prison Punishment
-
డొమినిక్ పెలికాట్కు 20 ఏళ్ల జైలు
అవిగ్నోన్: తీవ్ర సంచలనం సృష్టించిన కేసులో ఫ్రాన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. భార్యకు మత్తు మందిచ్చి ఇతరులతో అత్యాచారం చేయించడంతోపాటు తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడిన మాజీ భర్త డొమినిక్ పెలికాట్(72)కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కేసులో మొత్తం 51 మందిని దోషులుగా ప్రకటించింది. మిగతా 50 మందిలో కొందరికి 3 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్షలను ఫ్రాన్స్‌లోని అవిగ్నోన్ నగర కోర్టు గురువారం ప్రకటించింది. ఇలాంటి నేరాలకు ఫ్రాన్స్‌లో గరిష్ట జైలు శిక్ష 20 ఏళ్లు కావడం గమనార్హం. రేప్‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపిన ఈ కేసు విచారణ మూడు నెలలపాటు సాగింది. ఓ డిపార్టుమెంట్ స్టోర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే డొమినిక్ పెలికాట్ 2020లో మొదటిసారిగా మహిళలను డ్రెస్ కింది నుంచి ఫొటో తీస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. ఇతరులతో కలిసి భార్య గిసెలి పెలికాట్‌ను రేప్, ఇతర వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలు, వీడియోలు 20 వేల వరకు అతడి కంప్యూటర్ డైవ్లలో కనిపించాయి. వాటిలోని ఫోల్డర్లకు అబ్యూజ్, రేపిస్ట్స్, నైట్ ఎలోన్.. తదితర పేర్లు పెట్టాడు డొమినిక్. దశాబ్దకాలంపాటు ఈ ఘోరం కొనసాగింది. గిసెలిపై మొత్తం 72 మంది అత్యాచారం సహా వేర్వేరు నేరాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. వీరిలో డొమినిక్ సహా 51 మందిని మాత్రం గుర్తించిన అధికారులు వివిధ నేరాభియోగాలను మోపారు. -
థాయ్ మాజీ ప్రధానికి పెరోల్
బ్యాంకాక్: జైలు శిక్ష అనుభవిస్తున్న థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్షిన్ షినవత్ర(76) పెరోల్ మీద విడుదలయ్యారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల ప్రభుత్వం అతడిని పెరోల్‌పై విడుదల చేసింది. మరో ఆరు నెలల్లో షినవత్ర శిక్ష ముగియనుంది. 15 ఏళ్ల ప్రవాసం వీడి గతేడాది దేశంలో అడుగు పెట్టిన వెంటనే ఆయనను జైలుకు తరలించారు. అనారోగ్యం కారణంగా జైలు నుంచి వెంటనే పోలీస్ ఆస్పత్రికి తరలించి నిర్బంధంలో ఉంచారు. రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన షినవత్రకు అవినీతి ఆరోపణలపై 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో షినవత్ర కుటుంబ సభ్యులే కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. 70 ఏళ్లు దాటి అనారోగ్యం బారిన పడినందున మిగిలిఉన్న జైలు శిక్షను ప్రభుత్వం రద్దు చేసింది. ఇదీ చదవండి.. కనీసం చివరిచూపు చూసుకోనువ్వండి -
మారణాయుధాలతో తిరుగుతున్న ఇద్దరికి జైలు
సాక్షి, చిలకలగూడ: మారణాయుధాలతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష విధించిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్, డీఐ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ మెట్రోస్టేషన్ ఫుట్‌పాత్‌పై నివసిస్తున్న జంజర్ల ప్రేమ్, లోయర్‌ట్యాంక్‌బండ్ గోశాల ప్రాంతానికి చెందిన కైత నాగరాజు చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ బ్యాటిల్స్ ఏరుకుని జీవనం సాగించేవారు. ఈనెల 21న రాత్రి గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని గస్తీ పోలీసులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. అదుపులోకి తీసుకుని సోదా చేయగా వారి వద్ద కత్తి, చాకు లభించాయి. ఈ పెట్టీ కేసులు నమోదు చేసి గురువారం సికింద్రాబాద్ 15వ స్పెషల్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపర్చగా, ఐదు రోజుల చొప్పున జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. (చదవండి: దారి కాచి...దాడి చేసి) -
ఆ నేరానికి గానూ... ఒక వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష!!
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చాలని డిమాండ్ చేస్తూ అమెరికా పార్లమెంటు 'క్యాపిటల్' భవనం డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడులను ప్రపంచ దేశాలన్ని విస్తుపోయి చూసిన సంగతి తెలిసిందే. అయితే యుఎస్ క్యాపిటల్‌ని ముట్టడించి పోలీసు అధికారులపై దాడి చేసినందుకు గానూ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుడు 54 ఏళ్ల రాబర్ట్ స్కాట్ పామర్‌కి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: ప్లీజ్.. నా కారుని ధ్వంసం చేయోద్దు!) అప్పటి దాడుల్లో పామర్ క్యాపిటల్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు కాని చివరికి భద్రతా అధికారులు మోహరించి పెప్పర్ స్ప్రే చేయడం వలన వెనక్కి తగ్గాడని అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు పామర్ ట్రంప్ అనుకూల ప్యాచ్‌లతో అలంకరించబడిన అమెరికన్ జెండా జాకెట్‌ని ధరించి "ఫ్లోరిడా ఫర్ ట్రంప్" అని వ్రాసిన టోపీని పెట్టుకుని ఉన్నట్లు ఫోటోల్లోనూ, వీడియోల్లోనూ కనిపించాడు. ఈ మేరకు పామర్పై అక్టోబరు 4న నేరారోపణ నిర్థారణ అయిన తర్వాత కూడా అతను తన చర్యలను సమర్థించకునే ప్రయత్నం చేశాడు. అయితే దేశ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవాలనే దురుద్దేశంతోనే పామర్ ఉద్దేశపూర్వకంగా పెద్ద అల్లర్ల సమూహంలో చేరాడు అని అమెరికన్ కోర్టు పేర్కొంది. శాంతియుతంగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికల అధికార మార్పిడిని అణచివేయాలనే రాజకీయ దురుద్దేశంతోనే పామర్ ఈ హింసకు పాల్పడ్డాడని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు యూఎస్ కోర్టు ఈ నేరాలకు గానూ పామర్‌కి ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. అంతేగాక ఇదే కేసులో అధికారిక విచారణకు ఆటంకం కలిగించారనే అభియోగాలతో మరో ఇద్దరికి 41 నెలల జైలు శిక్ష విధించింది. పైగా ఈ దాడులకి సంబంధించిన సూమారు 700 మందిని అరెస్టు చేసినట్లు యూఎస్ పోలీసులు తెలిపారు. అయితే వారంతా క్యాపిటల్‌లోకి అక్రమంగా ప్రవేశించడం వంటి చిన్న చిన్న నేరాలకు పాల్పడిని వారని అధికారులు పేర్కొన్నారు. (చదవండి: తగ్గేదేలే! నువ్వు ముందు విమానం నుంచి దిగిపో!) -
ఎయిర్‌పోర్టులో ఫోర్న్ వీడియో చిత్రీకరణ.. మోడల్‌కు 18 యేళ్ల జైలు శిక్ష!
ఎయిర్ పోర్టులో బట్టలు విప్పి పోర్న్ వీడియోకు ఫోజులిచ్చిన మోడల్‌కు 18 యేళ్ల జీవిత ఖైదు పడే అవకాశం ఉందని మీడియా వెల్లడించింది. వివరాల్లోకెళ్తే.. ఇండోనేషియాలోని జావా విమానాశ్రయం పార్కింగ్ స్థలంలో అశ్లీల ఫొటో షూట్‌కు సిస్కై అనే మోడల్ బట్టలు విప్పి, ఫొటోలకు ఫోజులిచ్చిన వీడియో చాలా తక్కువ సమయంలో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. పిర్యాదు అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు తర్వాత డిసెంబర్ 4న పోలీసులు పశ్చిమ జావాలోని బాండుంగ్ సిటీలో సిస్కైని అరెస్టు చేశారు. అంతేకాదు పోర్నోగ్రఫీ చేసినందుకుగాను సదరు మోడల్‌కు 18 ఏళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు. ఈ కేసులో స్థానిక పోలీసు చీఫ్ ముహ్రొమా ఫజ్రినీ మాట్లాడుతూ.. ‘ఈ వీడియోను అక్టోబర్‌లో చిత్రీకరించారని విమానాశ్రయ సిబ్బంది తెలియజేశారు. మోడల్ ప్రయాణం కోసం కాకుండా ఫోటోషూట్ కోసం ఈ విమానాశ్రయానికి వచ్చింది. ఫోర్నోగ్రఫీ చట్టం, ఐటీఈ చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలపై మోడల్‌ను అరెస్టు చేయడం జరిగిందని’ వెల్లడించారు. మరోవైపు మోడల్.. ‘ఇలాంటి ఫోటోలు, వీడియోల వల్ల నేను జనాల్లో చాలా పాపులర్ అయ్యాను. ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను గుర్తిస్తారు. నా అభిమానులలో ఎక్కువ మంది పురుషులే. అనేక ప్రాంతాలకు ప్రయాణం చేశాను కూడా’ అని చెప్పుకొచ్చింది. చదవండి: Omicron: అవసరమైతే మూడో డోస్‌కు కూడా రెడీ! -
ఫేమస్ జైలు మ్యూజియంలు: అండమాన్ సెల్యులార్ జైలులాంటిదే.. మన సికింద్రాబాద్‌లో..
It is not the prisoners who need reformation, it is the prisons జైల్లో ఉన్న ఖైదీలకు కాదు జైలుకే పరివర్తన అవసరం అని అర్థం! ఈ ఆలోచన వచ్చిందంటే తప్పొప్పుల మూలాలు గ్రహించినట్టే.. నాగరికత పరిఢవిల్లినట్టే!! మరి ఒకనాడు కఠిన శిక్షలకు పేరుమోసిన జైళ్లన్నీ ఏం కావాలి? మ్యూజియంలుగా పర్యాటకుల కోసం ముస్తాబవ్వాలి!! అనుకొని ప్రపంచంలోని ఎన్నో దేశాలు తమదగ్గరున్న.. చాలా జైళ్లను మ్యూజియంలుగా మర్చాయి. మన దగ్గర కూడా అండమాన్‌లోని కాలాపానీ జైలునూ మ్యూజియంగా, పర్యాటక కేంద్రంగా మలచారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లోనూ ఓ సెల్యులార్ జైలు ఉంది. పెద్దగా ప్రాచుర్యంలో లేదు.. కాని ప్రాశస్త్యం కలది. దాని గురించి.. దాన్నీ పర్యటనకు పెట్టాలనే అర్జీతో వచ్చిన వ్యాసం ఇది.. చరిత్ర తెలుసుకుందాం.. వర్తమాన అర్జీ గురించి ఆలోచిద్దాం.. ఆ వివరాలు.. భారత స్వాతంత్య్ర పోరాటం 1857 జూలై 17న ఉత్తరాదిన ఎక్కువగా మీరట్, ఢిల్లీ, లక్నో, కాన్పూరు తదితర ప్రాంతాల్లో ప్రారంభమైంది. అదే సమయంలో హైదరాబాద్‌లోని కోఠి సమీపంలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీపై 6,000 మందితో సాయుధ దళాల దాడి జరిగింది. తుర్రేబాజ్ ఖాన్, రాజా మహిపత్ రామ్, మౌల్వీ అల్లావుద్దీన్ తదితరులు నేతృత్వం వహించారు. 1857 జూలై 17, సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అయితే బ్రిటిష్ సేనల ముందు ఎంతటి భీకరపోరాటం చేసినా హైదరాబాద్ సాయుధ దళాలు నిలువలేకపోయాయి. తుర్రేబాజ్ ఖాన్ని పట్టుకుని, బందీని చేసి రెసిడెన్సీ భవనం దగ్గర ఉరితీశారు. అలాగే పట్టుబడిన మౌల్వీ అల్లావుద్దీన్‌ని అండమాన్‌కు పంపారు. అండమాన్ దీవుల్లోనే అతను మరణించాడు. బ్రిటిష్ రెసిడెన్సీపై తిరుగుబాటు చేసిన ఈ మహా నాయకుల జ్ఞాపకార్థం హైదరాబాద్‌లోని కోఠి జంక్షన్లో ఏనుగు తలలతో ఒక రాతి స్మారక చిహ్నాన్నీ ఏర్పాటు చేశారు. కానీ నగరజీవితం దీన్ని గుర్తించేంత తీరికనివ్వట్లేదు జనానికి. ఈ స్మారక స్థూపాన్ని గుర్తించేవారు బహు కొద్దిమందేనని చెప్పాలి. జైలు గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి ఈ కథ చెప్తున్నారేంటీ అని కదా మీ అనుమానం. ఎందుకంటే ఈ కథకు ఆ ఇంట్రడక్షన్‌కు లింక్ ఉంది కనుక. బ్రిటిష్ రెసిడెన్సీపై దాడికి పర్యవసానంగానే 1858లో తిరుమలగిరిలో సెల్యులార్ జైలు నిర్మాణం చేపట్టారు కనుక. బ్రిటన్‌లోని రాణి 2వ ఎలిజెబెత్ అధికార నివాసం ‘‘విండ్సర్ కేజిల్’’ నమూనాలో ఈ జైలును నిర్మించారు. ప్రపంచంలో ఇంకా ఎక్కడా ఈ మాదిరి సెల్యులార్ జైళ్ల నిర్మాణం ఉన్నట్లు ఆధారాలు లేవు. ప్రతి ఒక్కరూ తప్పక చూడాలి సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి చౌరాస్తా నుంచి సైనిక్‌పురికి వెళ్ళే దారిలో సుమారు వంద గజాల దూరంలో ఉంటుందీ జైలు. రోజూ ఆ దారిన వెళ్ళేవారికి ఈ చారిత్రక కట్టడంపైన గాలికి రెపరెపలాడే జాతీయ పతాకం కనిపిస్తుంది కానీ, చాలామందికి ఈ భవనం గురించి బొత్తిగా తెలియదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ భవనం సికింద్రాబాద్‌లోని మిలిటరీ అధికారుల అధీనంలో ఉంది. ఈ జైలుని చూడాలంటే ముందుగా సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరి. అయితే ఆ అధికారులు అందరినీ అనుమతించరు. సుమారు 150 సంవత్సరాల కిందట 1858లో ఈ సెల్యులార్ జైలును కట్టారు. ఇందుకోసం ఆనాడు 4,71,000 రూపాయలను ఖర్చు చేశారు. విశేషమేమంటే, తిరుమలగిరి జైలు నమూనాతో తిరుమలగిరి జైలుకన్నా చిన్న సైజులో, అండమాన్‌లోని కాలాపానీ నిర్మాణం జరిగింది. ఆ వివరాలు ఇక్కడి ప్రాంగణంలో చాలా స్పష్టంగా ఒక ఫలకం మీద రాసున్నాయి. సుమారు 20,344 చదరపు అడుగుల విస్తీర్ణంలో గోతిక్ నిర్మాణ శైలిలో కట్టారు దీన్ని. ఇది ఆకాశం నుంచి చూస్తే, ఏసుక్రీస్తు శిలువ అకారంలో కన్పిస్తుంది. తూర్పు – పడమర, ఉత్తర – దక్షిణ దిక్కుల్లో మూడు అంతస్తుల్లో మొత్తం 75 జైలు గదులను నిర్మించారు. కింది అంతస్తుల్లో 40 గదులున్నాయి. మొదటి అంతస్తులో 35 గదులు వున్నాయి. అంతర్ నిర్మాణం.. జైలు గదుల లోపల గోడకు ఖైదీని గట్టి ఇనుప గొలుసులతో కట్టి ఉంచేలా ఏర్పాటుంది. గదికి మూడు రకాల గట్టి ఇనుప తలుపులున్నాయి. ఖైదీకి తన గదిలో నుంచి బయటకి చూసేందుకు చిన్న కిటికీని అమర్చారు. దీనికీ ఓ ప్రత్యేకత ఉంది. జైలు గదిలోని ఖైదీకి తనకెదురుగా ఉన్నది మాత్రమే కనపడుతుంది. చుట్టుపక్కల ఏముందో, ఏం జరుగుతోందో, ఎవరు ఎటు వెళ్తున్నారో, వస్తున్నారో గమనించడానికి ఏ మాత్రం వీలుండదు. తిరిగి అదే కిటికీని బయట నుంచి చూస్తే, ఆ గదిలోని ప్రతి అంగుళం స్పష్టంగా కనిపిస్తుంది. ఖైదీ ప్రవర్తనను కట్టడి చేయడానికి వీలుగా ఈ కిటికీ నిర్మాణం జరిగిందని చెప్పాలి. ఇదే సెల్యులార్ జైలు నిర్మాణశైలి ప్రత్యేకత అని స్థానిక అధికారులు చెప్పారు. ఇది ఆనాటి బ్రిటిష్ సైన్యాధికారుల కాఠిన్యానికి అద్దం పడుతుంది. ఉరిశిక్ష మూడవ అంతస్తు, ఆ పైభాగాన ఖైదీలకు ఉరిశిక్ష అమలు చేసే ఇనుపకప్పీల ఏర్పాటు ఉంది. ఉరిశిక్ష అమలుకు ముందు ఖైదీకి తన ఇష్ట దైవాన్ని ప్రార్థించే అవకాశం ఇచ్చేవారట. అందుకోసం చిన్న ప్రార్థన మందిరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ గదిలో అన్ని మతాల దేవుళ్ళ చిత్రపటాలు ఉన్నాయి. ఉరితీసే సమయంలో ఇనుపకప్పీలు సక్రమంగా పనిచేయకనో, లేదా మరేదైనా సాంకేతికత కారణం వల్లనో ఉరి గురి తప్పుతుందేమోనని ముందుగానే ఊహించి ఉరికంబం కప్పీల నుంచి సుమారు వంద అడుగుల లోతులో ఒక బావిలాంటి నిర్మాణం చేశారు. ఈ బావిలో పదునైన ఇనుప ఊచలుంచారు. కప్పీల నుంచి ఉరితాడు వదలగానే ఖైదీ ఈ పదునైన ఇనుప ఊచలపై పడి ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రాణాలు వదిలేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఇక్కడ గమనించవచ్చు. అయితే ప్రస్తుతం ఆ ఇనుప ఊచలు ఇక్కడ లేవు. ఉరికంబం యథాప్రకారం సందర్శకులకు కన్పిస్తుంది. ఇక్కడ సుమారుగా 500 మందికి పైగా ఉరిశిక్షను అమలు చేశారని అధికారిక రికార్డులు తెలియజేస్తున్నాయి. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో చాలామంది ఖైదీల్ని ఇక్కడ బందీగా ఉంచారు. ఆపరేషన్ బ్లూస్టార్లోని కొందరు ఖైదీల్ని సైతం ఇక్కడ ఉంచారని, 1994 నుంచి ఈ మిలిటరీ జైలు వినియోగంలో లేదని స్థానిక అధికారులు చెప్పారు. ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీ –125 ఇన్ఫాంట్రీ బెటాలియన్ – ది గార్డు – అధీనంలో ఈ భవన ప్రాంగణం భద్రంగా ఉంది. 1997లో ఇంటాక్ సంస్థ ఈ ప్రాంగణానికి హెరిటేజ్ అవార్డును ప్రకటించింది. గట్టి భద్రత విషయంలో నేటికీ ఏ మాత్రం మార్పు లేదు దీనికి. జైలు శిఖారాగ్రం నుంచి చూస్తే సికింద్రాబాద్ నగర పరిసరాలన్నీ ఆకుపచ్చని చెట్లతో దట్టమైన అడవిలాగా కన్పిస్తాయి. ఈ చరిత్ర గల సెల్యులార్ జైలును స్థానిక సందర్శకులకు అందుబాటులో ఉంచగలిగితే బాగుంటుంది. అండమాన్‌లోని కాలాపానీ నిర్మాణం పూర్తయి నూరేళ్లైన సందర్భంగా కాలాపానీ జైలు ప్రాంగణాన్ని నేషనల్ మ్యూజియంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వేలమంది పర్యాటకులు కాలాపానీని సందర్శిస్తున్నారు. అయితే, తిరుమలగిరిలోని మిలిటరీ జైలు మాత్రం స్థానిక మిలిటరీ అధికారుల ముందుస్తు అనుమతితో, ఆసక్తిగల ఏ కొద్ది మందికో సందర్శించే వీలుంది. ఈ సెల్యులార్ జైలును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే, చారిత్రక పర్యాటక అభిలాషాపరులకి చక్కని అవకాశం కల్పించినట్లవుతుంది. కనీసం ఏడాదిలో ఒక రోజున ముఖ్యంగా జాతీయ పండుగ రోజులైన స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం నాడైనా అనుమతించాలని స్థానికులు కోరుతున్నారు. కాలాపానీ అంటే... హిందీలో కాల్ అంటే కాలము, పానీ అంటే నీరు. అండమాన్‌లో చుట్టూతా సముద్రం కదా. ఈ ప్రాంతానికి వచ్చిన ఖైదీలకు ఇదే చివరి మజిలీ అని ఉద్యమకారుల్ని భయభ్రాంతుల్ని చేయడానికి బ్రిటిష్ వారు కాలాపానీ అని పేరుపెట్టారని చరిత్రకారుల కథనం. అయితే భారత స్వాతంత్య్ర సమరయోధులు, తమ త్యాగనిరతితో కాలాపానీని ఒక మరపురాని మహాతీర్థంగా మలిచారు. అక్కడ గడిపిన ఫ్రీడం ఫైటర్స్ చెప్పిన గాధలు విన్నవారికి వెన్నులోంచి వణుకు వస్తుంది. గానుగలో నూనె గింజలు వేసి, నూనె పట్టాలని, పశువులు కూడా చేయలేనంత పనిని ఖైదీలకు జైలు అధికారులు అప్పగించేవారుట. రాజకీయ ఖైదీలతో అలవికాని పనులు చేయించారు. పరపాలన అంతం కోసం కలలుకంటూ మాటల్లో చెప్పలేని కఠినమైన జీవనం గడిపారు ఆ యోధులు. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టారిక్కడ. అందుకే వీలున్నంత వరకూ ఈ సెల్యులార్ జైలుని ప్రతి ఒక్కరూ తప్పక చూడాలి. అండమాన్‌లోని కాలాపానీని నేషనల్ మ్యూజియంగా ప్రకటించినట్టే. సికిందరాబాద్‌లో వున్న సెల్యులార్ జైలుకి కూడా ప్రభుత్వం ఆ అవకాశం కల్పించాలనేది సగటు నగర ప్రజల ఆకాంక్ష. ఇది అత్యాశేమీ కాదు. దాగ్షై చండీగఢ్‌కు అరవై కిటోమీటర్ల దూరంలో ఉన్న కంటోన్మెంట్ టౌనే దాగ్షై. ఇక్కడున్న జైలు 163 ఏళ్ల నాటిది. ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు శిక్షను అనుభవించారిక్కడ. కఠినకర్మాగారమనే పేరును ఇదీ భరించింది. స్వాతంత్య్రానంతరం 2011 వరకు ఈ జైలు ప్రాంగణం.. దాని చుట్టుపక్కల పరిసరాలూ డంప్ యార్డ్‌గా మారిపోయాయి. ఆ పరిస్థితి చూడలేని దాగ్షై బ్రిగేడ్ కమాండర్ బ్రిగేడియర్ అనంత్ నారాయాణన్ ఈ చారిత్రక స్థలాన్ని మ్యూజియమ్‌గా మార్చాడు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పట్లతో ఉన్న 54 నాలుగు జైలు గదులతో ఒక సెక్షన్‌గా, నాటి పరిస్థితులకు అద్దంపట్టే ఛాయాచిత్రాలతో ఉన్న ప్రాంగణాన్ని మరో సెక్షన్‌గా పర్యటనకోసం తెరిచారు. ఈ మొత్తం జైలులో ఒకే ఒక వీఐపీ సెల్ ఉంది.. చలిమంట కాచుకునే ఫైర్ ప్లేస్, ప్రత్యేకమైన వాష్‌రూమ్‌తో. అందులో మహాత్మాగాంధీ ఉన్నారట. ప్రపంచంలోని ఫేమస్ జైలు మ్యూజియంలు.. కెనడా, ఒంటారియోలోని కింగ్స్టన్ పెనిటెన్షియరీ జైలు మొదలు అమెరికా, ఫిలడెల్ఫియాలోని ఈస్టర్న్ స్టేట్ పెనిటెన్షియరీ జైలు, హాట్ స్ప్రింగ్ డకోటా టెరిటరీ జైలు సహా ఉత్తర అమెరికాలోని మొత్తం ఎనిమిది జైళ్లు మ్యూజియంలుగా మారాయి. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే దేశాల్లో, అలాగే యూరప్‌లోని ఇంగ్లండ్, ఎస్టోనియా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, పోలాండ్, రుమేనియా, రష్యా దేశాల్లో, ఆసియాలోని కంబోడియా, దక్షిణకొరియా, థాయ్‌లాండ్, వియత్నాం, ఆఫ్రికాలోని ఘనా, సెనెగల్, దక్షిణాఫ్రికా, టాంజానియా, అస్ట్రేలియాలోని అస్ట్రేలియా, న్యూజీల్యాండ్ దేశాల్లోని ప్రసిద్ధ జైళ్లనూ మ్యూజియంలుగా మార్చాయి ఆయా దేశాల ప్రభుత్వాలు. అవన్నీ ఇప్పుడు జనాకర్షక పర్యాటక కేంద్రాలుగా అలరారుతున్నాయి. - మల్లాది కృష్ణానంద్ చదవండి: ఒళ్లు నొప్పులా? తక్కువగా అంచనా వేయకండి.. -
రైలులో ప్రాంక్ వీడియో: జైలు పాలైన ప్రాంక్ స్టార్
మాస్కో: స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో సామాజిక మాధ్యమాల వాడకం బాగా పెరిగింది. ఈ సమయంలో ఫోన్ వినియోగదారులకు వినోదం అందించేందుకు తమకు తోచినట్టు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ప్రాంక్ (నటన) వీడియోలు ఒక ఆదాయ పెట్టుబడిగా మారాయి. చిత్రవిచిత్ర ప్రాంక్ వీడియోలు తీసి నెటిజన్ల ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు కరోనా బాధితుడి మాదిరి దగ్గుతూ.. తుమ్ముతూ ఒక్కసారిగా రైలులో కింద పడిపోయాడు. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. ముందే కరోనా భయంతో వణుకుతుంటే ఆ యువకుడు దగ్గుతూ.. తూలుతూ పడిపోవడంతో భయాందోళనకు గురయిన ప్రయాణికులు రైలును ఆపేసి పరుగులు పెట్టారు. కొద్దిసేపటికి ఆ యువకుడు లేచి ‘ఇది ప్రాంక్ వీడియో.. ప్రాంక్ వీడియో’ అనడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో సీక్రెట్ కెమెరా (సీసీ)లో రికార్డవడంతో పరిశీలించిన అధికారులు అతడిపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించడంతో అతడికి రెండేళ్లు జైలు శిక్ష పడింది. ఈ సంఘటన రష్యాలోని మాస్కోలో జరిగింది. మాస్కోలో మెట్రో రైలును ప్రాంక్‌స్టార్‌గా గుర్తింపు పొందిన కరమతుల్లో డిహబోరోవ్ ఎక్కాడు. రైలు మొదలైన కొద్దిసేపటికి ఓ బోగిలోకి వెళ్లి పై విధంగా చేశాడు. 2020 ఫిబ్రవరిలో ఈ ఘటన చేయగా జనాలను భయబ్రాంతులకు గురి చేయడంపై ఆ దేశ పోలీసులు డిహబోరోవ్పై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై కోర్టు తీర్పు ఇచ్చింది. డిహబోరోవ్కు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అతడితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిద్దరికీ న్యాయస్థానం శిక్ష విధించింది. Когда пранк вышел из-под контроля! В Москве задержали шутника, разыгравшего в метро приступ коронавируса. Полиция попросила Черемушкинский суд столицы арестовать молодого человека. pic.twitter.com/fmT17RUijQ — ВЕСТИ (@vesti_news) February 10, 2020 -
దానం నాగేందర్‌కు ఆరు నెలల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఓ ఘర్షణ కేసులో మాజీ మంత్రి దానం నాగేందర్‌కు ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అలాగే రూ.వెయ్యి జరిమానా చెల్లించాలని, లేకపోతే మరో నెల రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి వరప్రసాద్ బుధవారం తీర్పునిచ్చారు. కాగా, ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును నెల రోజులపాటు నిలిపివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. -
కరోనాకాలంలో జైలు శిక్షంటే మరణ శిక్షతో సమానం!
జొహన్నెస్‌బర్గ్: పదవీ కాలంలో అవినీతి ఆరోపణలపై కోర్టు జైలు శిక్ష విధించడంతో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా సానుభూతి పల్లవి అందుకున్నారు. ఇప్పటివరకు విచారణకు హాజరు కానంటూ బీరాలు పలికిన జూమా తాజాగా కొత్తపాట ఆరంభించారు. ఈ వయసులో, కరోనా సమయంలో తాను జైలుకు పోవడమంటే అది మరణ శిక్ష విధించినట్లేనంటూ సానుభూతిపరుల మద్దతుకు యత్నించారు. అంతలోనే తాను జైలుకు భయపడనంటూ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు 1980 కాలం నాటి నిర్భంధాన్ని గుర్తు తెస్తున్నాయంటూ విమర్శించారు. మరోవైపు జుమా అరెస్టును అడ్డుకునేందుకు పలువురు మద్దతుదారులు ఆయన నివాసం చుట్టూ మానవ కవచంలా నిలుచున్నారు. అవినీతి కేసులో 15నెలల జైలు శిక్ష విధించిన కోర్టు ఆయనంతట ఆయనే పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో తన ఇంటి బయట మద్దతుదారులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో 79ఏళ్ల వయసులో జైలుకు పోవడమంటే మరణశిక్ష విధించినట్లేనని, దక్షిణాఫ్రికాలో 1995లోనే మరణ శిక్ష రద్దయిందని చెప్పారు. ఇదే అభ్యర్ధన చేస్తూ ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానంలో తీర్పు పునఃసమీక్ష పిటీషన్ కూడా వేశారు. శనివారం ఈ పిటీషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించి, తదుపరి వాయిదాను జూలై 12కు వేసింది. అప్పటివరకు జైలు శిక్ష అమలు వాయిదా పడనుంది. కరోనా కాలంలో ఇంతమంది మద్దతుదారులు మాస్కుల్లేకుండా గుమికూడినా వారికి జుమా ఎలాంటి సూచనలు చేయలేదు. నిజానికి కరోనా నిబంధనల కాలంలో ఇలాంటి సమావేశం చట్టవ్యతిరేకమైనదని నిపుణులు చెబుతున్నారు. అయితే తమ నాయకుడిని అరెస్టు చేస్తే హింస తప్పదనే సంకేతాలను జుమా మద్దతుదారులిస్తున్నారు. జుమా, ఆయన మద్దతుదారుల ప్రవర్తనను పలువురు తీవ్రంగా ఖండించారు. -
స్వదేశానికి వస్తే ఐదేళ్ల జైలు శిక్ష..!
కాన్బెర్రా: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో రోజు లక్షలాదిగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కాగా ఆస్ట్రేలియా మరో అడుగు ముందుకు వేసి మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఉన్న ఆస్ట్రేలియా పౌరులు 14 రోజుల్లోగా తాము భారత్ నుంచి స్వదేశానికి వెళ్లాలని భావిస్తున్న వారిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని లెక్కచేయకుండా ప్రవేశించిన పౌరులకు ఐదు ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 3 నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ తాత్కాలిక నిషేధ్ఞాలను శుక్రవారం రోజున ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించింది. తమ దేశానికి తిరిగి వచ్చే ఆస్ట్రేలియా పౌరులపై జైలు శిక్ష విధించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద కోవిడ్ హాట్ స్పాట్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హర్ట్ తెలిపారు. తాజా ఆంక్షలపై తాము ఈ నెల 15 న పునరాలోచన చేస్తామని గ్రెగ్ హర్ట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌లో కరోనా కేసులు తగ్గముఖం పట్టిన తరువాత ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామన్నారు. ఈ నిర్ణయంపై పలు ఆస్ట్రేలియన్ పౌరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన మెడికల్ సర్జన్ నీలా జానకీరామన్ దేశానికి తిరిగి వచ్చే ఆస్ట్రేలియన్ పౌరులకు శిక్ష విధించడం హేయమైన చర్యగా భావించారు. ఇండో- ఆస్ట్రేలియన్లు ఈ నిర్ణయాన్ని జాతి వివక్షగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారిని, తమను వేరుగా చూస్తున్నారని ఆమె ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని విమర్శించింది. ఈ సందర్భంగా అమెరికా, యూకే, యూరప్ దేశాల్లో కూడా కోవిడ్ రోగులు లేరా అని ప్రశ్నించారు. మరోవైపు మానవ హక్కుల బృందాలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకునే బదులు క్వారంటైన్ పై దృష్టి పెడితే బాగుండేదని ఆస్ట్రేలియా రైట్స్ వాచ్ డైరెక్టర్ ఎలైన్ పియర్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించడంతో సుమారు 9000 మంది ఆస్ట్రేలియా పౌరులు భారత్‌లో చిక్కుకుపోయారు. చదవండి: ‘భారత్‌లో లాక్డౌన్ పెట్టండి..!’ -
నేడు శశికళ విడుదల
బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆప్తురాలు వీకే శశికళ ఈ రోజు జైలు నుంచి విడుదల కానున్నారు. ప్రస్తుతం ఆమె కోవిడ్ బారిన పడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బుధవారం ఆమెకు పూర్తి విడుదల కలుగుతుందని, దానికి సంబంధించిన తంతు అంతా ఆస్పత్రిలోనే పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ నెల 20న ఆమెకు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి ఎప్పుడు విడుదలవుతారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం ఆమెకు కరోనా లక్షణాలేమీ లేవని, చికిత్స కొనసాగుతోందని వైద్యులు ప్రకటించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఆమె మరో 10 రోజుల పాటు ఆస్పత్రిలో కొనసాగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. -
జనవరి 27న విడుదలకానున్న చిన్నమ్మ..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు జీవితాన్ని వీడి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు శశికళ మార్గం సుగమమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆమె వచ్చే ఏడాది జనవరి 27న విడుదల కానున్నారు. విడుదల సమయంలో చేపట్టాల్సిన బందోబస్తు చర్యలపై కర్ణాటక ప్రభుత్వం గురువారం జారీ చేసిన సర్క్యులర్ చిన్నమ్మ విడుదల విషయాన్ని అనధికారికంగా ధ్రువీకరించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఆమె వదిన ఇళవరసి, అక్క కుమారుడు సుధాకర్ 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ ముగ్గురూ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి శిక్షాకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. గతనెల 17న శశికళ తన జరిమానాను న్యాయవాది ద్వారా బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో చెల్లించారు. ఆ తరువాత ఇళవరసి సైతం జరిమానాను చెల్లించారు. వీఎన్ సుధాకరన్ మాత్రం ఇంకా చెల్లించలేదు. సుధాకరన్ శిక్షాకాలం త్వరలో ముగుస్తున్నందున జరిమానా చెల్లింపునకు అనుమతి, విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన న్యాయవాదులు సెప్టెంబర్ 8న అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తుదితీర్పు వెలువడే నాటికి 122 రోజులు జైల్లో గడిపినందున నాలుగేళ్ల శిక్షాకాలంలో వీటిని మినహాయించుకుని వెంటనే విడుదల చేయాల్సిందిగా సుధాకరన్ న్యాయవాదులు కోర్టుకు విన్న వించారు. విడుదలపై ఆదేశాలు జారీకాగానే జరిమానాను చెల్లిస్తామని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రాగా, జరిమానా చెల్లించగానే శిక్షాకాలం రోజులను కలుపుకుని సుధాకరన్ను వెంటనే విడుదల చేయాలని బెంగళూరు సివిల్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. జరిమానా సొమ్ము చెల్లింపునకు న్యాయవాదులు సిద్ధం అవుతుండగా, రెండు మూడు రోజుల్లో సుధాకరన్ విడుదల కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. చదవండి: (కమల్ హాసన్‌కు నిరాశ.. టార్చ్‌లైట్ పోయే..) వచ్చేనెల 27న శశికళ విడుదల.. ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న సుధాకరన్ విడుదలపై స్పష్టత రావడంతో అదే కేసుకు చెందిన శశికళకు సైతం జైలు నుంచి విముక్తి పొందే రోజు ఆసన్నమైనట్లు తెలుస్తోంది. విచారణ ఖైదీగా శశికళ గడిపిన జైల్లో గడిపిన రోజులను పరిగణనలోకి తీసుకుని వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ రాత్రి 7 లేదా 9.30 గంటలకు శశికళ విడుదల ఖాయమని సమాచారం. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో బెంగళూరు జైలు వద్దకు చేరుకుని శశికళ ఘనస్వాగతం పలికే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వం అంచనా వేసింది. బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి తమిళనాడు సరిహద్దుకు ఆమె చేరే వరకు ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్‌శాఖకు కర్ణాటక ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీచేసింది. దీంతో వచ్చేనెలాఖరులో శశికళ విడుదల ఖాయమని భావించవచ్చు. -
డబ్బు ఆశతో భారీ మూల్యం చెల్లించుకున్న వైద్యుడు
వర్జీనియా: డబ్బు ఆశకు పోయి ఓ డాక్టర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అమెరికాలోని గైనకాలజిస్టు విభాగాంలో పనిచేస్తున్న ఓ డాక్టర్ అవసరం లేకపోయినా శస్త్ర చికిత్సలు చేసి 465 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొన్నాడు. ఈ డాక్టర్ పేరు జావేద్ పర్వేజ్. వర్జీనీయాకు చెందిన ఈ వైద్యుడు గైనకాలజిస్ట్‌గా పనిచేస్తూ సొంతంగా ప్రైవేటు ఆస్పత్రి నడుపుతున్నాడు. అధిక డబ్బు సంపాదించాలనే దురాశతో ఆయన వద్దకు వచ్చిన రోగులకు అవసరం లేకపోయిన శస్త్రచికిత్స చేయాలని సూచించేవాడు. ఈ క్రమంలో ఎక్కువగా అతడు గర్భసంచి సంబంధిత ఆపరేషన్స్ చేసేవాడు. మందులకు తగ్గే జబ్బులకు సైతం ఆపరేషన్ చేసేవాడు. అలా ఈ ప్రబుదుడు పదేళ్లలో 52 మందికి అనవసర శస్త్రచికిత్సలు చేసినట్లు అమెరికా మెడికల్ కౌన్సిల్ గుర్తించింది. (చదవండి: ఈమె 8 మంది శిశువులను చంపారట!) అయితే ఓ డాక్టర్ పదేళ్లలో సగటున 7.63 శాతం మాత్రమే ఆపరేషన్స్ చేయాల్సి ఉంటుంది. జావేద్ పర్వేజ్ మాత్రం పదేళ్లలో ఏకంగా 41.26 శాతం శస్త్ర చికిత్సలు చేశాడు. ఈ వైద్యుడి వద్దకు చికిత్సకు వెళ్లిన కొంతమంది మహిళలు అనుమానంతో మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. జావేద్ ఆస్పత్రిపై రైడ్ చేసిన మెడికల్ కౌన్సిల్ పదేళ్లలో 41.26 శాతం ఆపరేషన్స్ చేసినట్లు గుర్తించింది. అతడిని విచారించగా అధిక డబ్బు గడించాలనే ఆశతోనే ఇలా చేసినట్లు సదరు వైద్యుడు ఒప్పుకున్నాడు. దీంతో వర్జీనియా న్యాయస్థానం అతడికి దాదాపు 465 ఏళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: ట్రంప్ వైఖరి ఇబ్బందికరమే) -
ఇక ఊరుకోరు.. రూ.కోటి జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం పతాక స్థాయికి చేరుకుంది. రానున్నది శీతకాలం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్రం.. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కమిషన్ని ఏర్పాటు చేస్తూ కొత్త ఆర్డినెన్స్‌ని తీసుకువచ్చింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఫర్ ఢిల్లీ-ఎన్సీఆర్ పేరిట దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ నూతన నిబంధనల ప్రకారం కాలుష్య కారకులకు ఐదేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా విధించనున్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారితో పాటు పర్యావరణ కాలుష్యానికి పాల్పడేవారిపై కేసు నమోదు చేసే అధికారం కమిషన్‌కి ఉంది. అంతేకాక హరియాణా, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కూడా ఈ కమిషన్ పరిధిలోకి చేర్చుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: రాష్ట్రపతి భవన్ వద్ద తొమ్మిదేళ్ల బాలిక నిరసన) 18 మంది సభ్యులు.. మూడేళ్ల పదవి కాలం 18 మంది సభ్యులతో ఏర్పడనున్న ఈ కమిషన్‌కి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి పూర్తికాలం చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇక 18 మంది సభ్యుల్లో పది మంది అధికారులు, బ్యూరోక్రాట్లు ఉండగా, మరికొందరు నిపుణులు, కార్యకర్తలు ఉండనున్నారు. వీరిని పర్యావరణ మంత్రి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీతో పాటు మరో ముగ్గురు మంత్రులు, క్యాబినేట్ కార్యదర్శి మూడేళ్ల పదవీ కాలానికి నియమిస్తారు. ఈ కమిషన్ వాయు నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు దానికి సంబంధించిన చట్టాలను అమలు చేస్తుంది. అలానే కాలుష్య స్థాయిలను నియంత్రించడానికి పరిశోధన, ఆవిష్కరణల కోసం ఉప సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చంటూ కేంద్రం ఆర్డినెన్స్‌లో పేర్నొన్నది. పంట వ్యర్థాల దహనం, కాలుష్యానికి సంబసంధించిన అన్ని ఇతర అంశాలను కమిషన్ పరిశీలిస్తుంది. ఇక తన వార్షిక నివేదికలను కమిషన్ పార్లమెంటుకు సమర్పించనుంది. (చదవండి: ఎట్టకేలకు కాలుష్యంపై చట్టం) కమిషన్‌కు విస్తృత అధికారాలు.. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు, దాని ఏజెన్సీలు, కమిషన్ ఆదేశాల మధ్య సంఘర్షణ విషయాలలో దీనికే ఎక్కువ అధికారాలుండటం విశేషం. ఈ కమిషన్‌కు విస్తృత అధికారాలు ఇవ్వబడ్డాయి. ఏదైనా ప్రాంగణాన్ని పరిశీలించడానికి, కాలుష్య యూనిట్లను మూసివేయడానికి.. విద్యుత్తు, నీటి సరఫరాను డిస్కనెక్ట్ చేయడానికి ఆర్డర్లు జారీ చేసే అధికారం కమిషన్‌కు ఉంటుంది. కమిషన్ ఏదైనా ఉత్తర్వు, ఆదేశాన్ని ఉల్లంఘిస్తే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 1 కోట్ల రూపాయల జరిమానా విధించవచ్చు. కమిషన్ ఆదేశాలకు వ్యతిరేకంగా వచ్చే అన్ని విజ్ఞప్తులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు మాత్రమే ఉంటాయి. సంబంధిత ఆదేశాలపై ఎటువంటి ఆదేశాలు జారీ చేయడానికి లేదా ఫిర్యాదు చేయడానికి ఇతర సంస్థలకు అధికారం ఉండదు. -
సంచలనం : ఢిల్లీ స్పీకర్‌కు ఆరు నెలల జైలు
న్యూఢిల్లీ : ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్, అతని కుమారుడు సుమిత్ గోయెల్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జైలు శిక్షతో పాటు చెరో వెయ్యి రూపాయల జరిమానా విధించింది. వివరాలు.. 2015 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శాదర నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రామ్ నివాస్ గోయెల్ పోటీ చేశారు. ప్రత్యర్థి తరపున ఓటర్లకు మద్యం, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారనే అనుమానంతో వివేక్ విహార్‌లోని మనీశ్ ఘాయి అనే స్థానిక బిల్డర్ ఇంట్లోకి తన అనుచరులతో కలిసి అక్రమంగా చొరబడి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇంట్లోని పర్నీచర్ను ధ్వంసం చేయడంతో పాటు అడ్డొచ్చిన పని మనుషులపై దాడి చేశారు. దీంతో బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రామ్ నివాస్‌పై సెక్షన్ 448 కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం 2017 సెప్టెంబర్‌లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటు ఏడుగురిని దోషులుగా తేల్చింది. తాజాగా ఇప్పుడు శిక్ష ఖరారైంది. అయితే సెక్షన్ 448 ప్రకారం గరిష్టంగా ఏడాది మాత్రమే శిక్ష విధించాలి. దీంతో రాజ్యాంగబద్ధంగా స్పీకర్ అనర్హత వేటుకి గురికారు. అయితే, గతంలో ఈ ఆరోపణలను రామ్ నివాస్ గోయెల్ ఖండించారు. ఘటనకు ముందు ప్రైవేట్ ఫిర్యాదునిచ్చి పోలీసుల సహాయంతోనే మనీశ్ ఘాయి ఇంటికి వెళ్లామనడం గమనార్హం. -
ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారని శిక్ష
సాక్షి, కొత్తగూడెం(అన్నపురెడ్డిపల్లి) : అటవీశాఖ, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో నేరం రుజువు కావడంతో మొత్తం 24 మందికి సంవత్సరం జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.700 చొప్పున జరిమానా విధిస్తూ కొత్తగూడెం 3వ అదనపు కోర్టులో గురువారం తీర్పువెలువడింది. 2015 సంవత్సరానికి పూర్వం అన్నపురెడ్డి మండలం మర్రిగూడెం గ్రామ పరిసర అటవీభూముల్లో స్థానిక గిరిజనులు పోడు సాగుచేసుకున్నారు. ఆ భూములు అటవీశాఖవి కావడంతో ఆ శాఖ ఉద్యోగులు 2015 సం వత్సరంలో మొక్కల పెంపకం చేపట్టారు. కాగా తాము సాగుచేసుకుంటున్న భూముల్లో మొక్క లు నాటారంటూ స్థానికులు సుమారు 500 మంది న్యూడెమోక్రసీ, సీపీఎం ఆధ్వర్యంలో అటవీశాఖ ఉద్యోగులను అడ్డుకున్నారు. అటవీ శాఖ ఉద్యోగుల ఫిర్యాదుమేరకు పోలీస్‌స్టేషన్‌లో ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం తదితర నేరారోపణతో కేసు నమోదయింది. న్యూడెమోక్రసీ, సీపీఎం నాయకులు ఎస్కే ఉమర్, కాక మహేశ్లతోపాటు మొత్తం 24 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో స్థానికులు 22 మంది ఉన్నారు. ఇటీవల ఈ కేసులో సుమారు 14 మంది సాక్షులను న్యాయమూర్తి దేవీమానస విచారించారు. నేరం రుజువైనం దున సంవత్సరం జైలుశిక్ష, ఒక్కొ్కరికి రూ.700 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది ఫణికుమార్ వాదించగా లైజన్ ఆఫీసర్ వీరబాబు సహకరించారు. -
అంగీకారంతో పెళ్లాడినా.. ఏడేళ్లు శిక్ష
చిత్తూరు అర్బన్: ‘‘మైనర్ బాలికలను వారి అంగీకారంతో పెళ్లాడినా.. కాపురం చేసినా అది చట్టరీత్యా నేరమే. దీనికి ఏడేళ్లకు మించి జైలుశిక్ష పడుతుంది. పిల్లల్ని లైంగిక దాడుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. మం చి సమాజాన్ని నిర్మించుకుని అందులో పిల్లల్ని స్వేచ్ఛగా బతకనిద్దాం..’’ అని జిల్లా ప్ర ధాన న్యాయమూర్తి మౌలాన్ జునైద్ అహ్మద్ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో ‘పిల్లలపై లైంగిక వేధిం పుల నిరోధక చట్టం (ఫోక్సో)’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. జిల్లా పోలీసు శాఖ, విద్యాశాఖ సంయుక్తంగా ఇందులో పాల్గొన్నాయి. సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ పిల్లల్ని లైంగిక వేధింపుల నుంచి కాపాడే చట్టాలపై విస్తృతంగా చర్చ జరగాలన్నారు. నేరాలను తగ్గించడమే లక్ష్యంగా పోలీసుశాఖ, విద్యాశాఖ అవగాహన కల్పించాలన్నారు. చెడు ప్రభావాల నుంచి పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ 18 ఏళ్ల వయస్సు నిండని బాలికలను వివాహమాడి, వారితో కాపురం పెట్టినా దానికి చట్టబద్ధత ఉండదన్నారు. అమ్మాయి సమ్మతంతోనే పెళ్లి జరిగినా చెల్లదని, పైగా పెళ్లాడిన వ్యక్తిపై కిడ్నాప్, రేప్ కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు. అసలు పిల్లలపై లైంగిక దాడులు అరికట్టాలంటే పాఠశాల స్థాయిలోనే ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. పోలీసు శాఖ ఇందులో బాధ్యతగా పనిచేస్తోందని.. గుడ్, బ్యాడ్ టచ్ పేరిట తోడేలు ముసుగులో ఉన్న మగాళ్ల వేషాలను వివరిస్తూ వెయ్యికి పైగా పాఠశాలల్లో పిల్లలకు వీడియోల ద్వారా అవగాహన కల్పించామన్నారు. సమాజంలో ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు పిల్లలు ధైర్యంగా మాట్లాడగలిగేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగయ్య మాట్లాడుతూ పిల్లలో వచ్చే శారీరక మార్పులు, హార్మోన్ల ప్రభావం వల్ల యుక్త వయస్సులో ఆకర్షణకు లోనవుతుంటారన్నారు. ఈ ఆకర్షణ బాధ్యతవైపు నడిపించేలా తల్లిదండ్రులు, గురువులు ప్రేరణ కల్పించాలన్నారు. అప్పుడే చెడు మార్గాలవైపు వెళ్లకుండా లక్ష్యాలను కేటా యించుకుని జీవితంలో నిలదొక్కుకుంటారన్నా రు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగశైలజ, ఏఎస్పీ సుప్రజ, మహిళా స్టేషన్ డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. -
వైరా చిట్‌ఫండ్ మోసగాళ్లకు జైలుశిక్ష
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపుగా 400మంది నుంచి చిట్టీల రూపంలో కొన్ని కోట్ల రూపాయలను వసూలు చేసి, టోపీ పెట్టిన కేసులో వైరాలోని సాయిప్రసన్న చిట్‌ఫండ్ నిర్వాహకులు ముగ్గురికి జైలు శిక్ష, భారీగా జరిమానా పడింది. ఈ మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ మంగళవారం తీర్పుచెప్పారు. ఖమ్మంలీగల్ : దొండిగర్ల బాలశౌరి, అతని కుటుంబీకులు కలిసి వైరాలో సాయి ప్రసన్న చిట్‌ఫండ్ పేరుతో 1996లో వ్యాపారం ప్రారంభించారు. సుమారు పదేళ్లపాటు సాగించారు. చందాదారులకు నమ్మకం కలిగించారు. ఈ చందాదారుల్లో అనేకమంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. చిట్టీ డబ్బుల కింద వీరిలో అనేకమందికి చిట్‌ఫండ్ నిర్వాహకులు చెక్కులు ఇచ్చారు. అవి చెల్లలేదు. చందాదారులు ఒత్తిడి చేయడంతో.. ‘‘నెల్లూరు, విశాఖపట్నం, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. మీ డబ్బుకు ఎటువంటి ఢోకా లేదు’’ అంటూ అందరినీ బాలశౌరి నమ్మించాడు. ∙2010, డిసెంబర్ 16న ఇతడి కుటుంబం మొత్తం వైరాలోని ఇల్లు ఖాళీ చేసి ఎటో వెళ్లిపోయింది. కొన్నాళ్ల తర్వాత, వైరాలోని పెద్దలు పంచాయితీ పెట్టారు. వైరాలోగల ఆస్తులను అమ్మి, ఎవరి డబ్బు వారికి ఇస్తామని బాలశౌరి, ఆయన పెద్ద కుమారుడు వరప్రసాద్ హామీ ఇచ్చారు. ఇదంతా 2011 వరకు సాగింది. చెప్పిన ప్రకారంగా బాలశౌరి, ఆయన కుమారుడు.. బాధితులకు డబ్బు ఇవ్వలేదు. దీంతో దాదాపుగా 400 బాధితుల తరఫున కలిసి వైరా పోలీసులకు రాయల వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. కోర్టులో చార్జిషీటును పోలీసులు దాఖలు చేశారు. మొత్తం 49మంది సాక్షులుగా చూపించారు. ఈ కేసులో తీర్పును మంగళవారం న్యాయమూర్తి వెలువరించారు. నేరం రుజువైందని నిర్థారించారు. బాలశౌరికి ఐపీసీ 406 సెక్షన్ కింద మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.25లక్షల జరిమానా, 420 ఐపీసీ కింద ఐదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.30లక్షల జరిమానా, సెక్షన్ 5 ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1999 కింద ఏడేళ్ల జైలుశిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించారు. మరో నిందితురాలు దొడ్డిగర్ల శాంతకు ఐపీసీ 406 సెక్షన్ కింద రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా, ఐపీసీ 420 కింద మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.20లక్షల జరిమానా, సెక్షన్ 5 ఏపీపీ డీఎఫ్ఈ యాక్ట్ 1999 కింద నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.50వేల జరిమానా విధించారు. నాలుగో నిందితుడైన దొడ్డిగొర్ల ప్రసన్నకుమార్‌కు ఐపీసీ 406 సెక్షన్ కింద రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ.12లక్షల జరిమానా, ఐపీసీ 420 కింద మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.20లక్షల జరిమానా, సెక్షన్ 5 ఏపీపీ డీఎఫ్ఈ యాక్ట్ 1999 కింద నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.50వేల జరిమానా విధించారు. మూడవ నిందితుడైన దొడ్డిగర్ల వరప్రసాద్‌పై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషిగా విడుదల చేశారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఆర్.ఉపేందర్ వ్యవహరించారు. లైజన్ ఆఫీసర్ పి.భాస్కర్‌రావు, కోర్టు కానిస్టేబుల్ కె.చెన్నారావు, హోంగార్డ్ ఎస్డి.యూసుఫ్ సహకరించారు. -
మద్యం బాబులకు జైలు, జరిమానా
గజ్వేల్‌రూరల్ : మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికి జైలు, మరో ఇద్దరికి జరిమానా విధిస్తూ గజ్వేల్ మున్సిఫ్ కోర్టు జడ్జి రవీందర్ సత్తు తీర్పునిచ్చినట్లు గజ్వేల్ ట్రాఫిక్ సీఐ నర్సింహారావు గురువారం తెలిపారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తా వద్ద రెండ్రోజుల క్రితం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా... నలుగురు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు బ్రీత్ ఎనలైజర్ ద్వారా గుర్తించామన్నారు. వీరిని గజ్వేల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. ప్రజ్ఞాపూర్‌కు చెందిన అశోక్‌కు మూడు రోజుల జైలు, చౌదర్‌పల్లికి చెందిన అయ్యలంకు ఒక రోజు జైలు శిక్ష, బెజుగామకు చెందిన నర్సింలుకు రూ. 1500, చౌదర్‌పల్లికి చెందిన బీరయ్యకు రూ. 1500 జరిమానా విధించారని తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సత్యనారాయణ ఉన్నారు. -
కట్నం కోసం వేధించిన భర్తకు ఏడాది జైలు
బోధన్ టౌన్: భార్యను అదనపు కట్నం కోసం వేధించిన కేసులో సాక్షధారాలు రుజువు కావడంతో భర్తకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ మంగళవారం జూనియర్ సివిల్ జడ్జి ఈశ్వరయ్య తీర్పు వెల్లడించారు. పీపీ కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని శక్కర్‌నగర్ చౌరస్తాకు చెందిన ప్రభుత్వ టీచర్ మదనగిరి వరలక్ష్మి వరంగల్ జిల్లా జనగామ మండలం పతమల్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌గౌడ్‌తో 4–5–2007లో వివాహమైందని, పెళ్ళి సమయంలో రెండున్నర లక్షలు, రెండుతులాల బంగారం, ఒక ప్యాషణ్ ప్రో బైకు, రూ.లక్ష విలువ చేసే ఇంటి సామగ్రి ఇచ్చారని తెలిపారు. కొన్ని రోజులు పాటు బాగానే ఉన్నారని అదనంగా కట్నం ఇవ్వాలని భర్త, అత్త, మరిది, మరిది భార్య, బావ, బావ భార్య వేధించారని, కొన్ని రోజులు బోధన్‌లో నివాసం ఉన్నారన్నారు. అయినా వేధింపులు తగ్గక పోవడంతో వరలక్ష్మి 17–7–2012న బోధన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు 498ఏ, 3అండ్4, డీసీఆర్ కేసునమోదు చేశారు. సాక్షధారాలు రుజువు కావడంతో భర్తకు యేడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమాన, జరిమాన కట్టకుంటే 2 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారని తెలిపారు -
మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి జైలుశిక్ష
సారవకోట : మండలంలో ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి పాతపట్నం కోర్టు న్యాయమూర్తి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. మండలంలోని పలుచోట్ల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో మండలానికి చెందిన ఏడుగురిపై ఇటీవల కేసులు పెట్టామని దీనిపై విచారణ చేపట్టిన ఆయన వారికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించారన్నారు. -
‘రోడ్డు’ నేరస్తులపై కొరడా!
ప్రమాదాలకు పాల్పడితే భారీ జరిమానాలు, జైలుశిక్ష - పిల్లలు మరణిస్తే రూ. 3 లక్షల జరిమానా, ఏడేళ్ల జైలు - కొత్త మోటారు వాహనాల బిల్లులో ప్రతిపాదనలు న్యూఢిల్లీ: దేశంలో ఏటా లక్షన్నర మందిని బలిగొంటున్న రోడ్డు ప్రమాదాలకు, వాటికి కారణమయ్యే వారికి చెక్ పెట్టేందుకు కేంద్రం కొరడా ఝళిపించనుంది. రహదారి భద్రత పెంచి, నిబంధనలు ఉల్లంఘించే నేరస్తులపై ఉక్కుపాదం మోపేందుకు కొత్త మోటారు వాహనాల బిల్లును ప్రతిపాదించింది. ఇందులో భారీ జరిమానాలు, ఏడేళ్లకుపైగా జైలు శిక్ష, వాహనాల జప్తు, డ్రైవింగ్ లెసైన్సుల రద్దు తదితర ప్రతిపాదనలు ఉన్నాయి. ‘కొత్త రోడ్డు భద్రత, రవాణా బిల్లు-2014’ పేరుతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మం త్రిత్వ శాఖ శనివారం దీన్ని విడుదల చేసింది. ప్రజల నుంచి, సంబంధిత రంగాల నుంచి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించేందుకు దీని వివరాలు వెల్లడించింది. సలహాలు స్వీకరించాక బిల్లును ఖరారు చేసి శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెడతారు. బిల్లులోని ముఖ్య ప్రతిపాదనలు.. ► కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదంలో పిల్లల మృతికి కారణమైతే నేరస్తుడికి రూ. 3 లక్షల జరిమానా, ఏడేళ్లకు తక్కువ కాకుండా జైలుశిక్ష. ► వాహనాల తయారీ డిజైన్‌లో లోపాలుంటే ఒక్కో వాహనానికి రూ. 5 లక్షల జరిమానా, జైలుశిక్ష. వాహనాలను సురక్షితంకాని పరిస్థితుల్లో నడిపితే రూ. 1 లక్షవరకు జరిమానా, లేదా ఆరు నెలల నుంచి ఏడాది జైలుశిక్ష, లేదా ఇవి రెండూ. ► మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే(తొలి నేరం కింద) రూ.25 వేల జరిమానా, లేదా మూడు నెలలకు మించని జైలుశిక్ష, లేదా ఇవి రెండూ, ఆరు నెలలు డ్రైవింగ్ లెసైన్స్ సస్పెన్షన్. మూడేళ్లలోపు రెండోసారి ఈ నేరానికి పాల్పడితే రూ. 50వేల పెనాల్టీ, లేదా ఏడాది జైలు శిక్ష, లేదా ఇవి రెండూ. వీటితోపాటు లెసైన్స్ ఏడాది సస్పెన్షన్. తర్వాత కూడా డ్రంక్ డ్రైవింగ్ చేస్తే లెసైన్స్ రద్దు, 30 రోజుల వరకు వాహనం జప్తు. ► స్కూల్ బస్సు డ్రైవర్ మద్యం తాగి నడిపితే రూ. 50 వేల జరిమానా, మూడేళ్లవరకు జైలుశిక్ష. 18-25 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులు ఇలాంటి నేరానికి పాల్పడితే వెంటనే లెసైన్స్ రద్దు. జరిమానాల విధింపు కోసం గ్రేడెడ్ పాయింట్ వ్యవస్థ. ► ట్రాఫిక్ సిగ్నళ్లను మూడుసార్లు ఉల్లంఘిస్తే రూ. 15 వేల జరిమానా. నెలపాటు లెసైన్స్ రద్దు, తప్పనిసరిగా తాజా డ్రైవింగ్ శిక్షణ. పదేపదే ప్రమాదాలకు కారణమయ్యేవారిని గుర్తించేందుకు ఎలక్ట్రానిక్ డిటెక్షన్, కేంద్రీకృత నేర సమాచార వ్యవస్థ. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద సీసీటీవీలు. వాహనాల్లో వేగ నియంత్రణ, డ్రైవర్ల నిద్రమత్తు గుర్తింపు తదితర భద్రతా పరికరాల ఏర్పాటు. ► ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన తొలి గంటలోనే(గోల్డెన్ అవర్) నగదు రహిత చికిత్స మోటార్ యాక్సిడెంట్ ఫండ్ ఏర్పాటు. దీనికింద.. రోడ్డు వాడుకునే వారందరినీ తప్పనిసరిగా బీమా పరిధిలోకి తెస్తారు. క్షతగాత్రులు, ప్రమాద మృతుల బంధువులు దీన్నుంచి డబ్బు కోరవచ్చు. లక్ష్యాలు.. వచ్చే ఐదేళ్లలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యను రెండు లక్షలమేర తగ్గించడం. ప్రస్తుతం ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగుతుండగా, 1.4 లక్షల మంది చనిపోతున్నారు. ► స్వతంత్రప్రతిపత్తిగల మోటారు వాహనాల నియంత్రణ- రోడ్డు భద్రత ప్రాధికార సంస్థ ఏర్పాటు. వాహనాలకు సంబంధించి మెరుగైన డిజైన్లు. భారీవాహనాల రీడిజైనింగ్. ► డ్రైవింగ్ లెసైన్సుల జారీకి సింగిల్‌విండో ఆటోమేటెడ్ వ్యవస్థ. ఆటోమేటెడ్ డ్రైవింగ్ పరీక్ష, నకిలీ లెసైన్సుల నియంత్రణకు బయోమెట్రిక్ విధానం. వాహనాల తయారీదారులు, రవాణా విభాగాలు, బీమా కంపెనీల కోసం సమగ్ర డేటాబేస్. సులభంగా వాహనాల బదిలీ. ► వాహనాల ఏకీకృత రిజిస్ట్రేషన్ వ్యవస్థ, నేషనల్ రోడ్ ట్రాన్స్పోర్ట్-మల్టీనేషనల్ కోఆర్డినేషన్ అథారిటీ, జాతీయ రహదారులపై ట్రాఫిక్ నియంత్రణ కోసం హైవే ట్రాఫిక్ రెగ్యులేషన్-ప్రొటెక్షన్ ఫోర్స్. గూడ్స్ ట్రాన్స్పోర్ట్-నేషనల్ ఫ్రైట్ పాలసీ. ► రోడ్డు రవాణా సామర్థ్యం, భద్రత పెంపుతో స్థూల జాతీయోత్పత్తి 4 శాతం పెరుగుతుందని అంచనా. ఈ రంగంలో పెట్టుబడుల పెంపు ద్వారా 10 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ► అభివృద్ధి చెందిన అమెరికా, కెనడా, సింగపూర్, జపాన్, బ్రిటన్, జర్మనీల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలకు అనుగుణంగా ఈ బిల్లు రూపొందించారు. కాగా, వేగం, సామర్థ్యం, సురక్షితం, లాభదాయకమైన రవాణా వ్యవస్థను నెలకొల్పడం ఈ బిల్లు లక్ష్యమని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ఈ రంగంలో పారదర్శకత కోసం ఈ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యమిచ్చామన్నారు. యాక్సిడెంట్ నిధితో ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందుతుందని, లక్షలాది ప్రాణాలను కాపాడొడచ్చని ట్విట్టర్లో పేర్కొన్నారు.