
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు జీవితాన్ని వీడి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు శశికళ మార్గం సుగమమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆమె వచ్చే ఏడాది జనవరి 27న విడుదల కానున్నారు. విడుదల సమయంలో చేపట్టాల్సిన బందోబస్తు చర్యలపై కర్ణాటక ప్రభుత్వం గురువారం జారీ చేసిన సర్క్యులర్ చిన్నమ్మ విడుదల విషయాన్ని అనధికారికంగా ధ్రువీకరించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఆమె వదిన ఇళవరసి, అక్క కుమారుడు సుధాకర్ 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ ముగ్గురూ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి శిక్షాకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. గతనెల 17న శశికళ తన జరిమానాను న్యాయవాది ద్వారా బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో చెల్లించారు. ఆ తరువాత ఇళవరసి సైతం జరిమానాను చెల్లించారు.
వీఎన్ సుధాకరన్ మాత్రం ఇంకా చెల్లించలేదు. సుధాకరన్ శిక్షాకాలం త్వరలో ముగుస్తున్నందున జరిమానా చెల్లింపునకు అనుమతి, విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన న్యాయవాదులు సెప్టెంబర్ 8న అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తుదితీర్పు వెలువడే నాటికి 122 రోజులు జైల్లో గడిపినందున నాలుగేళ్ల శిక్షాకాలంలో వీటిని మినహాయించుకుని వెంటనే విడుదల చేయాల్సిందిగా సుధాకరన్ న్యాయవాదులు కోర్టుకు విన్న వించారు. విడుదలపై ఆదేశాలు జారీకాగానే జరిమానాను చెల్లిస్తామని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రాగా, జరిమానా చెల్లించగానే శిక్షాకాలం రోజులను కలుపుకుని సుధాకరన్‌ను వెంటనే విడుదల చేయాలని బెంగళూరు సివిల్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. జరిమానా సొమ్ము చెల్లింపునకు న్యాయవాదులు సిద్ధం అవుతుండగా, రెండు మూడు రోజుల్లో సుధాకరన్ విడుదల కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. చదవండి: (కమల్ హాసన్‌కు నిరాశ.. టార్చ్‌లైట్ పోయే..)
వచ్చేనెల 27న శశికళ విడుదల..
ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న సుధాకరన్ విడుదలపై స్పష్టత రావడంతో అదే కేసుకు చెందిన శశికళకు సైతం జైలు నుంచి విముక్తి పొందే రోజు ఆసన్నమైనట్లు తెలుస్తోంది. విచారణ ఖైదీగా శశికళ గడిపిన జైల్లో గడిపిన రోజులను పరిగణనలోకి తీసుకుని వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ రాత్రి 7 లేదా 9.30 గంటలకు శశికళ విడుదల ఖాయమని సమాచారం. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో బెంగళూరు జైలు వద్దకు చేరుకుని శశికళ ఘనస్వాగతం పలికే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వం అంచనా వేసింది. బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి తమిళనాడు సరిహద్దుకు ఆమె చేరే వరకు ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్‌శాఖకు కర్ణాటక ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీచేసింది. దీంతో వచ్చేనెలాఖరులో శశికళ విడుదల ఖాయమని భావించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment