డ్రాగన్ ఆధీనంలో 4 వేల చదరపు కి.మీ. భారత భూభాగం
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ధ్వజం
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో పలు అంశాలపై పదునైన వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చైనా అంశాన్ని ప్రస్తావించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక నేషనల్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం ఆయన పత్రికాసమావేశంలో మాట్లాడారు.
‘‘ 4,000 చదరపు కి.మీ.ల భారత భూభాగంలో చైనా బలగాలు తిష్టవేసిన ఉదంతంలో మోదీ సమర్థవంతంగా వ్యవహరించారా అంటే కాదు అనే చెప్తా. లద్దాఖ్‌లో ఢిల్లీ అంత పరిమాణంలో భూభాగాన్ని చైనా బలగాలు ఆక్రమించాయి. ఇది తీవ్ర వైఫల్యం. ఒక వేళ అమెరికాకు చెందిన 4వేల చదరపు కి.మీ.ల భూభాగాన్ని పొరుగుదేశం ఆక్రమిస్తే అమెరికా ఊరుకుంటుందా? ఎలా స్పందిస్తుంది?. ఈ విషయాన్ని అద్భుతంగా చక్కదిద్దానని అమెరికా అధ్యక్షుడు చేతులు దులిపేసుకుంటాడా?. అందుకే ఈ కోణంలో చూస్తే మోదీ చైనా విషయంలో విఫలమయ్యారు’’అని అన్నారు.
‘‘ అమెరికా– భారత్ సంబంధాల విషయంలో మోదీని సమరి్థస్తా. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో అనుసరించిన విధానాలనే ఇప్పుడు మోదీ కొనసాగిస్తున్నారు. అయితే భారత అంతర్గత అంశాల్లో అమెరికా ప్రమేయాన్ని నేను ఏమాత్రం ఒప్పుకోను. భారత్‌లో ప్రజాస్వామ్యం మెరుగు కోసం దేశీయంగా జరుగుతున్న పోరు ఇండియా సొంత విషయం. దీనిని మేమే పరిష్కరించుకుంటాం’’ అని రాహుల్ అన్నారు.
నిరాధార ఆరోపణలు: రాజ్‌నాథ్
భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న రాహుల్ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పందించారు. ‘‘ లోక్‌సభలో విపక్షనేత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా తప్పుడు, నిరాధార, అబద్దపు వ్యాఖ్యానాలు చేయడం నిజంగా సిగ్గుచేటు. అసంబద్ధంగా మాట్లాడి విదేశీ గడ్డపై భారత పరువు తీస్తున్నారు. గురుద్వారాకు వెళ్లే సిక్కులు తలపాగా ధరించడానికి కూడా పోరాడాల్సి వస్తోందని రాహుల్ సత్యదూరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రేమ దుకాణాలు తెరిచానని చెప్పుకుని తిరిగే రాహుల్ .. అబద్ధాల దుకాణాలు నడుపుతున్నారు’’ అని
రాజ్‌నాథ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment