కాన్‌బెర్రా: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో రోజు లక్షలాదిగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కాగా ఆస్ట్రేలియా మరో అడుగు ముందుకు వేసి మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఉన్న ఆస్ట్రేలియా పౌరులు 14 రోజుల్లోగా తాము భారత్ నుంచి స్వదేశానికి వెళ్లాలని భావిస్తున్న వారిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని లెక్కచేయకుండా ప్రవేశించిన పౌరులకు ఐదు ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 3 నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ తాత్కాలిక నిషేధ్ఞాలను శుక్రవారం రోజున ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించింది. తమ దేశానికి తిరిగి వచ్చే ఆస్ట్రేలియా పౌరులపై జైలు శిక్ష విధించడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద కోవిడ్ హాట్ స్పాట్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హర్ట్ తెలిపారు. తాజా ఆంక్షలపై తాము ఈ నెల 15 న పునరాలోచన చేస్తామని గ్రెగ్ హర్ట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌లో కరోనా కేసులు తగ్గముఖం పట్టిన తరువాత ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామన్నారు. ఈ నిర్ణయంపై పలు ఆస్ట్రేలియన్ పౌరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన మెడికల్ సర్జన్ నీలా జానకీరామన్ దేశానికి తిరిగి వచ్చే ఆస్ట్రేలియన్ పౌరులకు శిక్ష విధించడం హేయమైన చర్యగా భావించారు. ఇండో- ఆస్ట్రేలియన్లు ఈ నిర్ణయాన్ని జాతి వివక్షగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారిని, తమను వేరుగా చూస్తున్నారని ఆమె ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని విమర్శించింది. ఈ సందర్భంగా అమెరికా, యూకే, యూరప్ దేశాల్లో కూడా కోవిడ్ రోగులు లేరా అని ప్రశ్నించారు.
మరోవైపు మానవ హక్కుల బృందాలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకునే బదులు క్వారంటైన్ పై దృష్టి పెడితే బాగుండేదని ఆస్ట్రేలియా రైట్స్ వాచ్ డైరెక్టర్ ఎలైన్ పియర్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించడంతో సుమారు 9000 మంది ఆస్ట్రేలియా పౌరులు భారత్‌లో చిక్కుకుపోయారు.
Comments
Please login to add a commentAdd a comment