చైనా తీరు ప్రపంచానికే ఆందోళనకరం! | Jaishankar Reacts To Chinas Quad Criticism | Sakshi
Sakshi News home page

చైనా తీరు ప్రపంచానికే ఆందోళనకరం!

Published Sat, Feb 12 2022 11:46 AM | Last Updated on Sat, Feb 12 2022 11:59 AM

Jaishankar Reacts To Chinas Quad Criticism - Sakshi

మెల్‌బోర్న్‌: చైనా తీరు ప్రపంచానికే ఆందోళనకరంగా మారుతోందని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్. జయశంకర్ అన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి జయశంకర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో చైనా, భారత సరిహద్దుల్లో చోటుచేసుకున్న పలు అంశాలపై కీలక వ్యాఖ‍్యలు చేశారు. భారత్ తో చైనా చేసుకున్న రాతపూర్వక ఒప్పందాలను చైనా ఉల్లంఘించిన కారణంగానే సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. 

వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలను మోహరించడం, వారి అత్యుత్సహం వల్లే రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. శనివారం క్వాడ్ సమావేశంలో భాగంగా భారత్, చైనా మధ్య లడఖ్ ప్రతిష్టంభన గురించి చర్చ జరిగిందా అని విలేఖరులు ప్రశ్నించారు.  దీనికి జయశంకర్ స్పందిస్తూ.. రెండు దేశాల మధ్య చర్చ జరిగిందని తెలిపారు. సరిహద్దు దేశాల మధ్య సమస్యలపై వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని వెల్లడించారు. 2020 ఏప్రిల్ లో చైనా నిబంధనలను ఉల్లంఘించి భారత భూ భాగంలోకి చొరబడిన కారణంగానే ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు. 

సరిహద్దు ఉగ్రవాదం గురించి తీవ్ర ఆందోళనలు ఉన్నాయని దీని గురించి బహుపాక్షిక వేదికల్లో ఉగ్రవాద వ్యతిరేక సహకారానికి తమ భాగస్వామ్యం ఉంటుందని సూచించారు. దేశాల సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ అంతర్జాతీయ జలాల్లో నావిగేషన్ స్వేచ్ఛ, భద్రతను ప్రోత్సహించడం కోసం క్వాడ్ పనిని కొనసాగిస్తుందని ఆశిస‍్తున్నట్టు జైశంకర్ చెప్పారు. ఈ సమావేశంలో సభ్య దేశాలు(భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్) రక్షణ, భద్రతా సహకారంలో పురోగతిపై క్లుప్తంగా చర్చించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement