ప్రధాని మోదీ ప్రతిపాదనను తోసిపుచ్చిన చైనా
బీజింగ్: సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద ప్రస్తుత స్థితిని స్పష్టం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనను చైనా తోసిపుచ్చింది. గతంలో అలా చేసినందువల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని, అందుకే ఆ పని చేయలేమని వెల్లడించింది. బదులుగా సరిహద్దుల్లో శాంతి పరిరక్షణ దిశగా ఒప్పందం కుదుర్చుకోడానికి సిద్ధమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి హువాన్ జిలియన్ గురువారం మీడియాకు వెల్లడించారు.
ఎల్‌ఏసీ వద్ద ఇరు దేశాల పరిధిలోని స్థానాలను వెల్లడించాలని చైనా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిపై పొరుగు దేశం తొలిసారిగా స్పందించింది. గతంలో ఓసారి ఇలాగే ఎల్‌ఏసీ స్థానాలను వెల్లడించామని, అయితే అది ఇబ్బందికర పరిస్థితులకు దారితీసిందని హువాన్ పేర్కొన్నారు.
ఏ చర్య అయినా ఇరుదేశాలను దగ్గర చేసేదిగా ఉండాలని, అడ్డంకిగా మారకూడదని వ్యాఖ్యానించారు. సరిహద్దు విషయంలో ఇరుదేశాలు ఓ ఒప్పందానికి వచ్చి ప్రవర్తనా నియమావళిని రూపొందించుకోవాలని, ఇంకా అనేక సానుకూల చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎల్‌ఏసీపై స్పష్టతనివ్వలేం!
Published Fri, Jun 5 2015 1:38 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM
Advertisement
Advertisement