దక్షిణాన సైనికులు.. ఉత్తరాన నిర్మాణాలు | Indian and Chinese troops man remote border outposts just hundreds of metres a part | Sakshi
Sakshi News home page

దక్షిణాన సైనికులు.. ఉత్తరాన నిర్మాణాలు

Published Thu, Sep 10 2020 5:07 AM | Last Updated on Thu, Sep 10 2020 5:13 AM

Indian and Chinese troops man remote border outposts just hundreds of metres a part - Sakshi

లద్దాఖ్‌ ప్రాంతంపై భారత వైమానిక దళ విమానం గస్తీ

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని చైనా సరిహద్దుల వద్ద, ప్రస్తుత ఘర్షణలకు కేంద్ర స్థానమైన పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల్లోని కీలక స్థావరాల వద్ద పాగా వేయడం చైనా లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, దక్షిణ తీరంలో పరిస్థితి ఏ మలుపైనా తీసుకునేలా కనిపిస్తోందని భారత అధికార వర్గాలు భావిస్తున్నాయి. చైనా దళాల చర్యలను నియంత్రిస్తోంది స్థానికంగా ఉన్న ఆర్మీ కమాండర్లు కాదని, ఉన్నత స్థాయి చైనా నాయకత్వ అదుపాజ్ఞల మేరకే చైనా దళాల కదలికలు ఉంటున్నాయని వివరించారు. పాంగాంగ్‌ సరస్సు ఉత్తర తీరం ఉద్రిక్తంగానే ఉందని, అయితే, అక్కడి కొన్ని వ్యూహాత్మక పర్వతాలు భారత నియంత్రణలోనే ఉన్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

ఆ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల స్థితిలో భారత ఆర్మీ ఉంది. పాంగాంగ్‌ సరస్సు ఉత్తర తీరంలోని ఫింగర్‌ 4 వద్ద చైనా దళాల కన్నా భారతే మెరుగైన స్థితిలో ఉంది. అక్కడ, కీలక పర్వత ప్రాంతాలు భారత్‌ స్వాధీనంలో ఉన్నాయి. రెండు దేశాల సైనికులు కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉన్నారు. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీర ప్రాంతంలో కూడా సుమారు 6 వేల మంది చైనా సైనికులు ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ స్వాధీనంలో ఉన్న దక్షిణ తీరంలోని వ్యూహాత్మక పర్వత ప్రాంతాలను మళ్లీ ఆక్రమించేందుకు చైనా తరచుగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలను భారత్‌ గట్టిగా అడ్డుకుంటోంది. అయితే, ఈ ప్రయత్నాలను చైనా మరింత తీవ్రస్థాయిలో కొనసాగించే అవకాశం ఉంది.

తూర్పు లద్దాఖ్‌ ప్రాంతానికి చైనా ఇప్పటికే సుమారు 150 యుద్ధ విమానాలను, ఇతర సహాయక హెలికాప్టర్లను తరలించింది. పాంగాంగ్‌ సరస్సుకు దక్షిణ తీరంలో భారత సైనికులను ఎంగేజ్‌ చేస్తూ.. ఉత్తర తీరంలో నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించే వ్యూహాన్ని చైనా అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఫింగర్‌ 5 ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్మాణ కార్యక్రమాలు కొనసాగినట్లు ఆ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ సంవత్సరం మే నెల నుంచి ఉత్తర తీర ప్రాంతంలోని ఫింగర్‌ 4 నుంచి ఫింగర్‌ 8 వరకు భారత దళాలు గస్తీని చైనా అడ్డుకుంటోంది. ఫింగర్‌ 8 వరకు భారత్‌ భూభాగమేనన్న భారతదేశ వాదన. కానీ, చైనా మాత్రం ఫింగర్‌ 4 వద్దనే వాస్తవాధీన రేఖ ఉందని వాదిస్తోంది. ఆ కీలక ప్రాంతాల్లో మే నెల నుంచి పలు నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది.  

ఇండో, చైనా ఆర్మీ కమాండర్ల చర్చలు
సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నివారణపై భారత్, చైనా సైన్యాలకు చెందిన కమాండర్లు తూర్పు లద్దాఖ్‌లో చర్చలు జరిపారు. టెన్షన్ల నివారణకు అనుసరించాల్సిన మార్గాలపై హాట్‌లైన్‌లోనూ చర్చించినట్లు సమాచారం.  చైనా, ఇండియా విదేశాంగ మంత్రుల మధ్య మాస్కోలో గురువారం సమావేశం జరగనుంది. ఇప్పటికీ తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. గురువారం షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సమావేశాల్లో జైశంకర్, వాంగ్‌ల భేటీపై ఆసక్తి నెలకొంది. ఇదే రోజు రష్యా, చైనా, ఇండియా విదేశాంగ మంత్రుల మధ్య త్రైపాక్షిక చర్చలు జరగనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement