న్యూఢిల్లీ: భారత్-నేపాల్ సరిహద్దు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆ దేశ పార్లమెంట్‌లో ఎగువసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత భూభాగంలోని ఈ మూడు ప్రాంతాలను తమ మ్యాప్‌లో పేర్కొన్న రాజ్యాంగ సవరణ బిల్లును రెండు రోజుల క్రితమే దిగువ సభ ఏకగీవ్రంగా ఆమోదించిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ, లిపులేఖ్, లింపియధురలు తమ ప్రాంతాలేనంటూ నేపాల్ వాదించడంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం ముదురుతుంది. ఈ క్రమంలో బిల్లును ఎగువసభలో ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ పుర్ణ చంద్ర థాపా.. కాలాపానీ సమీపంలోని చాంగ్రూలో ఏర్పాటు చేసిన కొత్త భద్రతా పోస్టును బుధవారం పరిశీలించారు. ఆయనతో పాటు నేపాల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్ (ఏపీఎఫ్)ముఖ్య అధికారి శైలేంద్ర ఖనాల్ కూడా ఉన్నారు. (నేపాల్‌తో వివాదంపై రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు)
నేపాల్ ప్రభుత్వం ఏపీఎఫ్ పోస్టును కొత్తగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మే 8న భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మానస సరోవర యాత్రికుల కోసం ఉద్ధేశించిన ధార్చులా-లిపులేఖ్ రోడ్డును ప్రారంభించిన తర్వాత నేపాల్ ఈ ఏపీఎఫ్ పోస్టును ఏర్పాటు చేయడం గమనార్హం. ఉత్తరాఖండ్‌లోని దార్చుల నుంచి లిపులేఖ్ వరకు భారత ప్రభుత్వం నిర్మిస్తున్న 80 కిలోమీటర్ల రోడ్డుపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే లిపులేఖ్ రహదారిపై నేపాల్ ‘వేరొకరి కోరిక మేరకు’ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుందని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే పరోక్షంగా చైనానుద్దేశించి పేర్కొన్నారు.
తీవ్రంగా వ్యతిరేకించిన భారత్
ఈ వివాదస్పద బిల్లును భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను తమ భూభాగాలుగా చెప్పడానికి నేపాల్ వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొంది. కృత్రిమంగా భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శించింది. సరిహద్దు అంశాలపై చర్చించేందుకు ముందుగా కుదిరిన అవగాహనను కూడా ఉల్లంఘించిందని భారత్ మండిపడింది. (ద్వైపాక్షిక బంధంపై తీవ్ర ప్రభావం)
Comments
Please login to add a commentAdd a comment