రాజ్‌నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించిన రోడ్డు మార్గం
కైలాస్ సరోవరం యాత్రికులకోసం నిర్మించిన 22కిలోమీటర్ల నూతనరోడ్డు మార్గాన్ని మే 8నాడు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ‘ఈ మార్గం సరిహద్దు భద్రతాదళాలకు, గ్రామాలకు ఉపయోగకారిగా ఉంటుందని’ ట్వీట్ చేశారు. చైనా సరిహద్దు వరకు నిర్మించిన ఈ నూతనమార్గం జార్ఖాండ్ రాష్ట్రంలోని డార్చులాలో ప్రారంభమై తూర్పు చిట్టచివరి పైభాగంలో 17,060 అడుగుల ఎత్తున ఉన్న లిపూలేక్ పాస్ వరకు ఉంది. 75 కిలోమీటర్ల వరకూ జీపులో ప్రయాణించి (5కి.మీ. సరిహద్డు వరకు), ఐదు రోజుల ట్రెక్కింగును రెండు రోజుల్లో ముగించి రానుపోనూ ఆరు రోజుల ప్రయాణాన్ని కుదించవచ్చును. జార్ఖండ్ తూర్పుచివర ఈ మార్గం ‘కాలాపాని’ ప్రాంతం గుండా వెళ్తుంది. కాలీనది పరివాహక ప్రాంతంగనుక కాలాపానీ ప్రాంతమైంది.
మూడుదేశాల సరిహద్దుల కూడలిలో 37,000 హెక్టార్ట విస్తీర్ణంగల కాలాపాని ప్రాంతం భారత్(ఉత్తరాఖండ్‌లో పాధోరాఘర్ జిల్లా), నేపాల్(ధార్చులా జిల్లా) చైనా(స్వయంప్రతిపత్తిగల టిబెట్ ప్రాంతం)లమధ్య ఉన్నది. ఈ ముక్కోణాన్ని లింపియాధురా, కాలాపానీ, లిపూలేక్ ప్రాంతమని అంటారు. కేంద్ర ప్రభుత్వం జమ్మూ, కశ్మీర్, లదాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన తర్వాత నూతన రాజకీయపటం గీసి కాలాపానీ ప్రాంతాన్ని మన దేశపటంలో చూపించారు. నేపాల్ నుండి నిరసన వ్యక్తమైంది, కాలాపానీ తమదని నేపాల్ వాదన. నేపాల్ నూతన రాజకీయపటాన్ని ఆవిష్కరిస్తూ మంత్రి పద్మా ఆర్యాల్ చరిత్రకు అనుకూలమైనదిగా వర్ణించారు. మన దేశంలోని కొన్ని ప్రాంతాలు ఆ పటంలో ఉండటంతో ‘ఈ ఏకపక్ష నిర్ణయం చారిత్రక ఆధారాలు, నిరూపణలు లేనిదని, కృత్రిమమైనదని’ మన విదేశాంగమంత్రిత్వశాఖ విమర్శించింది. నేపాల్ నూతన పటానికి తొలుత ప్రధాని ఓలీకి సహకరించని ప్రధాన ప్రతిపక్షపార్టీ నేపాలీ కాంగ్రెస్ ఇప్పుడు నూతన నేపాలి పటం మార్పుకు సహకరిస్తానంది. 1997లో మన దేశం చైనాతో మానస సరోవర యాత్రామార్గ ఒప్పందాన్ని చేసుకొన్నప్పటినుండి, భారత్–నేపాల్ సరిహద్దులోనున్న లిపూలేక్ ప్రాంతం వివాదాస్పదమైంది. 1954లో ఇండోసైనో ఒప్పందంలో లిపూలేక్‌ను భారతదేశ ముఖద్వారంగా పేర్కొన్నారు. వాణిజ్యానికి, భక్తులకు మార్గంగా నిల్చిన లిపూలేక్ పాస్ 1962 ఇండోసైనో యుద్ధసమయాన మూసివేసారు. తిరిగి 2015లో లిపూలేక్‌గుండా వాణిజ్యం జరుపుకోటానికి చైనా, భారత్ ఒప్పు కొన్నాయి. గుంజి గ్రామంనుండి లిపూలేక్ ప్రారంభమవుతుంది. ఈ గ్రామంతోపాటు, రహదారి ప్రాంతమంతా తమదేనని నేపాల్ వాదన.
కాలీనది సరిహద్దు ఇదిమిత్తంగా నిర్ణయించబడలేదని, నదీప్రవాహంలో కాలక్రమేణా అనేకమార్పులు రావటంతో కాలీ పశ్చిమ సరిహద్దు గుర్తించటం కష్టమైందని అనేక పటాల రూపకర్తలు చెబుతుండగా, వ్యూహాత్మకంగా కాలీనది తూర్పు సరిహద్దునే నేపాల్‌కు పరిమితం చేసారని కొందరు బ్రిటిష్ పట రూపకర్తలు అంటున్నారని వికీమీడియా కామన్స్ రాసింది. ఇదిలా ఉండగా హిమాలయాల్లో అనేక ఉపనదులున్న కాలీనది జన్మస్థానమే ప్రశ్నార్ధకంగా ఉంది. కాలాపానీ సమీపంలో పుట్టిం దని మనమంటుంటే, ఈ నది జన్మస్థలం లింపియాధురా కొండప్రాంతమని అక్కడినుండి తూర్పు ప్రాంతమంతా తమదని నేపాల్ వాదన.
సరిహద్దుల్ని నిర్ణయించిన ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్రకన్నా భారత్, నేపాల్, చైనా సంబంధాలు వేల సంవత్సరాల పురాతనమైనవి. క్రీ.పూ. రెండు వేల సంవత్సరాల క్రితమే మనం ఈ మార్గంగుండా వర్తక,వాణిజ్యాలను చేసుకొన్నాం. బౌద్ధులు, హిందువులు లిపూలేక్ పాస్‌గుండా పయనించేవారని చరిత్ర చెబుతుంది. 1962 చైనాతో యుద్ధసమయాన కాలాపానీ ప్రాంత మంతా మన సైనికదళాలుండేవి. 1962 నుండి 1997వరకు ఈ ప్రాంత వూసేఎత్తని నేపాల్, చైనాతో మానసరోవరమార్గ ఒప్పందం తర్వాతనే తన ధోరణిని మార్చుకొంది. బహుశా ఆ ఒప్పందంలో నేపాల్‌ను భాగస్వామ్యం చేయకపోవటం మన వ్యూహాత్మక తప్పిదమేమో.
నేపాల్‌కు మనకు మధ్య సంబంధాలు భౌగోళిక, చారిత్రక, సాంస్కతిక, ఆర్ధికపరమైనవి. దేశ భద్రతకు వ్యూహాత్మకంగా నేపాల్ మనకు సహాయపడుతుంది. కావల్సిన ఆయుధ సామాగ్రి మనమే సరఫరా చేస్తున్నాము. ఇంతటి ప్రాముఖ్యతకల్గిన ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను మన విదేశాంగశాఖ దౌత్యనీతితో పరిష్కరిస్తుందని అందరూ విశ్వసిస్తున్నారు.
బుడ్డిగ జమిందార్
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యుడు
సెల్: 9849491969
Comments
Please login to add a commentAdd a comment