కశ్మీర్, కాలాపానీల్లోకి మేం వస్తే ఏం చేస్తారు?
డోక్లామ్‌లో ప్రతిష్టంభనపై చైనా వ్యాఖ్య
బీజింగ్: చైనా దళాలు, భారత దళాలు డోక్లామ్ నుంచి ఒకేసారి వెనక్కు వెళ్లాలన్న భారత ప్రతిపాదనను చైనా తోసిపుచ్చింది. ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ లేదా కశ్మీర్‌లోకి తమ దళాలు చొరబడితే భారత్ ఏం చేస్తుందని మంగళవారం వ్యాఖ్యానించింది. చైనా విదేశాంగ శాఖకు చెందిన అధికారిణి వాంగ్ వెన్లీ మాట్లాడుతూ ‘డోక్లాం మూడు దేశాల సరిహద్దు అయినంత మాత్రాన భారత్ అక్కడ రోడ్డు నిర్మాణానికి అడ్డుతగలడం సమంజసం కాదు. భారత్, చైనా, నేపాల్‌లకు కలిపి సరిహద్దుగా ఉన్న కాలాపానీలోనో, భారత్–పాక్ సరిహద్దు అయిన కశ్మీర్‌లోకో మేం వస్తే ఎలా ఉంటుంది?’ అని అన్నారు.
డోక్లామ్‌లో ఒక్క భారతీయ సైనికుడు ఒక్కరోజు ఉన్నా అది తమ సార్వభౌమత్వాన్ని, భూభాగ సమగ్రతను ఉల్లంఘించినట్లేనని ఆమె వ్యాఖ్యానించారు. చైనాలోని భారత విలేకరుల బృందంతో ఆమె మాట్లాడారు. ఇప్పుడు భారత్‌తో చర్చలు జరిపితే తమ ప్రభుత్వం అసమర్థమైనదని ప్రజలు అనుకుంటారనీ, కాబట్టి భారత సైన్యం వెనక్కు వెళ్లే వరకు చర్చలకు ఆస్కారం ఉండదని అధికారిణి పేర్కొన్నారు. భారత్‌తో యుద్ధానికి చైనా సిద్ధమవుతోందా అని ప్రశ్నించగా అది భారత వైఖరిపై ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు.
చైనా సంయమనాన్ని పాటిస్తోందని వాంగ్ వెన్లీ పేర్కొన్నారు. డోక్లామ్ ప్రాంతం చైనాదేనని భూటాన్ దేశమే ఒప్పుకుందనీ, చైనా, భారత్ బలగాలు మోహరించిన ప్రాంతం తమది కాదని దౌత్య వర్గాల ద్వారా భూటాన్ చెప్పిందన్నారు. చైనా భూభాగంపైనే భారత సరిహద్దు దళాలు ఉన్నాయనీ, ఈ సమాచారాన్ని భూటాన్ మీడియా, బ్లాగుల ద్వారానే తాము సేకరించామని ఆమె చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలను వాంగ్ వెన్లీ చెప్పలేదు.