Indian territory
-
Rahul Gandhi: చైనాను అడ్డుకోలేకపోయారు
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో పలు అంశాలపై పదునైన వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చైనా అంశాన్ని ప్రస్తావించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక నేషనల్ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన పత్రికాసమావేశంలో మాట్లాడారు. ‘‘ 4,000 చదరపు కి.మీ.ల భారత భూభాగంలో చైనా బలగాలు తిష్టవేసిన ఉదంతంలో మోదీ సమర్థవంతంగా వ్యవహరించారా అంటే కాదు అనే చెప్తా. లద్దాఖ్‌లో ఢిల్లీ అంత పరిమాణంలో భూభాగాన్ని చైనా బలగాలు ఆక్రమించాయి. ఇది తీవ్ర వైఫల్యం. ఒక వేళ అమెరికాకు చెందిన 4వేల చదరపు కి.మీ.ల భూభాగాన్ని పొరుగుదేశం ఆక్రమిస్తే అమెరికా ఊరుకుంటుందా? ఎలా స్పందిస్తుంది?. ఈ విషయాన్ని అద్భుతంగా చక్కదిద్దానని అమెరికా అధ్యక్షుడు చేతులు దులిపేసుకుంటాడా?. అందుకే ఈ కోణంలో చూస్తే మోదీ చైనా విషయంలో విఫలమయ్యారు’’అని అన్నారు. ‘‘ అమెరికా– భారత్ సంబంధాల విషయంలో మోదీని సమరి్థస్తా. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో అనుసరించిన విధానాలనే ఇప్పుడు మోదీ కొనసాగిస్తున్నారు. అయితే భారత అంతర్గత అంశాల్లో అమెరికా ప్రమేయాన్ని నేను ఏమాత్రం ఒప్పుకోను. భారత్‌లో ప్రజాస్వామ్యం మెరుగు కోసం దేశీయంగా జరుగుతున్న పోరు ఇండియా సొంత విషయం. దీనిని మేమే పరిష్కరించుకుంటాం’’ అని రాహుల్ అన్నారు. నిరాధార ఆరోపణలు: రాజ్‌నాథ్ భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న రాహుల్ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పందించారు. ‘‘ లోక్‌సభలో విపక్షనేత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా తప్పుడు, నిరాధార, అబద్దపు వ్యాఖ్యానాలు చేయడం నిజంగా సిగ్గుచేటు. అసంబద్ధంగా మాట్లాడి విదేశీ గడ్డపై భారత పరువు తీస్తున్నారు. గురుద్వారాకు వెళ్లే సిక్కులు తలపాగా ధరించడానికి కూడా పోరాడాల్సి వస్తోందని రాహుల్ సత్యదూరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రేమ దుకాణాలు తెరిచానని చెప్పుకుని తిరిగే రాహుల్ .. అబద్ధాల దుకాణాలు నడుపుతున్నారు’’ అనిరాజ్నాథ్ అన్నారు. -
Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
సిమ్లా: చైనా భారత భూబాగాన్ని ఆక్రమించి ఇళ్లు, రోడ్డు నిర్మిస్తోందని, అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నా రు. హిమాచల్‌ప్రదేశ్‌లోని రొహ్రులో శనివారం ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘56 అంగుళాల ఛాతి ఎటుపోయింద’ని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలను, రాజ్యాంగాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందన్నా రు. రాజ్యాంగాన్ని రక్షించకపోతే దాని ద్వారా అందిన ప్రజాస్వామ్యం, హక్కులను లాగేసుకుంటారని అన్నారు. మోదీ ప్రభుత్వం ధనవంతుల కొమ్ముకాస్తుందని, కాంగ్రెస్ పేదల పక్షాన నిలబడుతుందని పేర్కొన్నారు. -
బోర్డర్లో రెచ్చిపోతున్న చైనా.. నివేదికలో పలు సంచలన అంశాలు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద డ్రాగన్ దేశం చైనా రెచ్చిపోతోంది. డ్రాగన్ సైన్యం భారత భూభాగంలోకి క్రమంగా చొచ్చుకొస్తూ సరిహద్దును సైతం మార్చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన డీజీపీల సమావేశంలో చైనా వ్యవహారంపై అధికారులు సమర్పించిన ఓ నివేదికలో పలు సంచలన అంశాలు బహిర్గతమయ్యాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో భారత్–చైనా సైనికుల నడుమ మరిన్ని ఘర్షణలు జరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక కథనాన్ని వెలువరించింది. భారత్–చైనాల మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతలు, నిఘా సంస్థలు సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ‘‘2013–14 తర్వాత రెండు మూడేళ్లకోసారి ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతల తీవ్రత పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సరిహద్దులో ఇరు దేశాలు పోటాపోటీగా సైనిక బలగాలను పెంచుకుంటున్నాయి. చైనా చర్యల వల్ల తూర్పు లద్దాఖ్‌లో భారత్ ఇప్పటికే పలు కీలక గస్తీ పాయింట్లను కోల్పోయింది. చైనా దూకుడును అడ్డుకోవాలంటే సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేయాలి. సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించాలి’’ అని సూచించారు. -
చైనా కొత్త గ్రామాల నిర్మాణం: తొలిసారి పెదవి విప్పిన భారత్
న్యూఢిల్లీ: భారత భూభాగంపై చైనా ఒక కొత్త గ్రామాన్నే నిర్మిస్తోందన్న ప్రచారంపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్ స్పందించారు. అందులో నిజం లేదని తెలిపారు. వాస్తవాధీన రేఖ వద్ద చైనా తన భూభాగంలోనే కొత్త గ్రామాల నిర్మాణం సాగుతున్నట్లు వెల్లడించారు. మన గడ్డపై చైనా అడుగు పెట్టలేదన్నారు. ఆయన గురువారం టైమ్స్ నౌ సదస్సులో మాట్లాడారు. భారత్, చైనా సైనిక బలగాలు సరిహద్దు వద్ద వారికి నిర్దేశించిన ప్రాంతాల్లోనే ఉన్నాయని వెల్లడించారు. భవిష్యత్తు అవసరాల కోసం సైనికులను తరలించడానికి చైనా ప్రభుత్వం వారి భూభాగంలోనే కొత్త గ్రామాలను నిర్మిస్తున్నట్లు తెలుస్తోందని రావత్ పేర్కొన్నారు. ఆక్రమణలను ఒప్పుకోం: భారత్ సరిహద్దు వెంట భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవడాన్ని ఏనాడూ అంగీకరించలేదని భారత్ తాజాగా స్పష్టంచేసింది. సరిహద్దు వెంట పరిస్థితులపై చైనా చేస్తున్న అసంబద్ధ వాదనలతో తాము ఏకీభవించబోమని భారత్ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ తూర్పు సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంబడి చివరి భారత భూభాగంలో కొంత ప్రాంతాన్ని చైనా ఆక్రమించి గ్రామాన్ని నిర్మించిందన్న అమెరికా నివేదికపై భారత్ తొలిసారిగా పెదవి విప్పింది. ఈ అంశాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిది అరిందం బాగ్చీ మాట్లాడారు. ‘ సరిహద్దు వెంట చైనా నిర్మాణ కార్యకలాపాలు జోరందుకున్నాయని మాకు తెలుసు. దశాబ్దాల క్రితం ఆక్రమించిన ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని మాకు సమాచారముంది. అమెరికా నివేదికనూ పరిగణనలోకి తీసుకున్నాం’ అని అరిందం చెప్పారు. ‘ భారత భూభాగాలను ఆక్రమించడాన్ని మేం ఏనాడూ అంగీకరించలేదు. అవి మా ప్రాంతాలేనంటూ చైనా చేసిన వాదనలనూ మేం ఒప్పుకోలేదు. దౌత్య మార్గాల్లో భారత్ తన నిరసనను వ్యక్తంచేసింది’ అని ఆయన స్పష్టంచేశారు. -
చొరబాట్లను అడ్డుకున్న సైన్యం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సరిహద్దు దాటి భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. హాత్‌లంగా ప్రాంతంలోని ఘటనా స్థలం నుంచి భారీస్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు గురువారం సైన్యాధికారి చెప్పారు. హతమైన వారిలో ఒకరు పాకిస్తానీ అని, మిగతా వారి వివరాలు ఇంకా తెలియదని అధికారి పేర్కొన్నారు. ఉరీ సెక్టార్, గోహలన్ ప్రాంతాల్లో చొరబాట్లు జరగొచ్చనే ముందస్తు సమాచారం మేరకు సరిహద్దు వెంట గాలింపు పెంచామని, చివరకు ఇలా ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకున్నామని లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే చెప్పారు. మొత్తం ఆరుగురు చొరబాటుకు ప్రయత్నించారని, నలుగురు సరిహద్దు ఆవలే ఉండిపోయారని, ఇద్దరు సరిహద్దు దాటారని, ఎదురుకాల్పుల్లో మొత్తంగా ముగ్గురు హతమయ్యారని వివరించారు. భారత్‌లో ఉగ్రచర్యల్లో పిస్టళ్లను వాడే కొత్త పంథాను పాక్ అవలంభిస్తోందని కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఈ ఏడాది 97 పిస్టళ్లను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది నిరాయుధులైన పోలీసులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రదాడుల్లో 85 శాతం ఘటనల్లో పిస్టళ్లనే వాడారని ఐజీ పేర్కొన్నారు. షోపియాన్‌లో మరో ఉగ్రవాది.. షోపియాన్ జిల్లాలో కేశ్వా గ్రామంలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో అనాయత్ అష్రాఫ్ అనే ఉగ్రవాది మరణించాడు. అక్రమంగా ఆయుధాలను సమీకరిస్తూ, మాదక ద్రవ్యాల లావాదేవీలు కొనసాగిస్తున్నాడనే పక్కా సమాచారంతో సైన్యం అష్రఫ్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది. లొంగిపోకుండా అష్రఫ్ సైన్యం పైకి కాల్పులు జరిపాడు. దీంతో సైన్యం జరిపిన కాల్పుల్లో అతను మృతిచెందాడు. -
లద్దాఖ్‌లో పట్టుబడ్డ చైనా జవాను
న్యూఢిల్లీ: చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు చెందిన సైనికుడు ఒకరు సోమవారం తూర్పు లద్దాఖ్‌లో భారత సైన్యానికి పట్టుబడ్డాడు. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) దాటి అతడు భారత భూభాగంలోకి ప్రవేశించడం సంచలనం రేపింది. ఈ ఘటనపై భారత సైన్యం స్పందించింది. ‘ఈ నెల 19వ తేదీన తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని డెమ్చోక్ ప్రాంతంలో చైనా సైనికుడొకరు ఎల్ఏసీని దాటి భారత భూభాగంలోకి దారి తప్పి ప్రవేశించాడు. అతడి వద్ద ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా పీఎల్ఏ కార్పొరల్ వాంగ్ య లాంగ్గా తెలిసింది. స్వస్థలం చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లోని షాంగ్జిఝెన్ పట్టణమని తేలింది. దీని వెనుక గూఢచర్యం ఉన్నట్లు భావించడం లేదు’ అని భారత ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘పర్వతమయమైన ఈ ప్రాంతంలో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య దారితప్పి వచ్చిన అతడికి ఆక్సిజన్, ఆహారంతోపాటు చలి నుంచి రక్షణ కల్పించే దుస్తులు అందించాం. తప్పిపోయిన తమ సైనికుడి ఆచూకీ కోసం పీఎల్ఏ నుంచి ఒక వినతి అందింది’అని భారత ఆర్మీ వెల్లడించింది. చైనాతో ఉన్న అవగాహనను అనుసరించి ఇతర లాంఛనాలన్నీ పూర్తయ్యాక చుషుల్–మోల్డో ప్రాంతంలో అతడిని తిరిగి చైనా సైనిక అధికారులకు అప్పగిస్తామని భారత సైన్యం స్పష్టం చేసింది. ‘భారత్–చైనా సరిహద్దులు దాటి భారత్‌లోకి అతడు ఎలా రాగలిగాడనే విషయం రాబట్టేందుకు అధికారులు ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం నాటికి అతడిని తిరిగి వెనక్కు పంపించే అవకాశాలున్నాయి’అని పేర్కొంది. భారత్, చైనాలు ఈ విషయంలో సంప్రదింపులు జరుపుతున్నాయని, పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాయని చైనా అధికార గ్లోబల్ టైమ్స్ తెలిపింది. సరిహద్దుల్లో ఇది మరో వివాదానికి తెరతీయబోదనీ, ఈ అంశం పరిష్కారం మరిన్ని ద్వైపాక్షిక చర్చలకు మార్గం సుగమం చేస్తుందని వ్యాఖ్యానించింది. పీఎల్ఏలో కార్పొరల్ హోదా భారత ఆర్మీలో నాయక్ స్థాయికి సమానం. కాగా, తూర్పు లద్దాఖ్‌లో ఎల్ఏసీ వెంట ఆరు నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. చైనాలో భాగంగా జమ్మూకశ్మీర్! జమ్మూకశ్మీర్ చైనాలో భాగం అంటూ ట్విట్టర్ చూపడం వివాదాస్పదంగా మారింది. ఈ పొరపాటును వెంటనే సరిచేసినట్లు ట్విట్టర్ చెబుతున్నప్పటికీ జమ్మూకశ్మీర్‌ను భారత్‌కు చెందినట్లు చూపకపోవడం, లేహ్ ప్రాంతాన్ని కశ్మీర్లో అంతర్భాగంగా పేర్కొనడం కొనసాగు తోందని నిపుణులు అంటున్నారు. జాతీయ భద్రతా వ్యవహారాల విశ్లేషకుడు నితిన్ గోఖలే ఆదివారం లేహ్‌లోని హాల్ ఆఫ్ ఫేంను గురించి ట్విట్టర్లో ఒక వీడియో పోస్టు చేశారు. అందులో లేహ్‌ను జమ్మూకశ్మీర్‌కు చెందినట్లు, జమ్మూకశ్మీర్ చైనాలో ఉన్నట్లు చూపుతోంది. సాంకేతిక లోపాల కారణంగా ఇలా జరిగిందని ట్విట్టర్ ఇండియా ప్రతినిధి చెప్పారు. -
423 మీటర్లు భారత భూభాగంలోకి..
