
సాధారణంగా దౌత్య సంబంధాల్లో అనూహ్యతకు తావుండదు. అవతలి దేశం మనతో చెలిమి కోరుకుంటున్నదో లేదో... అది మనవైపో, వేరేవాళ్లవైపో ఊహించటం పెద్ద కష్టం కాదు. కానీ చైనా మటుకు ఇందుకు విరుద్ధం. ‘నేనేంటో చెప్పుకోండి చూద్దాం’ అన్నట్టు వ్యవహరిస్తుంటుంది. నోటితో నవ్వి నొసటితో వెక్కిరిస్తున్న చందాన ప్రవర్తిస్తుంటుంది.
రష్యాలో మూడు నెలల క్రితం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లు కలుసుకున్నారు. అంతకు రెండు రోజుల ముందు వాస్తవాధీన రేఖ ప్రాంతాలైన డెస్పాంగ్, దెమ్ చోక్‌లలో ఇరు దేశాల సైన్యాల గస్తీపై అవగాహన కుదిరింది.
ఆ ప్రాంతంలో ఇకపై సైనిక విన్యాసాలకు చోటీయరాదనీ, ఉద్రిక్తతలను ఉపశమింపజేయాలనీ దాని సారాంశం. అంతేగాదు... రెండు దేశాలూ దీనిపై వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. చాన్నాళ్లుగా నిలిచిపోయిన ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధుల సమావేశం గత నెలలో జరిగింది కూడా.
తీరా తాజాగా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం అధునాతన సాంకేతికతలతో, అన్నిరకాల నేలల్లోనూ పనికొచ్చే వాహనాలతో, డ్రోన్‌లతో, మానవరహిత విమానాలతో విన్యాసాలు నిర్వహించినట్టు బయటపడింది. తన సైనిక సామర్థ్యాన్ని, కొండప్రాంతాల్లో యుద్ధ సంసిద్ధతలను అంచనా వేసుకోవటానికి షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ రెజిమెంట్ ఈ విన్యాసాలు నిర్వహించిందంటున్నారు.
అంతక్రితం మాటెలావున్నా 2020 ఏప్రిల్‌లో గాల్వాన్ లోయలో మన సైన్యంతో గిల్లికజ్జాలకు దిగటం ద్వారా చైనా తన కవ్వింపు చర్యల జోరు పెంచింది. అప్పుడు జరిగిన ఘర్షణల్లో మన జవాన్లు 21 మంది చనిపోగా, చైనా కూడా గణనీయమైన నష్టాలు చవిచూసింది. ఆ ఘర్షణల్లోనే బిహార్ రెజిమెంట్‌లో 17వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అయిన తెలంగాణకు చెందిన బి.సంతోష్‌బాబు వీర మరణం పొందారు. అనంతర కాలంలో ఇరు దేశాల మధ్యా సైనిక అధికారుల స్థాయి చర్చలు జరిగాయి. కొన్ని అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి.
ఆ ఏడాది ఆగస్టులో రెండు దేశాల విదేశాంగమంత్రులూ భేటీ అయ్యారు. అందులో భారత్–చైనాల మధ్య పంచసూత్ర పథకం కుదిరింది. ఇకపై సామరస్యంగా మెలగాలన్నది ఆ పథకం సారాంశం. దానికి కొనసాగింపుగా రక్షణ మంత్రులు కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత వివాదాస్పద ప్రాంతాల్లో సైనికుల ఉపసంహ రణ కూడా మొదలైంది.
కానీ సమస్య ఎక్కడిదక్కడే ఉంది. డెస్పాంగ్, దెమ్‌చోక్ ప్రాంతాల విషయం మొదటి నుంచీ జటిలమే. అందువల్లే ప్రస్తుతానికి ఇరు దేశాల సైన్యాలూ ఆ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించాలని, ఉద్రిక్తతలు ముదిరే విధంగా ఎవరూ సైన్యాలను మోహరించ రాదని మూడు నెలలక్రితం నిర్ణయించారు.
కానీ చైనాకు ఏమైందో కానీ దాన్ని బేఖాతరు చేస్తూ తాజాగా విన్యాసాలు మొదలుపెట్టింది. వారంరోజుల క్రితం షిన్‌జియాంగ్‌లోని వీగర్ స్వయంపాలిత ప్రాంతంలో ఉన్న హోటాన్ నగరానికి సమీపంలో చైనా కొత్తగా రెండు కౌంటీలను ఏర్పాటు చేసిందన్న కథనాలు వెలువడటం గమనించదగ్గది. ఈ రెండూ కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోని ఆక్సాయ్‌చిన్‌కు సమీపంలో ఉన్నాయి.
దానిలోని కొంత భూభాగం ఈ రెండు కౌంటీల్లోనూ ఉన్నదంటున్నారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఇది చాలదా? ఇక బ్రహ్మపుత్ర నదిపై ఒక మెగా డ్యామ్‌ను నిర్మించటానికి చైనా సన్నాహాలు చేస్తున్నదన్న వార్త కూడా ఇటీవలి పరిణామమే. ఎగువ ప్రాంతాల్లో ఆనకట్టలు కట్టినప్పుడు దిగువ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందక ఇబ్బందులు తలెత్తు తాయి. భారీవర్షాల సమయంలో దిగువకు నీరు వదలటం వల్ల ఆ ప్రాంతాలు మునుగుతాయి.
అందువల్లే దేశాలమధ్య ప్రవహించే నదులపై నిర్మాణాలకు పూనుకున్నప్పుడు పరస్పరం చర్చించుకుంటాయి. అందరికీ ప్రయోజనం కలిగేలా ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. కానీ మెగా డ్యామ్ నిర్మాణాన్ని చైనా ఏకపక్షంగా ప్రకటించింది. దీనిపై మన దేశం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇక అరుణాచల్‌ప్రదేశ్‌కు మన నాయకులు వెళ్లినప్పుడల్లా చైనాకు ఆగ్రహావేశాలొస్తాయి. అక్కడి ఊళ్లకు సొంత పేర్లు పెట్టుకుని మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం చైనాకు చాన్నాళ్లుగా దురలవాటు.
అందుకే చైనా వ్యవహారశైలి తెలిసినవారెవరూ దాని మాటలు విశ్వసించరు. చెప్పే మాటలకు భిన్నమైన ఆచరణ ప్రదర్శించటం చైనాకు అలవాటైన విద్య. ఇరుగు పొరుగు దేశాలన్నాక సమస్యలు సహజంగా వస్తాయి. వాటిని చర్చించుకోవటం, పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించటం వివేకవంతమైన చర్య. సమస్యలను దశాబ్దాల తరబడి అలాగే వదిలేస్తే అవి జటిలంగా మారి చివరకు శత్రుత్వానికి దారితీస్తాయి.
మనతో ఉన్న వివాదాల విషయంలో చైనా మొదటినుంచీ దాగుడుమూతలు ఆడుతోంది. వివాదాలను పక్కనబెట్టి వ్యాపార వాణిజ్యాలను విస్తరించుకుంటే ఇరు దేశాలూ అభివృద్ధి చెందుతాయని ఊరించి 70వ దశకం చివరిలో మనకు మైత్రీ హస్తం అందించింది మొదలు చైనా తీరుతెన్నులు ఎన్నడూ సక్రమంగా లేవు.
సరిహద్దు పరిణామాలపై మన దేశం అప్రమత్తంగానే ఉన్నదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ సోమవారం చేసిన ప్రకటన సూచిస్తోంది. వివాదాస్పద ప్రాంతాల్లో ప్రస్తుతానికి ప్రతిష్టంభన ఉన్నదని ఆయనంటున్నారు. బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్ట నిర్మాణం విషయంలోనైనా, లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం కదలికల విషయంలోనైనా మన దేశం దృఢంగా వ్యవహరించాలి. దేశ రక్షణకు అది తప్పనిసరి. కరచాలనం చేస్తూనే కత్తులు దూయటం ఏమైనా కావొచ్చుగానీ దౌత్య కళ కాదని చైనాకు తెలియచెప్పటం అవసరం.
Comments
Please login to add a commentAdd a comment