సిడ్నీ: కోవిడ్-19పై భారత్ అలుపెరుగని పోరాటం చేస్తోందని, త్వరలోనే మహమ్మారిని తరిమికొట్టి పూర్వపు వైభవాన్ని సంతరించుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. స్థానిక పరిస్థితుల గురించి తెలియకుండా ఆ దేశం గురించి ఇష్టారీతిన మాట్లాడటం సరికాదంటూ పరోక్షంగా విమర్శకులకు చురకలు అంటించాడు. ఈ ఆసీస్ ఆటగాడికి భారత్ అంటే ప్రత్యేక అభిమానం అన్న సంగతి తెలిసిందే. ఎన్నోసార్లు తానే ఈ విషయాన్ని స్వయంగా పంచుకున్నాడు.
ఇక ఇండియాను తన రెండో ఇల్లుగా భావించే హెడెన్, కరోనా సంక్షోభం గురించి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగతంగా నాకెన్నో పాఠాలు నేర్పిన దేశం పట్ల నాకెంతో ప్రేమ, సానుభూతి ఉన్నాయి. ఇండియాతో పాటు అక్కడి మనుషులతో నాకు ఏదో తెలియని బంధం ఉంది. భిన్న సంస్కృతుల సమ్మేళనం. అందుకే అక్కడి నుంచి వెళ్లిపోవాలంటే నాకేదో తెలియని చిరాకు, విసుగు పుడుతుంది. ప్రస్తుతం మిగతా దేశాలతో పోలిస్తే, అత్యధిక జనాభా ఉన్న ఇండియా తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటోంది.
అయితే, అక్కడి ప్రజలు చాలా దయగలిగిన వారు. ఇతరుల పట్ల ప్రేమానురాగాలు చూపిస్తారు. త్వరలోనే వారు మళ్లీ మునుపటి జీవితాన్ని గడుపుతారు. మూడు దశాబ్దాలుగా ఓ యాత్రికుడిగా, ఓ సోదరుడిగా వారి ఆప్యాయతను పొందుతున్నాను. అందుకు నేనెంతో గర్వపడుతున్నాను. అలాంటి అందమైన దేశం గురించి పూర్తిగా తెలుసుకోకుండా కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అది సరికాదు. కరోనాపై పోరులో భారత్ బాగానే పనిచేస్తోంది. కఠిన సమయాల్లో వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: Ab De Villiers: వేరే లెవల్.. ధోని, కోహ్లి మాదిరిగానే!
Comments
Please login to add a commentAdd a comment