కఠ్మాండు: భారత్‌లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలు తమకే చెందుతాయంటూ ఇటీవల వాదనలు ప్రారంభించిన నేపాల్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆ దేశ పార్లమెంట్‌లో దిగువసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌ను సవరిస్తూ ప్రభుత్వం శనివారం దిగువసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా పార్టీ–నేపాల్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కూడా మద్దతు తెలిపాయి.
సభకు హాజరైన 258 మంది సభ్యులూ ఈ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ‘ఈ సవరణను మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మెజారిటీతో సభ ఆమోదించింది’అని స్పీకర్ అగ్ని సప్కోటే ప్రకటించారు. ఈ బిల్లు నేషనల్ అసెంబ్లీకి వెళుతుంది. ఆమోదం అనంతరం అక్కడి నుంచి అధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారుతుంది. ఆ మేరకు రాజ్యాంగంలో సవరణలు జరుగుతాయి. దీనిద్వారా నేపాల్ జాతీయ చిహ్నంలోని దేశ రాజకీయ మ్యాప్‌లో మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని అధికార పత్రాల్లో ఈ మ్యాప్ ఉంటుంది. కాగా, నేపాల్ చర్యను భారత్ శనివారం తీవ్రంగా ఖండించింది. నేపాల్ కృత్రిమంగా తమ భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించింది. ‘ఇది చారిత్రక సందర్భం.
రాచరిక పాలనలో పోగొట్టుకున్న భూమిని ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పొందబోతున్నాం. ఈ విషయంలో దక్షిణ సరిహద్దులోని పొరుగుదేశంతో శత్రుత్వం కోరుకోవడం లేదు. ఎంతోకాలంగా కొనసాగుతున్న ఈ వివాదం దౌత్యపరమైన సంభాషణలు, చర్చల ద్వారా పరిష్కారమవుతుంది’అని అధికార ఎన్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ విశ్వాసం వ్యక్తం చేశారు. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్‌బా మాట్లాడుతూ.. ‘జాతి సమగ్రత, జాతీయత అంశాల్లో నేపాల్ ప్రజలు ఐక్యంగా నిలుస్తారు. 1816లో జరిగిన సుగాలీ ఒప్పందం ప్రకారం..మహాకాళి నదికి తూర్పు భాగం నేపాల్‌కే చెందుతుంది’అని పేర్కొన్నారు. ఈ మూడు ప్రాంతాలు నేపాల్‌కే చెందుతాయని, వాటిని భారత్ నుంచి పొందుతామని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి అన్నారు.
ఆధారాల్లేవన్న ప్రతిపక్ష నేత
కాలాపానీ సహా ఇతర ప్రాంతాలు నేపాల్‌కే చెందుతాయనేందుకు ఎలాంటి రుజువులు లేవని జనతా సమాజ్‌వాదీ పార్టీ సరితా గిరి అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు సవరణలు ప్రతిపాదించారు. ఆ సవరణ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ స్పీకర్ దానిని తిరస్కరించడంతో ఆమె సభ నుంచి వాకౌట్ చేశారు.
వివాదం ఎందుకు తలెత్తింది?
లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలతో కలిపి 2019 నవంబర్‌లో భారత్ రాజకీయ మ్యాప్ విడుదల చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్‌లోని దార్చులా ప్రాంతాన్ని లిపులేఖ్‌తో కలిపే 80 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మకంగా కీలకమైన రహదారిని మే 18వ తేదీన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. అప్పటి నుంచి నేపాల్ అభ్యంతరాలు మొదలయ్యాయి.
అంగీకారయోగ్యం కాదు: భారత్
తమ భూభాగాలను కూడా కలుపుకుంటూ రూపొందించిన రాజకీయ మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్ ఆమోదిం చడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. అవి నేపాల్‌లోని వని చెప్పేందుకు చారిత్రక సత్యాలు, ఆధారాలు లేవని భారత విదేశాంగ శాఖ తెలిపింది. కృత్రిమంగా భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శించింది. సరిహద్దు అంశాలపై చర్చించేందుకు ముందుగా కుదిరిన అవగాహనను కూడా ఉల్లంఘించిందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. ఇతరుల ప్రోద్బలంతోనే నేపాల్ ఇలా వ్యవహరిస్తోందని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే పరోక్షంగా చైనానుద్దేశించి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment