Ladakh area
-
45 ఏళ్ల తర్వాత మరణాలు.. చైనాపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: భారత్-చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్. గత కొద్ది నెలలుగా రెండు దేశాల మధ్య నిరంతర దౌత్య చర్చల ఫలితంగా సంబంధాలు మెరుగైనట్టు ఆయన తెలిపారు. భారత సరిహద్దుల విషయంలో కూడా కీలక పురోగతి నెలకొందని చెప్పుకొచ్చారు.ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల్లో భాగంగా విదేశాంగ మంత్రి జైశంకర్..‘భారత్-చైనా సంబంధాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా జైశంకర్ పార్లమెంట్లో మాట్లాడుతూ..‘చైనా చర్యల కారణంగా 2020లో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు భంగం వాటిల్లింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, నిరంతర దౌత్య చర్చల ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఇటీవల కొంత మెరుగుదల కనిపించిందని తెలిపారు.2020 ఏప్రిల్‌లో తూర్పు లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలలో రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గడిచిన 45 సంవత్సరాల కాలంలో మొదటిసారిగా రెండు వైపులా మరణాలకు ఈ ఘర్షణ దారితీసింది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన.. పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావడానికి ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. ఇందుకు కోసం భారతదేశం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇటీవలి కాలంలో లడఖ్‌లోని భారత సరిహద్దుల నుంచి చైనా బలగాలు, భారత సైన్యం వెనక్కి వెళ్లినట్టు ఆయన తెలిపారు. గతంలో 38 వేల చదరపు కిలోమీటర్ల భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించింది. వాస్తవాధీన రేఖకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో ఇరుదేశాలకు ఏకాభిప్రాయం లేదు. పరస్పరం అంగీకరించిన యంత్రాంగం ద్వారా శాంతియుతంగా సరిహద్దు సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఇటీవల జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో కూడా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పలు విషయాలపై చర్చించారు’ అని చెప్పుకొచ్చారు. లాజిస్టికల్ సవాళ్లు, కొవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ.. మన బలగాలు వేగంగా, సమర్థవంతంగా స్పందించి చైనాను కట్టడి చేశాయి. ఇలా తమ సామర్థ్యాలతో ఓ వైపు దీటుగా ప్రతిస్పందిస్తూనే, ఉద్రిక్తతలు తగ్గించడం కోసం పొరుగు దేశంతో దౌత్యపరమైన చర్చలకు ప్రయత్నాలు చేశాం. సరిహద్దులో శాంతి, స్థిరత్వం లేకుండా ఇరు దేశాల సంబంధాలు సాధారణంగా ఉండలేవని మన ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందన్నారు. వీటికి సంబంధించి భారత్‌కు స్పష్టమైన వైఖరి ఉందన్నారు. న్యాయమైన, సహేతుక, పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం చైనాతో చర్చలు జరిపేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు.#WATCH | In the Lok Sabha, EAM Dr S Jaishankar says "I rise to apprise the House of some recent developments in the India-China border areas and their implications for our overall bilateral relations. The House is aware that our ties have been abnormal since 2020 when peace and… pic.twitter.com/gmE3DECobq— ANI (@ANI) December 3, 2024 -
భారత్, చైనా సరిహద్దుల్లో సైనికీకరణ ఆందోళనకరం
జెనీవా: తూర్పు లద్ధాఖ్‌లో భారత్–చైనా సరిహద్దులో నాలుగేళ్ల క్రితం మొదలైన ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యం వెనక్కి వెళ్లిపోయే విషయంలో చైనాతో నెలకొన్న సమస్యలు 75 శాతం పరిష్కారమైనట్లు తెలిపారు. చేయాల్సింది ఇంకా మిగిలే ఉందని పేర్కొన్నారు. గురువారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఓ చర్చా కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు. 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలు భారత్–చైనా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఉంటేనే ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడతాయని ఉద్ఘాటించారు. భారత్, చైనా సైన్యం మధ్య ఘర్షణలకు పూర్తిగా తెరదించడానికి నాలుగేళ్లుగా చర్చలు జరుగుతున్నాయని వివరించారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంబడి భారత్, చైనా సైన్యం వెనక్కి వెళ్తుండగా, మరోవైపు అక్కడ మిగిలి ఉన్న రెండు దేశాల సేనలు ఎదురెదురుగా సమీపంలోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. సరిహద్దుల్లో సైనికీకరణ జరుగుతోందని వెల్లడించారు. ఈ సమస్యను కచి్చతంగా పరిష్కరించాల్సి ఉందన్నారు. సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయం తూర్పు లద్దాఖ్‌లో వివాదాస్పద సరిహద్దుల నుంచి తమ సేనలను సాధ్యమైనంత త్వరగా పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలను వేగవంతం, రెట్టింపు చేయాలని తీర్మానించుకున్నాయి. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని తాము కోరుకుంటున్నామని అజిత్ దోవల్ ఈ సందర్భంగా తేలి్చచెప్పారు. వాస్తవా«దీన రేఖను(ఎల్ఏసీ)ని గౌరవించాలని వాంగ్ యీకి సూచించారు. భారత్, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఎల్ఏసీని గౌరవించాల్సిందేనని స్పష్టంచేశారు. -
మళ్లీ సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష.. కారణమిదే!
ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దేశంలోని లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరవ షెడ్యూల్‌ను వెంటనే అమలు చేయాలని కోరుతూ లేహ్‌లో 21 రోజుల నిరాహార దీక్షకు దిగారు. మార్చి 7న ప్రారంభమైన ఈ నిరాహార దీక్ష 21 రోజుల పాటు కొనసాగనుంది. సోనమ్ వాంగ్‌చుక్ ఎవరు? సోనమ్ వాంగ్‌చుక్ వృత్తిరీత్యా ఇంజనీర్, ఆవిష్కర్తగా, వాతావరణ పరిరక్షణకు పాటుపడే వ్యక్తిగా పేరొందారు. లడఖ్‌లోని విద్యా వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తూ ‘స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడఖ్’ను స్థాపించారు. కృత్రిమ హిమానీనదాలను సృష్టించే మంచు స్థూప సాంకేతికతను రూపొందించారు. ఇందుకోసం ఆయన 2018లో రామన్ మెగసెసే అవార్డు, 2017లో గ్లోబల్ అవార్డ్ ఫర్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ అవార్డులను అందుకున్నారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్ అమలు డిమాండ్‌తో వాంగ్‌చుక్ మరోసారి నిరాహారదీక్షకు దిగారు. ఇవే డిమాండ్లతో గత ఏడాది జనవరిలో ఐదు రోజుల పాటునిరాహార దీక్ష చేశారు. అది కూడా 18 వేల అడుగుల ఎత్తులో -40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య నిరాహార దీక్షకు దిగారు. లడఖ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని వాంగ్‌చుక్ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. హిమాలయాల్లో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కిచెప్పిన ఆయన, ఈ అంశానికి ప్రభుత్వం తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. వాంగ్‌చుక్ తన దీక్షతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. త్రీ ఈడియట్స్ సినిమాలో.. అమీర్ ఖాన్, శర్మన్ జోషి, ఆర్ మాధవన్‌లు నటించిన ‘త్రీ ఇడియట్స్’లో అమీర్ ఖాన్ పోషించిన రాంచో పాత్ర వాంగ్‌చుక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం 2009లో విడుదలైంది. అప్పుడు వాంగ్‌చుక్ గురించి దేశంలోని అందరికీ తెలిసింది. అయితే ఈ సినిమా తన బయోపిక్ కాదని, వినోదం కోసం తన జీవితం నుండి ప్రేరణ పొందారని పలు సందర్భాల్లో వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. #SAVELADAKH #SAVEHIMALAYAS Sonam Wangchuk appeals to the world to live simply, starts #ClimateFast of 21 days (extendable till death) Please watch full video in English here:https://t.co/XHkcIdQQ7b#ILiveSimply #MissionLiFE #ClimateActionNow pic.twitter.com/KQi5EMro9X — Sonam Wangchuk (@Wangchuk66) March 6, 2024 -
‘ఆన్ ది రోడ్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన ఆర్జీవీ
పూర్తిగా లడఖ్ ప్రాంతంలో తెరకెక్కించిన మొదటి భారతీయ చిత్రం ‘ఆన్ ది రోడ్’ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషలలొ విడుదలకు సిద్దమవుతోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను, ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమాలోని విజువల్స్‌ను ఆయన మెచ్చుకోవడమే కాకుండా ఇలాంటి అవుట్ పుట్ తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఆన్ ది రోడ్ టీమ్ మెంబర్స్‌ను ప్రశంసించారు, సినిమా విజయం సాధించాలని ఆయన కోరారు. ఈ చిత్ర దర్శకుడు సూర్య లక్కోజు గతంలో రామ్ గోపాల్ వర్మతో కలిసి పలు చిత్రాలకు పని చేయడం విశేషం. ప్రముఖ చిత్ర నిర్మాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC) ఉపాధ్యక్షులు ముత్యాల రామ్ దాస్ ఈ సినిమా విడుదలకు సహకారం అందిస్తూ ఈ ప్రాజెక్టులో ఒక భాగం అయ్యారు. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుందని చెప్పారు. ఎస్ పీ ఎల్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్నిసూర్య లక్కోజు నిర్మించారు. రాజేష్ శర్మ ఈ సినిమాకు సహ నిర్మాత. ఇదొక రోడ్ ట్రిప్ థ్రిల్లర్ అయినప్పటికీ, సేఫ్‌గా రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్న ఒక జంటతో ఒక సాధారణ వ్యక్తి కలవడం, అతను వారితో ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత చోటు చేసుకున్న కల్లోల సంఘటనలే ఈ చిత్ర కథాంశమని మేకర్స్ తెలిపారు. చిత్ర నాయకి అయిన స్వాతి మెహ్రా తన మొదటి సినిమా లడఖ్ లాంటి అందమైన ప్రాంతంలో తెరకెక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో హీరోగా రాఘవ్ తివారీ అద్భుతంగా నటించారని చిత్ర మేకర్స్ తెలిపారు. -
చెనాతో ముప్పు పొంచే వుంది: ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో చైనా నుంచి ముప్పు పొంచేఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే అన్నారు. రానున్న ఆర్మీ డేను పురస్కరించుకొని బుధవారం నరవణే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సరిహద్దు భూభాగాలకు సంబంధించి చైనా కొత్తగా తీసుకొచ్చిన చట్టం మూలంగా తలెత్తే పర్యవసానాలను ఎదుర్కొనడానికి సంసిద్ధులై ఉన్నామన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయడానికే కట్టుబడి ఉన్నామని నరవణే చెప్పారు. నియంత్రణ రేఖకు అవతలి వైపున (పాక్ ఆక్రమిత కశ్మీర్లో) 350 నుంచి 400 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడటానికి క్యాంప్ వేశారని, పదేపదే చొరబాటుయత్నాలు చోటుచేసుకోవడం శత్రుదేశం నీచమైన ఉద్దేశాలను ఎత్తిచూపుతున్నాయని పేర్కొన్నారు. డిసెంబర్ 4న నాగాలాండ్‌లో పొరపాటున పౌరులపైకి సైనికులు కాల్పులు జరిగిన ఘటనపై ఆర్మీ విచారణ నివేదిక ఒకటి, రెండు రోజుల్లో అందవచ్చని తెలిపారు. హాట్‌స్ప్రింగ్స్ నుంచి వెనక్కి మళ్లండి తూర్పు లద్దాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్స్‌లో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి (పెట్రోలింగ్ పాయింట్ 15) సాధ్యమైనంత త్వరగా చైనా బలగాలు వెనక్కి మళ్లాలని భారత్ గట్టిగా డిమాండ్ చేసింది. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖకు అవతలి వైపున చైనా భూభాగంలో బుధవారం భారత్– చైనాల మధ్య 14వ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. -
తల్లి నేర్పిన ఓనమాలే ‘శాపం’ గా మారాయి..
ఒక పోటీలో వందకు పది మంది ఓడితే.. అది పెద్ద సమస్య కాకపోవచ్చు. అదే వందలో 70 మంది విఫలమైతే.. మొత్తం వ్యవస్థ వైఫల్యమే అవుతుంది. ఆ వైఫల్యాన్ని గుర్తించి తన అనుభవంతో మార్పు తేవడానికి ప్రయత్నించాడు సోనమ్ వాంగ్‌చుక్. సంప్రదాయేతర సిలబస్‌ను రూపొందించి ‘ఆసాన్ భాషామే’(సులభమైన భాషలో) పిల్లలకు పాఠాలు బోధించడం, మంచు నీటి ప్రవాహాలను గడ్డ కట్టించి.. వర్షాభావ పరిస్థితులప్పుడు వాడుకోవడం, సోలార్ ఆర్మీ టెంట్లు.. ఇలా ఆయన బుర్రలోంచి పుట్టిన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఒక ఇంజినీర్‌గా, ఆవిష్కరణకర్తగా, విద్యావేత్తగా గుర్తింపు పొందిన వాంగ్‌చుక్.. తన జీవితం కంటే ఆవిష్కరణలు, వాటి వెనుక ఆలోచనలే పిల్లలకు పాఠంగా ఉండటాన్ని ఇష్టపడతానని చెప్తుంటాడు. సోనమ్ వాంగ్‌చుక్ పుట్టినరోజు ఇవాళ. 1966 సెప్టెంబర్ 1న లడఖ్‌లోని లే జిల్లా ఉలెటోక్పో లో వాంగ్‌చుక్ జన్మించాడు. ఇంజినీర్ కమ్ సైంటిస్ట్ అయిన సోనమ్ వాంగ్‌చుక్ స్ఫూర్తి నుంచే త్రీ ఇడియట్స్ సినిమా తెరకెక్కిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. అందులో అమీర్ క్యారెక్టర్ పున్షుక్ వాంగ్డూ(రాంచో) చూపించే ప్లాన్లన్నీ వాంగ్‌చుక్ నిజజీవితంలో అమలు చేసినవే. తల్లి నేర్పిన పాఠాలే.. వాంగ్‌చుక్ పుట్టిన ఊళ్లో బడి లేదు. దీంతో 9 ఏళ్ల వయసుదాకా ఆయన బడి ముఖం చూడలేదు. ఆ వయసులో గృహిణి అయిన తల్లి నేర్పిన ఓనమాలే ఆయనకు దిక్కయ్యాయి. వాంగ్ చుక్ తండ్రి రాజకీయ వేత్త(మాజీ మంత్రి కూడా). అందుకే ఎలాగోలా శ్రీనగర్‌లోని ఓ స్కూల్లో కొడుక్కి అడ్మిషన్ తెచ్చాడు. అయితే వాంగ్చుక్కు తల్లి నేర్పిన భాషంతా స్థానిక భాషలో ఉండడంతో.. స్కూల్లో బాగా ఇబ్బందిపడేవాడు. టీచర్లు అడిగిన దానికి సమాధానాలు చెప్పలేక మౌనంగా ఉంటే.. ‘సుద్దమొద్దు’ అనే ముద్ర పడింది. తన తల్లి నేర్పిన ఆ ఓనమాలే తన పాలిట శాపం అయ్యాయని, అలా జరిగి ఉండకపోతే తన జీవితం కుటుంబానికి దూరం అయ్యేది కాదని ఇప్పటికీ గుర్తు చేసుకుంటాడాయన. అంతేకాదు శ్రీనగర్ బడిలో నడిపిన రోజుల్ని.. చీకటి రోజులుగా అభివర్ణించుకుంటాడు. టీచర్లు, తోటి విద్యార్థులు చూసే అవమానమైన చూపులకు, కామెంట్లకు భరించలేక ఒకదశకొచ్చేసరికి ఢిల్లీకి పారిపోయాడు. పాకెట్‌మనీ లేకున్నా.. ఒంటరిగా ఢిల్లీకి చేరిన వాంగ్‌చుక్.. విశేష్కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ను కలిసి తన పరిస్థితిని వివరించాడు. తన స్కూల్ చదువులు పూర్తయ్యేదాకా ఆచూకీ పేరెంట్స్‌కు చెప్పొద్దంటూ బతిమాలుకున్నాడు వాంగ్‌చుక్. అది అర్థం చేసుకుని, మాటిచ్చి వాంగ్చుక్కు తమ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చాడు ఆ ప్రిన్స్‌పాల్. చదువులో రాటుదేలాక విషయాన్ని పేరెంట్స్‌కి తెలియజేసి.. తిరిగి వాళ్ల దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆపై శ్రీనగర్ ఎన్ఐటీలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసి మరోసారి కుటుంబానికి దూరం అయ్యాడు. వాంగ్‌చుక్ ఆర్థిక నిపుణుడు కావాలన్నది ఆ తండ్రి కోరిక. అది నెరవేరకపోవడంతో కొడుకును అసహ్యించుకుని తిరిగి దగ్గరకు తీసుకోలేదు. పేరెంట్స్‌కు దూరమైన వాంగ్‌చుక్.. తన స్కాలర్‌షిప్‌తోనే హాస్టల్ చదువులు కొనసాగించాడు. ఆపై ఓ ప్రొఫెసర్ సాయంతో ఫ్రాన్స్‌లో ఎర్తెన్ ఆర్చిటెక్చర్ కోర్సు పూర్తి చేశాడు. తర్వాత ఇండియాకు వచ్చిన ఆయన జీవితం.. లడఖ్ పరిస్థితుల కారణంగా కొత్త మలుపు తిరిగింది. కామన్సెన్స్ ఉపయోగించి ప్రజల అవసరాలను తీర్చే ఆవిష్కరణలకు బీజం పడింది ఇక్కడి నుంచే.. ►లడఖ్‌లో అడుగుపెట్టేనాటికి.. అక్కడి విద్యార్థుల పాస్ పర్సంటేజ్ 5 శాతంగా తేలింది. దీంతో విద్యా సంస్కరణలకు బీజం వేశాడు. నిపుణులైన గ్రామస్తులకు-తల్లిదండ్రులకు శిక్షణ ఇప్పించాడు. వాళ్ల ద్వారా పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పించాడు. అలా ఐదు శాతం నుంచి 75 శాతానికి పాస్ పర్సంటేజ్‌ను మూడేళ్లలోనే సాధించి చూపించాడాయన. ► స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్‌ను కొందరు విద్యార్థులతో 1988లో స్థాపించాడు. పూర్తి సోలార్ ఎనర్జీతో నడిచే విద్యాలయం ఇది. ► స్వచ్ఛమైన నీటిని గ్రామ ప్రజలకు అందించేందుకు ప్రవాహాలను దారి మళ్లించే ప్లాన్లు అమలు చేశాడాయన. ఐస్ స్థూపాలను కోన్ ఆకారంలో నెలకొల్పి కృత్రిమ హిమానీనదాలతో నీటి కరువును తీర్చే ప్రయత్నం చేశాడు. 2013లో ‘ఐస్ స్తూప’ ప్రాజెక్టు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. ► సోషల్ ఇంజినీర్‌గా ఎన్నో విచిత్రమైన ఆవిష్కరణలు చేశాడు వాంగ్‌చుక్. సోలార్ ప్రాజెక్టులతో లడఖ్ గ్రామీణ ముఖచిత్రం మార్చేశాడు. ఆ ఆవిష్కరణలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు కూడా. ► ప్రభుత్వ, కార్పొరేట్ వైఫల్య చదువుల్ని ఏలియన్ చదవులుగా వర్ణిస్తాడాయన. సంప్రదాయేతర బడి.. విద్యా సంస్కరణలకు బీజం వేయడంతో పాటు కొన్నాళ్లపాటు ప్రభుత్వ ఎడ్యుకేషన్ అడ్వైజరీగా వ్యవహరించాడు కూడా. ► నానో కారు వైఫల్యానికి కారణాల్లో ఒకటి.. పేదల కారుగా ప్రచారం చేయడమే అంటాడు సోనమ్ వాంగ్‌చుక్. పేదవాళ్లే ఆ కారును కొంటారనే ‘సొసైటీ యాక్సెప్టెన్సీ’ వల్ల దానిని జనాలు తిప్పికొట్టారని చెప్పాడు. ► రాజకీయాలపై ఆసక్తి ఉన్న వాంగ్‌చుక్.. వ్యవస్థ లోపాల వల్లే మంచి విద్య అందట్లేదని అభిప్రాయపడుతుంటాడు. ప్రజల ప్రాధాన్యం మారినప్పుడే.. ప్రభుత్వాల ఆలోచనా విధానం మారుతుందని చెప్తాడాయన. - సాక్షి, వెబ్‌డెస్క్ స్పెషల్ -
సైనికుల కోసం సోలార్ టెంట్లు
దేశ రక్షణ కోసం సైనికులు ఎండకు, వానకు, చలికి తట్టుకొని అత్యంత కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తారు. జమ్ము కాశ్మీర్, శ్రీనగర్, లడక్ వంటి ప్రాంతాల్లో శీతాకాలంలో గడ్డ కట్టే చలిలో విధులు నిర్వహించాలంటే కత్తి మీద సాములాగా ఉంటుంది. ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఒకొక్కసారి ఇక్కడ చలికి సైనికులు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. అయితే ఇప్పటి వరకూ సైనికుల క్యాంపుల్లో వాడే టెంట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ '3 ఇడియట్స్'సినిమాలోని 'ఫన్సుఖ్ వాంగ్డు' పాత్ర వెనుక ఉన్న వ్యక్తి సోనమ్ వాంగ్‌చుక్. ఈ సోనమ్ వాంగ్‌చుక్ లడఖ్ లాంటి ప్రాంతంలో ఉన్న ఆర్మీ జవాన్లకు వెచ్చదనం కోసం ఒక పరిష్కారం కనుగొన్నారు. అతను ఒకేసారి 10 మంది జవాన్లకు వసతి కల్పించే సౌరశక్తితో నడిచే పోర్టబుల్ సైనిక గుడారాన్ని నిర్మించాడు. గాల్వన్ వ్యాలీ వంటి ప్రాంతాలలో రాత్రి 10 గంటలకు గుడారం బయట మైనస్ 14 డిగ్రీలు ఉన్నప్పటికీ గుడారం లోపల సుమారు 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని తెలిపారు. 10మంది జవాన్లకు వసతి కల్పించే విధంగా ఈ టెంట్ ను తయారు చేశారు. దీని బరువు 30 కిలోల కన్నా తక్కువ ఉంటుంది. ఈ సోలార్ టెంట్ పూర్తిగా పోర్టబుల్. కనుక సైనికులకు ఈ టెంట్ అత్యంత శీతల ప్రాంతాల్లో కూడా ఉపయోగపడుతుందని వారు సురక్షితంగా సోనమ్ ఉంటారని చెప్పారు. SOLAR HEATED MILITARY TENT for #indianarmy at #galwanvalley +15 C at 10pm now. Min outside last night was -14 C, Replaces tons of kerosesne, pollution #climatechange For 10 jawans, fully portable all parts weigh less than 30 Kgs. #MadeInIndia #MadeInLadakh #CarbonNeutral pic.twitter.com/iaGGIG5LG3 — Sonam Wangchuk (@Wangchuk66) February 19, 2021 చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు '5జీ'తో ఐటీ దిగ్గజాలకు కాసుల పంట -
బలగాల మోహరింపు.. ఒప్పందానికి చైనా తూట్లు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉన్న ఘర్షణాత్మక ప్రాంతాలకు కొత్తగా బలగాలను తరలించరాదన్న ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించింది. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖకు చైనా వైపున్న మిలటరీ పాయింట్స్‌లో బలగాల సంఖ్యను పెంచింది. ఉద్రిక్తతలను తొలగించే ఉద్దేశంతో గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా ఈ చర్యలకు పాల్పడింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఘర్షణాత్మక ప్రదేశాలకు కొత్తగా బలగాలను పంపించరాదని గతేడాది సెప్టెంబర్ 21న జరిగిన 6వ విడత చర్చల సమయంలో చైనానే ప్రతిపాదించడం గమనార్హం. తమ ప్రతిపాదనపై కుదిరిన ఒప్పందాన్నే చైనా ఉల్లంఘించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచే బలగాల మోహరింపు కార్యక్రమాన్ని చైనా చేపట్టిందని వెల్లడించాయి. చైనా చర్యలను గమనించిన భారత్.. ముందు జాగ్రత్తగా పలు కీలక ప్రాంతాల్లో బలగాలను మోహరించింది. దాంతో, ఇరుదేశాల సాయుధ దళాలు, యుద్ధ ట్యాంకులు మరింత దగ్గరగా మోహరించిన పరిస్థితి మరోసారి నెలకొంది. చైనాతో 9వ విడత చర్చలు భారత్, చైనాల మధ్య ఆర్మీ కమాండర్ స్థాయిలో మరో విడత చర్చలు ఆదివారం జరిగా యి. దాదాపు రెండున్నర నెలల తరువాత జరిగిన 9వ విడత చర్చలు ఇవి. నవంబర్ 6న ఇరు దేశాల మధ్య 8వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లోని అన్ని వివాదాస్పద కేంద్రాల నుంచి బలగాల ఉపసంహరణ కొనసాగాలన్న అంశంపై 9వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖకు ఆవలివైపు(చైనా వైపు) మోల్దో సరిహద్దు పాయింట్ వద్ద ఉదయం 10 గంటలకు ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ పీజీకే మెనన్ నాయకత్వం వహించారు. ప్రస్తుతం తూర్పు లద్దాఖ్‌లోని పలు వ్యూహాత్మక పర్వత ప్రాంతాల్లో సుమారు 50 వేల మంది భారత సైనికులు మోహరించి ఉన్నారు. చైనా కూడా దాదాపు అంతే సంఖ్యలో సైనికులను సిద్ధంగా ఉంచింది. మరిన్ని దళాలను పంపించకూడదని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నించ కూడదని, 6వ విడత చర్చల సందర్భంగా ఇరుదేశాలు అంగీకరించిన విషయం తెలిసిందే. -
యుద్ధానికి సిద్ధంకండి!
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సైన్యాన్ని యుద్ధానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీకున్న శక్తియుక్తులన్నింటినీ యుద్ధంపైనే నిమగ్నం చేయండని చైనా ఆర్మీతో జిన్‌పింగ్ చెప్పినట్టుగా సీఎన్ఎన్ ఒక కథనాన్ని ప్రచురించింది. గాంగ్‌డాంగ్‌లో మంగళవారం ఒక సైనిక స్థావరాన్ని సందర్శించిన జిన్‌పింగ్ అక్కడ సైనికులతో మాట్లాడుతూ దేశం పట్ల విశ్వసనీయంగా వ్యవహరించండంటూ వారికి హితబోధ చేశారు. ‘‘మీకున్న శక్తిని, మేధస్సుని యుద్ధ వ్యూహ రచనపై కేంద్రీకరించండి. అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండండి. యుద్ధానికి సిద్ధంగా ఉండండి ’’అని జిన్‌పింగ్ చెప్పినట్టుగా సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. అయితే ఏ దేశంపైన, ఎప్పుడు దండెత్తడానికి జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారన్న దానిపై స్పష్టత లేదు. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో ఉద్రిక్తతలు, అగ్రరాజ్యం అమెరికాతో విభేదాలతో పాటుగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి సంబంధించి ఇతర దేశాలతో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నావికాదళ జవాన్లతో జిన్‌పింగ్ మాట్లాడారు. మరోవైపు చైనా మీడియా మాత్రం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరింత బలోపేతం కావడానికి, సైనికుల్లో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పడానికి జిన్‌పింగ్ సైనిక స్థావరాన్ని సందర్శించారని చెబుతోంది. ఇప్పటివరకు భారత్, చైనా ఏడు రౌండ్లు చర్చలు జరిగినప్పటికీ ఉద్రిక్తతల నివారణకు చర్యలు అమలు చేయడంలో చైనా వెనుకడుగ వేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో జిన్‌పింగ్ నోటి వెంట యుద్ధం ప్రస్తావన తేవడం మరింత ఆందోళనని పెంచుతోంది. -
ఏకకాలంలో చైనా, పాక్‌లతో యుద్ధానికి రెడీ
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఎలాంటి సంఘర్షణ తలెత్తినా భారత వైమానిక దళాని(ఐఏఎఫ్)దే పైచేయిగా ఉంటుందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్ సంసిద్ధంగా ఉందన్నారు. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన అన్ని చోట్లా పటిష్టంగా మోహరించినట్లు తెలిపారు. చైనాతో తూర్పు లద్దాఖ్‌లో ఐదు నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ప్రతిష్టంభన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న వైమానిక దళం దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను పరిరక్షించడానికి సర్వశక్తులూ ఒడ్డుతామన్నారు. లద్దాఖ్‌లో ఐఏఎఫ్ సామర్థ్యంలో భారత్‌తో పోలిస్తే చైనా వెనుకబడి ఉందనీ, అయినప్పటికీ శత్రువును తక్కువగా అంచనా వేయజాలమన్నారు. క్షేత్రస్థాయిలో తలెత్తే ఎలాంటి పరిస్థితులకైనా తక్షణం, వేగంగా స్పందించేలా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట ఐఏఎఫ్ మోహరింపులు చేపట్టిందని చెప్పారు. అవసరమైతే ఉత్తర(చైనా), పశ్చిమ(పాక్) సరిహద్దుల వెంట ఏకకాలంలో పోరాటం జరిపే సత్తా ఐఏఎఫ్‌కు ఉందన్నారు. లద్దాఖ్ ప్రాంతంలో చైనా నుంచి ముప్పు ఉంది కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన..‘అవసరమైన అన్ని చోట్లా మోహరించాం. లద్దాఖ్ అందులో చిన్న ప్రాంతం’అని పేర్కొన్నారు. లద్దాఖ్‌లోకి సులువుగా ప్రవేశించేందుకు వీలున్న అన్ని చోట్లా ఈ మోహరింపులు ఉన్నాయని తెలిపారు. మన ఆర్మీని, ఆయుధ సామగ్రిని శత్రువు కూడా ఊహించలేని ప్రాంతాల్లోకి సైతం వేగంగా తరలించేందుకు ఐఏఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పారు. రఫేల్ యుద్ధ విమానాల చేరికతో ఉత్తర సరిహద్దుల్లో శత్రువు కంటే మెరుగైన సామర్థ్యంతో ఉన్నామన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మరిన్ని రఫేల్‌లను సమకూర్చుకునే విషయం పరిశీలనలో ఉందని వెల్లడించారు. చైనా బలాలు చైనాకున్నాయి.. చైనా కూడా కొన్ని అంశాల్లో బలంగా ఉందన్న బదౌరియా.. వాటిని దీటుగా తిప్పికొట్టేందుకు అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలను ఐఏఎఫ్ సిద్ధం చేసిందన్నారు. ‘చైనాకు సుదూర లక్ష్యాలను ఛేదించే, భూమిపై నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలు, ఐదో తరం జె–20 యుద్ధ విమాన దళం, అత్యాధునిక సెన్సార్లు, ఆయుధాలు ఉన్నాయి. సాంకేతిక, వ్యవస్థల ఏర్పాటు కోసం భారీగా వెచ్చిస్తోంది’అని తెలిపారు. -
సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనాలు ఆధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నాయి. 2 వేల కి.మీల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను, భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను జిన్జియాంగ్, టిబెట్ ప్రాంతాల్లో చైనా మోహరించింది. ప్రతిగా బ్రహ్మోస్, నిర్భయ్, భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్ క్షిపణులను భారత్ సిద్ధం చేసింది. బ్రహ్మోస్‌ది 500 కి.మీల రేంజ్ కాగా, నిర్భయ్‌ది 800 కి.మీ.ల రేంజ్. 40 కి.మీ.ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఆకాశ్ ఛేదించగలదు. చైనా తన ఆయుధ వ్యవస్థలను ఆక్రమిత అక్సాయ్ చిన్ ప్రాంతంలోనే కాకుండా, వాస్తవాధీన రేఖ వెంట కస్ఘర్, హోటన్, లాసా, నింగ్చి.. తదితర ప్రాంతాల్లోనూ మోహరించింది. ఆకాశం నుంచి ఆకాశంలో ఉన్న లక్ష్యాలను, ఆకాశం నుంచి భూమిపైన ఉన్న లక్ష్యాలను ఛేదించగల అత్యంత శక్తివంత బ్రహ్మోస్ క్షిపణి 300 కి.మీ.ల వార్‌హెడ్‌ను మోసుకుని వెళ్లగలదు. టిబెట్, జిన్‌జియాంగ్‌ల్లోని చైనా వైమానిక స్థావరాలను బ్రహ్మోస్ క్షిపణి లక్ష్యంగా చేసుకోగలదు. లద్దాఖ్ ప్రాంతంలో ఈ క్షిపణులను అవసరమైనంత సంఖ్యలో భారత్ సిద్ధంగా ఉంచింది. ఎస్‌యూ30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. హిందూ మహా సముద్రంలోని కార్ నికోబార్ ద్వీపంలో ఉన్న భారత వైమానిక కేంద్రం నుంచి కూడా దీన్ని ప్రయోగించే వీలుంది. కార్‌నికోబార్‌లోని వైమానిక కేంద్రం నుంచి బ్రహ్మోస్, నిర్భయ్ క్షిపణులను ప్రయోగించి మలక్కా జలసంధి నుంచి లేదా సుందా జలసంధి నుంచి వచ్చే చైనా యుద్ధ నౌకలను సమర్ధంగా ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద నిర్భయ్ క్షిపణుల సంఖ్య పరిమితంగా ఉంది. నిర్భయ్ క్షిపణి భూమిపై నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. లద్దాఖ్ ప్రాంతంలో ఆకాశ్ క్షిపణులను కూడా అవసరమైన సంఖ్యలో భారత్ మోహరించింది. భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను చేధించే ఈ క్షిపణి వాస్తవాధీన రేఖ దాటి వచ్చే చైనా విమానాలను లక్ష్యంగా చేసుకోగలదు. ఆకాశ్ క్షిపణిలోని రాడార్ ఏకకాలంలో 64 లక్ష్యాలను గుర్తించగలదు. అందులో 12 లక్ష్యాలపై దాడి చేయగలదు. ఆకాశంలోనే శత్రుదేశ యుద్ధవిమానాలు, క్రూయిజ్ మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్స్‌ను కూల్చివేయగలదు. ఈ మధ్యకాలంలో అక్సాయ్‌చిన్ ప్రాంతంలో చైనా వైమానిక దళ విమానాల కార్యకలాపాలు కొంత తగ్గాయి కానీ, కారాకోరం పాస్ దగ్గరలోని దౌలత్‌బేగ్ ఓల్డీ ప్రాంతంలో పెరిగాయి. రూ. 2,290 కోట్లతో రక్షణ కొనుగోళ్లు డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్‌ను ఆవిష్కరించిన రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాల కోసం రూ. 2,290 కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయుధ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో అమెరికా నుంచి కొనుగోలు చేసే 72 వేల ఎస్ఐజీ సావర్ తుపాకులు ఉన్నాయి. ఆర్మీ కోసం వీటిని రూ. 780 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రక్షణ శాఖకు చెందిన అత్యున్నత నిర్ణయ మండలి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన సమావేశమై ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ రూ. 2,290 కోట్లలో రూ. 970 కోట్లతో నౌకాదళం, వైమానిక దళం కోసం ‘స్మార్ట్ ఎయిర్‌ఫీల్డ్ వెపన్(ఎస్ఏఏడబ్ల్యూ)’ వ్యవస్థలను కొనుగోలు చేయనున్నారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ క్షేత్రస్థాయి దళాల మధ్య అడ్డంకులు లేని సమాచార పంపిణీ కోసం రూ. 540 కోట్లతో హెచ్ఎఫ్ రేడియో సెట్స్‌ను సమకూర్చాలని నిర్ణయించారు. భారత్‌ను అంతర్జాతీయ మిలటరీ వ్యవస్థల తయారీ కేంద్రంగా మార్చడం, సాయుధ సామగ్రిని సమకూర్చుకోవడంలో అనవసర జాప్యాలను నివారించడం, అత్యవసర కొనుగోలు నిర్ణయాలను త్రివిధ దళాలే సులభమైన విధానం ద్వారా తీసుకునే అవకాశం కల్పించడం.. లక్ష్యాలుగా ‘డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్(డీఏపీ)’ని రాజ్‌నాథ్ ఆవిష్కరించారు. ఈ కొత్త విధానం ప్రకారం, భారత్‌లో ఉత్పత్తి చేసే సంస్థలకు డిఫెన్స్ కొనుగోళ్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆధునిక సమాచార సాంకేతికతల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలైన డీఆర్డీఓ, డీపీఎస్‌యూలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని డీఏపీని రూపొందించామని రాజ్‌నాథ్ చెప్పారు. -
ప్రతికూల వాతావ‘రణ’మైనా రెడీ!
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చెలరేగుతున్న తూర్పు లద్దాఖ్‌లో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత్ సమాయత్తమైంది. చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కోవడానికి గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీగా యుద్ధ ట్యాంకులను, ఇతర సామగ్రిని తరలించింది. వచ్చే నాలుగు నెలలు శీతాకాలంలో ఎత్తయిన పర్వత ప్రాంతమైన లద్దాఖ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొని ఉంటాయి. అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో చలి మైనస్ 25 డిగ్రీల వరకు వెళుతుంది. ఆ సమయంలో డ్రాగన్ దేశం ఎలాంటి కుయుక్తులు పన్నినా దీటుగా ఎదుర్కోవడానికి ఇండియన్ ఆర్మీ ఈ భారీ తరలింపు ప్రక్రియ చేపట్టింది. యుద్ధ ట్యాంకులు, భారీగా ఆయుధాలు, ఇంధనాన్ని తరలించినట్టు ఆర్మీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. వాటితో పాటు సైనికులకు అవసరమైన ఆహారం దుస్తులు, బూట్లు తదితర సామగ్రిని చేరవేయడం దాదాపుగా పూర్తయింది. ఈ భారీ తరలింపు కసరత్తుని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నారవాణే, మరికొందరు కమాండర్లతో బృందంగా ఏర్పడి స్వయంగా పర్యవేక్షించారు. జూలై నుంచి మొదలు పెట్టిన ఈ ప్రక్రియని పకడ్బందీ ప్రణాళికతో నరవాణె రూపొందించి అమలయ్యేలా చూశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా ఆయుధాలు తూర్పు లద్దాఖ్‌లోని సమస్యాత్మక ప్రాంతాలైన చుషుల్, డెమ్‌చోక్‌లకు టీ–90, టీ–72 ట్యాంకులు, గన్స్, పదాతిదళానికి అవసరమయ్యే వాహనాలు ఇప్పటికే చేరుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా 16 వేల అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతంలోని శిబిరాల్లో ఉండే జవాన్ల కోసం భారీగా ఆహార పదార్థాలు, దుస్తులు, టెంట్లు, కమ్యూనికేషన్ పరికరాలు, చమురు, చలి నుంచి రక్షణకి హీటర్లు తరలించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లద్దాఖ్‌లో సైనిక శిబిరాలకు ఈ స్థాయిలో సామగ్రిని చేరవేయడం ఇదే మొదటిసారి. ఈ తరలింపు అత్యంత భారీ స్థాయిలో జరిగింది’’అని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. రక్తం గడ్డ కట్టే చలి నుంచి రక్షణ కోసం యూరప్ దేశాల నుంచి దుస్తుల్ని తెప్పించి ఇప్పటికే సైనికులకి అందించారు. ఈ సామగ్రిని తరలించడానికి వైమానిక దళానికి చెందిన సి–130జే సూపర్ హెర్క్యులస్, సీ–17 గ్లోబ్‌మాస్టర్ హెలికాప్టర్లను వినియోగించారు. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతల నివారణ కోసం చైనాతో జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాకపోవడం, సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడానికి ఆ దేశం అంగీకరించకపోవడంతో ముందు జాగ్రత్తగా భారత్ అన్ని రకాలుగా సిద్ధమైంది. అదనంగా మూడు సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది. అక్కడ సైనికులకి అన్ని సదుపాయాలు కల్పించింది. -
తూర్పులద్దాఖ్‌లో పీఎల్ఏపై ఆర్మీ పైచేయి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో భారత ఆర్మీ చైనా పీఎల్ఏపై పైచేయి సాధించింది. ఒక వైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే గడిచిన మూడు వారాల్లో కీలకమైన 20 పర్వత ప్రాంతాలను భారత సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. భారత్ ఇచ్చిన షాక్‌తో దిమ్మెర పోయిన చైనా ఆర్మీ అరుణాచల్‌ప్రదేశ్‌తో గల సరిహద్దుల్లో మోహరింపులు పెంచి, కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నేపథ్యంలో భారత్, చైనా కమాండర్ స్థాయి ఆరో విడత చర్చలు సోమవారం జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ సమావేశంలో భారత బృందంలో విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి కూడా పాలు పంచుకునే అవకాశముంది. ఈ చర్చలు తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖకు చైనావైపున్న మోల్దోలో జరగనున్నాయి. లద్దాఖ్ గగనతలంపై రఫేల్ యుద్ధ విమానాలు పహారా కాస్తున్నాయి.‘ఆగస్టు 29 మొదలు సెప్టెంబర్ రెండో వారం వరకు భారత సైన్యం 20 ప్రధాన పర్వత ప్రాంతాలను ఆక్రమించింది. ఆర్మీ ఆధీనంలోకి తీసుకున్న వాటిలో మగార్ హిల్, గురుంగ్ హిల్, రెచెన్ లా, రెజంగ్ లా, మొఖ్‌పరితోపాటు ఫింగర్ 4కు సమీపంలోని పర్వతప్రాంతం ఉన్నాయి’ ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ‘ఇంతకుముందు ఈ ప్రాంతాల్లో చైనా ఆర్మీ పీఎల్ఏ ఆధిపత్యం ఉండేది. తాజా పరిణామంతో మన బలగాలు ఈ ప్రాంతంలో శత్రువుపై పైచేయి సాధించినట్లయింది’అని ఆ వర్గాలు తెలిపాయి. భారత భూభాగం వైపున పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణం వైపు ఉన్న ఈ పర్వత భాగాలను ఆక్రమించుకునే క్రమంలో చైనా ఆర్మీ ప్రతిఘటించిందనీ, ఈ సందర్భంగా మూడు పర్యాయాలు గాల్లోకి కాల్పులు కూడా జరిగాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత ఆర్మీ కదలికలతో ఇప్పటికే ఉన్న బలగాలకు తోడు మరో 3,000 బలగాలను చైనా అదనంగా రెజంగ్ లా, రెచెన్ లా పర్వత ప్రాంతాలకు సమీపంలోకి రప్పించిందని తెలిపాయి. దీంతోపాటు మోల్డో సైనిక స్థావరంలోకి అదనపు బలగాలను తరలించిందని వివరించాయి. అరుణాచల్ సరిహద్దుల్లో చైనా కుట్ర తూర్పు లద్దాఖ్ అనంతరం చైనా దృష్టి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులపై పడింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలతో అప్పర్ సుబన్‌సిరిలోని అసపిలా, లాంగ్జు, బిసా, మఝా ప్రాంతాల్లోకి పీఎల్ఏ మోహరింపులు పెరిగాయి. దీంతోపాటు ఎల్ఏసీకి సమీపంలోని బిసాలో ఒక రోడ్డును కూడా నిర్మించింది. భారత సైన్యం కూడా దీటుగా స్పందించింది. ఆరు సమస్యాత్మక ప్రాంతాలు, 4 సున్నిత ప్రాంతాల్లో గస్తీని పెంచింది. ఎలాంటి దురాక్రమణనైనా తిప్పికొట్టేందుకు సర్వం సన్నద్ధమైంది. -
చైనా నుంచి చొరబాట్లు లేవు
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల నుంచి గత ఆరునెలల్లో ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో పాక్ సరిహద్దుల నుంచి 47 చొరబాటు యత్నాలు చోటు చేసుకున్నాయని బుధవారం రాజ్యసభకు తెలిపింది. గత మూడేళ్లలో పాక్ నుంచి కశ్మీర్లోకి జరిగిన చొరబాటు యత్నాల సంఖ్య 594 అని, వాటిలో 312 విజయవంతమయ్యాయని వెల్లడించింది. మూడేళ్లలో అక్కడ 582 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయని హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆరు నెలలుగా చైనా సరిహద్దుల్లో ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం ప్రకటించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఆ ప్రకటన గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో ప్రాణాలర్పించిన వీర జవాన్లను అవమానించడమేనని పేర్కొంది. చైనా దురాక్రమణపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి చేసిన వేర్వేరు ప్రకటనలను వరుసగా ప్రస్తావిస్తూ.. ‘మోదీ ప్రభుత్వం మన సైనికుల పక్షాన ఉందా? లేక చైనా వైపు ఉందా?’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నేడు రాజ్‌నాథ్ ప్రకటన తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నేడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ రాజ్యసభలో ప్రకటన చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్‌నాథ్ ప్రకటన అనంతరం, విపక్ష సభ్యులను మాట్లాడే అవకాశం ఇస్తారని, ఆ తరువాత అవసరమైతే, రాజ్‌నాథ్ సభ్యుల అనుమానాలకు వివరణ ఇస్తారని వెల్లడించాయి. రాష్ట్రపతి, ప్రధాని కూడా.. చైనా టెక్నాలజీ కంపెనీ డేటా చౌర్యం అంశాన్ని బుధవారం కాంగ్రెస్ పార్లమెంట్ ఉభయసభల్లో లేవనెత్తింది. దాదాపు 10 వేల మంది ప్రముఖుల సమాచారంపై నిఘా వేశారన్న వార్త ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో, చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న షెంజెన్ కేంద్రంగా ఉన్న ఒక టెక్నాలజీ కంపెనీ 10 వేల మంది భారతీయ ప్రముఖుల డిజిటల్ డేటాను ట్రాక్ చేస్తోందని పత్రికల్లో కథనం వచ్చిందని కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ వివరించారు. ఆ ప్రముఖుల్లో భారత రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, ఆర్మీ చీఫ్, ముఖ్యమంత్రులు ఉండడం షాక్‌కు గురిచేస్తోందన్నారు. డేటా చౌర్యంపై నిపుణుల కమిటీ భారత్‌లోని దాదాపు 10 వేల మంది ప్రముఖులపై చైనా టెక్నాలజీ సంస్థ నిఘాపెట్టి డేటా చౌర్యం చేస్తోందన్న ఆరోపణలపై కేంద్రం ఒక నిపుణుల కమిటీని నియమించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్ నేతృత్వంలో ఈ కమిటీ ఈ ఆరోపణల్లోని నిజానిజాలను నిర్ధారిస్తుంది. -
సరిహద్దు వివాదం : డ్రాగన్ కుటిల యుద్ధతంత్రం
సాక్షి, న్యూఢిల్లీ : భారత దళాల స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు చైనా నక్కజిత్తులు ప్రదర్శిస్తోంది. యుద్ధం చేయకుండానే ప్రత్యర్ధులను మానసికంగా దిగజార్చాలని చైనా సైనిక వ్యూహకర్త సున్ సూ రాసిన ‘యుద్ధకళ’ పుస్తకాన్ని డ్రాగన్ ఇప్పటికీ అనుసరిస్తోంది. లడఖ్‌లో మోహరించిన భారత సైనికులపై ఇప్పటికీ పీఎల్ఏ, కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రికలు అవే మానసిక యుద్ధతంత్రాలను ప్రయోగిస్తున్నాయి. గత నెల 29 రాత్రి ప్యాంగాంగ్ త్సూ ప్రాంతంలో చైనా దళాల దాడిని భారత్ సమర్ధంగా తిప్పికొట్టి ఫింగర్ 4పై తన ప్రాబల్యాన్ని తిరిగి హస్తగతం చేసుకున్న అనంతరం చైనా సైన్యం తొలుత ట్యాంకులు, దళాలతో విరుచుకుపడాలని భావించినా రెడ్ లైన్ అతిక్రమిస్తే భీకర ప్రతిదాడి తప్పదని భారత సైన్యం స్పష్టం చేయడంతో డ్రాగన్ వ్యూహం మార్చింది. చదవండి : సరిహద్దులో సంసిద్ధం.. చైనా సైనిక ఎత్తుగడలకు భారత సైన్యం తలొగ్గకపోవడంతో 1962 నాటి యుద్ధతంత్రాన్ని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ప్రదర్శించింది. కీలక పర్వత ప్రాంతంలో భారత్ గస్తీని నిలువరించే క్రమంలో ఫింగర్ 4 వద్ద పీఎల్ఏ లౌడ్స్పీకర్లలో పంజాబీ పాటలను వినిపించింది. ఇక ప్యాంగాంగ్ త్సో దక్షిణ తీరంలో లౌడ్ స్పీకర్లలో హిందీలో భారత సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా పీఎల్ఏ వ్యవహరించింది. ఢిల్లీలో కూర్చున్న రాజకీయ పెద్దల ఇష్టానుసారం శీతాకాలంలో ప్రతికూల వాతావరణంలో సైనికులను ఇక్కడ మోహరించారని, చలి వాతావరణంలో వేడి భోజనం, రవాణా సౌకర్యాలు లేవని, రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి ఎదురవుతుందంటూ రెచ్చగొట్టారు. భారత సైనికుల్లో అసంతృప్తి రాజేసేందుకు పీఎల్ఏ కుటిల యత్నాలకు పాల్పడింది. 1962లో కూడా తూర్పు, పశ్చిమ సెక్టార్లలో 1967 నాథులా వివాదంలోనూ పీఎల్ఏ ఇదే లౌడ్‌స్పీకర్ ఎత్తుగడలకు పాల్పడిందని సైనిక నిపుణులు చెబుతున్నారు. చైనా సేనలు పాంగాంగ్ త్సో వద్ద కుటిల గూఢచర్యానికి పాల్పడుతుంటే చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక భారత్‌పై విషం చిమ్ముతోంది. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగడం, ఆర్థిక వ్యవస్థ కుదేలైన క్రమంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు నరేంద్ర మోదీ సర్కార్ లడఖ్‌పై కఠిన వైఖరి అవలంభిస్తోందని రాసుకొచ్చింది. -
చైనా దుస్సాహసం జిన్‌పింగ్ ఆలోచన
వాషింగ్టన్: భారత్ సరిహద్దుల్లో ఇటీవలి చైనా దుశ్చర్యలకు వ్యూహరచన ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌దేనని తాజాగా వెల్లడైంది. తన భవిష్యత్తును పణంగా పెట్టి ఈ ప్రమాదకర ఎత్తుగడకు జిన్‌పింగ్ తెరతీశారని, అయితే, భారత సైనికులు వీరోచితంగా ఎదురు నిలవడంతో ఆ వ్యూహం విఫలమైందని అమెరికాకు చెందిన పత్రిక ‘ద న్యూస్‌వీక్’ పేర్కొంది. ఈ వైఫల్యం విపరిణామాలను జిన్‌పింగ్ ఎదుర్కోవాల్సి రావచ్చని అభిప్రాయపడింది. అయితే, దీన్ని కారణంగా చూపి సైన్యంలోని విరోధులకు చెక్ పెట్టేందుకు ఆయన ప్రయత్నించవచ్చని వెల్లడించింది. అలాగే, భారత్‌పై సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు దిగవచ్చని పేర్కొంది. జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. అయితే, చైనా వైపు కూడా మరణాలు సంభవించినప్పటికీ.. ఆ సంఖ్యను చైనా నేటికీ వెల్లడించలేదు. ఆ ఘర్షణల్లో చైనాకు చెందిన కనీసం 43 మంది సైనికులు చనిపోయి ఉంటారని తాజాగా న్యూస్‌వీక్ పేర్కొంది. ఆ సంఖ్య గరిష్టంగా 60 వరకు ఉండొచ్చని ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమొక్రసీస్‌కు చెందిన క్లియొ పాస్కల్‌ను ఉటంకిస్తూ వెల్లడించింది. ఐదు దశాబ్దాల్లో తొలిసారి గత నెలలో చైనా ఆర్మీపై భారత సైనికులు దుందుడుకుగా ముందుకువెళ్లి, కీలక పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకున్నారని, ఇది చైనా సైనికులను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆ కథనంలో న్యూస్‌వీక్ పేర్కొంది. గతంలో చైనా ఆధీనంలో ఉన్న మూడు కీలక ప్రాంతాలను తాజాగా భారత్ కైవసం చేసుకుందని వెల్లడించింది. ముఖాముఖి ఘర్షణల్లో చైనా గ్రౌండ్ ఫోర్స్‌కు ఘన చరిత్ర ఏమీ లేదని, వియత్నాంతో యుద్ధంలో ఓటమిని గుర్తు చేస్తూ వ్యాఖ్యానించింది. భారత సైనికులు కొత్తగా నూతనోత్తేజంతో కనిపిస్తున్నారని, దూకుడుగా ఎదురుదాడికి దిగుతున్నారని ప్రశంసించింది. -
ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట నెలకొన్న తీవ్రస్థాయి ఉద్రిక్తతలను తొలగించే దిశగా భారత్, చైనా ముందడుగు వేశాయి. మాస్కోలో గురువారం జరిగిన రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఇందుకు సంబంధించి ఐదు అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేలా చర్యలు చేపట్టకపోవడం, వాస్తవాధీన రేఖ వెంట శాంతి, సంయమనం నెలకొనడం, రెండు దేశాల సరిహద్దు భద్రత దళాలు చర్చలు కొనసాగించడం, సైనిక బలగాల మధ్య దూరం పాటించడం అనే ఐదు అంశాల్లో ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొనేందుకు మాస్కో వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి.. సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపు లక్ష్యంగా అక్కడ ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఇరువురు నేతల మధ్య ఈ విషయంలో దాదాపు రెండున్నర గంటల పాటు నిర్మాణాత్మకంగా, నిర్మొహమాటంగా చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఉభయ దేశాలకు ప్రయోజనకరం కాదని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. తూర్పు లద్దాఖ్‌లో ప్యాంగాంగ్ సరస్సు కేంద్రంగా భారత్, చైనాలు భారీగా బలగాలను, యుద్ధ సామగ్రిని మోహరించిన విషయం తెలిసిందే. విదేశాంగ మంత్రుల భేటీ సందర్భంగా కుదిరిన ఐదు అంశాల ఒప్పందం ప్రస్తుత సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు ఒక మార్గదర్శిగా నిలుస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దు దళాలు చర్చలు కొనసాగించాలని, బలగాల ఉపసంహరణ సాధ్యమైనంత త్వరగా జరగాలని, ఇరు దేశాల సైన్యం తగినంత దూరం పాటించాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు’ అని పేర్కొంటూ శుక్రవారం ఉదయం ఒక సంయుక్త ప్రకటనను భారత విదేశాంగ శాఖ విడుదల చేసింది. అయితే, బలగాల ఉపసంహరణకు సంబంధించి ఎలాంటి కాల వ్యవధిని ఈ ఐదు అంశాల ఒప్పందంలో పేర్కొనలేదు. ‘సరిహద్దులకు సంబంధించిన అన్ని ఒప్పందాలు, ప్రొటోకాల్స్‌ను రెండు దేశాలు గౌరవించాలని, సరిహద్దుల్లో శాంతి, సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు పెరిగే చర్యలు చేపట్టకూడదని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్రిక్తతలు చల్లారిన తరువాత,.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పూర్వక వాతావరణం నెలకొనేలా విశ్వాస కల్పన చర్యలు చేపట్టడాన్ని వేగవంతం చేయాలని కూడా నిర్ణయించాయని వెల్లడించారు. రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్æ శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్æ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే ఉద్దేశంతో భారత్, చైనా విదేశాంగ మంత్రుల భేటీలో కుదిరిన ‘ఐదు అంశాల’ ఒప్పందంపై వీరంతా చర్చించారు. తూర్పు లద్దాఖ్‌లో భారత దళాల సన్నద్ధతను సమగ్రంగా సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని పేర్కొంటూ సంబంధిత వ్యూహాలను ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె వివరించారు. -
ఉద్రిక్తతల తొలగింపే లక్ష్యం
మాస్కో: తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే లక్ష్యంతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం రష్యా రాజధాని మాస్కోలో సమావేశమయ్యారు. ప్యాంగాంగ్ సరస్సు కేంద్రంగా రెండు దేశాలు భారీగా బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న ఈ మే నెల నుంచి రెండు దేశాల విదేశాంగ మంత్రులు ముఖాముఖీ భేటీ కావడం ఇదే ప్రథమం. గల్వాన్ లోయలో చోటు చేసుకున్న తీవ్ర స్థాయి ఘర్షణల సమయంలో జూన్ 17న ఇరువురు నేతలు ఫోన్లో చర్చలు జరిపారు. చైనా దురాక్రమణ చర్యలు కొనసాగిస్తుండటంతో పాటు భారీగా సైనిక దళాలను మోహరించడం, కొన్ని నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడంతో.. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోకి భారత్ అదనపు బలగాలను, యుద్ధ ట్యాంకులను, ఇతర సామగ్రిని భారీగా తరలించింది. ‘కాసేపట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశమవనున్నారు. సరిహద్దు సమస్యను వారిద్దరు చర్చిస్తారు’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడిం చారు. ‘దౌత్య, మిలటరీ మార్గాల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలనే భారత్, చైనా భావిస్తున్నాయి’ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్, వాంగ్ మాస్కో వెళ్లారు. ఆర్ఐసీ విదేశాంగ మంత్రుల భేటీ ఎస్సీఓ సమావేశాల సందర్భంగా గురువారం మాస్కోలో రష్యా, భారత్, చైనా(ఆర్ఐసీ) విదేశాంగ మంత్రులు వరుసగా సెర్గీ లెవ్రోవ్, జైశంకర్, వాంగ్ సమావేశమయ్యారు. పరస్పర సహకారం, స్నేహం, విశ్వాసం స్ఫూర్తిగా త్రైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల విషయమై వారు చర్చించారు. భేటీ అనంతరం వారు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. అంతర్జాతీయంగా అభివృద్ధిదాయక శాంతి, సుస్థిరతలు నెలకొనడానికి ఈ మూడు దేశాల మధ్య త్రైపాక్షిక సహకారం ఆవశ్యకమని అందులో పేర్కొన్నారు. వ్యూహాత్మక పర్వతాలపై భారత్ పాగా ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో చైనా దళాలు ఉన్న ప్రదేశాలపై దృష్టి పెట్టేలా కీలకమైన పలు పర్వతాలపై భారత బలగాలు నియంత్రణ సాధించాయి. రెండు దేశాల ఆర్మీలకు చెందిన బ్రిగేడ్ కమాండర్లు, కమాండింగ్ అధికారులు వేర్వేరుగా చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. -
దక్షిణాన సైనికులు.. ఉత్తరాన నిర్మాణాలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని చైనా సరిహద్దుల వద్ద, ప్రస్తుత ఘర్షణలకు కేంద్ర స్థానమైన పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల్లోని కీలక స్థావరాల వద్ద పాగా వేయడం చైనా లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, దక్షిణ తీరంలో పరిస్థితి ఏ మలుపైనా తీసుకునేలా కనిపిస్తోందని భారత అధికార వర్గాలు భావిస్తున్నాయి. చైనా దళాల చర్యలను నియంత్రిస్తోంది స్థానికంగా ఉన్న ఆర్మీ కమాండర్లు కాదని, ఉన్నత స్థాయి చైనా నాయకత్వ అదుపాజ్ఞల మేరకే చైనా దళాల కదలికలు ఉంటున్నాయని వివరించారు. పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం ఉద్రిక్తంగానే ఉందని, అయితే, అక్కడి కొన్ని వ్యూహాత్మక పర్వతాలు భారత నియంత్రణలోనే ఉన్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఆ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల స్థితిలో భారత ఆర్మీ ఉంది. పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలోని ఫింగర్ 4 వద్ద చైనా దళాల కన్నా భారతే మెరుగైన స్థితిలో ఉంది. అక్కడ, కీలక పర్వత ప్రాంతాలు భారత్ స్వాధీనంలో ఉన్నాయి. రెండు దేశాల సైనికులు కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉన్నారు. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీర ప్రాంతంలో కూడా సుమారు 6 వేల మంది చైనా సైనికులు ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్వాధీనంలో ఉన్న దక్షిణ తీరంలోని వ్యూహాత్మక పర్వత ప్రాంతాలను మళ్లీ ఆక్రమించేందుకు చైనా తరచుగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలను భారత్ గట్టిగా అడ్డుకుంటోంది. అయితే, ఈ ప్రయత్నాలను చైనా మరింత తీవ్రస్థాయిలో కొనసాగించే అవకాశం ఉంది. తూర్పు లద్దాఖ్ ప్రాంతానికి చైనా ఇప్పటికే సుమారు 150 యుద్ధ విమానాలను, ఇతర సహాయక హెలికాప్టర్లను తరలించింది. పాంగాంగ్ సరస్సుకు దక్షిణ తీరంలో భారత సైనికులను ఎంగేజ్ చేస్తూ.. ఉత్తర తీరంలో నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించే వ్యూహాన్ని చైనా అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఫింగర్ 5 ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్మాణ కార్యక్రమాలు కొనసాగినట్లు ఆ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ సంవత్సరం మే నెల నుంచి ఉత్తర తీర ప్రాంతంలోని ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు భారత దళాలు గస్తీని చైనా అడ్డుకుంటోంది. ఫింగర్ 8 వరకు భారత్ భూభాగమేనన్న భారతదేశ వాదన. కానీ, చైనా మాత్రం ఫింగర్ 4 వద్దనే వాస్తవాధీన రేఖ ఉందని వాదిస్తోంది. ఆ కీలక ప్రాంతాల్లో మే నెల నుంచి పలు నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది. ఇండో, చైనా ఆర్మీ కమాండర్ల చర్చలు సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నివారణపై భారత్, చైనా సైన్యాలకు చెందిన కమాండర్లు తూర్పు లద్దాఖ్‌లో చర్చలు జరిపారు. టెన్షన్ల నివారణకు అనుసరించాల్సిన మార్గాలపై హాట్‌లైన్‌లోనూ చర్చించినట్లు సమాచారం. చైనా, ఇండియా విదేశాంగ మంత్రుల మధ్య మాస్కోలో గురువారం సమావేశం జరగనుంది. ఇప్పటికీ తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. గురువారం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో జైశంకర్, వాంగ్ల భేటీపై ఆసక్తి నెలకొంది. ఇదే రోజు రష్యా, చైనా, ఇండియా విదేశాంగ మంత్రుల మధ్య త్రైపాక్షిక చర్చలు జరగనున్నాయి. -
ఎల్ఏసీని గౌరవించాలి
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను చైనా గౌరవించాలని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు మానుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చైనా రక్షణ మంత్రి వెయి ఫెంఘెకు స్పష్టంచేశారు. భారత్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు కట్టుబడి ఉందన్నారు. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోవడానికి భారత్ సిద్ధంగా లేదని చెప్పారు. శుక్రవారం మాస్కోలో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు సందర్భంగా వీరిద్దరు రెండు గంటల 20 నిమిషాలపాటు భేటీ అయ్యారు. గత మేలో తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన ఉన్నతస్థాయి భేటీ ఇదే కావడం గమనార్హం. ఉభయులు సరిహద్దుతోపాటు, ఇరుదేశాల సంబంధాలపై నిర్మొహమాటంగా, లోతుగా చర్చించుకున్నారని విదేశాంగ శాఖ శనివారం తెలిపింది. సరిహద్దులో ప్రస్తుత పరిస్థితుల నిర్వహణలో బాధ్యతాయుతంగా మెలగాలని, అలజడి రేగేలా ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఉభయపక్షాలు నడుచుకోవాలని రాజ్‌నాథ్ చెప్పారు. ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా బలగాలు పెద్ద ఎత్తున కవ్వింపు చర్యలకు దిగి ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించాయని రాజ్‌నాథ్.. ఫెంఘె దృష్టికి తీసుకెళ్లారు. ఉభయ దేశాలు దౌత్య, మిలిటరీ మార్గాల ద్వారా చర్చలను కొనసాగించాలని, వీలైనంత త్వరగా బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. శాంతిని పునరుద్ధరించేలా ఇరు దేశాధినేతల ఏకాభిప్రాయం మేరకు నడుచుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని, దీనివల్ల విభేదాలు వివాదాలుగా మారకుండా ఉంటాయన్నారు. ఎల్ఏసీ వెంబడి గల్వాన్ లోయలో గత కొద్ది నెలలుగా చేస్తున్న అభివృద్ధి పనుల గురించి రాజ్‌నాథ్ చర్చల సందర్భంగా సూత్రప్రాయంగా చెప్పారు. సరిహద్దులో భారత బలగాలు వివాదాలకు తావీయకుండా ఎల్లప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా మెలుగుతున్నాయని, అదే సమయంలో భారత సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ పడబోమని తేల్చిచెప్పారు. చైనా అడిగిన అన్ని అంశాలకు రాజ్‌నాథ్ బదులిచ్చారని, వారు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. రెచ్చగొట్టే చర్యలొద్దు: చైనా వివాదం శాంతియుతంగా పరిష్కారం కావాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చైనా మంత్రి ఫెంఘె రాజ్‌నాథ్‌కు చెప్పారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ద్వైపాక్షిక ఒప్పందాలను కచ్చితంగా అమలు చేయాలని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని పేర్కొన్నట్లు చెప్పింది. ఉద్రిక్త నివారణకు కలిసి పనిచేయాలని, సంబంధాల పురోగతిపై దృష్టి పెట్టాలని ఫెంఘె చెప్పారంది. వివాదానికి కారణం భారతేనని, చైనా భూభాగాన్ని అంగుళం కూడా వదులుకోబోమని ఫెంఘె చెప్పారంటూ చైనా ఒక ప్రకటన విడుదల చేసి తన వక్రబుద్ధి చాటుకుంది. ఉద్రిక్తత నివారణకు సాయం చేస్తా: ట్రంప్ వాషింగ్టన్: భారత్–చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అక్కడి పరిస్థితి ‘చాలా అసహ్యంగా’ ఉందని అభివర్ణించారు. చైనా చాలా దూకుడుగా వ్యవహరిస్తోందని, అవసరమైతే వివాద పరిష్కారానికి సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ట్రంప్ శుక్రవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిపై భారత్, చైనాలతో మాట్లాడుతున్నానని పునరుద్ఘాటించారు. భారత్, చైనా రక్షణ మంత్రుల భేటీ సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
‘గ్రీన్‌లైన్’పై చైనా గురి
న్యూఢిల్లీ: గత నెలాఖరులో లద్దాఖ్‌లో చైనా సైన్యం (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ– పీఎల్ఏ) పెద్ద పన్నాగమే పన్నింది. లద్దాఖ్‌తో టిబెట్ సరిహద్దును చైనా ‘గ్రీన్‌లైన్’తో నిర్వచిస్తోంది. ఈ గ్రీన్‌లైన్ పాంగాంగ్ సరస్సు ఉత్తరతీరంలోని ఫింగర్–4 పర్వత ప్రాంతం మీదుగా వెళుతూ... దక్షిణతీరంలోని చుషుల్ లోయ మొత్తాన్ని చైనా భూభాగంగా చూపిస్తుంది. 1960లో చైనా తయారుచేసిన మ్యాప్ ఇది. ఆగస్టు 29– 30 మధ్యరాత్రి వేళ పీఎల్ఏ దుస్సాహసానికి దిగింది. ఈ గ్రీన్‌లైన్ మేరకు భూభాగాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా పెద్ద ఎత్తున బలగాలతో ముందుకు కదిలింది. వాస్తవా«ధీన∙రేఖ వద్ద ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు యత్నించింది. ‘పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని కీలకమైన అన్ని పర్వత ప్రాంతాలపై, చుషుల్‌లో మోహరించడం ద్వారా భారత స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ప్రత్యర్థి కదలికలకు చెక్ పెట్టింది. లేకపోతే మొత్తం చుషుల్ లోయను పీఎల్ఏ తమ స్వాధీనంలోకి తీసుకునేది. ఎలాగైనా గ్రీన్‌లైన్‌ను చేరుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఆరోజు చైనా సైన్యం ముందుకు కదిలింది. భారీ ట్యాంకులు, భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే మిస్సైల్స్, భారీ తుపాకులను వాస్తవాధీన రేఖ వద్ద మోహరించి భారత సైన్యాన్ని వెనుకడుగు వేసేలా బెదరగొట్టాలని చూసింది. అయితే వెంటనే అప్రమత్తమైన భారత్... ఫింగర్–4పై, పాంగాంగ్ దక్షిణ తీరంలో తమ బలగాల మోహరింపులో మార్పులు చేర్పులు చేసింది. తదుపరి అడుగు వేయడానికి చైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా చేసింది. అలా డ్రాగన్ దురాక్రమణ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది’ అని భారత సైనిక ఉన్నతాధికారి ఒకరు వివరించారు. రెండు చోట్ల ఎదురెదురుగా... ఒకవైపు శుక్రవారం రష్యాలో ఇరుదేశాల రక్షణశాఖ మంత్రుల సమావేశం జరిగినప్పటికీ... సరిహద్దుల్లో మాత్రం చైనా ఇంకా తన దుందుడుకు చర్యలను ఆపడం లేదు. చుషుల్ లోయలోని రెచిన్ లా ప్రాంతంలో, బంప్ అనే మరోచోట భారత్– చైనా సైన్యాలు ఎదురెదురుగా మోహరించాయి. సైనిక బలగాలను, ఆయుధ సామగ్రిని చైనా పెంచుతూనే ఉంది. బంప్‌కు అభిముఖంగా, వాస్తవాధీన రేఖకు చైనా వైపున్న బ్లాక్‌టాప్ శిఖరంపై పీఎల్ఏ 150 మంది సైనికులను, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్ను మోహరించింది. -
పబ్జీ ‘ఆట’కట్టు
-
పబ్జీ ‘ఆట’కట్టు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా కవ్వింపు నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా మొబైల్ యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పబ్జీ మొబైల్ లైట్, బైదు, బైదు ఎక్స్‌ప్రెస్ ఎడిషన్, అలీపే, వాచ్‌లిస్ట్, వీచాట్ రీడింగ్, కామ్కార్డ్తో పాటు పలు గేమింగ్ యాప్‌లు నిషేధానికి గురైన వాటిలో ఉన్నాయి. దేశ భద్రతకు ముప్పుగా పేర్కొంటూ కేంద్రం వీటిపై కొరడా ఝళిపించింది. పబ్జీ గేమ్ పిల్లలు, యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందనే అభిప్రాయం ఉంది. భారత్‌లో పబ్జీ క్రియాశీల వినియోగదారులు 3.3 కోట్ల మంది ఉన్నారు. ప్రతిరోజూ మనదేశంలో 1.3 కోట్ల మంది దీన్ని ఆడుతున్నారు. లద్దాఖ్‌లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 29న కేంద్ర ప్రభుత్వం... అత్యంత ప్రజాదరణ కలిగిన టిక్‌టాక్, యూసీ బ్రౌజర్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. తర్వాత మరో 47 యాప్‌లను నిషేధిత జాబితాలో చేర్చింది. బుధవారం వేటుపడిన వాటితో కలిపితే ఇప్పటిదాకా భారత్ మొత్తం 224 చైనా యాప్‌లపై నిషేధం విధించింది. భారత్ లాంటి పెద్దమార్కెట్లో ఉనికి కోల్పోవడం ఈ చైనా కంపెనీలకు ఆర్థికంగా పెద్దదెబ్బే. టిక్‌టాక్‌పై భారత్ నిషేధం విధించాక... అమెరికా కూడా అదేబాటలో నడిచిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15కల్లా టిక్‌టాక్ అమెరికా వ్యాపారాన్ని అమ్మివేయాలని, లేని పక్షంలో నిషేధం అమలులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. దేశ భద్రతకు ముప్పు... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 69 (ఎ), ప్రజల సమాచారం సంగ్రహించడాన్ని నిరోధించే విధానం, భద్రతల నిబంధనలు– 2009 పరిధిలో ఈ 118 యాప్‌లను నిషేధించింది. అందుబాటులో ఉన్న సమాచారం దృష్ట్యా ఆయా మొబైల్ యాప్‌లు భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణ, ప్రజాభద్రతకు హాని కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నందున వాటిపై నిషేధం విధించినట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ల శాఖకు వివిధ వర్గాల నుంచి ఆయా యాప్‌లపై అనేక ఫిర్యాదులు అందాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమయ్యే కొన్ని మొబైల్ యాప్‌లను దుర్వినియోగం చేయడం, వినియోగదారుల డేటాను దొంగిలించడం, అనధికారికంగా భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు రహస్యంగా పంపించడం చేస్తున్నట్టు కేంద్రం గ్రహించింది. ఈ డేటా సంకలనం భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను చివరికి జాతీయ భద్రతను ప్రభావితం చేయడం ఆందోళన కలిగించే విషయమని, దీనిని నిరోధించే తక్షణ చర్యలో భాగంగా ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్టు తెలిపింది. వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతున్నాయని పేర్కొంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం మంత్రిత్వ శాఖ కూడా ఈ హానికరమైన మొబైల్ యాప్స్ నిరోధించటానికి సమగ్రమైన సిఫారసు పంపింది. ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి కూడా వీటిని నిషేధించాలన్న డిమాండ్ ఉందని కేంద్ర ఐటీ శాఖ వివరించింది. -
మళ్లీ చైనా దుస్సాహసం
న్యూఢిల్లీ: చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సరిహద్దుల్లో మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. గల్వాన్ ఘటన అనంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో మరోసారి రెచ్చగొట్టేందుకు పీఎల్ఏ చేసిన ప్రయత్నానికి భారత్ గట్టిగా బదులిచ్చింది. తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితిని కొనసాగిం చాలంటూ కుదిరిన ఒప్పందాన్ని కాలరాస్తూ ఆగస్టు 29వ తేదీ అర్ధరాత్రి పాంగోంగ్ సో సరస్సు దక్షిణం ఒడ్డుకు చైనా బలగాలు చేరుకున్నాయి. పసిగట్టిన భారత సైన్యం వేగంగా స్పందించింది. ఆ ప్రాంతంలోకి పెద్ద ఎత్తున బలగాలను తరలించి, వారి ప్రయత్నాన్ని వమ్ము చేసింది. అయితే, ఎలాంటి భౌతిక పరమైన ఘర్షణలు చోటుచేసుకోలేదని కేంద్రం తెలిపింది. పాంగోంగ్ సో సరస్సు చుట్టుపక్కల అన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో బలగాలను, ఆయుధ సంపత్తిని మరింత పెంచినట్లు వెల్లడించింది. తూర్పు లద్దాఖ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక, దౌత్యవర్గాల మధ్య చర్చల్లో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఆగస్టు 29/30 రాత్రి పీఎల్ఏ బలగాలు యథాతథ స్థితిని మార్చేందుకు రెచ్చగొట్టేలా సైనిక కదలికలకు పాల్పడ్డాయని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ ఆనంద్ తెలిపారు. ‘క్షేత్రస్థాయిలో యథాతథ పరిస్థితులను ఏకపక్షంగా మార్చాలన్న చైనా ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టింది. ఆ ప్రాంతంలోని కీలక పోస్టుల్లో బలగాలను సమీకరించడం సహా అన్ని చర్యలు చేపట్టింది’అని కల్నల్ ఆనంద్ తెలిపారు. ‘పాంగోంగ్ సో సరస్సు దక్షిణ ఒడ్డున పీఎల్ఏ కదలికలు కనిపించాయి. వెంటనే భారత ఆర్మీ ఆ ప్రాంతంలో బలగాల సంఖ్యను భారీగా పెంచింది. యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఈ వ్యవహారంపై చుషుల్‌లో బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి’ అని కల్నల్ ఆనంద్ వివరించారు. ‘శాంతి, సామరస్యాలు కొనసాగేందుకు భారత ఆర్మీ కట్టుబడి ఉంది. అంతే స్థాయిలో, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు కృత నిశ్చయంతో ఉంది’ అని వివరించారు. ఆగస్టు 29వ తేదీ అర్ధరాత్రి చైనా బలగాలు పెద్ద సంఖ్యలో తూర్పు లద్దాఖ్‌లోని పాంగోంగ్ సో దక్షిణం వైపునకు చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని, తిష్టవేసేందుకు ప్రయత్నిం చాయి. పసిగట్టిన భారత బలగాలు వారిని నిలువరించేందుకు వెంటనే భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి తరలివెళ్లాయి. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఎలాంటి భౌతిక దాడులు చోటుచేసుకోలేదు’అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాంగోంగ్ సో సరస్సు ఉత్తర తీరం వైపు రెండు దేశాల బలగాలు గతంలో తలపడ్డాయి. కానీ, దక్షిణం వైపు ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రథమం అని వెల్లడించాయి. ఈ పరిణామంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు చర్చించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా ప్రయత్నాన్ని ఆర్మీ సీరియస్‌గా తీసుకుందనీ, పాంగోంగ్ సో ఉత్తర, దక్షిణ తీరం, చుట్టుపక్కల కీలక ప్రాంతాల్లోకి బలగాలతో పాటు ఆయుధ సంపత్తిని తరలించింది. భారత్ గట్టిగా డిమాండ్ చేస్తున్న విధంగా ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చైనా కట్టుబడి ఉన్నట్లు కనిపించడం లేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. కాగా, జూన్ 15వ తేదీన గల్వాన్ ఘటన తర్వాత చైనా కవ్వింపు చర్యలకు పాల్పడటం ఇది మొదటిసారి. ఉద్రిక్తతలను సడలించుకు నేందుకు ఇరు దేశాలు అంగీకరించినా పాంగోంగ్ సో, డెప్సాంగ్, మరో రెండు ఘర్షణాత్మక ప్రాంతాల్లో చైనా సైన్యం తిష్టవేసుకుని ఉంది. దీంతో భారత్ భారీగా సైన్యాన్ని మోహరించింది. అత్యాధునిక ఆయుధ సంపత్తిని తరలించింది. మిరేజ్–2000, సుఖోయ్ 30 ఎంకేఐ వంటి ఫైటర్ జెట్లను ఎల్ఏసీ వెంట మోహరించింది. అతిక్రమించలేదు: చైనా చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియాన్ స్పందించారు. చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. ఆ రేఖను వారెప్పుడూ అతిక్రమించలేదు. సరిహద్దుల్లో రెండు వైపుల సైన్యం క్షేత్ర స్థాయి అంశాలపై ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నాయి’ అని వివరించారు. ‘గతంలో అంగీకరిం చిన అంశాలను భారత్ ఉల్లంఘించింది. పాంగోంగ్ సో సరస్సు దక్షిణతీరంతో పాటు రెకిన్ పాస్‌ను ఆగస్టు 31వ తేదీన భారత్ బలగాలు అతిక్రమించాయి. తీవ్రమైన రెచ్చగొట్టే చర్య సరిహద్దుల వెంట ఉద్రిక్తతలకు కారణమైంది. చైనా సైన్యం ఇటువంటి వాటిని దీటుగా ఎదుర్కొంటుంది’ అంటూ పీఎల్ఏ పశ్చిమ కమాండ్ ప్రతినిధి కల్నల్ ఝాంగ్ షుయిలీ చేసిన ప్రకటనను అధికార జిన్హువా ప్రచురించింది. -
చైనాకు దీటుగా బలగాల మోహరింపు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డీ, దెప్సాంగ్ ప్రాంతాల్లో చైనా సుమారు 17 వేల సైనికులను, యుద్ధ వాహనాలను మోహరించింది. ఏప్రిల్, మేల నుంచే చైనా ఆ ప్రాంతాలకు బలగాల తరలింపు ప్రారంభించింది. అలాగే, అక్కడ పెట్రోలింగ్ పాయింట్(పీపీ) 10 నుంచి పీపీ 13 వరకు భారత బలగాల గస్తీ విధులను చైనా సైనికులు అడ్డుకోవడం ప్రారంభించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాంతో, భారత్ కూడా అదే స్థాయిలో స్పందించిందని, టీ 90 రెజిమెంట్స్ సహా భారీగా బలగాలను ఆ ప్రాంతాలకు తరలించిందని వెల్లడించాయి. కారకోరం పాస్ దగ్గర్లోని పీపీ 1 దగ్గర్నుంచి పెద్ద ఎత్తున భారత్ బలగాలను దెప్సాంగ్‌కు తరలించిందని తెలిపాయి. ఏదైనా దుస్సాహసానికి పాల్పడాలంటే చైనా పలుమార్లు ఆలోచించే స్థాయిలో 15 వేల మంది భారత జవాన్లు అక్కడ సిద్ధంగా ఉన్నారన్నాయి. టీడబ్ల్యూడీ బెటాలియన్ ప్రధాన కార్యాలయం నుంచి కారకోరం కనుమ వరకు రోడ్డు నిర్మించాలని చైనా భావిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణంతో రెండు బెటాలియన్ల మధ్య దూరం చాలా తగ్గుతుంది. భారత భూభాగంలోని పీపీ 7, పీపీ 8 మధ్య చైనా గతంలో చిన్న వంతెనను నిర్మించగా భారత సైనికులు దాన్ని కూల్చేశారు. భౌగోళిక సమగ్రతలో రాజీ లేదు చైనాకు మరోసారి స్పష్టం చేసిన భారత్ దేశ భౌగోళిక సమగ్రత విషయంలో రాజీ లేదని చైనాకు భారత్ మరోసారి తేల్చిచెప్పింది. భారత్, చైనాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సొ, ఇతర ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి బలగాల ఉపసంహరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలని ఇరుదేశాల మిలటరీ కమాండర్ స్థాయి ఐదో విడత చర్చల సందర్భంగా స్పష్టం చేసింది. సీనియర్ కమాండర్ స్థాయి అధికారుల నేతృత్వంలో ఆదివారం చైనా భూభాగంలోని మోల్డో వద్ద 11 గంటల పాటు చర్చించారు. రెండు దేశాల మధ్య సౌహార్ధ సంబంధాలు నెలకొనాలంటే.. వాస్తవాధీన రేఖ వెంట గతంలో ఉన్న యథాతథ స్థితి నెలకొనడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేసినట్లు ఆర్మీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ‘గల్వాన్ లోయ, పలు ఇతర ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకుంది. కానీ పాంగాంగ్ సొ ప్రాంతంలోని ఫింగర్ 4, ఫింగర్ 8 ల్లో, గొగ్రా వద్ద బలగాలను ఉపసంహరించకపోవడంపై భారత్ గట్టిగా ప్రశ్నించింది’ అని వివరించాయి. 1.75 లక్షల కోట్ల టర్నోవర్ లక్ష్యం 2025 నాటికి రక్షణ ఉత్పత్తుల టర్నోవర్ రూ. 1.75 లక్షల కోట్లకు చేరాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తిగా మారే సామర్ధ్యం ఈ రంగానికి ఉందని భావిస్తోంది. దీనికి సంబంధించిన ‘డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ–2020’ ముసాయిదాను రక్షణ శాఖ రూపొందించింది. అందులో, రానున్న ఐదేళ్లలో అంతరిక్ష రక్షణ రంగ ఉత్పత్తులు, సేవల ఎగుమతుల లక్ష్యమే రూ. 35 వేల కోట్లని అందులో పేర్కొంది.