It is not the prisoners who need
reformation, it is the prisons
జైల్లో ఉన్న ఖైదీలకు కాదు జైలుకే పరివర్తన అవసరం అని అర్థం! ఈ ఆలోచన వచ్చిందంటే తప్పొప్పుల మూలాలు గ్రహించినట్టే.. నాగరికత పరిఢవిల్లినట్టే!! మరి ఒకనాడు కఠిన శిక్షలకు పేరుమోసిన జైళ్లన్నీ ఏం కావాలి? మ్యూజియంలుగా పర్యాటకుల కోసం ముస్తాబవ్వాలి!! అనుకొని ప్రపంచంలోని ఎన్నో దేశాలు తమదగ్గరున్న.. చాలా జైళ్లను మ్యూజియంలుగా మర్చాయి. మన దగ్గర కూడా అండమాన్‌లోని కాలాపానీ జైలునూ మ్యూజియంగా, పర్యాటక కేంద్రంగా మలచారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లోనూ ఓ సెల్యులార్ జైలు ఉంది. పెద్దగా ప్రాచుర్యంలో లేదు.. కాని ప్రాశస్త్యం కలది. దాని గురించి.. దాన్నీ పర్యటనకు పెట్టాలనే అర్జీతో వచ్చిన వ్యాసం ఇది.. చరిత్ర తెలుసుకుందాం.. వర్తమాన అర్జీ గురించి ఆలోచిద్దాం.. ఆ వివరాలు..
భారత స్వాతంత్య్ర పోరాటం 1857 జూలై 17న ఉత్తరాదిన ఎక్కువగా మీరట్, ఢిల్లీ, లక్నో, కాన్పూరు తదితర ప్రాంతాల్లో ప్రారంభమైంది. అదే సమయంలో హైదరాబాద్‌లోని కోఠి సమీపంలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీపై 6,000 మందితో సాయుధ దళాల దాడి జరిగింది. తుర్రేబాజ్ ఖాన్, రాజా మహిపత్ రామ్, మౌల్వీ అల్లావుద్దీన్ తదితరులు నేతృత్వం వహించారు. 1857 జూలై 17, సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అయితే బ్రిటిష్ సేనల ముందు ఎంతటి భీకరపోరాటం చేసినా హైదరాబాద్ సాయుధ దళాలు నిలువలేకపోయాయి. తుర్రేబాజ్ ఖాన్‌ని పట్టుకుని, బందీని చేసి రెసిడెన్సీ భవనం దగ్గర ఉరితీశారు. అలాగే పట్టుబడిన మౌల్వీ అల్లావుద్దీన్‌ని అండమాన్‌కు పంపారు.
అండమాన్ దీవుల్లోనే అతను మరణించాడు. బ్రిటిష్ రెసిడెన్సీపై తిరుగుబాటు చేసిన ఈ మహా నాయకుల జ్ఞాపకార్థం హైదరాబాద్‌లోని కోఠి జంక్షన్‌లో ఏనుగు తలలతో ఒక రాతి స్మారక చిహ్నాన్నీ ఏర్పాటు చేశారు. కానీ నగరజీవితం దీన్ని గుర్తించేంత తీరికనివ్వట్లేదు జనానికి. ఈ స్మారక స్థూపాన్ని గుర్తించేవారు బహు కొద్దిమందేనని చెప్పాలి. జైలు గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి ఈ కథ చెప్తున్నారేంటీ అని కదా మీ అనుమానం. ఎందుకంటే ఈ కథకు ఆ ఇంట్రడక్షన్‌కు లింక్ ఉంది కనుక. బ్రిటిష్ రెసిడెన్సీపై దాడికి పర్యవసానంగానే 1858లో తిరుమలగిరిలో సెల్యులార్ జైలు నిర్మాణం చేపట్టారు కనుక. బ్రిటన్‌లోని రాణి 2వ ఎలిజెబెత్ అధికార నివాసం ‘‘విండ్‌సర్ కేజిల్’’ నమూనాలో ఈ జైలును నిర్మించారు. ప్రపంచంలో ఇంకా ఎక్కడా ఈ మాదిరి సెల్యులార్ జైళ్ల నిర్మాణం ఉన్నట్లు ఆధారాలు లేవు.
ప్రతి ఒక్కరూ తప్పక చూడాలి
సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి చౌరాస్తా నుంచి సైనిక్‌పురికి వెళ్ళే దారిలో సుమారు వంద గజాల దూరంలో ఉంటుందీ జైలు. రోజూ ఆ దారిన వెళ్ళేవారికి ఈ చారిత్రక కట్టడంపైన గాలికి రెపరెపలాడే జాతీయ పతాకం కనిపిస్తుంది కానీ, చాలామందికి ఈ భవనం గురించి బొత్తిగా తెలియదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ భవనం సికింద్రాబాద్‌లోని మిలిటరీ అధికారుల అధీనంలో ఉంది. ఈ జైలుని చూడాలంటే ముందుగా సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరి. అయితే ఆ అధికారులు అందరినీ అనుమతించరు.
సుమారు 150 సంవత్సరాల కిందట 1858లో ఈ సెల్యులార్ జైలును కట్టారు. ఇందుకోసం ఆనాడు 4,71,000 రూపాయలను ఖర్చు చేశారు. విశేషమేమంటే, తిరుమలగిరి జైలు నమూనాతో తిరుమలగిరి జైలుకన్నా చిన్న సైజులో, అండమాన్‌లోని కాలాపానీ నిర్మాణం జరిగింది. ఆ వివరాలు ఇక్కడి ప్రాంగణంలో చాలా స్పష్టంగా ఒక ఫలకం మీద రాసున్నాయి. సుమారు 20,344 చదరపు అడుగుల విస్తీర్ణంలో గోతిక్ నిర్మాణ శైలిలో కట్టారు దీన్ని. ఇది ఆకాశం నుంచి చూస్తే, ఏసుక్రీస్తు శిలువ అకారంలో కన్పిస్తుంది. తూర్పు – పడమర, ఉత్తర – దక్షిణ దిక్కుల్లో మూడు అంతస్తుల్లో మొత్తం 75 జైలు గదులను నిర్మించారు. కింది అంతస్తుల్లో 40 గదులున్నాయి. మొదటి అంతస్తులో 35 గదులు వున్నాయి.
అంతర్ నిర్మాణం..
జైలు గదుల లోపల గోడకు ఖైదీని గట్టి ఇనుప గొలుసులతో కట్టి ఉంచేలా ఏర్పాటుంది. గదికి మూడు రకాల గట్టి ఇనుప తలుపులున్నాయి. ఖైదీకి తన గదిలో నుంచి బయటకి చూసేందుకు చిన్న కిటికీని అమర్చారు. దీనికీ ఓ ప్రత్యేకత ఉంది. జైలు గదిలోని ఖైదీకి తనకెదురుగా ఉన్నది మాత్రమే కనపడుతుంది. చుట్టుపక్కల ఏముందో, ఏం జరుగుతోందో, ఎవరు ఎటు వెళ్తున్నారో, వస్తున్నారో గమనించడానికి ఏ మాత్రం వీలుండదు. తిరిగి అదే కిటికీని బయట నుంచి చూస్తే, ఆ గదిలోని ప్రతి అంగుళం స్పష్టంగా కనిపిస్తుంది. ఖైదీ ప్రవర్తనను కట్టడి చేయడానికి వీలుగా ఈ కిటికీ నిర్మాణం జరిగిందని చెప్పాలి. ఇదే సెల్యులార్ జైలు నిర్మాణశైలి ప్రత్యేకత అని స్థానిక అధికారులు చెప్పారు. ఇది ఆనాటి బ్రిటిష్ సైన్యాధికారుల కాఠిన్యానికి అద్దం పడుతుంది.
ఉరిశిక్ష
మూడవ అంతస్తు, ఆ పైభాగాన ఖైదీలకు ఉరిశిక్ష అమలు చేసే ఇనుపకప్పీల ఏర్పాటు ఉంది. ఉరిశిక్ష అమలుకు ముందు ఖైదీకి తన ఇష్ట దైవాన్ని ప్రార్థించే అవకాశం ఇచ్చేవారట. అందుకోసం చిన్న ప్రార్థన మందిరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ గదిలో అన్ని మతాల దేవుళ్ళ చిత్రపటాలు ఉన్నాయి. ఉరితీసే సమయంలో ఇనుపకప్పీలు సక్రమంగా పనిచేయకనో, లేదా మరేదైనా సాంకేతికత కారణం వల్లనో ఉరి గురి తప్పుతుందేమోనని ముందుగానే ఊహించి ఉరికంబం కప్పీల నుంచి సుమారు వంద అడుగుల లోతులో ఒక బావిలాంటి నిర్మాణం చేశారు.
ఈ బావిలో పదునైన ఇనుప ఊచలుంచారు. కప్పీల నుంచి ఉరితాడు వదలగానే ఖైదీ ఈ పదునైన ఇనుప ఊచలపై పడి ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రాణాలు వదిలేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఇక్కడ గమనించవచ్చు. అయితే ప్రస్తుతం ఆ ఇనుప ఊచలు ఇక్కడ లేవు. ఉరికంబం యథాప్రకారం సందర్శకులకు కన్పిస్తుంది. ఇక్కడ సుమారుగా 500 మందికి పైగా ఉరిశిక్షను అమలు చేశారని అధికారిక రికార్డులు తెలియజేస్తున్నాయి.
రెండవ ప్రపంచయుద్ధ సమయంలో చాలామంది ఖైదీల్ని ఇక్కడ బందీగా ఉంచారు. ఆపరేషన్ బ్లూస్టార్‌లోని కొందరు ఖైదీల్ని సైతం ఇక్కడ ఉంచారని, 1994 నుంచి ఈ మిలిటరీ జైలు వినియోగంలో లేదని స్థానిక అధికారులు చెప్పారు. ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీ –125 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ – ది గార్డు – అధీనంలో ఈ భవన ప్రాంగణం భద్రంగా ఉంది. 1997లో ఇంటాక్ సంస్థ ఈ ప్రాంగణానికి హెరిటేజ్ అవార్డును ప్రకటించింది. గట్టి భద్రత విషయంలో నేటికీ ఏ మాత్రం మార్పు లేదు దీనికి. జైలు శిఖారాగ్రం నుంచి చూస్తే సికింద్రాబాద్ నగర పరిసరాలన్నీ ఆకుపచ్చని చెట్లతో దట్టమైన అడవిలాగా కన్పిస్తాయి. ఈ చరిత్ర గల సెల్యులార్ జైలును స్థానిక సందర్శకులకు అందుబాటులో ఉంచగలిగితే బాగుంటుంది.
అండమాన్‌లోని కాలాపానీ నిర్మాణం పూర్తయి నూరేళ్లైన సందర్భంగా కాలాపానీ జైలు ప్రాంగణాన్ని నేషనల్ మ్యూజియంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వేలమంది పర్యాటకులు కాలాపానీని సందర్శిస్తున్నారు. అయితే, తిరుమలగిరిలోని మిలిటరీ జైలు మాత్రం స్థానిక మిలిటరీ అధికారుల ముందుస్తు అనుమతితో, ఆసక్తిగల ఏ కొద్ది మందికో సందర్శించే వీలుంది. ఈ సెల్యులార్ జైలును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే, చారిత్రక పర్యాటక అభిలాషాపరులకి చక్కని అవకాశం కల్పించినట్లవుతుంది. కనీసం ఏడాదిలో ఒక రోజున ముఖ్యంగా జాతీయ పండుగ రోజులైన స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం నాడైనా అనుమతించాలని స్థానికులు కోరుతున్నారు.
కాలాపానీ అంటే...
హిందీలో కాల్ అంటే కాలము, పానీ అంటే నీరు. అండమాన్‌లో చుట్టూతా సముద్రం కదా. ఈ ప్రాంతానికి వచ్చిన ఖైదీలకు ఇదే చివరి మజిలీ అని ఉద్యమకారుల్ని భయభ్రాంతుల్ని చేయడానికి బ్రిటిష్ వారు కాలాపానీ అని పేరుపెట్టారని చరిత్రకారుల కథనం. అయితే భారత స్వాతంత్య్ర సమరయోధులు, తమ త్యాగనిరతితో కాలాపానీని ఒక మరపురాని మహాతీర్థంగా మలిచారు. అక్కడ గడిపిన ఫ్రీడం ఫైటర్స్ చెప్పిన గాధలు విన్నవారికి వెన్నులోంచి వణుకు వస్తుంది. గానుగలో నూనె గింజలు వేసి, నూనె పట్టాలని, పశువులు కూడా చేయలేనంత పనిని ఖైదీలకు జైలు అధికారులు అప్పగించేవారుట. రాజకీయ ఖైదీలతో అలవికాని పనులు చేయించారు.
పరపాలన అంతం కోసం కలలుకంటూ మాటల్లో చెప్పలేని కఠినమైన జీవనం గడిపారు ఆ యోధులు. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టారిక్కడ. అందుకే వీలున్నంత వరకూ ఈ సెల్యులార్ జైలుని ప్రతి ఒక్కరూ తప్పక చూడాలి. అండమాన్‌లోని కాలాపానీని నేషనల్ మ్యూజియంగా ప్రకటించినట్టే. సికిందరాబాద్‌లో వున్న సెల్యులార్ జైలుకి కూడా ప్రభుత్వం ఆ అవకాశం కల్పించాలనేది సగటు నగర ప్రజల ఆకాంక్ష. ఇది అత్యాశేమీ కాదు.
దాగ్‌షై
చండీగఢ్‌కు అరవై కిటోమీటర్ల దూరంలో ఉన్న కంటోన్మెంట్ టౌనే దాగ్‌షై. ఇక్కడున్న జైలు 163 ఏళ్ల నాటిది. ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు శిక్షను అనుభవించారిక్కడ. కఠినకర్మాగారమనే పేరును ఇదీ భరించింది. స్వాతంత్య్రానంతరం 2011 వరకు ఈ జైలు ప్రాంగణం.. దాని చుట్టుపక్కల పరిసరాలూ డంప్ యార్డ్‌గా మారిపోయాయి. ఆ పరిస్థితి చూడలేని దాగ్‌షై బ్రిగేడ్ కమాండర్ బ్రిగేడియర్ అనంత్ నారాయాణన్ ఈ చారిత్రక స్థలాన్ని మ్యూజియమ్‌గా మార్చాడు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పట్లతో ఉన్న 54 నాలుగు జైలు గదులతో ఒక సెక్షన్‌గా, నాటి పరిస్థితులకు అద్దంపట్టే ఛాయాచిత్రాలతో ఉన్న ప్రాంగణాన్ని మరో సెక్షన్‌గా పర్యటనకోసం తెరిచారు. ఈ మొత్తం జైలులో ఒకే ఒక వీఐపీ సెల్ ఉంది.. చలిమంట కాచుకునే ఫైర్ ప్లేస్, ప్రత్యేకమైన వాష్‌రూమ్‌తో. అందులో మహాత్మాగాంధీ ఉన్నారట.
ప్రపంచంలోని ఫేమస్ జైలు మ్యూజియంలు..
కెనడా, ఒంటారియోలోని కింగ్‌స్టన్ పెనిటెన్షియరీ జైలు మొదలు అమెరికా, ఫిలడెల్ఫియాలోని ఈస్టర్న్ స్టేట్ పెనిటెన్షియరీ జైలు, హాట్ స్ప్రింగ్ డకోటా టెరిటరీ జైలు సహా ఉత్తర అమెరికాలోని మొత్తం ఎనిమిది జైళ్లు మ్యూజియంలుగా మారాయి. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే దేశాల్లో, అలాగే యూరప్‌లోని ఇంగ్లండ్, ఎస్టోనియా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, పోలాండ్, రుమేనియా, రష్యా దేశాల్లో, ఆసియాలోని కంబోడియా, దక్షిణకొరియా, థాయ్‌లాండ్, వియత్నాం, ఆఫ్రికాలోని ఘనా, సెనెగల్, దక్షిణాఫ్రికా, టాంజానియా, అస్ట్రేలియాలోని అస్ట్రేలియా, న్యూజీల్యాండ్ దేశాల్లోని ప్రసిద్ధ జైళ్లనూ మ్యూజియంలుగా మార్చాయి ఆయా దేశాల ప్రభుత్వాలు. అవన్నీ ఇప్పుడు జనాకర్షక పర్యాటక కేంద్రాలుగా అలరారుతున్నాయి.
- మల్లాది కృష్ణానంద్
Comments
Please login to add a commentAdd a comment