అసలే సంబంధాలు అంతంత మాత్రమైనప్పుడు, కొద్దిపాటి కవ్వింపు చర్యలైనా పరిస్థితిని క్లిష్టతరం చేస్తాయి. భారత్‌తో సరిహద్దు వెంట చైనా తాజా చర్యలు అచ్చం అలాగే ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు చైనా తన సొంత నామకరణాలు చేస్తూ, డిసెంబర్ 30న చేసిన ప్రకటన అలాంటి చర్యల్లో ఒకటి. అలాగే, ఆంగ్ల సంవత్సరాదికి గల్వాన్ లోయలో చైనా సైనికులు తమ దేశ పతాకావిష్కరణ చేసి, ‘ఒక్క అంగుళం భూమినైనా వదిలేది లేదు’ అని పేర్కొన్న వీడియోలు కాక రేపుతున్నాయి. ఇక, జనవరి 1 నుంచి చైనా సరికొత్త సరిహద్దు చట్టం తెచ్చింది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట సైనిక, పౌర వినియోగాలకు వీలుగా చైనా మరిన్ని నమూనా సరిహద్దు గ్రామాలను నిర్మించనుంది. వెరసి, దేశ ఉత్తర సరిహద్దుల్లో భారత్ మరిన్ని సవాళ్ళను ఎదుర్కోక తప్పేలా లేదు.
అరుణాచల్‌ను ‘దక్షిణ టిబెట్’ పేరిట తమ అధికారిక చైనీస్ పత్రాలు, భౌగోళిక పటాల్లో ప్రమాణీకరించాలని డ్రాగన్ చూడడం దురాలోచన. ‘అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం’ అని మన ప్రభుత్వం ఘాటుగా చైనాకు చెప్పాల్సి వచ్చింది. 2017 ఏప్రిల్‌లో కూడా చైనా ఇలాగే అరుణాచల్‌లోని 6 ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టింది. అప్పట్లో దలైలామా భారత సందర్శనతో ఈ కడుపుమంట చర్యకు దిగింది. గతవారం పలువురు భారత పార్లమెంట్ సభ్యులు ప్రవాసంలో ఉన్న టిబెటన్ పార్లమెంట్ ఉత్సవానికి హాజరయ్యారు. దానికి ప్రతిచర్య అన్నట్టుగా అరుణాచల్‌లోని 25 జిల్లాల్లో 11 జిల్లాలకు విస్తరించిన తాజా పేర్ల జాబితా వెలువడింది. అందులో 8 పట్నాలతో పాటు, 4 కొండలు, 2 నదులు, ఓ కొండ కనుమ ఉన్నాయి. జాగ్రత్తగా చూస్తే, మొత్తం అరుణాచల్ అంతటి పైనా తనదే పట్టు అని పునరుద్ఘాటించడానికే చైనా ఈ నిర్ణీత స్థలాలను ఎంపిక చేసుకుంది.
భారత్, భూటాన్‌లతో భౌగోళిక సరిహద్దులను ఏకపక్షంగా పునర్లిఖించే ప్రయత్నంలో భాగంగానే చైనా కొత్త సరిహద్దు చట్టం తెచ్చినట్టు కనిపిస్తోంది. ఒక పక్క ఆ చట్టం, మరోపక్క భారత్‌తో వివాదం ఉన్న భూసరిహద్దుల్లో 2017 నుంచి 628 ‘షియావోకాంగ్’ నమూనా గ్రామాల నిర్మాణం ఆందోళన రేపుతున్నాయి. సరిహద్దు సమస్యకు ‘సైనిక పరిష్కారం’ అనే పరిస్థితిని చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) సృష్టిస్తోందా అనిపిస్తోంది. చైనా అత్యున్నత శాసన నిర్మాణ వ్యవస్థ ‘నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్’ స్థాయీ సంఘం నిరుడు అక్టోబర్ 23న ఈ కొత్త సరిహద్దు చట్టానికి ఆమోదముద్ర వేసింది. మొత్తం 7 అధ్యాయాలు, 62 అధికరణాలున్న చట్టం ఇది. ‘చైనాలోని భూసరిహద్దు ప్రాంతాల రక్షణ, వినియోగం కోసం’ అంటూ ఈ చట్టం తెచ్చామన్నారు. దాదాపు 22,457 కిలోమీటర్ల మేర భూసరిహద్దును 14 దేశాలతో చైనా పంచుకుంటోంది. మంగోలియా, రష్యాల తర్వాత చైనాకు మూడో అతి పెద్ద సరిహద్దు భారత్‌తోనే!
తూర్పు లద్దాఖ్ సరిహద్దు అక్సాయ్ చిన్‌లో భారత భూభాగంలో 38 వేల కి.మీ.ల భాగాన్ని చైనా ఆక్రమించుకుందని దీర్ఘకాలంగా మన దేశ ఆరోపణ. ఇది కాక, 1963లో పాకిస్తాన్ తాను ఆక్రమించుకున్న భారత భూభాగంలో 5,180 కి.మీ.ల మేర చైనాకు కట్టబెట్టింది. ఆ సరిహద్దు సమస్యలు సాగుతుండగా, లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో 2020 జూన్ 15న భారత, చైనా సేనల మధ్య హింసాత్మక ఘర్షణ రేగింది. గత 45 ఏళ్ళుగా ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఆ ఘర్షణలో 20 మంది భారత సైనికుల మరణం, ఇరుదేశాల మధ్య సైనిక ప్రతిష్టంభన, 20 నెలలుగా అనేక విడతలుగా దౌత్య, సైనిక వర్గాల చర్చలు నడుస్తున్న చరిత్ర. గతంలో లౌక్యంగా దౌత్యం నడుపుతూ వచ్చిన బీజింగ్ తన ఆర్థిక, సైనిక సంపత్తితో ఇప్పుడు ఏ దేశాన్నైనా అయితే మిత్రుడు, కాదంటే శత్రువు అన్న పద్ధతిలోనే చూస్తోంది. ఒక పక్క సరిహద్దు గ్రామాల నిర్మాణంతో ఇరుకున పెడుతూనే, రాజకీయ స్థాయిలో మన దేశానికీ – పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్‌లకూ మధ్య చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తోంది. మాల్దీవులు, శ్రీలంకల్లో, ఇంకా చెప్పాలంటే హిందూ మహాసముద్రంలో భారత ప్రాబల్యాన్ని తగ్గించాలని చూస్తోంది. అందుకే, జాతీయ భద్రత భారత్ ముందున్న సవాలు.
భారతీయ ప్రాంతాలకు చైనీయుల కొత్త నామకరణం ప్రతీకాత్మకమే కావచ్చు. కానీ, తద్వారా సరిహద్దు వివాదాలపై చైనా సరికొత్త వైఖరి ఏమిటన్నది అర్థమవుతోంది. అదీ కీలకం. కొత్త సరిహద్దు చట్టం తీసుకురాక ముందు నుంచీ భారత్‌తో దూకుడుగా ఉన్న చైనా... అవసరమైతే ఇక ఈ చట్టాన్ని సాధనంగా వాడుకుంటుంది. ఏ దేశమైనా తమ భూభాగాన్ని రక్షించుకోవడం చేసే పనే. చైనా ఆ పనే చేస్తానంటోంది. కానీ ఆ భూభాగం ఏమిటన్నదే ప్రశ్న. ఇప్పటి దాకా చర్చలతో ఎల్‌ఏసీ సహా సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవాలని చూశారు. ఇప్పుడిక బలప్రయోగంతో డ్రాగన్ ఆ పని చేయాలనుకుంటోందన్న మాట. ఈ చట్టం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది అందుకే.
సైనిక స్థాయిలో భారత్ ఇప్పటికే అమెరికాకు దగ్గరై, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలసి చతుర్భుజ కూటమి ‘క్వాడ్’లో పాల్గొంటూ చైనాకు చెక్ పెట్టాలనుకుంటోంది. ఆర్థిక స్థాయిలో చైనా ప్రాబల్య మున్న ఆసియా ప్రాంత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ‘ఆర్‌సీఈపీ’కి భారత్ దూరంగా నిలిచింది. బ్రిటన్, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇజ్రాయెల్ లాంటి వ్యూహాత్మక భాగస్వాములతో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద ప్రయత్నాల్లో ఉంది. ఇక, జాతీయ భద్రతలో చైనా ముప్పు తప్పించుకోవాలంటే దేశమంతటా ఒక్క తాటిపైకి రావాలి. మతప్రాతిపదికన మనుషులను కేంద్రీకృతం చేసే రాజకీయం అందుకు ఇబ్బంది అని గ్రహించాలి. సరిహద్దు భద్రతే సర్వోన్నతమని గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment