్రమిస్తున్నారని, ఏళ్లుగా మూసధోరణితో ఉన్న అంశాలను సంస్కరిస్తున్నారని రాంమాధవ్ ఉద్ఘాటించారు. ఆర్థికాభివృద్ధి కోసమే ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ మయాంక్ సింగ్, అవేర్నెస్ ఇన్ యాక్షన్ ప్రతినిధులు బీజీ రాజేశ్వర్, బుచ్చిబాబు, మాధవి, రామకృష్ణ పాల్గొన్నారు. -
పక్కా ప్లాన్ ప్రకారమే గల్వాన్ దాడి..
వాషింగ్టన్: ఈ ఏడాది జూన్‌లో గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికులు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా సైనికులు 45 మంది వరకు చనిపోయినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. అయితే దీనిపై చైనా ఇంతవరకు నోరు విప్పలేదు. ఇప్పటికే కరోనా విషయంలో సీఎన్ఎన్ ప్రచురించిన ‘వుహాన్ ఫైల్స్’ చైనా గుట్టు రట్టు చేయగా.. తాజాగా గల్వాన్ దాడికి సంబంధించిన సంచలన వాస్తవాలను అమెరికా అత్యున్నత స్థాయి కమిషన్ వెల్లడించింది. యునైటెడ్ స్టేట్స్-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ (యూఎస్‌సీసీ) వార్షిక నివేదిక ప్రకారం చైనా పథకం ప్రకారమే ఈ దాడికి దిగిందని.. భారత్‌కు ప్రాణ నష్టం కలిగించడమే దాని ప్రధాన ఉద్దేశమని తెలిపే కొన్ని సాక్ష్యాలు లభించాయి అని యూఎస్‌సీసీ నివేదిక వెల్లడించింది. యూఎస్‌సీసీ 2000 సంవత్సరంలో ప్రారంభమయ్యింది. అమెరికా-చైనా మధ్య జాతీయ భద్రత, వ్యాణిజ్య సమస్యలను పరిశీలిస్తుంది. బీజింగ్‌పై అమెరికా కాంగ్రెస్ తీసుకోవాల్సిన పరిపాలన, శాసనపరమైన చర్యలను సిఫారసు చేస్తుంది. ఇక ఈ నివేదిక ప్రకారం వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసి) వెంబడి "చైనా ప్రభుత్వం రెచ్చగొట్టే ప్రవర్తన వెనుక ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు" అని నివేదిక పేర్కొంది. అయితే గల్వాన్ ఘర్షణకు "ప్రధాన కారణం" భారతదేశం సరిహద్దులో వ్యూహాత్మకంగా వ్యవహరించడం.. దళాలకు మద్దతు ఇచ్చే చర్యలను పెంచుకోవడమే అని యూఎస్‌సీసీ నివేదిక పేర్కొంది. (చదవండి: తూర్పులద్దాఖ్‌లో పీఎల్ఏపై ఆర్మీ పైచేయి) #Breaking | Galwan standoff: United States-China Economic & Security Review Commission says 'some evidence suggests that the Chinese Govt had planned the incident potentially including the possibility for fatalities.' pic.twitter.com/ZyEZb0bR29 — TIMES NOW (@TimesNow) December 2, 2020 గల్వాన్ ఘర్షణకు కొన్ని వారాల ముందు డ్రాగన్ రక్షణ మంత్రి వీ చైనా దళాలను ఉద్దేశించి సరిహద్దులో స్థిరత్వం కోసం ఘర్షణలకు దిగండి అని ప్రోత్సాహించాడని నివేదిక వెల్లడించిది. అలానే చైనా కమ్యూనిస్ట్ పార్టీ మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్‌లో వచ్చిన ఓ సంపాదకీయం ‘ఒకవేళ భారతదేశం గనక అమెరికా-చైనా శత్రుత్వంలో తలదూరిస్తే.. చైనాతో ఇండియాకు గల ఆర్థిక, వాణిజ్య సంబంధాల్లో "వినాశకరమైన దెబ్బ" ను ఎదుర్కొంటుందని హెచ్చరించినట్లు’ నివేదక తెలిపింది. గల్వాన్ ఘర్షణకు కొన్ని రోజుల ముందు చైనా ఆ ప్రాంతంలో భారీ ఎత్తున బలగాలను మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలిసింది. (చదవండి: చైనాతో ఉద్రిక్తతలకు చెక్! ) ప్రస్తుతం బీజింగ్ వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంట విస్తృతమైన మౌలిక సదుపాయాలను నిర్మించడంలో నిమగ్నమై ఉంది. ఇక గల్వాన్ ఘర్షణల తరువాత మొత్తం తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చోరబాట్లకు ప్రయత్నించింది. దాంతో ప్రస్తుతం కొన్ని నెలలుగా భారత్-చైనా మధ్య సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక తన దళాలను వెనక్కి రప్పించడానికి బీజింగ్ ఇష్టపడటంలేదు. ఈ సంవత్సరం చైనా కరోనా మహమ్మారి విషయంలో భారతదేశంతోనే కాకుండా జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్, యూకే, కెనడా వంటి దేశాలతో చైనాదూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్.. చైనీస్ యాప్స్, టెక్ కంపెనీలపై నిషేధం, ఆంక్షలు విధించడం వంటివి చేస్తూ.. డ్రాగన్‌కు ధీటుగా బదులిస్తోంది. -
కశ్మీర్లో పాక్ దుస్సాహసం
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం సరిహద్దుల వెంట పలు చోట్ల భారత భద్రత బలగాలు, పౌరులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఆ కాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నలుగురు జవాన్లు, ఎనిమిది మంది పౌరులు గాయపడ్డారు. పాక్ కాల్పులకు భారత్ దీటుగా బదులిచ్చింది. భారత్ జరిపిన ఎదురు కాల్పుల్లో 8 మంది పాక్ జవాన్లు చనిపోయారు. దాదాపు 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉడి, గురెజ్ సెక్టార్ల మధ్య పాకిస్తాన్ మోర్టార్లు, ఇతర ఆయుధాలను ఉపయోగించిందని, పౌర ఆవాసాలు లక్ష్యంగా కాల్పులు జరిపిందని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. భారత్ ఎదురు కాల్పుల్లో పాకిస్తాన్‌కు భారీగా నష్టం జరిగిందని, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ సైన్యానికి చెందిన మౌలిక వసతుల ప్రాంతాలు ధ్వంసమయ్యాయని వివరించారు. కొన్ని ఆయుధ కేంద్రాలు, ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించేందుకు ఉపయోగించే స్థావరాలు ధ్వంసమయ్యాయన్నారు. కల్నల్ కాలియా తెలిపిన వివరాల మేరకు... పాక్ కాల్పుల్లో చనిపోయిన వారిలో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేశ్ దోవల్, నలుగురు ఆర్మీ జవాన్లు, ఆరుగురు పౌరులు ఉన్నారు. 8 మంది పౌరులతో పాటు నలుగురు జవాన్లు గాయపడ్డారు. నియంత్రణ రేఖ వెంట ఉడి, దావర్, కేరన్, నౌగమ్, గురెజ్ సహా పలు సెక్టార్లలలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. హజీపీర్ సెక్టార్లో పాక్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేశ్ దోవల్ చనిపోయారు. ఒక జవాను గాయపడ్డారు. కమల్‌కోటే సెక్టార్లో ఇద్దరు పౌరులు, బాలాకోట్ ప్రాంతంలో ఒక మహిళ చనిపోయారు. ఉడి సెక్టార్‌లోని నంబ్లా ప్రాంతంలో పాక్ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. కాల్పుల మాటున ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించే కుయత్నాన్ని తిప్పికొట్టామని కల్నల్ కాలియా వెల్లడించారు. ‘కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్లో ఎల్ఓసీ వెంట అనుమానాస్పద కదలికలను మన బలగాలు గుర్తించాయి. అది ఉగ్రవాదుల చొరబాటుగా గుర్తించి, వెంటనే స్పందించి, వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి’ అని వివరించారు. ఈ వారంలో ఇది రెండో చొరబాటు యత్నమని, మాచిల్ సెక్టార్లో ఈనెల 7న రాత్రి కూడా ఒక చొరబాటు యత్నాన్ని అడ్డుకుని, ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చామన్నారు. పూంఛ్‌లోని పలు ప్రాంతాలపై విచక్షణారహితంగా కాల్పులకు, మోర్టార్ షెల్లింగ్నకు పాల్పడిందని, భారత బలగాలు వాటికి దీటుగా స్పందించాయని జమ్మూలో రక్షణ శాఖ అధికారి తెలిపారు. ‘పాక్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ ఎస్ఐ రాకేశ్ దోవల్ ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌కు చెందినవారు. 2004లో బీఎస్ఎఫ్లో చేరారు. ఆయనకు తండ్రి, భార్య, తొమ్మిదేళ్ల కూతురు ఉన్నారు. దేశ రక్షణలో ఆయన వీర మరణం పొందారు’ అని ఢిల్లీలోని బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. నియంత్రణ రేఖ వెంట ఫార్వర్డ్ లొకేషన్లో ఎస్ఐ రాకేశ్ దోవల్‌తో పాటు విధుల్లో ఉన్న కాన్స్టేబుల్ వాసు రాజాకు గాయాలయ్యాయని, ఆయన చికిత్స పొందుతున్నారని వివరించారు. -
చైనాతో ఉద్రిక్తతలకు చెక్!
న్యూఢిల్లీ: భారత్–చైనాల సరిహద్దుల్లో 6 నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన త్వరలోనే ముగింపునకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్రిక్తతలను తొలగించుకునే క్రమంలో ఇరు దేశాల సైనికాధికారులు ఇప్పటి వరకు 8 దఫాలుగా చర్చలు జరిపారు. వారం క్రితం కోర్ కమాండర్ల స్థాయిలో జరిగిన 8వ విడత చర్చల్లో సరిహద్దుల్లో శాంతి స్థాపన సాధన దిశగా కీలక ముందడుగు పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటిపై త్వరలోనే జరిగే 9వ విడత కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల సందర్భంగా సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా, ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని, ఆయుధ సామగ్రిని నిర్ణీత కాల వ్యవధిలో మూడు విడతలుగా ఉపసంహరించుకునేందుకు స్థూలంగా ఒక అంగీకారం కుదిరింది. ఇది అమల్లోకి వస్తే వాస్తవ ఆధీన రేఖ(ఎల్ఏసీ) వెంట తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఏప్రిల్ నాటి పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయని బుధవారం అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం మొదటి దశలో ఒప్పందం కుదిరిన మూడు రోజుల్లోనే రోజుకు 30 శాతం చొప్పున బలగాలను రెండు దేశాలు ఉపసంహరించుకోవాలి. -
పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉంది..
న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మీద విరుచుకుపడ్డారు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి పరిస్థితులు పూర్తిగా కంట్రోల్లోనే ఉన్నాయన్నారు. భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా దళాలు మన భూభాగంలోకి చొచ్చుకొచ్చాయంటూ రాహుల్ గాంధీ పదే పదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్‌నాథ్ పీఎల్ఏ దళాలు భారత భూభాగంలోకి ప్రవేశించలేదని తెలిపారు. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఎల్ఏసీ వెంబడి పరిస్థితి పూర్తిగా మా నియంత్రణలోనే ఉంది. చైనా దళాలు భాతర భూభాగంలోకి ప్రవేశించాయనే వాదనలు పూర్తిగా నిరాధారమైనివి. ప్రస్తుతం చైనాతో కమాండర్ స్థాయి చర్చలు జరగుతున్నాయి. ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుందో మాకు తెలీదు. కానీ మేం ప్రయత్నిస్తున్నాం అన్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని వివరాలను వెల్లడించలేం’ అని తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘1962 నుంచి 2013 వరకు ఏం జరిగింది అనే దాని గురించి వదిలేద్దాం. నేను దాని గురించి ఏం మాట్లాడను. ప్రస్తుతం మన దళాలు ఎల్ఏసీ వద్ద గొప్ప ధైర్యాన్ని చూపించాయి. చైనా సైన్యం మన భూభాగంలోకి ప్రవేశించారనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. గల్వాన్ ఘర్షణ తర్వాత నేను మన సైనికులను కలిశాను. ప్రధానమంత్రి కూడా సైనికులను కలుసుకున్నారు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేరు’ అన్నారు. (చదవండి: భగ్గుమన్న భారత్.. పీఓకే ఆక్రమణ..!) అలానే పీఓకేలో భాగమైన గిల్గిత్ బాల్టిస్తాన్‌కు తాత్కలిక ప్రాంతీయ హోదా ఇవ్వడానికి ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయంపై కూడా ఆయన మండి పడ్డారు. గిల్గిత్ బాల్టిస్తాన్, పీఓకే భారతదేశానికి చెందినది. దాని స్థితిలో ఎటువంటి మార్పు మాకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాక్ రగిలిపోతుంది. టెర్రర్ గ్రూపులు కూడా ఇలానే ఉన్నాయి. ఆ కడుపుమంటతో ఈ చర్యలకు దిగింది అన్నారు. అలానే పుల్వామా దాడి విషయంలో కూడా ఇమ్రాన్‌పై మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి పాకిస్తానే కారణం అన్నారు. -
చైనా స్పందన కోసం ఎదురు చూస్తున్నాం
న్యూఢిల్లీ: 1959 నాటి వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు కట్టుబడి ఉంటామంటూ చైనా లేవనెత్తిన సరికొత్త వాదనను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 12న లద్దాఖ్‌లో జరిగే 7వ మిలిటరీ కమాండర్ల సమావేశంలో దీనిపై చైనా ఎలా స్పందించనుందనే దాని గురించి భారత్ ఎదురు చూస్తుందో. ఈ అంశంలో భారత్ బలంగా ఉంది. దీని గురించి జాయింట్ సెక్రటరీ(తూర్పు ఆసియా) భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై నిర్వహించిన 19వ రౌండ్ వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కో ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ)లో చైనా ప్రతినిధికి తెలిపారు. 1959లో అప్పటి చైనా ప్రధాని చౌఎన్‌లై పేర్కొన్న ఎల్ఏసీని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తిరస్కరించినట్లు భారత్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఇక భారత్ తిరస్కరణకు సంబంధించి చైనా నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. (చదవండి: చైనా వాదనను అంగీకరించం) ఇక అక్సాయ్ చిన్ ప్రాంతంలో చైనా ఇప్పటికే 33,000 కిలోమీటర్ల భూమిని ఆక్రమించుకుందని, మరో 5,180 చదరపు కిలోమీటర్ల షాక్స్‌గమ్ వ్యాలీని 1963 లో పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా అప్పగించిందని భారత దౌత్యవేత్తలు అభిప్రాయపడ్డారు. వచ్చే వారం జరిగే మిలటరీ కమాండర్ల సమావేశంలో లద్దాఖ్‌లోని 1,597 కిలోమీటర్ల సరిహద్దు రేఖ వెంబడి ఆరు ఘర్షణ పాయింట్ల వద్ద ప్రస్తుత వివాదాలను పరిష్కరించడానికి కేంద్రంగా ఉన్న ఎల్ఏసి అవగాహనపై చైనీయులు తమ స్థానానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారని భారతదేశం ఆశిస్తోంది.