సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న ఇండియా-చైనా సరిహద్దుల్లో డ్రోన్ కదలికలను గుర్తించినట్లు హిమాచల్ ప్రదేశ్ మంత్రి జగత్ సింగ్ నేగి తెలిపారు. సరిహద్దుల్లో పొరుగు దేశం చైనా.. డ్రోన్లను నిఘా, గూఢచర్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బోర్డర్‌లో డ్రోన్ల కదలికల విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు.
ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కిన్నౌర్ జిల్లాలోని షిప్కి లా , రిషి డోగ్రీ గ్రామాల్లో డ్రోన్ కార్యకలాపాలను గుర్తించాం. సరిహద్దు ప్రాంతానికి సమీపంలో తరచుగా డ్రోన్‌లు ఎగురుతున్నట్లు గత వారంలో కూడా గుర్తించాం. షిప్కిలా, రిషిడోగ్రి గ్రామాల్లో వాస్తవ నియంత్రణ రేఖ వరకు రహదారి నిర్మాణం పురోగతిలో ఉంది.
..పొరుగుదేశం చైనా ఈ డ్రోన్ల ద్వారా నిఘా, గూఢచర్యానికి పాల్పడే అవకాశాన్ని తోసిపుచ్చలేం. డ్రోన్‌లను పోలీసులు, ఆర్మీ సిబ్బంది సైతం చూశారు. చైనా డ్రోన్‌లు భారత గగనతలంలోకి చొరబడటం చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి’ అని అన్నారు.
ఇక.. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్, లాహౌల్, స్పితి గిరిజన జిల్లాలు చైనాతో 240 కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment