
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత్‌లోని వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలను తన భూభాగంలోకి కలుపుతూ నేపాల్ ప్రభుత్వం రూపొందించిన కొత్త మ్యాప్‌కు రాజ్యాంగబద్ధత లభించింది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును గురువారం నేపాల్ పార్లమెంట్ ఆమోదించిన కొన్ని గంటల్లోనే అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ సంతకం చేశారు. సవరణ బిల్లు ఇప్పటికే దిగువసభలో ఆమోదం పొందింది. భారత్‌కు చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియధురా ప్రాంతాలను తమ దేశ భూభాగంలో చూపిస్తూ మేలో నేపాల్ కొత్త మ్యాప్ విడుదల చేయడం తెల్సిందే. భారత్‌తో విభేదాల నేపథ్యంలో నేపాల్ తన సరిహద్దుల్లో కాలాపానీ సమీపాన ఉన్న చంగ్రూ శిబిరాన్ని నేపాల్ ఆధునీకరించింది. దార్చులా జిల్లాలోని ఈ ఔట్ పోస్టులో ఇకపై శీతాకాలంలోనూ ఒక జవాను బందోబస్తు విధులు నిర్వర్తిస్తారు.
ఖండించిన భారత్: నేపాల్ ప్రయత్నాలను భారత్ మొదట్నుంచీ వ్యతిరేకిస్తోంది. నేపాల్ కృత్రిమంగా భూభాగాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోందని భారత్ విమర్శించింది. నేపాల్ ప్రయత్నాలను మద్దతు తెలిపేందుకు ఎటువంటి రుజువులు గానీ, చారిత్రక వాస్తవాలు కానీ లేవని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. సరిహద్దుల విషయంలో చర్చలు జరుపుకోవాలని గతంలో కుదిరిన అవగాహనను నేపాల్ ఉల్లంఘించిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment