సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓడిపోయినా సంబురాలు చేసుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అలాగే, మతోన్మాద శక్తులు ఏకమై బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, సోమాజీగూడ జయ గార్డెన్‌లో జరిగిన సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా విసృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సిద్ధాంతపరంగా, కార్యకర్తల ఆధారంగా, ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే పార్టీ బీజేపీ. బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసింది. బీఆర్ అంబేద్కర్‌ను అనేకసార్లు అవమానించింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించాలని కుట్ర చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.
దేశ వ్యతిరేక శక్తులు, తీవ్రవాద శక్తులు చాపకింద నీరులా ఎన్నికల్లో ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా కుతంత్రాలు పన్నారు. మతోన్మాద శక్తులు ఏకమై బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించారు. దేశాన్ని చీల్చడం, దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించడమే వారి ఉద్దేశం. ఎన్నికల్లో ఎంఐఎం తప్పుడు ప్రచారం చేసింది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ నిజస్వరూపం మరోసారి బయటపడుతుంది. లోక్‌సభ జరగకుండా అడ్డుపడటం.. రాజ్యాంగం గురించి అబద్ధాలు ప్రచారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.
గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు కూడా సాధించలేదు. కానీ, రాహుల్ గాంధీ మాత్రం ప్రధాన మంత్రి అయినట్లు ఊహాగానాల్లో తేలిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయి సంబురాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీని దేశ రాజకీయాల్లో మొదటిసారిగా చూస్తున్నాం. ఎన్నికల్లో ఓడిపోయిన అసహనంతో పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అబద్ధాలు, తప్పుడు ఆరోపణలతో విషం చిమ్మారు.
ఎన్నికల్లో పోటీ చేసేది కాంగ్రెస్ పార్టీ. కానీ, బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసింది మజ్లిస్ పార్టీ. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఉగ్రవాదం, కుటుంబ పాలన, అవినీతి పెరిగిపోతుందని దేశ ప్రజలు గ్రహించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో అణచివేసిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్‌లో బాంబుపేలుళ్లతో ప్రజలు వణికిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment