సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ చైనా కవ్వింపు చర్యలను ఆపడం లేదు. తూర్పు లద్దాఖ్ సరిహద్దులోని వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో యుద్ధ విమానాలలో చక్కర్లు కొడుతోంది. గత మూడ్నాలుగు వారాల్లో భారత సైన్యాన్ని కవ్వించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. భారత రక్షణ యంత్రాంగం గుట్టును తెలుసుకునేందుకే డ్రాగన్ దేశం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
చైనాకు భారత సైన్యం దీటుగా బదులిస్తోందని సైనిక వర్గాలు తెలిపాయి. డ్రాగన్ దేశం ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా, భద్రతా ముప్పు వాటిల్లేలా చేసినా క్షణాల్లో తిప్పికొట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నాయి. సరిహద్దుకు అతి సమీపంలో మిగ్ 29, మిరాజ్ 2000 యుద్ధ విమానాలకు మోహరించినట్లు వెల్లడించాయి. అదే సమయంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉద్రిక్తతలు పెరగకుండా చూస్తున్నట్లు పేర్కొన్నాయి.
భయంతోనే..
అయితే డ్రాగన్ దేశ సైన్యం భయంతోనే యుద్ధ విమానాలతో చక్కర్లు కొడుతున్నట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. లద్దాక్ సెక్టార్‌లో భారత సైన్యం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్ చేసిందని, చైనా సైన్యానికి సంబంధించిన కార్యకలాపాలను అత్యంత సమీపం నుంచి పసిగడుతోందని చెప్పాయి. ఆ భయంతో చైనా యుద్ధ విమానాలతో వాస్తవాధీన రేఖకు సమీపంలో చక్కర్లు కొడుతున్నట్లు పేర్కొన్నాయి.
జూన్ 24-25 మధ్య చైనా కవ్వింపు చర్యలు మొదలయ్యాయని, జులై 17న ఇరు దేశాల మధ్య జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. భారత్ కూడా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నిఘాను మరింత పటిష్టం చేసినట్లు సమాచారం.
చదవండి: సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్
Comments
Please login to add a commentAdd a comment