
బ్యాంకాక్: జైలు శిక్ష అనుభవిస్తున్న థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్షిన్ షినవత్ర(76) పెరోల్ మీద విడుదలయ్యారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల ప్రభుత్వం అతడిని పెరోల్‌పై విడుదల చేసింది. మరో ఆరు నెలల్లో షినవత్ర శిక్ష ముగియనుంది. 15 ఏళ్ల ప్రవాసం వీడి గతేడాది దేశంలో అడుగు పెట్టిన వెంటనే ఆయనను జైలుకు తరలించారు.
అనారోగ్యం కారణంగా జైలు నుంచి వెంటనే పోలీస్ ఆస్పత్రికి తరలించి నిర్బంధంలో ఉంచారు. రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన షినవత్రకు అవినీతి ఆరోపణలపై 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో షినవత్ర కుటుంబ సభ్యులే కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. 70 ఏళ్లు దాటి అనారోగ్యం బారిన పడినందున మిగిలిఉన్న జైలు శిక్షను ప్రభుత్వం రద్దు చేసింది.