న్యూఢిల్లీ: చైనా చెప్పేదొకటి, చేసేదొకటి అన్నదానికి రోజు కొక సాక్ష్యం వెలుగులోకి వస్తూనే ఉంది. లద్దాఖ్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయ సమీపంలో చైనా సైన్యం 423 మీటర్ల మేరకు భారత భూభాగంలోకి వచ్చినట్టుగా ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెల్లడవుతోంది. జూన్ 25 నాడు తీసిన చిత్రాల్లో మొత్తం చైనాకు చెందిన 16 టెంట్లు , మరో అతి పెద్ద శిబిరం, 14 వాహనాలు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చినట్టుగా జాతీయ మీడియా ప్రసారం చేసిన ఫోటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. 1960–61లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రచురించిన ఒక డాక్యుమెంట్ ప్రకారం సరిహద్దుల్లో ఎవరి భూభాగం ఎంతవరకో అన్నది ఒక స్పష్టమైన వివరణ ఉంది. ఇరుదేశాలు సరిహద్దు భూభాగాలపై ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత రూపొందించిన డాక్యుమెంట్ ఇది. కానీ చైనా ఆ ఒప్పందాన్ని తుంగలోకి తొక్కింది. గల్వాన్ నదికి ఉత్తరంగా భారత్ భూభాగాన్ని 423 మీటర్ల మేరకు ఆక్రమించుకొని చైనా దళం తిష్టవేసుకొని కూర్చుంది. -
భారత్-నేపాల్ వివాదం.. కీలక పరిణామం
న్యూఢిల్లీ: భారత్-నేపాల్ సరిహద్దు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆ దేశ పార్లమెంట్లో ఎగువసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత భూభాగంలోని ఈ మూడు ప్రాంతాలను తమ మ్యాప్‌లో పేర్కొన్న రాజ్యాంగ సవరణ బిల్లును రెండు రోజుల క్రితమే దిగువ సభ ఏకగీవ్రంగా ఆమోదించిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ, లిపులేఖ్, లింపియధురలు తమ ప్రాంతాలేనంటూ నేపాల్ వాదించడంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం ముదురుతుంది. ఈ క్రమంలో బిల్లును ఎగువసభలో ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ పుర్ణ చంద్ర థాపా.. కాలాపానీ సమీపంలోని చాంగ్రూలో ఏర్పాటు చేసిన కొత్త భద్రతా పోస్టును బుధవారం పరిశీలించారు. ఆయనతో పాటు నేపాల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్ (ఏపీఎఫ్)ముఖ్య అధికారి శైలేంద్ర ఖనాల్ కూడా ఉన్నారు. (నేపాల్‌తో వివాదంపై రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు) నేపాల్ ప్రభుత్వం ఏపీఎఫ్ పోస్టును కొత్తగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మే 8న భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మానస సరోవర యాత్రికుల కోసం ఉద్ధేశించిన ధార్చులా-లిపులేఖ్ రోడ్డును ప్రారంభించిన తర్వాత నేపాల్ ఈ ఏపీఎఫ్ పోస్టును ఏర్పాటు చేయడం గమనార్హం. ఉత్తరాఖండ్‌లోని దార్చుల నుంచి లిపులేఖ్ వరకు భారత ప్రభుత్వం నిర్మిస్తున్న 80 కిలోమీటర్ల రోడ్డుపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే లిపులేఖ్ రహదారిపై నేపాల్ ‘వేరొకరి కోరిక మేరకు’ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుందని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే పరోక్షంగా చైనానుద్దేశించి పేర్కొన్నారు. తీవ్రంగా వ్యతిరేకించిన భారత్ ఈ వివాదస్పద బిల్లును భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను తమ భూభాగాలుగా చెప్పడానికి నేపాల్ వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొంది. కృత్రిమంగా భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శించింది. సరిహద్దు అంశాలపై చర్చించేందుకు ముందుగా కుదిరిన అవగాహనను కూడా ఉల్లంఘించిందని భారత్ మండిపడింది. (ద్వైపాక్షిక బంధంపై తీవ్ర ప్రభావం) -
నేపాల్ కొత్త మ్యాప్ : ఆ మూడూ మావే
కఠ్మాండు: భారత్‌లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలు తమకే చెందుతాయంటూ ఇటీవల వాదనలు ప్రారంభించిన నేపాల్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆ దేశ పార్లమెంట్లో దిగువసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌ను సవరిస్తూ ప్రభుత్వం శనివారం దిగువసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా పార్టీ–నేపాల్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కూడా మద్దతు తెలిపాయి. సభకు హాజరైన 258 మంది సభ్యులూ ఈ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ‘ఈ సవరణను మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మెజారిటీతో సభ ఆమోదించింది’అని స్పీకర్ అగ్ని సప్కోటే ప్రకటించారు. ఈ బిల్లు నేషనల్ అసెంబ్లీకి వెళుతుంది. ఆమోదం అనంతరం అక్కడి నుంచి అధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారుతుంది. ఆ మేరకు రాజ్యాంగంలో సవరణలు జరుగుతాయి. దీనిద్వారా నేపాల్ జాతీయ చిహ్నంలోని దేశ రాజకీయ మ్యాప్‌లో మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని అధికార పత్రాల్లో ఈ మ్యాప్ ఉంటుంది. కాగా, నేపాల్ చర్యను భారత్ శనివారం తీవ్రంగా ఖండించింది. నేపాల్ కృత్రిమంగా తమ భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించింది. ‘ఇది చారిత్రక సందర్భం. రాచరిక పాలనలో పోగొట్టుకున్న భూమిని ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పొందబోతున్నాం. ఈ విషయంలో దక్షిణ సరిహద్దులోని పొరుగుదేశంతో శత్రుత్వం కోరుకోవడం లేదు. ఎంతోకాలంగా కొనసాగుతున్న ఈ వివాదం దౌత్యపరమైన సంభాషణలు, చర్చల ద్వారా పరిష్కారమవుతుంది’అని అధికార ఎన్సీపీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ విశ్వాసం వ్యక్తం చేశారు. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా మాట్లాడుతూ.. ‘జాతి సమగ్రత, జాతీయత అంశాల్లో నేపాల్ ప్రజలు ఐక్యంగా నిలుస్తారు. 1816లో జరిగిన సుగాలీ ఒప్పందం ప్రకారం..మహాకాళి నదికి తూర్పు భాగం నేపాల్‌కే చెందుతుంది’అని పేర్కొన్నారు. ఈ మూడు ప్రాంతాలు నేపాల్‌కే చెందుతాయని, వాటిని భారత్ నుంచి పొందుతామని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి అన్నారు. ఆధారాల్లేవన్న ప్రతిపక్ష నేత కాలాపానీ సహా ఇతర ప్రాంతాలు నేపాల్‌కే చెందుతాయనేందుకు ఎలాంటి రుజువులు లేవని జనతా సమాజ్‌వాదీ పార్టీ సరితా గిరి అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు సవరణలు ప్రతిపాదించారు. ఆ సవరణ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ స్పీకర్ దానిని తిరస్కరించడంతో ఆమె సభ నుంచి వాకౌట్ చేశారు. వివాదం ఎందుకు తలెత్తింది? లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలతో కలిపి 2019 నవంబర్‌లో భారత్ రాజకీయ మ్యాప్ విడుదల చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్‌లోని దార్చులా ప్రాంతాన్ని లిపులేఖ్‌తో కలిపే 80 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మకంగా కీలకమైన రహదారిని మే 18వ తేదీన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. అప్పటి నుంచి నేపాల్ అభ్యంతరాలు మొదలయ్యాయి. అంగీకారయోగ్యం కాదు: భారత్ తమ భూభాగాలను కూడా కలుపుకుంటూ రూపొందించిన రాజకీయ మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్ ఆమోదిం చడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. అవి నేపాల్‌లోని వని చెప్పేందుకు చారిత్రక సత్యాలు, ఆధారాలు లేవని భారత విదేశాంగ శాఖ తెలిపింది. కృత్రిమంగా భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శించింది. సరిహద్దు అంశాలపై చర్చించేందుకు ముందుగా కుదిరిన అవగాహనను కూడా ఉల్లంఘించిందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. ఇతరుల ప్రోద్బలంతోనే నేపాల్ ఇలా వ్యవహరిస్తోందని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే పరోక్షంగా చైనానుద్దేశించి పేర్కొన్నారు.