న్యూఢిల్లీ: భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమి ‘క్వాడ్’ ప్రస్తుత అవసరమని, ‘క్వాడ్’ తొలి సమావేశాల అజెండా కూడా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా శాంతి, అభివృద్ధిలను సాధించే శక్తిగా క్వాడ్ నిలుస్తుందన్నారు. ఈ ‘క్వాడ్’ వర్చువల్ సమావేశాలను ఉద్దేశించి శుక్రవారం మోదీ ప్రసంగించారు. కార్యక్రమంలో యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ పీఎం యోషిహిదె సుగా పాల్గొన్నారు. ‘ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సమ్మిళిత, సహకార, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతం అనే లక్ష్యాలకు మన నాలుగు దేశాలు కట్టుబడి ఉన్నాయి.
వాతావరణ మార్పుపై పోరు, కోవిడ్ 19 టీకా, నూతన సాంకేతికలు అనే ప్రపంచానికంతటికీ మంచి జరిగేందుకు ఉద్దేశించిన అంశాలను ఈ భేటీకి అజెండాగా తీసుకోవడం ముదావహం’ అని మోదీ పేర్కొన్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబమనే భారత దేశ పురాతన విశ్వాసమైన ‘వసుధైక కుటుంబం’ అనే భావనకు ఇది కొనసాగింపని వ్యాఖ్యానించారు. ‘కలసికట్టుగా, గతంలో కన్నా ఐక్యంగా పనిచేద్దాం. సురక్షిత, సుస్థిర, ప్రగతిశీల ఇండో పసిఫిక్‌ను రూపొందిద్దాం’ అన్నారు. ఈ ప్రాంత ప్రజలందరికీ కోవిడ్ 19 వ్యాక్సిన్ లభించేందుకు వీలుగా, టీకా ఉత్పత్తిని పెంచేందుకు ఉమ్మడి భాగస్వామ్య ప్రాజెక్టు రూపొందించాలన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఘర్షణలకు తావు లేకుండా, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు అమలు జరగాలని బైడెన్ వ్యాఖ్యానించారు.
చైనాకు స్పష్టమైన సందేశమిస్తూ.. సుస్థిర, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ కోసం క్వాడ్ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. వాతావరణ మార్పుపై జరిపే ఉమ్మడి పోరాటంలో క్వాడ్ ఒక నూతన శక్తి అని బైడెన్ అభివర్ణించారు. ‘మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది’ అని బైడెన్ ఈ సందర్భంగా మోదీతో వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో ప్రపంచం గతిని ఇండో పసిఫిక్ ప్రాంతం నిర్ధారిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ పేర్కొన్నారు. 2004లో సునామీ సహాయక చర్యల్లో సమన్వయం లక్ష్యంగా భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఒక కీలక బృందంగా ఏర్పాటయ్యాయి. ఇండో పసిఫిక్ ప్రాంతం అత్యంత వ్యూహాత్మకంగా మారడంతో పాటు, ఈ ప్రాంతంలో చైనా దూకుడు పెంచుతున్న నేపథ్యంలో ఈ కూటమి కీలకంగా మారింది.
వేరే దేశాన్ని లక్ష్యంగా చేసుకోవద్దు
బీజింగ్: దేశాల మధ్య సహకారం, సంప్రదిం పులు మరో దేశాన్ని లక్ష్యంగా చేసుకునేలా ఉండవద్దని చైనా వ్యాఖ్యానించింది. దేశాలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడడం సరికాదని పేర్కొంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ‘క్వాడ్’ భేటీ ప్రారంభమయ్యే ముందు చైనా ఈ వ్యాఖ్యలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment