న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల నుంచి గత ఆరునెలల్లో ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో పాక్ సరిహద్దుల నుంచి 47 చొరబాటు యత్నాలు చోటు చేసుకున్నాయని బుధవారం రాజ్యసభకు తెలిపింది. గత మూడేళ్లలో పాక్ నుంచి కశ్మీర్లోకి జరిగిన చొరబాటు యత్నాల సంఖ్య 594 అని, వాటిలో 312 విజయవంతమయ్యాయని వెల్లడించింది.
మూడేళ్లలో అక్కడ 582 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయని హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆరు నెలలుగా చైనా సరిహద్దుల్లో ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం ప్రకటించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఆ ప్రకటన గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో ప్రాణాలర్పించిన వీర జవాన్లను అవమానించడమేనని పేర్కొంది. చైనా దురాక్రమణపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి చేసిన వేర్వేరు ప్రకటనలను వరుసగా ప్రస్తావిస్తూ.. ‘మోదీ ప్రభుత్వం మన సైనికుల పక్షాన ఉందా? లేక చైనా వైపు ఉందా?’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
నేడు రాజ్‌నాథ్ ప్రకటన
తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నేడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ రాజ్యసభలో ప్రకటన చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్‌నాథ్ ప్రకటన అనంతరం, విపక్ష సభ్యులను మాట్లాడే అవకాశం ఇస్తారని, ఆ తరువాత అవసరమైతే, రాజ్‌నాథ్ సభ్యుల అనుమానాలకు వివరణ ఇస్తారని వెల్లడించాయి.
రాష్ట్రపతి, ప్రధాని కూడా..
చైనా టెక్నాలజీ కంపెనీ డేటా చౌర్యం అంశాన్ని బుధవారం కాంగ్రెస్ పార్లమెంట్ ఉభయసభల్లో లేవనెత్తింది. దాదాపు 10 వేల మంది ప్రముఖుల సమాచారంపై నిఘా వేశారన్న వార్త ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో, చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న షెంజెన్ కేంద్రంగా ఉన్న ఒక టెక్నాలజీ కంపెనీ 10 వేల మంది భారతీయ ప్రముఖుల డిజిటల్ డేటాను ట్రాక్ చేస్తోందని పత్రికల్లో కథనం వచ్చిందని కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ వివరించారు. ఆ ప్రముఖుల్లో భారత రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, ఆర్మీ చీఫ్, ముఖ్యమంత్రులు ఉండడం షాక్‌కు గురిచేస్తోందన్నారు.
డేటా చౌర్యంపై నిపుణుల కమిటీ
భారత్‌లోని దాదాపు 10 వేల మంది ప్రముఖులపై చైనా టెక్నాలజీ సంస్థ నిఘాపెట్టి డేటా చౌర్యం చేస్తోందన్న ఆరోపణలపై కేంద్రం ఒక నిపుణుల కమిటీని నియమించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్ నేతృత్వంలో ఈ కమిటీ ఈ ఆరోపణల్లోని నిజానిజాలను నిర్ధారిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment