Kalapani
-
ఒళ్లు గగుర్పొడిచే.. ‘అండా సెల్’
సాక్షి, సెంట్రల్ డెస్క్: దేశ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో అండమాన్‌లోని ‘కాలాపానీ’, బర్మా (ప్రస్తుతం మయన్మార్)లో ‘మాండలే’ జైళ్లు చరిత్ర ప్రసిద్ధికెక్కాయి. లోకమాన్య బాలగంగాధర్ తిలక్‌కు నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆరేళ్ల కఠిన కారాగార శిక్ష విధించి బర్మాలోని మాండలే జైలుకు పంపింది. ఒక్కసారి ‘కాలాపానీ’, ‘మాండలే’ జైలులో ప్రవేశిస్తే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అత్యంత దారుణ మైన చావుని మూటగట్టుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఖైదీలకు విధించే శిక్షలు దారుణంగా ఉంటాయి. కాలాపానీ, మాండలే జైళ్ల తరహాలోనే ఇప్పుడు అండా సెల్స్ కూడా చాలా పాపులర్. మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అక్టోబర్ 13న కన్నుమూసిన సంగతి తెలిసిందే.ఆయన నాగపూర్ సెంట్రల్ జైలులో తొమ్మిదేళ్లపాటు జైలుశిక్ష అనుభవించారు. అందులోనూ ‘అండా సెల్’లో అత్యంత కఠినమైన కారాగార శిక్షను ఎదుర్కొన్నారు. ఈయనకు ముందు నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో అబ్దుల్ కరీం తెల్గీ, 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి నిషేధిత ఆయుధాలను అక్రమంగా కలిగి ఉన్నందుకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను అండా సెల్లో ఉంచారు. రోజులో ఉన్న 24 గంటల్లో 22.5 గంటలు అత్యంత కఠిన ఏకాంత నిర్బంధం తప్పదని తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడచక మానదు. ఈ నేపథ్యంలో ఈ అండా సెల్ ఏంటి? ఇది ఎక్కడ ఉంది? ఎలాంటి వారిని ఇందులో ఉంచుతారు? ఇప్పటివరకు ఇందులో ఎవరెవరు శిక్షను అనుభవించారు? అనే అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గుడ్డు ఆకారంలో..⇒ అండా సెల్ అంటే గుడ్డు ఆకారంలో ఉండే నిర్మాణం. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 50్ఠ50 అడుగుల కంపార్ట్మెంట్లుగా విభజితమై ఉంటుంది.⇒ మహారాష్ట్రలోని ఎరవాడ (పుణే), నవీ ముంబైలోని తలోజా, నాగపూర్ సెంట్రల్ జైళ్లలో ఈ అండా సెల్స్ ఉన్నాయి. ఇక్కడే కాకుండా మనదేశంలోని పలు సెంట్రల్ జైళ్లలోనూ ఈ అండా సెల్స్ ఉన్నాయని తెలుస్తోంది. వీటిని ఆయా రాష్ట్రాల ప్రజా పనుల విభాగాలు నిర్మించాయి.⇒ 1990లో పుణేలోని ఎరవాడలో అండా సెల్‌ను నిర్మించారు.⇒అత్యంత కరడు గట్టిన నేరస్తులను, మోస్ట్ వాండెట్ ఉగ్రవాదులను, తీవ్రవాదులను, గ్యాంగ్స్టర్లను. వ్యవస్థీకృత నేరాలు చేసినవారిని ఈ అండా సెల్స్‌లో ఉంచుతారు.⇒ అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్ వద్ద ఆపరేషన్ బ్లూస్టార్‌కు నాయకత్వం వహించిన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ అరుణ్‌కుమార్ వైద్యను హత్య చేసిన ఉగ్రవాదులు హర్జీందర్ సింగ్ జిందా, సుఖ్‌దేవ్ సుఖాలను ఉరితీసే ముందు 1992లో పుణేలోని ఎరవాడలో ఉన్న అండా సెల్లో తొలిసారిగా ఉంచారు.అండా సెల్స్ ఎందుకు?అత్యంత కరడు గట్టిన నేరస్తులను సులువుగా పర్యవేక్షించడానికి, అధిక ప్రమాదం ఉన్న ఖైదీలను సురక్షితంగా ఉంచడానికి ప్రత్యేకంగా ఈ అండా సెల్స్‌ను నిర్మించారు. గుడ్డు ఆకారంలో రెండు భాగాలుగా ఉండే అండా సెల్స్ జైలు అధికారుల పెట్రోలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. వీటిలో అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుంది.ఇనుప కడ్డీలే స్నేహితులు.. ఊచలే తోబుట్టువులుఅండా సెల్స్‌లో రెండు.. బాహ్య, అంతర్గత భద్రతా వలయాలు ఉంటాయి. మిగతా బ్యారక్‌లతో పోలిస్తే అండా సెల్స్‌ను పర్యవేక్షించడానికి ఎక్కువ మంది జైలు అధికారులు ఉంటారు. అండా సెల్లో జైలుశిక్ష అత్యంత దారుణంగా ఉంటుంది. ఇందులో ఖైదీకి ఏకాంత నిర్బంధం ఉంటుంది. రోజులో 22.5 గంటల పాటు ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. ఇనుప కడ్డీలు, జైలు ఊచలు తప్ప మరో మనిషి జాడ కనిపించదు. సెంట్రల్ జైలులో అత్యంత ఒంటరిగా ఉండే సెల్.. అండా సెల్. అందులో ఉండే ఖైదీ అన్ని వైపులా ఇనుప కడ్డీలతో కప్పబడి ఉంటాడు.ఎత్తయిన గోడలే తప్ప కిటికీలు ఉండవు. పచ్చదనం ఏమాత్రం కనిపించదు. ఒక్క మాటలో చెప్పాలంటే గాలి కూడా చొరబడలేని కాంక్రీట్‌తో నిర్మితమై ఉంటుందంటే అతిశయోక్తి కాదు. గదిలో ఉన్న ఖైదీ చుట్టూ కాంక్రీట్‌ను తప్ప మరేమీ చూడలేడు. స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా అందదు. ఖైదీలు ఇతర ఖైదీలను చూడలేరు.. మాట్లాడలేరు. లైబ్రరీ, క్యాంటీన్‌కు వెళ్లే అవకాశం ఉండదు. బాత్రూమ్, టాయిలెట్ కూడా అండా సెల్లోనే అటాచ్డ్గా ఉంటాయి. అండా సెల్ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కుటుంబ సభ్యులతో ములాఖత్ కావడానికి అంతగా అవకాశాలు ఉండవు. ఏ ఖైదీని అండా సెల్‌కు పంపాలనేది ఆ జైలు సూపరింటెండెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. -
ఫేమస్ జైలు మ్యూజియంలు: అండమాన్ సెల్యులార్ జైలులాంటిదే.. మన సికింద్రాబాద్‌లో..
It is not the prisoners who need reformation, it is the prisons జైల్లో ఉన్న ఖైదీలకు కాదు జైలుకే పరివర్తన అవసరం అని అర్థం! ఈ ఆలోచన వచ్చిందంటే తప్పొప్పుల మూలాలు గ్రహించినట్టే.. నాగరికత పరిఢవిల్లినట్టే!! మరి ఒకనాడు కఠిన శిక్షలకు పేరుమోసిన జైళ్లన్నీ ఏం కావాలి? మ్యూజియంలుగా పర్యాటకుల కోసం ముస్తాబవ్వాలి!! అనుకొని ప్రపంచంలోని ఎన్నో దేశాలు తమదగ్గరున్న.. చాలా జైళ్లను మ్యూజియంలుగా మర్చాయి. మన దగ్గర కూడా అండమాన్‌లోని కాలాపానీ జైలునూ మ్యూజియంగా, పర్యాటక కేంద్రంగా మలచారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లోనూ ఓ సెల్యులార్ జైలు ఉంది. పెద్దగా ప్రాచుర్యంలో లేదు.. కాని ప్రాశస్త్యం కలది. దాని గురించి.. దాన్నీ పర్యటనకు పెట్టాలనే అర్జీతో వచ్చిన వ్యాసం ఇది.. చరిత్ర తెలుసుకుందాం.. వర్తమాన అర్జీ గురించి ఆలోచిద్దాం.. ఆ వివరాలు.. భారత స్వాతంత్య్ర పోరాటం 1857 జూలై 17న ఉత్తరాదిన ఎక్కువగా మీరట్, ఢిల్లీ, లక్నో, కాన్పూరు తదితర ప్రాంతాల్లో ప్రారంభమైంది. అదే సమయంలో హైదరాబాద్‌లోని కోఠి సమీపంలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీపై 6,000 మందితో సాయుధ దళాల దాడి జరిగింది. తుర్రేబాజ్ ఖాన్, రాజా మహిపత్ రామ్, మౌల్వీ అల్లావుద్దీన్ తదితరులు నేతృత్వం వహించారు. 1857 జూలై 17, సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అయితే బ్రిటిష్ సేనల ముందు ఎంతటి భీకరపోరాటం చేసినా హైదరాబాద్ సాయుధ దళాలు నిలువలేకపోయాయి. తుర్రేబాజ్ ఖాన్ని పట్టుకుని, బందీని చేసి రెసిడెన్సీ భవనం దగ్గర ఉరితీశారు. అలాగే పట్టుబడిన మౌల్వీ అల్లావుద్దీన్‌ని అండమాన్‌కు పంపారు. అండమాన్ దీవుల్లోనే అతను మరణించాడు. బ్రిటిష్ రెసిడెన్సీపై తిరుగుబాటు చేసిన ఈ మహా నాయకుల జ్ఞాపకార్థం హైదరాబాద్‌లోని కోఠి జంక్షన్లో ఏనుగు తలలతో ఒక రాతి స్మారక చిహ్నాన్నీ ఏర్పాటు చేశారు. కానీ నగరజీవితం దీన్ని గుర్తించేంత తీరికనివ్వట్లేదు జనానికి. ఈ స్మారక స్థూపాన్ని గుర్తించేవారు బహు కొద్దిమందేనని చెప్పాలి. జైలు గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి ఈ కథ చెప్తున్నారేంటీ అని కదా మీ అనుమానం. ఎందుకంటే ఈ కథకు ఆ ఇంట్రడక్షన్‌కు లింక్ ఉంది కనుక. బ్రిటిష్ రెసిడెన్సీపై దాడికి పర్యవసానంగానే 1858లో తిరుమలగిరిలో సెల్యులార్ జైలు నిర్మాణం చేపట్టారు కనుక. బ్రిటన్‌లోని రాణి 2వ ఎలిజెబెత్ అధికార నివాసం ‘‘విండ్సర్ కేజిల్’’ నమూనాలో ఈ జైలును నిర్మించారు. ప్రపంచంలో ఇంకా ఎక్కడా ఈ మాదిరి సెల్యులార్ జైళ్ల నిర్మాణం ఉన్నట్లు ఆధారాలు లేవు. ప్రతి ఒక్కరూ తప్పక చూడాలి సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి చౌరాస్తా నుంచి సైనిక్‌పురికి వెళ్ళే దారిలో సుమారు వంద గజాల దూరంలో ఉంటుందీ జైలు. రోజూ ఆ దారిన వెళ్ళేవారికి ఈ చారిత్రక కట్టడంపైన గాలికి రెపరెపలాడే జాతీయ పతాకం కనిపిస్తుంది కానీ, చాలామందికి ఈ భవనం గురించి బొత్తిగా తెలియదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ భవనం సికింద్రాబాద్‌లోని మిలిటరీ అధికారుల అధీనంలో ఉంది. ఈ జైలుని చూడాలంటే ముందుగా సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరి. అయితే ఆ అధికారులు అందరినీ అనుమతించరు. సుమారు 150 సంవత్సరాల కిందట 1858లో ఈ సెల్యులార్ జైలును కట్టారు. ఇందుకోసం ఆనాడు 4,71,000 రూపాయలను ఖర్చు చేశారు. విశేషమేమంటే, తిరుమలగిరి జైలు నమూనాతో తిరుమలగిరి జైలుకన్నా చిన్న సైజులో, అండమాన్‌లోని కాలాపానీ నిర్మాణం జరిగింది. ఆ వివరాలు ఇక్కడి ప్రాంగణంలో చాలా స్పష్టంగా ఒక ఫలకం మీద రాసున్నాయి. సుమారు 20,344 చదరపు అడుగుల విస్తీర్ణంలో గోతిక్ నిర్మాణ శైలిలో కట్టారు దీన్ని. ఇది ఆకాశం నుంచి చూస్తే, ఏసుక్రీస్తు శిలువ అకారంలో కన్పిస్తుంది. తూర్పు – పడమర, ఉత్తర – దక్షిణ దిక్కుల్లో మూడు అంతస్తుల్లో మొత్తం 75 జైలు గదులను నిర్మించారు. కింది అంతస్తుల్లో 40 గదులున్నాయి. మొదటి అంతస్తులో 35 గదులు వున్నాయి. అంతర్ నిర్మాణం.. జైలు గదుల లోపల గోడకు ఖైదీని గట్టి ఇనుప గొలుసులతో కట్టి ఉంచేలా ఏర్పాటుంది. గదికి మూడు రకాల గట్టి ఇనుప తలుపులున్నాయి. ఖైదీకి తన గదిలో నుంచి బయటకి చూసేందుకు చిన్న కిటికీని అమర్చారు. దీనికీ ఓ ప్రత్యేకత ఉంది. జైలు గదిలోని ఖైదీకి తనకెదురుగా ఉన్నది మాత్రమే కనపడుతుంది. చుట్టుపక్కల ఏముందో, ఏం జరుగుతోందో, ఎవరు ఎటు వెళ్తున్నారో, వస్తున్నారో గమనించడానికి ఏ మాత్రం వీలుండదు. తిరిగి అదే కిటికీని బయట నుంచి చూస్తే, ఆ గదిలోని ప్రతి అంగుళం స్పష్టంగా కనిపిస్తుంది. ఖైదీ ప్రవర్తనను కట్టడి చేయడానికి వీలుగా ఈ కిటికీ నిర్మాణం జరిగిందని చెప్పాలి. ఇదే సెల్యులార్ జైలు నిర్మాణశైలి ప్రత్యేకత అని స్థానిక అధికారులు చెప్పారు. ఇది ఆనాటి బ్రిటిష్ సైన్యాధికారుల కాఠిన్యానికి అద్దం పడుతుంది. ఉరిశిక్ష మూడవ అంతస్తు, ఆ పైభాగాన ఖైదీలకు ఉరిశిక్ష అమలు చేసే ఇనుపకప్పీల ఏర్పాటు ఉంది. ఉరిశిక్ష అమలుకు ముందు ఖైదీకి తన ఇష్ట దైవాన్ని ప్రార్థించే అవకాశం ఇచ్చేవారట. అందుకోసం చిన్న ప్రార్థన మందిరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ గదిలో అన్ని మతాల దేవుళ్ళ చిత్రపటాలు ఉన్నాయి. ఉరితీసే సమయంలో ఇనుపకప్పీలు సక్రమంగా పనిచేయకనో, లేదా మరేదైనా సాంకేతికత కారణం వల్లనో ఉరి గురి తప్పుతుందేమోనని ముందుగానే ఊహించి ఉరికంబం కప్పీల నుంచి సుమారు వంద అడుగుల లోతులో ఒక బావిలాంటి నిర్మాణం చేశారు. ఈ బావిలో పదునైన ఇనుప ఊచలుంచారు. కప్పీల నుంచి ఉరితాడు వదలగానే ఖైదీ ఈ పదునైన ఇనుప ఊచలపై పడి ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రాణాలు వదిలేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఇక్కడ గమనించవచ్చు. అయితే ప్రస్తుతం ఆ ఇనుప ఊచలు ఇక్కడ లేవు. ఉరికంబం యథాప్రకారం సందర్శకులకు కన్పిస్తుంది. ఇక్కడ సుమారుగా 500 మందికి పైగా ఉరిశిక్షను అమలు చేశారని అధికారిక రికార్డులు తెలియజేస్తున్నాయి. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో చాలామంది ఖైదీల్ని ఇక్కడ బందీగా ఉంచారు. ఆపరేషన్ బ్లూస్టార్లోని కొందరు ఖైదీల్ని సైతం ఇక్కడ ఉంచారని, 1994 నుంచి ఈ మిలిటరీ జైలు వినియోగంలో లేదని స్థానిక అధికారులు చెప్పారు. ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీ –125 ఇన్ఫాంట్రీ బెటాలియన్ – ది గార్డు – అధీనంలో ఈ భవన ప్రాంగణం భద్రంగా ఉంది. 1997లో ఇంటాక్ సంస్థ ఈ ప్రాంగణానికి హెరిటేజ్ అవార్డును ప్రకటించింది. గట్టి భద్రత విషయంలో నేటికీ ఏ మాత్రం మార్పు లేదు దీనికి. జైలు శిఖారాగ్రం నుంచి చూస్తే సికింద్రాబాద్ నగర పరిసరాలన్నీ ఆకుపచ్చని చెట్లతో దట్టమైన అడవిలాగా కన్పిస్తాయి. ఈ చరిత్ర గల సెల్యులార్ జైలును స్థానిక సందర్శకులకు అందుబాటులో ఉంచగలిగితే బాగుంటుంది. అండమాన్‌లోని కాలాపానీ నిర్మాణం పూర్తయి నూరేళ్లైన సందర్భంగా కాలాపానీ జైలు ప్రాంగణాన్ని నేషనల్ మ్యూజియంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వేలమంది పర్యాటకులు కాలాపానీని సందర్శిస్తున్నారు. అయితే, తిరుమలగిరిలోని మిలిటరీ జైలు మాత్రం స్థానిక మిలిటరీ అధికారుల ముందుస్తు అనుమతితో, ఆసక్తిగల ఏ కొద్ది మందికో సందర్శించే వీలుంది. ఈ సెల్యులార్ జైలును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే, చారిత్రక పర్యాటక అభిలాషాపరులకి చక్కని అవకాశం కల్పించినట్లవుతుంది. కనీసం ఏడాదిలో ఒక రోజున ముఖ్యంగా జాతీయ పండుగ రోజులైన స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం నాడైనా అనుమతించాలని స్థానికులు కోరుతున్నారు. కాలాపానీ అంటే... హిందీలో కాల్ అంటే కాలము, పానీ అంటే నీరు. అండమాన్‌లో చుట్టూతా సముద్రం కదా. ఈ ప్రాంతానికి వచ్చిన ఖైదీలకు ఇదే చివరి మజిలీ అని ఉద్యమకారుల్ని భయభ్రాంతుల్ని చేయడానికి బ్రిటిష్ వారు కాలాపానీ అని పేరుపెట్టారని చరిత్రకారుల కథనం. అయితే భారత స్వాతంత్య్ర సమరయోధులు, తమ త్యాగనిరతితో కాలాపానీని ఒక మరపురాని మహాతీర్థంగా మలిచారు. అక్కడ గడిపిన ఫ్రీడం ఫైటర్స్ చెప్పిన గాధలు విన్నవారికి వెన్నులోంచి వణుకు వస్తుంది. గానుగలో నూనె గింజలు వేసి, నూనె పట్టాలని, పశువులు కూడా చేయలేనంత పనిని ఖైదీలకు జైలు అధికారులు అప్పగించేవారుట. రాజకీయ ఖైదీలతో అలవికాని పనులు చేయించారు. పరపాలన అంతం కోసం కలలుకంటూ మాటల్లో చెప్పలేని కఠినమైన జీవనం గడిపారు ఆ యోధులు. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టారిక్కడ. అందుకే వీలున్నంత వరకూ ఈ సెల్యులార్ జైలుని ప్రతి ఒక్కరూ తప్పక చూడాలి. అండమాన్‌లోని కాలాపానీని నేషనల్ మ్యూజియంగా ప్రకటించినట్టే. సికిందరాబాద్‌లో వున్న సెల్యులార్ జైలుకి కూడా ప్రభుత్వం ఆ అవకాశం కల్పించాలనేది సగటు నగర ప్రజల ఆకాంక్ష. ఇది అత్యాశేమీ కాదు. దాగ్షై చండీగఢ్‌కు అరవై కిటోమీటర్ల దూరంలో ఉన్న కంటోన్మెంట్ టౌనే దాగ్షై. ఇక్కడున్న జైలు 163 ఏళ్ల నాటిది. ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు శిక్షను అనుభవించారిక్కడ. కఠినకర్మాగారమనే పేరును ఇదీ భరించింది. స్వాతంత్య్రానంతరం 2011 వరకు ఈ జైలు ప్రాంగణం.. దాని చుట్టుపక్కల పరిసరాలూ డంప్ యార్డ్‌గా మారిపోయాయి. ఆ పరిస్థితి చూడలేని దాగ్షై బ్రిగేడ్ కమాండర్ బ్రిగేడియర్ అనంత్ నారాయాణన్ ఈ చారిత్రక స్థలాన్ని మ్యూజియమ్‌గా మార్చాడు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పట్లతో ఉన్న 54 నాలుగు జైలు గదులతో ఒక సెక్షన్‌గా, నాటి పరిస్థితులకు అద్దంపట్టే ఛాయాచిత్రాలతో ఉన్న ప్రాంగణాన్ని మరో సెక్షన్‌గా పర్యటనకోసం తెరిచారు. ఈ మొత్తం జైలులో ఒకే ఒక వీఐపీ సెల్ ఉంది.. చలిమంట కాచుకునే ఫైర్ ప్లేస్, ప్రత్యేకమైన వాష్‌రూమ్‌తో. అందులో మహాత్మాగాంధీ ఉన్నారట. ప్రపంచంలోని ఫేమస్ జైలు మ్యూజియంలు.. కెనడా, ఒంటారియోలోని కింగ్స్టన్ పెనిటెన్షియరీ జైలు మొదలు అమెరికా, ఫిలడెల్ఫియాలోని ఈస్టర్న్ స్టేట్ పెనిటెన్షియరీ జైలు, హాట్ స్ప్రింగ్ డకోటా టెరిటరీ జైలు సహా ఉత్తర అమెరికాలోని మొత్తం ఎనిమిది జైళ్లు మ్యూజియంలుగా మారాయి. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే దేశాల్లో, అలాగే యూరప్‌లోని ఇంగ్లండ్, ఎస్టోనియా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, పోలాండ్, రుమేనియా, రష్యా దేశాల్లో, ఆసియాలోని కంబోడియా, దక్షిణకొరియా, థాయ్‌లాండ్, వియత్నాం, ఆఫ్రికాలోని ఘనా, సెనెగల్, దక్షిణాఫ్రికా, టాంజానియా, అస్ట్రేలియాలోని అస్ట్రేలియా, న్యూజీల్యాండ్ దేశాల్లోని ప్రసిద్ధ జైళ్లనూ మ్యూజియంలుగా మార్చాయి ఆయా దేశాల ప్రభుత్వాలు. అవన్నీ ఇప్పుడు జనాకర్షక పర్యాటక కేంద్రాలుగా అలరారుతున్నాయి. - మల్లాది కృష్ణానంద్ చదవండి: ఒళ్లు నొప్పులా? తక్కువగా అంచనా వేయకండి.. -
ఐక్యరాజ్యసమితికి నేపాల్ కొత్త మ్యాప్
ఖాట్మాండు: గత కొద్ది రోజులుగా భారత్‌కు వ్యతిరేకంగా దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న నేపాల్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ రూపొందించిన నూతన మ్యాప్‌ను.. ఐక్యరాజ్యసమితి, గూగుల్‌కు పంపించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ దేశ మీడియా శనివారం తెలిపింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం మ్యాప్‌ను ఆంగ్లంలో ప్రచురించడంతో పాటు.. ఐక్యరాజ్యసమితి, గూగుల్‌తో సహా అంతర్జాతీయ సమాజానికి పంపడానికి అవసరమైన సన్నాహాలు చేస్తోందని సమాచారం. (నేపాల్ కొత్త మ్యాప్‌కు చట్టబద్ధత) ఈ సందర్భంగా ‘మేము త్వరలో లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలతో ఉన్న మ్యాప్‌ను అంతర్జాతీయ సమాజానికి పంపిస్తాము’ అని నేపాల్ మంత్రి పద్మ ఆర్యాల్ తెలిపారు. అంతేకాక ‘ఆక్రమిత భూభాగాలతో’ అనే పేరుతో ఈ మూడు భూభాగాలకు సంబంధించి ఒక పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా నేపాల్ ప్రభుత్వం సన్నద్ధమవుతోందని పద్మ ఆర్యాల్ తెలిపారు. అయితే, ఈ నూతన మ్యాప్‌ను అంతర్జాతీయ సమాజానికి పంపడమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను తమ దేశ అంతర్భాగంలో చేర్చిన మ్యాప్‌ను జూన్ 13న నేపాల్ పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మూడు ప్రాంతాలు తమకు చెందినవేనని భారత్ స్పష్టం చేసింది. -
నేపాల్ కొత్త మ్యాప్‌కు చట్టబద్ధత
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత్‌లోని వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలను తన భూభాగంలోకి కలుపుతూ నేపాల్ ప్రభుత్వం రూపొందించిన కొత్త మ్యాప్‌కు రాజ్యాంగబద్ధత లభించింది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును గురువారం నేపాల్ పార్లమెంట్ ఆమోదించిన కొన్ని గంటల్లోనే అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ సంతకం చేశారు. సవరణ బిల్లు ఇప్పటికే దిగువసభలో ఆమోదం పొందింది. భారత్‌కు చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియధురా ప్రాంతాలను తమ దేశ భూభాగంలో చూపిస్తూ మేలో నేపాల్ కొత్త మ్యాప్ విడుదల చేయడం తెల్సిందే. భారత్‌తో విభేదాల నేపథ్యంలో నేపాల్ తన సరిహద్దుల్లో కాలాపానీ సమీపాన ఉన్న చంగ్రూ శిబిరాన్ని నేపాల్ ఆధునీకరించింది. దార్చులా జిల్లాలోని ఈ ఔట్ పోస్టులో ఇకపై శీతాకాలంలోనూ ఒక జవాను బందోబస్తు విధులు నిర్వర్తిస్తారు. ఖండించిన భారత్: నేపాల్ ప్రయత్నాలను భారత్ మొదట్నుంచీ వ్యతిరేకిస్తోంది. నేపాల్ కృత్రిమంగా భూభాగాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోందని భారత్ విమర్శించింది. నేపాల్ ప్రయత్నాలను మద్దతు తెలిపేందుకు ఎటువంటి రుజువులు గానీ, చారిత్రక వాస్తవాలు కానీ లేవని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. సరిహద్దుల విషయంలో చర్చలు జరుపుకోవాలని గతంలో కుదిరిన అవగాహనను నేపాల్ ఉల్లంఘించిందని చెప్పారు. -
భారత్-నేపాల్ వివాదం.. కీలక పరిణామం
న్యూఢిల్లీ: భారత్-నేపాల్ సరిహద్దు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆ దేశ పార్లమెంట్లో ఎగువసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత భూభాగంలోని ఈ మూడు ప్రాంతాలను తమ మ్యాప్‌లో పేర్కొన్న రాజ్యాంగ సవరణ బిల్లును రెండు రోజుల క్రితమే దిగువ సభ ఏకగీవ్రంగా ఆమోదించిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ, లిపులేఖ్, లింపియధురలు తమ ప్రాంతాలేనంటూ నేపాల్ వాదించడంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం ముదురుతుంది. ఈ క్రమంలో బిల్లును ఎగువసభలో ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ పుర్ణ చంద్ర థాపా.. కాలాపానీ సమీపంలోని చాంగ్రూలో ఏర్పాటు చేసిన కొత్త భద్రతా పోస్టును బుధవారం పరిశీలించారు. ఆయనతో పాటు నేపాల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్ (ఏపీఎఫ్)ముఖ్య అధికారి శైలేంద్ర ఖనాల్ కూడా ఉన్నారు. (నేపాల్‌తో వివాదంపై రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు) నేపాల్ ప్రభుత్వం ఏపీఎఫ్ పోస్టును కొత్తగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మే 8న భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మానస సరోవర యాత్రికుల కోసం ఉద్ధేశించిన ధార్చులా-లిపులేఖ్ రోడ్డును ప్రారంభించిన తర్వాత నేపాల్ ఈ ఏపీఎఫ్ పోస్టును ఏర్పాటు చేయడం గమనార్హం. ఉత్తరాఖండ్‌లోని దార్చుల నుంచి లిపులేఖ్ వరకు భారత ప్రభుత్వం నిర్మిస్తున్న 80 కిలోమీటర్ల రోడ్డుపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే లిపులేఖ్ రహదారిపై నేపాల్ ‘వేరొకరి కోరిక మేరకు’ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుందని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే పరోక్షంగా చైనానుద్దేశించి పేర్కొన్నారు. తీవ్రంగా వ్యతిరేకించిన భారత్ ఈ వివాదస్పద బిల్లును భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను తమ భూభాగాలుగా చెప్పడానికి నేపాల్ వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొంది. కృత్రిమంగా భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శించింది. సరిహద్దు అంశాలపై చర్చించేందుకు ముందుగా కుదిరిన అవగాహనను కూడా ఉల్లంఘించిందని భారత్ మండిపడింది. (ద్వైపాక్షిక బంధంపై తీవ్ర ప్రభావం) -
నేపాల్ కొత్త మ్యాప్ : ఆ మూడూ మావే
కఠ్మాండు: భారత్‌లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలు తమకే చెందుతాయంటూ ఇటీవల వాదనలు ప్రారంభించిన నేపాల్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆ దేశ పార్లమెంట్లో దిగువసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌ను సవరిస్తూ ప్రభుత్వం శనివారం దిగువసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా పార్టీ–నేపాల్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కూడా మద్దతు తెలిపాయి. సభకు హాజరైన 258 మంది సభ్యులూ ఈ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ‘ఈ సవరణను మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మెజారిటీతో సభ ఆమోదించింది’అని స్పీకర్ అగ్ని సప్కోటే ప్రకటించారు. ఈ బిల్లు నేషనల్ అసెంబ్లీకి వెళుతుంది. ఆమోదం అనంతరం అక్కడి నుంచి అధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారుతుంది. ఆ మేరకు రాజ్యాంగంలో సవరణలు జరుగుతాయి. దీనిద్వారా నేపాల్ జాతీయ చిహ్నంలోని దేశ రాజకీయ మ్యాప్‌లో మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని అధికార పత్రాల్లో ఈ మ్యాప్ ఉంటుంది. కాగా, నేపాల్ చర్యను భారత్ శనివారం తీవ్రంగా ఖండించింది. నేపాల్ కృత్రిమంగా తమ భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించింది. ‘ఇది చారిత్రక సందర్భం. రాచరిక పాలనలో పోగొట్టుకున్న భూమిని ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పొందబోతున్నాం. ఈ విషయంలో దక్షిణ సరిహద్దులోని పొరుగుదేశంతో శత్రుత్వం కోరుకోవడం లేదు. ఎంతోకాలంగా కొనసాగుతున్న ఈ వివాదం దౌత్యపరమైన సంభాషణలు, చర్చల ద్వారా పరిష్కారమవుతుంది’అని అధికార ఎన్సీపీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ విశ్వాసం వ్యక్తం చేశారు. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా మాట్లాడుతూ.. ‘జాతి సమగ్రత, జాతీయత అంశాల్లో నేపాల్ ప్రజలు ఐక్యంగా నిలుస్తారు. 1816లో జరిగిన సుగాలీ ఒప్పందం ప్రకారం..మహాకాళి నదికి తూర్పు భాగం నేపాల్‌కే చెందుతుంది’అని పేర్కొన్నారు. ఈ మూడు ప్రాంతాలు నేపాల్‌కే చెందుతాయని, వాటిని భారత్ నుంచి పొందుతామని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి అన్నారు. ఆధారాల్లేవన్న ప్రతిపక్ష నేత కాలాపానీ సహా ఇతర ప్రాంతాలు నేపాల్‌కే చెందుతాయనేందుకు ఎలాంటి రుజువులు లేవని జనతా సమాజ్‌వాదీ పార్టీ సరితా గిరి అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు సవరణలు ప్రతిపాదించారు. ఆ సవరణ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ స్పీకర్ దానిని తిరస్కరించడంతో ఆమె సభ నుంచి వాకౌట్ చేశారు. వివాదం ఎందుకు తలెత్తింది? లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలతో కలిపి 2019 నవంబర్‌లో భారత్ రాజకీయ మ్యాప్ విడుదల చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్‌లోని దార్చులా ప్రాంతాన్ని లిపులేఖ్‌తో కలిపే 80 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మకంగా కీలకమైన రహదారిని మే 18వ తేదీన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. అప్పటి నుంచి నేపాల్ అభ్యంతరాలు మొదలయ్యాయి. అంగీకారయోగ్యం కాదు: భారత్ తమ భూభాగాలను కూడా కలుపుకుంటూ రూపొందించిన రాజకీయ మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్ ఆమోదిం చడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. అవి నేపాల్‌లోని వని చెప్పేందుకు చారిత్రక సత్యాలు, ఆధారాలు లేవని భారత విదేశాంగ శాఖ తెలిపింది. కృత్రిమంగా భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శించింది. సరిహద్దు అంశాలపై చర్చించేందుకు ముందుగా కుదిరిన అవగాహనను కూడా ఉల్లంఘించిందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. ఇతరుల ప్రోద్బలంతోనే నేపాల్ ఇలా వ్యవహరిస్తోందని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే పరోక్షంగా చైనానుద్దేశించి పేర్కొన్నారు. -
‘సరిహద్దుల్లో అంతా అదుపులోనే ఉంది’
న్యూఢిల్లీ: చైనాతో ఉన్న మన సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే తెలిపారు. చైనాతో కార్ప్స్ కమాండర్ స్థాయిలో శాంతి చర్చలు జరిగాయని, ఆ తర్వాత స్థానిక స్థాయి కమాండర్లతోనూ మీటింగ్‌లు జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఇవాళ డెహ్రాడూన్‌లో జరిగిన ఆర్మీ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న ఎమ్ఎమ్ నారావనే మీడియాతో మాట్లాడారు. నిరాటంకంగా చర్చలు నిర్వహించడం వల్ల చైనాతో సమస్య సద్దుమణిగే అవకాశం ఉందన్నారు. అలానే ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ ప్రాంతంపై నేపాల్‌తో ఇటీవల జరిగిన సరిహద్దు వివాదాల గురించి ఆయన మాట్లాడుతూ... ‘మనకు నేపాల్‌తో చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి. భౌగోళిక, సాంస్కృతిక, చారిత్రక, మత సంబంధాలు ఉన్నాయి. నేపాల్-భారత్ ప్రజల మధ్య మంచి బంధం ఉంది. ఆ దేశ ప్రజలతో మా సంబంధం ఇప్పుడు, ఎల్లప్పుడూ బలంగానే ఉంటుంది’ అన్నారు.(కాలాపానీ కహానీ) నివేదికల ప్రకారం, గల్వాన్ వ్యాలీ, పాంగోంగ్ త్సోలోని ఎల్ఏసీ భారత సరిహద్దు వైపు అధిక సంఖ్యలో చైనా దళాలు శిబిరాలు ఏర్పాటు చేశాయి. తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఐసి) వెంబడి అనేక ప్రాంతాల్లో భారత్, చైనా దళాల మధ్య నెల రోజులుగా భీకర పోరటాలు జరుగుతున్నాయి. వివాదాన్ని పరిష్కరించడానికి ఇరు దేశాలు సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. గల్వాన్ వ్యాలీలోని డార్బుక్-షాయోక్-దౌలత్ బేగ్ ఓల్డీ రహదారిని అనుసంధానించే మరో రహదారిని నిర్మించడంతో పాటు.. పాంగోంగ్ త్సో సరస్సు ప్రాంతంలో భారత్ మరో కీలక రహదారిని నిర్మిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలని చైనా వ్యతిరేకిస్తుంది. అలానే భారతదేశానికి ఆమోదయోగ్యం కాని ఫింగర్ ప్రాంతంలో చైనా కూడా రహదారిని నిర్మించింది. (‘భారత్ చర్యలతో.. సంబంధాలు సంక్లిష్టం’) 3,488 కిలోమీటర్ల పొడవైన ఎల్ఏసీ వెంబడి భారతదేశం-చైనా సరిహద్దు వివాదం ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌లో భాగంగా చైనా పేర్కొంటుండగా, భారత్ వ్యతిరేకిస్తోంది. సరిహద్దు సమస్యకు సంబంధించి అంతిమ పరిష్కారం ఇంకా పెండింగ్‌లో ఉన్నందున.. సరిహద్దు ప్రాంతంలో ఇరు పక్షాలు శాంతితో మెలగాలని కోరుకుంటున్నారు. -
కాలాపానీ కహానీ
కైలాస్ సరోవరం యాత్రికులకోసం నిర్మించిన 22కిలోమీటర్ల నూతనరోడ్డు మార్గాన్ని మే 8నాడు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ‘ఈ మార్గం సరిహద్దు భద్రతాదళాలకు, గ్రామాలకు ఉపయోగకారిగా ఉంటుందని’ ట్వీట్ చేశారు. చైనా సరిహద్దు వరకు నిర్మించిన ఈ నూతనమార్గం జార్ఖాండ్ రాష్ట్రంలోని డార్చులాలో ప్రారంభమై తూర్పు చిట్టచివరి పైభాగంలో 17,060 అడుగుల ఎత్తున ఉన్న లిపూలేక్ పాస్ వరకు ఉంది. 75 కిలోమీటర్ల వరకూ జీపులో ప్రయాణించి (5కి.మీ. సరిహద్డు వరకు), ఐదు రోజుల ట్రెక్కింగును రెండు రోజుల్లో ముగించి రానుపోనూ ఆరు రోజుల ప్రయాణాన్ని కుదించవచ్చును. జార్ఖండ్ తూర్పుచివర ఈ మార్గం ‘కాలాపాని’ ప్రాంతం గుండా వెళ్తుంది. కాలీనది పరివాహక ప్రాంతంగనుక కాలాపానీ ప్రాంతమైంది. మూడుదేశాల సరిహద్దుల కూడలిలో 37,000 హెక్టార్ట విస్తీర్ణంగల కాలాపాని ప్రాంతం భారత్(ఉత్తరాఖండ్‌లో పాధోరాఘర్ జిల్లా), నేపాల్(ధార్చులా జిల్లా) చైనా(స్వయంప్రతిపత్తిగల టిబెట్ ప్రాంతం)లమధ్య ఉన్నది. ఈ ముక్కోణాన్ని లింపియాధురా, కాలాపానీ, లిపూలేక్ ప్రాంతమని అంటారు. కేంద్ర ప్రభుత్వం జమ్మూ, కశ్మీర్, లదాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన తర్వాత నూతన రాజకీయపటం గీసి కాలాపానీ ప్రాంతాన్ని మన దేశపటంలో చూపించారు. నేపాల్ నుండి నిరసన వ్యక్తమైంది, కాలాపానీ తమదని నేపాల్ వాదన. నేపాల్ నూతన రాజకీయపటాన్ని ఆవిష్కరిస్తూ మంత్రి పద్మా ఆర్యాల్ చరిత్రకు అనుకూలమైనదిగా వర్ణించారు. మన దేశంలోని కొన్ని ప్రాంతాలు ఆ పటంలో ఉండటంతో ‘ఈ ఏకపక్ష నిర్ణయం చారిత్రక ఆధారాలు, నిరూపణలు లేనిదని, కృత్రిమమైనదని’ మన విదేశాంగమంత్రిత్వశాఖ విమర్శించింది. నేపాల్ నూతన పటానికి తొలుత ప్రధాని ఓలీకి సహకరించని ప్రధాన ప్రతిపక్షపార్టీ నేపాలీ కాంగ్రెస్ ఇప్పుడు నూతన నేపాలి పటం మార్పుకు సహకరిస్తానంది. 1997లో మన దేశం చైనాతో మానస సరోవర యాత్రామార్గ ఒప్పందాన్ని చేసుకొన్నప్పటినుండి, భారత్–నేపాల్ సరిహద్దులోనున్న లిపూలేక్ ప్రాంతం వివాదాస్పదమైంది. 1954లో ఇండోసైనో ఒప్పందంలో లిపూలేక్ను భారతదేశ ముఖద్వారంగా పేర్కొన్నారు. వాణిజ్యానికి, భక్తులకు మార్గంగా నిల్చిన లిపూలేక్ పాస్ 1962 ఇండోసైనో యుద్ధసమయాన మూసివేసారు. తిరిగి 2015లో లిపూలేక్గుండా వాణిజ్యం జరుపుకోటానికి చైనా, భారత్ ఒప్పు కొన్నాయి. గుంజి గ్రామంనుండి లిపూలేక్ ప్రారంభమవుతుంది. ఈ గ్రామంతోపాటు, రహదారి ప్రాంతమంతా తమదేనని నేపాల్ వాదన. కాలీనది సరిహద్దు ఇదిమిత్తంగా నిర్ణయించబడలేదని, నదీప్రవాహంలో కాలక్రమేణా అనేకమార్పులు రావటంతో కాలీ పశ్చిమ సరిహద్దు గుర్తించటం కష్టమైందని అనేక పటాల రూపకర్తలు చెబుతుండగా, వ్యూహాత్మకంగా కాలీనది తూర్పు సరిహద్దునే నేపాల్‌కు పరిమితం చేసారని కొందరు బ్రిటిష్ పట రూపకర్తలు అంటున్నారని వికీమీడియా కామన్స్ రాసింది. ఇదిలా ఉండగా హిమాలయాల్లో అనేక ఉపనదులున్న కాలీనది జన్మస్థానమే ప్రశ్నార్ధకంగా ఉంది. కాలాపానీ సమీపంలో పుట్టిం దని మనమంటుంటే, ఈ నది జన్మస్థలం లింపియాధురా కొండప్రాంతమని అక్కడినుండి తూర్పు ప్రాంతమంతా తమదని నేపాల్ వాదన. సరిహద్దుల్ని నిర్ణయించిన ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్రకన్నా భారత్, నేపాల్, చైనా సంబంధాలు వేల సంవత్సరాల పురాతనమైనవి. క్రీ.పూ. రెండు వేల సంవత్సరాల క్రితమే మనం ఈ మార్గంగుండా వర్తక,వాణిజ్యాలను చేసుకొన్నాం. బౌద్ధులు, హిందువులు లిపూలేక్ పాస్‌గుండా పయనించేవారని చరిత్ర చెబుతుంది. 1962 చైనాతో యుద్ధసమయాన కాలాపానీ ప్రాంత మంతా మన సైనికదళాలుండేవి. 1962 నుండి 1997వరకు ఈ ప్రాంత వూసేఎత్తని నేపాల్, చైనాతో మానసరోవరమార్గ ఒప్పందం తర్వాతనే తన ధోరణిని మార్చుకొంది. బహుశా ఆ ఒప్పందంలో నేపాల్‌ను భాగస్వామ్యం చేయకపోవటం మన వ్యూహాత్మక తప్పిదమేమో. నేపాల్‌కు మనకు మధ్య సంబంధాలు భౌగోళిక, చారిత్రక, సాంస్కతిక, ఆర్ధికపరమైనవి. దేశ భద్రతకు వ్యూహాత్మకంగా నేపాల్ మనకు సహాయపడుతుంది. కావల్సిన ఆయుధ సామాగ్రి మనమే సరఫరా చేస్తున్నాము. ఇంతటి ప్రాముఖ్యతకల్గిన ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను మన విదేశాంగశాఖ దౌత్యనీతితో పరిష్కరిస్తుందని అందరూ విశ్వసిస్తున్నారు. బుడ్డిగ జమిందార్ ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యుడు సెల్: 9849491969 -
యుద్ధానికి మా ఆర్మీ సిద్ధం: నేపాల్ మంత్రి
ఖాట్మండూ: భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే నేపాలీ గూర్ఖాల మనోభావాలను గాయపరిచారని నేపాల్ రక్షణ శాఖా మంత్రి ఈశ్వర్ పోఖ్రేల్ విచారం వ్యక్తం చేశారు. భారత్ రక్షణ కోసం ఎన్నెన్నో త్యాగాలు చేసిన నేపాలీ సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడారని.. ఆయన వ్యాఖ్యల వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని విమర్శించారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య నెలకొన్న వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే.. నేపాల్ వేరొకరి తరఫున వకాల్తా పుచ్చుకుని భారత్ పట్ల నిరసన వైఖరి ప్రదర్శిస్నుత్నట్లు కనిపిస్తుందన్నారు. భారత్‌తో చైనా ప్రచ్చన్న యుద్ధంలో భాగంగా డ్రాగన్‌కు నేపాల్ అనుకూలంగా వ్యవహరిస్తోందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే నేపాల్ సైన్యం రంగంలోకి దిగాలే తప్ప వేరొకరిపై ఆధారపడకూడదని విమర్శించారు.(నేపాల్ దూకుడుకు భారత్ గట్టి కౌంటర్) ఈ విషయంపై స్పందించిన ఈశ్వర్ పోఖ్రేల్ సోమవారం మాట్లాడుతూ.. ‘‘భారత్‌ను రక్షించేందుకు తమ జీవితాలను అర్పించిన నేపాలీ గూర్ఖా సైన్యం మనోభావాలను భారత ఆర్మీ చీఫ్ కించపరిచారు. గూర్ఖా బలగాలకు ఎదురుగా నిలబడటం ఇప్పుడు వారికి కష్టతరంగా మారినట్టుంది’’అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా సమయం వచ్చినపుడు నేపాల్ సైన్యం ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు. ‘‘మా రాజ్యాంగాన్ని అనుసరించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం యుద్ధం చేయాల్సి వస్తే నేపాల్ ఆర్మీ ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉంటుంది. కీలక సమయాల్లో తన వంతు పాత్ర తప్పక పోషించి తీరుతుంది. అయితే కాలాపానీ వివాదానికి పరిష్కారం కనుగొనేందుకు దౌత్యపరమైన చర్చలకే నేపాల్ మొగ్గుచూపుతుంది’’ అని ఈశ్వర్ పోఖ్రేల్ స్పష్టం చేశారు. (భారత్‌పై నేపాల్ అభ్యంతరం.. చైనా ప్రమేయం!) చిచ్చురేపుతున్న నేపాల్! -
చిచ్చురేపుతున్న నేపాల్!
మిత్ర దేశాల మధ్య చిచ్చు రేగింది. భారత్, నేపాల్ సరిహద్దు వివాదం... సరికొత్త మలుపులు తిరుగుతోంది. నేపాల్ కొత్త మ్యాపుతో మంట రేగుతోంది. ఏమిటీ వివాదం ? ఎందుకు ముదురుతోంది ? వివాదం మొదలైంది ఇలా ... జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చూపిస్తూ గత ఏడాది నవంబర్‌లో భారత్ ఒక మ్యాప్ విడుదల చేసింది. అందులో కాలాపానీ ప్రాంతాన్ని ఉత్తరాఖండ్ భూభాగంలో ఉన్నట్టుగానే చూపించింది. అప్పట్లోనే నేపాల్‌లో అక్కడక్కడా నిరసన స్వరాలు వినిపించాయి. ఆ తర్వాత మానససరోవర్‌కు వెళ్లే యాత్రికుల ప్రయాణ దూరాన్ని తగ్గించడానికి లిఫులేఖ్ ప్రాంతంలో నిర్మించిన 80.కి.మీ. రహదారిని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నెల 8న ప్రారంభించారు. దీంతో నేపాల్ ఒక్కసారిగా కస్సుమంది. లిఫులేఖ్, కాలాపానీ, లింపియాథురా ప్రాంతాలను తమ దేశ భూభాగంగా చూపిస్తూ కొత్త దేశ పటాన్ని విడుదల చేసింది. దానికి రాజ్యాంగబద్ధతను తీసుకురావడానికి పార్లమెంటులో తీర్మానం కూడా చేసింది. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతాలు తమవేనని నేపాల్‌కు స్పష్టం చేసింది. ఫలితంగా ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నేపాల్ బుసల వెనుక డ్రాగన్ ? నేపాల్‌కు ఏ చిన్న కష్టమొచ్చినా నేనున్నానంటూ భారత్ ఆదుకుంటుంది. ఎన్నో అంశాల్లో నేపాల్ భారత్‌పైనే ఆధారపడి ఉంది. కానీ ఈ మధ్య కాలంలో నేపాల్ చీటికీ మాటికీ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్ నుంచి వచ్చిన వారితో విస్తరించిన కరోనా వైరస్ చైనా కంటే డేంజర్ అంటూ నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పడు సరిహద్దు వివాదానికి తెరతీశారు. దీని వెనుక చైనా హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి. నేపాల్ ప్రధానమంత్రి ఓలి ఏకపక్ష నిర్ణయాలతో అక్కడ రాజకీయ సంక్షోభం తీవ్రతరమైంది.. ఓలి రాజీనామా చేయాలని ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) డిమాండ్ చేసింది. ఆ సమయంలో చైనా ఓలికి అండగా నిలబడింది. నేపాల్‌లో చైనా రాయబారి ఆ పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించినట్టుగా కథనాలు వచ్చాయి. ప్రతిఫలంగా ఓలి చైనాకు కొమ్ముకాస్తూ భారత్ రక్షణని ప్రమాదంలో పడేసే నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కోవిడ్–19ని అరికట్టడంలో వైఫల్యం, పార్టీలోనూ, ప్రజల్లోనూ పట్టు కోల్పోతున్న ఓలి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి కాలాపానీ అంశాన్ని పెద్దది చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాలాపానీ చరిత్రలోకి వెళితే ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్ జిల్లాలో నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతమే కాలాపానీ. సముద్రమట్టానికి 3,600 మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది. 35 చదరపు కిలో మీటర్లు ఉండే ఈ ప్రాంతం మహాకాలీ నది జన్మస్థావరం. ఎప్పట్నుంచో ఇది భారత్‌లో అంతర్భాగంగానే ఉంది. ఈ మార్గం ద్వారానే భారతీయ యాత్రికులు అత్యంత సాహసోపేతమైన మానస సరోవర్ యాత్రకి వెళతారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో భారత్ అక్కడ 18 సైనిక శిబిరాల్ని ఏర్పాటు చేసింది. 1969లో నేపాల్‌తో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంతో కాలాపానీలో మినహా మిగిలిన సైనిక శిబిరాలన్నీ తొలగించింది. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలపై నిఘా పెట్టాలంటే కాలాపానీ ప్రాంతంలో సైనిక శిబిరం అత్యంత ముఖ్యం. అయితే కాలాపానీ ప్రాంతం తమదేనని నేపాల్ వాదిస్తోంది. నేపాల్‌కు, ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య 1816లో జరిగిన సుగౌలీ ఒప్పందం ప్రకారం కాలీ నది నేపాల్‌లో ప్రవహిస్తోందని చెప్పారని, ఆ నది పుట్టిన భూభాగం తమదేనన్నది ఆ దేశం వాదన. దేశ పటాన్ని మార్చడంలో నేపాల్ ఏకపక్ష నిర్ణయానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. సరిహద్దు వివాదాలు దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కారమవుతాయన్న భావనకు వ్యతిరేకంగా ఓలి సర్కార్ వ్యవహరిస్తోంది. సరిహద్దు రేఖల్ని తమ ఇష్టారాజ్యంగా మార్చేస్తామంటే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి -
మనీషా కోయిరాలా ట్వీట్‌పై విమర్శలు
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటి, నేపాల్ పౌరురాలు మనీషా కోయిరాలా చేసిన ఓ ట్వీట్ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడంతో ఆమెపై ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను తమ భూభాగంలో చూపించుకుంటూ నేపాల్ మంత్రి పోస్ట్ చేసిన మ్యాప్ ట్వీట్‌ను మనీషా కోయిరాలా రీట్వీట్ చేశారు. ‘మన చిన్న దేశ గౌరవాన్ని నిలబెట్టినందుకు ధన్యవాదాలు. మూడు గొప్ప దేశాల మధ్య చర్చలన్నీ ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో భారత్‌లో ఆమెపై ట్రోల్స్ మొదలయ్యాయి. భారత్ ఆమెకు సినీ జీవితం ప్రసాదిస్తే ఇప్పుడు భారత్ మీదే వివక్ష చూపుతున్నారని, ఆమెను బహిష్కరించాలని ట్రోల్స్ వచ్చాయి. -
కాలాపానీ మాదే.. భారత్ నుంచి తీసుకుంటాం
కఠ్మాండు: లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ఈ మూడు ప్రాంతాలూ తమవేననీ, రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వాటిని భారత్ నుంచి తిరిగి పొందుతామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తెలిపారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను నేపాల్ భూభాగంలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్‌కు ఆ దేశ కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ.. ‘నేపాల్‌కు చెందిన ఈ మూడు ప్రాంతాల్లోనూ సైన్యాన్ని మోహరించి భారత్ వివాదాస్పదంగా మార్చింది. నేపాలీలు అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంది. కాలాపానీలో 1962 నుంచి భారత సైన్యం ఉంది. గత పాలకులు ఈ అంశాన్ని లేవనెత్తడానికి వెనుకంజ వేశారు. వాటిని మేం తిరిగి పొందుతాం’అని తెలిపారు. ఈ మూడు ప్రాంతాలను తమకు అప్పగించాలని భారత్‌ను డిమాండ్ చేస్తూ అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్లో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టింది. ఉత్తరాఖండ్‌లోని ధర్చులా ప్రాంతాన్ని లిపులేఖ్ కనుమతో కలుపుతూ భారత్ రోడ్డు నిర్మించడంపై గత వారం నేపాల్‌లో భారత రాయబారికి నిరసన తెలిపింది. కాలాపానీ, లిపులేఖ్‌లు తమవేనంటూ గత ఏడాది అక్టోబర్‌లో భారత్ మ్యాప్ విడుదల చేయడంతో ఈ వివాదం మొదలైంది. చర్చల ద్వారా ఇరుదేశాలు దీన్ని పరిష్కరించుకోవాలని చైనా పేర్కొంది. -
కశ్మీర్, కాలాపానీల్లోకి మేం వస్తే ఏం చేస్తారు?
డోక్లామ్‌లో ప్రతిష్టంభనపై చైనా వ్యాఖ్య బీజింగ్: చైనా దళాలు, భారత దళాలు డోక్లామ్ నుంచి ఒకేసారి వెనక్కు వెళ్లాలన్న భారత ప్రతిపాదనను చైనా తోసిపుచ్చింది. ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ లేదా కశ్మీర్లోకి తమ దళాలు చొరబడితే భారత్ ఏం చేస్తుందని మంగళవారం వ్యాఖ్యానించింది. చైనా విదేశాంగ శాఖకు చెందిన అధికారిణి వాంగ్ వెన్లీ మాట్లాడుతూ ‘డోక్లాం మూడు దేశాల సరిహద్దు అయినంత మాత్రాన భారత్ అక్కడ రోడ్డు నిర్మాణానికి అడ్డుతగలడం సమంజసం కాదు. భారత్, చైనా, నేపాల్‌లకు కలిపి సరిహద్దుగా ఉన్న కాలాపానీలోనో, భారత్–పాక్ సరిహద్దు అయిన కశ్మీర్లోకో మేం వస్తే ఎలా ఉంటుంది?’ అని అన్నారు. డోక్లామ్‌లో ఒక్క భారతీయ సైనికుడు ఒక్కరోజు ఉన్నా అది తమ సార్వభౌమత్వాన్ని, భూభాగ సమగ్రతను ఉల్లంఘించినట్లేనని ఆమె వ్యాఖ్యానించారు. చైనాలోని భారత విలేకరుల బృందంతో ఆమె మాట్లాడారు. ఇప్పుడు భారత్‌తో చర్చలు జరిపితే తమ ప్రభుత్వం అసమర్థమైనదని ప్రజలు అనుకుంటారనీ, కాబట్టి భారత సైన్యం వెనక్కు వెళ్లే వరకు చర్చలకు ఆస్కారం ఉండదని అధికారిణి పేర్కొన్నారు. భారత్‌తో యుద్ధానికి చైనా సిద్ధమవుతోందా అని ప్రశ్నించగా అది భారత వైఖరిపై ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు. చైనా సంయమనాన్ని పాటిస్తోందని వాంగ్ వెన్లీ పేర్కొన్నారు. డోక్లామ్ ప్రాంతం చైనాదేనని భూటాన్ దేశమే ఒప్పుకుందనీ, చైనా, భారత్ బలగాలు మోహరించిన ప్రాంతం తమది కాదని దౌత్య వర్గాల ద్వారా భూటాన్ చెప్పిందన్నారు. చైనా భూభాగంపైనే భారత సరిహద్దు దళాలు ఉన్నాయనీ, ఈ సమాచారాన్ని భూటాన్ మీడియా, బ్లాగుల ద్వారానే తాము సేకరించామని ఆమె చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలను వాంగ్ వెన్లీ చెప్పలేదు. -
హైదరాబాద్.. కాలపాని
కాలాపానీ.. అందమైన అండమాన్ నికోబార్ దీవుల్లో భయంకరమైన జైలు. నగరంలోనూ కాలాపానీ ఉంది. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి చౌరస్తానుంచి సుమారు వందగజాల దూరంలో ఉందీ జైలు ప్రాంగణం. గాలికి రెపరెపలాడే జాతీయ పతాకంతో అటుగా వెళ్లేవారికి ప్రభుత్వ భవనంలా మాత్రమే కనిపించే ఈ జైలు గురించి.. జనానికి అంతగా తెలియదు. అండమాన్‌లోని కాలాపానీని చూడాలనుకునేవారు ఈ భవనాన్ని సందర్శిస్తే చాలు.. సుమారు 150 సంవత్సరాల క్రితం1858లో ఆనాటి బ్రిటిష్ అధికారులు ఈ సెల్యూలార్ జైలును నిర్మించారు. తప్పుచేసిన బ్రిటిష్ సైనికుల్ని శిక్షించేందుకు సుమారు 20 వేల 344 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ జైలుని నిర్మించారు. ఇదే నమూనాలో, ఈ జైలు కన్నా చిన్న సైజులో కాలాపానీ నిర్మాణం జరగడం విశేషం. ఈ వివరాలు ఇక్కడి ప్రాంగణంలో చాలా స్పష్టంగా ఒక ఫలకంపై రాసి వున్నాయి. గోతిక్ నిర్మాణ శైలిలో వున్న ఈ జైలు పైనుంచి చూస్తే శిలువ ఆకారంలో కన్పిస్తుంది. ప్రత్యేక కిటికీ... జైలు గది లోపల గోడకు గట్టి ఇనుప తాళ్లతో ఖైదీని కట్టి వుంచేలా ఏర్పాటు చేశారు. జైలుగదికి మూడు రకాల ఇనుప తలుపులున్నాయి. గదిలోనుంచి బయటికి చూసేందుకు చిన్న కిటికీని అమర్చారు. ఈ కిటికీకి ఓ ప్రత్యేకత వుంది. జైలు గదిలోని ఖైదీకి తనకెదురుగా ఏముందో అంత మాత్రమే కనపడుతుంది. తిరిగి అదే కిటికీ బయట నుంచి లోపలికి మనం చూస్తే ఆ గదిలోని ప్రతి అంగుళం స్పష్టంగా కనిపిస్తుంది. సెల్యులార్ జైలు నిర్మాణశైలి ఆనాటి బ్రిటిష్ సైన్యాధికాల కాఠిన్యానికి అద్దం పడుతుంది. మూడో అంతస్తులో ఉరి.. మూడో అంతస్తు, ఆ పైభాగాన ఖైదీలకు ఉరిశిక్ష అమలు చేసే ఇనుప కప్పీల ఏర్పాటు ఉంది. శిక్ష అమలుకు ముందు ఖైదీకి తన ఇష్టదైవాన్ని ప్రార్థించడం కోసం చిన్న ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ గదిలో అన్ని మతాల దేవుళ్ల చిత్రపటాలు ఉన్నాయి. ఉరితీసే సమయంలో ఇనుప కప్పీలు సక్రమంగా పనిచేయకనో, లేదా మరేదైనా సాంకేతిక కారణం వల్లనైనా ఉరి గురి తప్పినా వ్యక్తి మరణించేలా సుమారు వంద అడుగుల లోతులో ఒక బావిలాంటి నిర్మాణం చేయడం ఇక్కడ మరో ఆసక్తికర విషయం. సుమారు పదిహేను దశాబ్దాల చరిత్ర పైబడిన ఈ బ్రిటిష్ నిర్మాణం ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదు. జైలు శిఖ రాగ్రం నుంచి చూస్తే సికింద్రాబాద్ నగర పరిసరాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. నూరేళ్ల సందర్భంగా... 2006 మార్చి 10న అండమాన్ నికోబార్దీవుల్లోని కాలాపానీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జైలు ప్రాంగణాన్ని నేషనల్ మ్యూజియంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిత్యం వేలమంది పర్యాటకులు కాలాపానీని సందర్శిస్తున్నారు. ఐతే తిరుమలగిరిలోని మిలిటరీ జైలు మాత్రం అధికారుల ముందస్తు అనుమతితో సందర్శించే వీలుంది. 1997లో ఇంటాక్ సంస్థ ఈ ప్రాంగణానికి హెరిటేజ్ అవార్డును ప్రకటించింది. గొప్ప చారిత్రక వారసత్వ ప్రాధాన్యత గల ఈ సెల్యులార్ జైలుపై రాష్ట్ర పర్యాటక శాఖ తగిన చొరవ చూపి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే బాగుంటుంది. - మల్లాది కృష్ణానంద్