నేపాల్ పార్లమెంటులో ప్రసంగిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ
ఖాట్మండ్: వీరభూమి నేపాల్‌కు ప్రణామాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేపాల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి తన ప్రసంగం ప్రారంభించారు. నేపాల్ ప్రజాప్రతినిధులు ఉప్పొంగిపోయారు. ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆయన ప్రసంగం హిందీలో కొనసాగింది. రెండు రోజుల నేపాల్ పర్యటన కోసం మోడీ ఇక్కడకు వచ్చిన విషయం తెలిసిందే.
మోడీ తన ప్రసంగంలో అనాదిగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను గుర్తు చేశారు. భారత్ -నేపాల్ మధ్య సంబంధాలు గంగా-హిమాలయాలంత ప్రాచీనమైనవన్నారు. 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నేపాల్‌లో పర్యటిస్తున్నారు. నేపాల్ పార్లమెంట్‌లో భారత ప్రధాని ప్రసంగించడం ఇదే తొలిసారి. నేపాల్ అంతర్గత వ్యవహారాలలో భారత్ కలుగజేసుకోవదని మోడీ చెప్పారు.
అంతకు ముందు ఖాట్మండ్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న నరేంద్ర మోడీకి నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాల పూలగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.