చతుర్భుజ సంకీర్ణ కూటమి భేటీ రేపే | Quad summit on March 12 | Sakshi
Sakshi News home page

చతుర్భుజ సంకీర్ణ కూటమి భేటీ రేపే

Published Thu, Mar 11 2021 4:51 AM | Last Updated on Thu, Mar 11 2021 7:59 AM

Quad summit on March 12 - Sakshi

నరేంద్ర మోదీ, జో బైడెన్‌, స్కాట్‌ మారిసన్‌, యోషిహిడో

వాషింగ్టన్‌: చతుర్భుజ సంకీర్ణ కూటమిలో (క్వాడ్‌) భాగస్వామ్య పక్షాలైన అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాధినేతలు శుక్రవారం తొలి సారిగా సమావేశం కానున్నారు. మార్చి 12న జరిగే ఆన్‌లైన్‌ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్, జపాన్‌ ప్రధాని యోషిహిడో సుగాలు పాల్గొంటారు. బైడెన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ప్రధాని మోదీ మొదటి సారిగా ఆయనతో ఈ సదస్సులో  చర్చించను న్నారు. ప్రపంచ దేశాలను కరోనా కుదిపేస్తున్న నేపథ్యంలో భారత్‌లో వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పలు ఆర్థిక ఒప్పందాలను ఈ సదస్సులో ప్రకటించే అవకాశం ఉందని అమెరికా వైట్‌ హౌస్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

అమెరికా ఔషధ సంస్థలైన నోవావాక్స్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు చెందిన వ్యాక్సిన్‌ల తయారీ భారత్‌లో చేపట్టేలా ఈ సదస్సులో ఒప్పందం కుదిరే అవకాశాలైతే కనిపిస్తు న్నాయి. కరోనా వైరస్‌పై యుద్ధం చేయడం, ఇండో ఫసిఫిక్‌ ప్రాంతంలో చైనా మిలటరీ శక్తిని దుర్వినియోగంపై చర్చించడమే ఈ క్వాడ్‌ సదస్సు ముఖ్య ఉద్దేశంగా ఉంది. వ్యాక్సినేషన్‌ని మరింత వేగవంతం చేస్తే కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చునని, భారత్‌లో టీకా డోసుల తయారీని పెంచి ఆగ్నేయాసియా దేశాలకు పంపిణీ చేయాలని క్వాడ్‌ దేశాలు యోచిస్తున్నాయి. మరోవైపు కోవిడ్‌–19 సంక్షోభంతో పాటుగా ఆర్థిక సహకారం, వాతావరణం మార్పులు వంటి అంతర్జాతీయ సమస్యలపై ఈ సదస్సులో లోతుగా చర్చించను న్నట్టుగా వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌సాకి చెప్పారు. 2004లో సునామీ ముంచెత్తిన తర్వాత క్వాడ్‌ కూటమి ఏర్పాటైంది. అప్పట్నుంచి విదేశాంగ ప్రతినిధులే సమావేశాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఆ కూటమి ఏర్పాటైన ఇన్నేళ్లకి తొలిసారిగా దేశాధినేతలు సమావేశం కానున్నారు.

చైనాకు చెక్‌ పెట్టే వ్యూహాలు
ఇండో ఫసిఫిక్‌ ప్రాంతంలో చైనా మిలటరీ ఆధిపత్యానికి చెక్‌ పెట్టేలా ఈ సదస్సులో వ్యూహ రచనకు నాలుగు దేశాలు సిద్ధమవుతున్నాయి. దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రంలో డ్రాగన్‌ దేశం పట్టు బిగిస్తూ ఉండడంతో క్వాడ్‌ సదస్సు ద్వారా ఆ దేశానికి గట్టి హెచ్చరికలు చేయాలనే ఉద్దేశంలో బైడెన్‌ ఉన్నారు. ఈ సమా వేశం ద్వారా ప్రాంతీయంగా శాంతి స్థాపన జరగా లని కోరుకుంటున్నట్టుగా చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement