Nepal parliament
-
నేపాల్ పార్లమెంట్ రద్దు..
ఖాట్మాండు:నేపాల్ పార్లమెంట్‌ను ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి రద్దు చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికల తేదీలను ప్రకటించారు. నవంబర్ 12, 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి ముందు శుక్రవారం సాయంత్రంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలికి, ప్రతిపక్షాలకు ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి గడువు ఇచ్చారు. ఇరు పక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు విద్యాదేవి భండారి శనివారం ప్రకటించారు. దీంతో మొదటి దశ ఎన్నికలు నవంబర్ 12న, రెండో దశ ఎన్నికలు 19 జరగనున్నాయి. తనకు 153 మంది సభ్యలు మద్దతు ఉందంటూ ప్రధాని మంత్రి కేపీ శర్మ ఓలి ప్రకటించారు.తనకు 121 మంది సభ్యులతో పాటు, జేఎస్‌పీఎన్‌కు చెందిన మరో 32 మంది సభ్యుల మద్దతు ఉందని పేర్కొన్నారు. బలాన్ని సభలో రుజువు చేసుకోలేకపోవడంతో ఈ సంక్షోభం ప్రారంభమైంది.అయితే కేపీ శర్మ ఓలి బలాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడంతో ప్రతిపక్షాలను ప్రభుత్వం ఏర్పా టు చేయాల్సిందిగా అధ్యక్షురాలు పిలుపునిచ్చారు.అయితే ప్రతిపక్షాలు సంకీర్ణ కూటమి ఏర్పాటు చేయడంలో విఫలం చెందాయి . నేపాల్ పార్లమెంట్లో 275 సీట్లు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 136 మంది మద్దతు అవసరం. -
నేపాల్ కొత్త మ్యాప్‌కు చట్టబద్ధత
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత్‌లోని వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలను తన భూభాగంలోకి కలుపుతూ నేపాల్ ప్రభుత్వం రూపొందించిన కొత్త మ్యాప్‌కు రాజ్యాంగబద్ధత లభించింది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును గురువారం నేపాల్ పార్లమెంట్ ఆమోదించిన కొన్ని గంటల్లోనే అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ సంతకం చేశారు. సవరణ బిల్లు ఇప్పటికే దిగువసభలో ఆమోదం పొందింది. భారత్‌కు చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియధురా ప్రాంతాలను తమ దేశ భూభాగంలో చూపిస్తూ మేలో నేపాల్ కొత్త మ్యాప్ విడుదల చేయడం తెల్సిందే. భారత్‌తో విభేదాల నేపథ్యంలో నేపాల్ తన సరిహద్దుల్లో కాలాపానీ సమీపాన ఉన్న చంగ్రూ శిబిరాన్ని నేపాల్ ఆధునీకరించింది. దార్చులా జిల్లాలోని ఈ ఔట్ పోస్టులో ఇకపై శీతాకాలంలోనూ ఒక జవాను బందోబస్తు విధులు నిర్వర్తిస్తారు. ఖండించిన భారత్: నేపాల్ ప్రయత్నాలను భారత్ మొదట్నుంచీ వ్యతిరేకిస్తోంది. నేపాల్ కృత్రిమంగా భూభాగాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోందని భారత్ విమర్శించింది. నేపాల్ ప్రయత్నాలను మద్దతు తెలిపేందుకు ఎటువంటి రుజువులు గానీ, చారిత్రక వాస్తవాలు కానీ లేవని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. సరిహద్దుల విషయంలో చర్చలు జరుపుకోవాలని గతంలో కుదిరిన అవగాహనను నేపాల్ ఉల్లంఘించిందని చెప్పారు. -
భారత్-నేపాల్ వివాదం.. కీలక పరిణామం
న్యూఢిల్లీ: భారత్-నేపాల్ సరిహద్దు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆ దేశ పార్లమెంట్లో ఎగువసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత భూభాగంలోని ఈ మూడు ప్రాంతాలను తమ మ్యాప్‌లో పేర్కొన్న రాజ్యాంగ సవరణ బిల్లును రెండు రోజుల క్రితమే దిగువ సభ ఏకగీవ్రంగా ఆమోదించిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ, లిపులేఖ్, లింపియధురలు తమ ప్రాంతాలేనంటూ నేపాల్ వాదించడంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం ముదురుతుంది. ఈ క్రమంలో బిల్లును ఎగువసభలో ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ పుర్ణ చంద్ర థాపా.. కాలాపానీ సమీపంలోని చాంగ్రూలో ఏర్పాటు చేసిన కొత్త భద్రతా పోస్టును బుధవారం పరిశీలించారు. ఆయనతో పాటు నేపాల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్ (ఏపీఎఫ్)ముఖ్య అధికారి శైలేంద్ర ఖనాల్ కూడా ఉన్నారు. (నేపాల్‌తో వివాదంపై రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు) నేపాల్ ప్రభుత్వం ఏపీఎఫ్ పోస్టును కొత్తగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మే 8న భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మానస సరోవర యాత్రికుల కోసం ఉద్ధేశించిన ధార్చులా-లిపులేఖ్ రోడ్డును ప్రారంభించిన తర్వాత నేపాల్ ఈ ఏపీఎఫ్ పోస్టును ఏర్పాటు చేయడం గమనార్హం. ఉత్తరాఖండ్‌లోని దార్చుల నుంచి లిపులేఖ్ వరకు భారత ప్రభుత్వం నిర్మిస్తున్న 80 కిలోమీటర్ల రోడ్డుపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే లిపులేఖ్ రహదారిపై నేపాల్ ‘వేరొకరి కోరిక మేరకు’ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుందని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే పరోక్షంగా చైనానుద్దేశించి పేర్కొన్నారు. తీవ్రంగా వ్యతిరేకించిన భారత్ ఈ వివాదస్పద బిల్లును భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను తమ భూభాగాలుగా చెప్పడానికి నేపాల్ వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొంది. కృత్రిమంగా భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శించింది. సరిహద్దు అంశాలపై చర్చించేందుకు ముందుగా కుదిరిన అవగాహనను కూడా ఉల్లంఘించిందని భారత్ మండిపడింది. (ద్వైపాక్షిక బంధంపై తీవ్ర ప్రభావం) -
నేపాల్ కొత్త మ్యాప్ : ఆ మూడూ మావే
కఠ్మాండు: భారత్‌లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలు తమకే చెందుతాయంటూ ఇటీవల వాదనలు ప్రారంభించిన నేపాల్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆ దేశ పార్లమెంట్లో దిగువసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌ను సవరిస్తూ ప్రభుత్వం శనివారం దిగువసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా పార్టీ–నేపాల్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కూడా మద్దతు తెలిపాయి. సభకు హాజరైన 258 మంది సభ్యులూ ఈ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ‘ఈ సవరణను మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మెజారిటీతో సభ ఆమోదించింది’అని స్పీకర్ అగ్ని సప్కోటే ప్రకటించారు. ఈ బిల్లు నేషనల్ అసెంబ్లీకి వెళుతుంది. ఆమోదం అనంతరం అక్కడి నుంచి అధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారుతుంది. ఆ మేరకు రాజ్యాంగంలో సవరణలు జరుగుతాయి. దీనిద్వారా నేపాల్ జాతీయ చిహ్నంలోని దేశ రాజకీయ మ్యాప్‌లో మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని అధికార పత్రాల్లో ఈ మ్యాప్ ఉంటుంది. కాగా, నేపాల్ చర్యను భారత్ శనివారం తీవ్రంగా ఖండించింది. నేపాల్ కృత్రిమంగా తమ భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించింది. ‘ఇది చారిత్రక సందర్భం. రాచరిక పాలనలో పోగొట్టుకున్న భూమిని ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పొందబోతున్నాం. ఈ విషయంలో దక్షిణ సరిహద్దులోని పొరుగుదేశంతో శత్రుత్వం కోరుకోవడం లేదు. ఎంతోకాలంగా కొనసాగుతున్న ఈ వివాదం దౌత్యపరమైన సంభాషణలు, చర్చల ద్వారా పరిష్కారమవుతుంది’అని అధికార ఎన్సీపీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ విశ్వాసం వ్యక్తం చేశారు. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా మాట్లాడుతూ.. ‘జాతి సమగ్రత, జాతీయత అంశాల్లో నేపాల్ ప్రజలు ఐక్యంగా నిలుస్తారు. 1816లో జరిగిన సుగాలీ ఒప్పందం ప్రకారం..మహాకాళి నదికి తూర్పు భాగం నేపాల్‌కే చెందుతుంది’అని పేర్కొన్నారు. ఈ మూడు ప్రాంతాలు నేపాల్‌కే చెందుతాయని, వాటిని భారత్ నుంచి పొందుతామని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి అన్నారు. ఆధారాల్లేవన్న ప్రతిపక్ష నేత కాలాపానీ సహా ఇతర ప్రాంతాలు నేపాల్‌కే చెందుతాయనేందుకు ఎలాంటి రుజువులు లేవని జనతా సమాజ్‌వాదీ పార్టీ సరితా గిరి అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు సవరణలు ప్రతిపాదించారు. ఆ సవరణ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ స్పీకర్ దానిని తిరస్కరించడంతో ఆమె సభ నుంచి వాకౌట్ చేశారు. వివాదం ఎందుకు తలెత్తింది? లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలతో కలిపి 2019 నవంబర్‌లో భారత్ రాజకీయ మ్యాప్ విడుదల చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్‌లోని దార్చులా ప్రాంతాన్ని లిపులేఖ్‌తో కలిపే 80 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మకంగా కీలకమైన రహదారిని మే 18వ తేదీన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. అప్పటి నుంచి నేపాల్ అభ్యంతరాలు మొదలయ్యాయి. అంగీకారయోగ్యం కాదు: భారత్ తమ భూభాగాలను కూడా కలుపుకుంటూ రూపొందించిన రాజకీయ మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్ ఆమోదిం చడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. అవి నేపాల్‌లోని వని చెప్పేందుకు చారిత్రక సత్యాలు, ఆధారాలు లేవని భారత విదేశాంగ శాఖ తెలిపింది. కృత్రిమంగా భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శించింది. సరిహద్దు అంశాలపై చర్చించేందుకు ముందుగా కుదిరిన అవగాహనను కూడా ఉల్లంఘించిందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. ఇతరుల ప్రోద్బలంతోనే నేపాల్ ఇలా వ్యవహరిస్తోందని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే పరోక్షంగా చైనానుద్దేశించి పేర్కొన్నారు. -
వీరభూమికి ప్రణామం
ఖాట్మండ్: వీరభూమి నేపాల్‌కు ప్రణామాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేపాల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి తన ప్రసంగం ప్రారంభించారు. నేపాల్ ప్రజాప్రతినిధులు ఉప్పొంగిపోయారు. ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆయన ప్రసంగం హిందీలో కొనసాగింది. రెండు రోజుల నేపాల్ పర్యటన కోసం మోడీ ఇక్కడకు వచ్చిన విషయం తెలిసిందే. మోడీ తన ప్రసంగంలో అనాదిగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను గుర్తు చేశారు. భారత్ -నేపాల్ మధ్య సంబంధాలు గంగా-హిమాలయాలంత ప్రాచీనమైనవన్నారు. 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నేపాల్‌లో పర్యటిస్తున్నారు. నేపాల్ పార్లమెంట్లో భారత ప్రధాని ప్రసంగించడం ఇదే తొలిసారి. నేపాల్ అంతర్గత వ్యవహారాలలో భారత్ కలుగజేసుకోవదని మోడీ చెప్పారు. అంతకు ముందు ఖాట్మండ్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న నరేంద్ర మోడీకి నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాల పూలగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. -
నేపాల్ పార్లమెంట్లో ప్రసంగించనున్న మోడీ
ఖాట్మాండు: భారత ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. వచ్చే నెలలో మోడీ రెండు రోజుల పాటు నేపాల్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 4న మోడీ నేపాల్ పార్లమెంట్‌ను సందర్శించనున్నారు. నేపాల్‌లోని ప్రసిద్ధ పశుపతి ఆలయాన్ని మోడీ సందర్శించనున్నారు. హిందువులు పవిత్రంగా భావించే ఈ ఆలంయలో శివుడు కొలువైఉన్నాడు. మోడీ రాకను పురస్కరించుకుని ఆలయం పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. మోడీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల నాయకులు కీలక అంశాలపై చర్చించనున్నారు. భారత ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించాక ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలకు ప్రాధానం ఇస్తున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలు హాజరైన సంగతి తెలిసిందే.