VK Sasikala
-
మాతో టచ్‌లో 10 మంది ఎమ్మెల్యేలు.. త్వరలోనే పార్టీలోకి
తిరువళ్లూరు (చెన్నై): అన్నాడీఎంకేతో 10 మంది డీఎంకే ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనాయకుడు ఎడపాడి పళణిస్వామి చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి మాజీ ఎమ్మెల్యే కేఎస్ విజయకుమార్ కుమార్తె వివాహానికి ఎడపాడి పళణిస్వామి బుధవారం ఉదయం హాజరయ్యారు. ఎడపాడి పళణిస్వామికి పార్టీ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వధూవరులను ఆశ్వీరించిన మాజీ ముఖ్యమంత్రి, ఈగువారిపాళ్యం వెళ్లి యూనియన్ చైర్మన్ శివకుమార్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. అనంతరం మీడియా సమావేశంలో ఈపీఎస్ మాట్లాడుతూ అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు డీఎంకేతో టచ్‌లో ఉన్నారనే వార్తలు అవాస్తమన్నారు. డీఎంకే ఏడాదిన్నర పాలనలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు విసిగిపోయారని, వారిపై ఉన్న అసంతృప్తి త్వరలో బయటపడుతుందని వ్యాఖ్యానించారు. డీఎంకేకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని త్వరలో వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మేయర్, డిప్యూటి మేయర్లను వెనుక సీట్లు కేటాయించడం వివాదస్పదంగా మారిన విషయంపై స్పందిస్తూ, డీఎంకే కార్పొరేట్ కంపెనీ లాంటింది. ఇక్కడ సీఈఓలుగా ఉన్న ఉదయనిధి స్టాలిన్, కనిమొళికి ఉన్న ప్రాధాన్యత ప్రజాప్రతినిధులకు వుండదన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న ఉదయనిధిను షాడో సీఎంగా ప్రమోట్ చేస్తున్నారని విమర్శించారు. శశికళ– దినకరన్‌లకు చోటులేదు అన్నాడీఎంకేలోకి శశికళ, టీటీవీ దినరకన్ ఓపీఎస్ ఆహ్వానించడం హర్షిందగ్గ విషయం కాదన్నారు. అన్నాడీఎంకేలో కార్యకర్తలే పాలకులని, గతంలో పార్టీకి ద్రోహం చేసిన వారిని మళ్లీ పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తామన్నారు. అన్నాడీఎంకే జనరల్ కమిటీ సమావేశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓపీఎస్ సుప్రీంకోర్టుకు వెళ్తున్న విషయంపై ఎడపాడి సీరియస్ అయ్యారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున అంతకు మించి తాము మాట్లాడనన్నారు. వేగంగా స్పందించలేదు అన్నాడీఎంకే కార్యాలయంలోని కీలక డాక్యుమెంట్ల చోరీ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పళణి స్వామి ఆరోపించారు. డీఎంకే హయాంలో సాధారణ ప్రజలకే భద్రత లేనప్పుడు తమ కార్యాలయానికి భద్రత కల్పిస్తారనే నమ్మకం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడు సరిహద్దుల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పునరాలోచన చేయాలని కోరారు. -
పళణి కోటలోకి శశికళ!
సాక్షి, చెన్నై : మాజీ సీఎం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళని స్వామి సొంత జిల్లాలో పర్యటించేందుకు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ సిద్ధమయ్యారు. చెన్నై నుంచి బుధవారం ఆమె తంజావూరు మీదుగా పర్యటనకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలను చిన్నమ్మ శశికళ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన మద్దతుదారులను ఏకం చేస్తూ పర్యటనలపై దృష్టి పెట్టారు. ఈసారి ఆమె అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి జిల్లాను టార్గెట్ చేశారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, పళణి స్వామి మధ్య వివాదం సాగుతోన్న నేపథ్యంలో చిన్నమ్మ శశికళ సేలం, నామక్కల్ జిల్లాలపై దృష్టి పెట్టడం రాజకీయంగా ప్రాధాన్యతకు దారి తీసింది. పళణి స్వామి ఆయన సన్నిహితుడు, మాజీ మంత్రి తంగమణి మద్దతుదారుల్ని తన వైపునకు తిప్పుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటనలో చిన్నమ్మ వ్యూహరచన చేసినట్లు సమాచారం. అక్రమాస్తుల కేసులో తాను జైలుకు వెళ్తూ పళణి స్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆమెను పళణి స్వామి సాగనంపి ఆ పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో పళణి సొంతజిల్లాలో పర్యటించే చిన్నమ్మ శశికళ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే విషయం ఆసక్తి కలిగిస్తోంది. రెండు రోజుల పర్యటన ఖరారు సేలం, నామక్కల్‌లో చిన్నమ్మ శశికళ పర్యటన రెండు రోజులు సాగనుంది. ఇందుకు తగ్గ రూట్ మ్యాప్‌ను మంగళవారం విడుదల చేశారు. బుధవారం ఉదయం టీ నగర్ నివాసం నుంచి తంజావూరు వైపుగా శశికళ పర్యటన ప్రారంభమవుతుంది. గురువారం తిరుత్తొరై పూండిలో కొత్తగా నిర్మించిన షిరిడీ సాయిబాబా ఆలయ కుంభాభిషేకం వేడుకల్లో ఆమె పాల్గొంటారు. తంజావూరు, తిరువారూర్, సేలం, నామక్కల్, పుదుకోట్టై, ఈరోడ్ జిల్లాల నేతలతో 9.10 తేదీల్లో సమావేశాలు నిర్వహిస్తారు. 11వ తేదీ ఉదయం తంజావూరు నుంచి తిరువయ్యారు. తిరుమానూరు, కీల పలలూరు, అరియలూరు, పెరంబలూరు జిల్లాల వైపుగా ఆమె పర్యటన ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం సేలంలో పలు ప్రాంతాల్లో శశికళ పర్యటించనున్నారు. పార్టీ కేడర్, నాయకులతో వివిధ అంశాలపై చర్చిస్తారు. ఆ రాత్రి సేలంలో బస చేసి 12వ తేదీ నామక్కల్ జిల్లాలో, అరియలూరు కొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు. శశికళ పర్యటన నేపథ్యంలో తన మద్దతు దారులు, సర్వ సభ్య సభ్యులు, ముఖ్యులు చేజారకుండా పళణిస్వామి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. -
Tamil Nadu: నాలుగు స్తంభాలాట
అనుకున్నంతా అయింది. ఎంజీఆర్ సారథ్యంలో, ఆ తరువాత జయలలిత నాయకత్వంలో తమిళనాట తిరుగులేని రీతిలో చక్రం తిప్పిన రాజకీయ పార్టీ ప్రతిష్ఠ అలాంటి బలమైన నేతలు లేక క్రమంగా మసక బారుతోంది. అంతర్గత కలహాలతో ‘అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం’ (అన్నాడీఎంకే) అల్లాడుతోంది. మాజీ సీఎం, నిన్నటి దాకా అన్నాడీఎంకే సమన్వయకర్త, కోశాధికారి అయిన ఓ. పన్నీర్ సెల్వమ్ (ఓపీఎస్)ను బహిష్కరిస్తూ, పార్టీపై పెత్తనాన్ని ప్రత్యర్థి ఈడపాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) సోమవారం చేజిక్కించుకోవడం ఆ పార్టీ ఇంటిపోరులో తాజా పరిణామం. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికై పార్టీపై పట్టు బిగించిన పళనిస్వామి, తనకంటూ బలమైన వర్గం సృష్టించుకోలేకపోయిన పన్నీర్ సెల్వమ్, తగిన సమయం కోసం కాచుకుకూర్చున్న శశికళ, అన్నాడీఎంకే నేతల్ని గుప్పెట పెట్టుకొని తమిళనాట బలం పుంజుకోవాలని చూస్తున్న బీజేపీలతో తమిళనాట ఆసక్తికరమైన నాలుగు స్తంభాలాట మొదలైంది. జయలలిత పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన రెండుసార్లూ, ఆమె ఆసుపత్రిలో చావుబతు కుల మధ్య ఉన్నప్పుడు మరోసారీ – మొత్తం మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన పన్నీర్ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకొనేందుకు పోరాడాల్సిన పరిస్థితి. ఆ మాటకొస్తే పార్టీకి ఒకే నాయకత్వం పేరిట పన్నీర్‌ను సాగనంపేందుకు ప్రత్యర్థి వర్గం కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. దాన్ని అడ్డుకొనేందుకు ఆయన కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చారు. కానీ, పార్టీ జనరల్ కౌన్సిల్ తాజా భేటీకి ముందు జూన్ 23న జరిగిన సమావేశంలోనే ఒకే నాయకుడి సిద్ధాంతాన్నీ, పళనిస్వామి నేతృత్వాన్నీ 2 వేల పైచిలుకు అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్, కార్యవర్గ సభ్యుల్లో అధికశాతం ఆమోదించారు. ఒక రకంగా అప్పుడే పన్నీర్ కథ కంచికి చేరింది. కోర్టు కేసులతో జూలై 11 దాకా ఆయన లాక్కొచ్చారు. పార్టీ అంతర్గత అంశాలపై కోర్టులోనూ ఊరట దొరకలేదు. పన్నీర్ ప్రత్యర్థులదే పైచేయి అయింది. నిజానికి, 2016లో జయలలిత మరణం తర్వాత ఆమె సహచరి శశికళ పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. తీరా ఆమెకు నాలుగేళ్ళ జైలుశిక్ష పడడంతో 2017 ఫిబ్రవరిలో జాతకం తిరగబడింది. పగ్గాలు ఆమె నుంచి చేజారాయి. శశికళే ఉమ్మడి శత్రువుగా, ఆమెనూ, ఆమె కుటుంబాన్నీ దూరం పెట్టడానికి ఓపీఎస్, ఈపీఎస్‌లు చేతులు కలిపారు. భారత రాజకీయాల్లో ఎన్నడూ లేని రీతిలో ఒక పార్టీని ఇద్దరు నేతలు సంయుక్తంగా నడిపే అరుదైన ప్రయోగానికి తెర తీశారు. పార్టీనీ, అధికారాన్నీ పంచుకున్నారు. ఈపీఎస్ ముఖ్యమంత్రిగా, పార్టీ సహ–కన్వీనర్‌గా ఉంటే, ఓపీఎస్ ఉప ముఖ్య మంత్రిగా, పార్టీ కన్వీనర్‌గా ఉండాలనే ఏర్పాటు ఆ సెప్టెంబర్‌లో జరిగింది. నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో ప్రతిపక్షానికే పరిమితమైన వేళ ఈ అవసరార్థ మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు పూర్తిగా బయటకొచ్చాయి. అందులో తాజా అంకమే – సోమవారం నాటి జనరల్ కౌన్సిల్లో ఈపీఎస్‌కు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి సీటు, ఓపీఎస్‌పై బహిష్కరణ వేటు. దాదాపు 15 కి.మీల దూరంలో వానగరంలోని కల్యాణమండపంలో ఒకపక్క పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగానే, చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ఆఫీసు అనేక నాటకీయ పరిణామాలకు వేదికైంది. ప్రత్యర్థులైన ఓపీఎస్ – ఈపీఎస్ వర్గాల మధ్య ఘర్షణ, తాళాలు బద్దలు కొట్టి మరీ పార్టీ కార్యాలయాన్ని పన్నీర్ వర్గీయులు కైవసం చేసుకోవడం, పోలీసుల రంగప్రవేశం, రెవెన్యూ అధికారులు వచ్చి కార్యాలయానికి సీలు వేయడం లాంటి పరిణామాలు ప్రజల్లో అన్నా డీఎంకే గౌరవాన్ని మరింత పలుచన చేశాయి. అసలైన పార్టీ ఎవరిది, పార్టీ ఆఫీసు ఎవరిది, బ్యాంకు ఖాతాలపై హక్కు ఎవరిది సహా అనేక అంశాలపై వైరివర్గాల పరస్పర ఫిర్యాదులు తాజాగా ఎన్నికల సంఘం నుంచి హైకోర్ట్ దాకా చేరాయి. రాగల కొన్ని వారాలు ఆ డ్రామా సాగనుంది. తమిళ ప్రజలు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేకు పట్టం కట్టినా, ప్రతిపక్షంగా అన్నాడీఎంకేకు అప్పగించిన బాధ్యత ఈ మొత్తం వ్యవహారంతో పక్కకుపోవడమే విషాదం. సామాన్య ప్రజల సమస్యలపై అధికార డీఎంకేపై పోరాడాల్సిన అన్నాడీఎంకే గత ఏడాదిగా అది వదిలేసి, అంతర్గత విభేదాలకే పరిమితమైంది. ప్రతిపక్ష స్థానంలో ఉన్నది తానే అన్న సంగతి ఈ ద్రవిడ పార్టీ మర్చిపోవడమే అదనుగా, ఆ స్థానాన్ని దక్కించుకొనేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తల దూర్చడానికి తావివ్వని తమిళ ద్రవిడ రాజకీయాల్లో షెడ్యూల్డ్ కులానికి చెందిన సంగీత దర్శకుడు ఇళయరాజాను తాజాగా రాజ్యసభకు నామినేట్ చేసి, బలమైన సంకేతాలిస్తోంది. అన్నాడీఎంకే బలహీనపడడం డీఎంకేకు లాభమే కానీ, ఇప్పటి దాకా రెండు ద్రవిడ పార్టీల మధ్య పోరుగా ఉన్న తమిళనాట ఆ స్థానంలోకి కొత్తగా బీజేపీ లాంటివి వస్తే దీర్ఘకాలంలో నష్టమే. ఇక, కార్యవర్గంలో మెజారిటీ ఉన్నా, రేపు కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ అంతే బలం పళని స్వామి నిరూపించుకుంటారా అన్నదీ వేచిచూడాలి. పళనిపై ప్రతీకారంతో తన సామాజిక వర్గానికే చెందిన శశికళతో పన్నీర్ చేతులు కలిపితే కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారన్నది పక్కన పెడితే, సరిగ్గా 50 ఏళ్ళ క్రితం కోశాధికారిగా లెక్కలడిగినందుకు కరుణానిధి సారథ్యంలోని నాటి డీఎంకే నుంచి బహిష్కృతుడైన ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే భవిష్యత్తు ప్రస్తుతం ఆందోళనకరమే. ఆ పార్టీకి ఇప్పుడు కావాల్సింది వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి తెచ్చే ప్రజాకర్షక నాయకుడే తప్ప వేరెవరూ కాదు. పార్టీ నిలబడితేనే వారి భవిష్యత్తు అనే ఆ సంగతి కీచులాడుకుంటున్న ఈ తమిళ తంబీలకు ఎవరు చెప్పాలి? -
శశికళకు షాక్
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు చెందిన సుమారు రూ.15 కోట్లను ఆదాయ పన్నుల శాఖ జప్తు చేసింది. చెన్నై టీ నగర్లో ఆమె బినామీకి చెందిన ఆంజనేయ ప్రింటర్స్ బిల్డింగ్‌ను శుక్రవారం మనీల్యాండరింగ్ చట్టం కింద సీజ్ చేసింది. 2017-21 మధ్య దివంగత జయలలిత, శశికళలకు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులు జప్తు అయిన సంగతి తెలిసిందే. 2017 నుంచి 150 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఐటీ రైడ్లు జరిగాయి. ఆ సమయంలో ఆమె బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 2020లో ఐటీ శాఖ.. శశికళ, ఆమె బంధువులకు చెందిన 84 ప్రాపర్టీలను రెండు ఫేజ్‌ల రైడ్లలో జప్తు చేసింది.నిందులో సిరుసతవూర్ ఫామ్ హౌజ్‌తో పాటు కొడనాడు ఎస్టేట్‌లోని ఆమె వాటా సైతం ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ, ఇళవరసై, సుధాగరన్ పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చాయి. -
సంచలన కేసు.. శశికళను ప్రశ్నించిన పోలీసులు
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళను తమిళనాట సంచలనం సృష్టించిన కొడనాడు కేసులో పోలీసులు ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక బృందం గురువారం టీ నగర్‌లోని ఆమె ఇంటికి వెళ్లింది. సుమారు గంటకు పైగా ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. 2017లో మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ బంగ్లా వద్ద దొపిడీ, ఆపై వరుస మరణాల ఉదంతాలు కలకలం రేపాయి. ఎస్టేట్ సెక్యూరిటీ గార్డును హత్య చేసిన ఎస్టేట్‌లో ఉన్న పలటియల్ బంగ్లాలోకి ప్రవేశించిన దుండగలు.. ఓ వాచ్, ఖరీదైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. ఈ దొపిడీ కేసుగానే భావించినా.. ఆ తర్వాత చోటు చేసుకున్న నాలుగు మరణాలు.. పలు అనుమానాలకు తావిచ్చాయి. ఈ దోపిడీలో కీలక అనుమానితుడిగా భావించిన జయలలిత మాజీ డ్రైవర్ కనగరాజ్ ఎడపాడి వద్ద ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అది మాజీ సీఎం పళనిస్వామి సొంతవూరు. అదే రోజు రెండో నిందితుడు సయన్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అదృష్టవశాత్తూ అతను బతికినా.. అతని భార్య, కూతురు చనిపోయారు. ఆ తర్వాత ఎస్టేట్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మరణాలకు.. జయలలిత మరణానికి ముడిపెడుతూ రాజకీయంగా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే సెక్యూరిటీ గార్డు హత్య జరిగిన టైంలో.. శశికళ అవినీతి కేసులో బెంగళూరు జైల్లో ఉన్నారు. అయినప్పటికీ మిగతా హత్యలు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక టీంతో కొడనాడు మిస్టరీ కేసుల్ని దర్యాప్తు చేయిస్తామని ఎన్నికల హామీలో స్టాలిన్ చెప్పారు. అయితే ఇది తనను ఇరికించే ప్రయత్నమని పళనిస్వామి ఆరోపిస్తుండగా.. కోర్టు అనుమతులతోనే తాము ముందుకెళ్తున్నామని, ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్తున్నారు. ఇదిలా ఉండగా.. జయలలిత అంతరంగికురాలు అయిన శశికళకు ఈ ఎస్టేట్‌లో భాగం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: శశికళకు చెన్నై కోర్టులో ఎదురు దెబ్బ -
VK Sasikala: శశికళకు ఎదురు దెబ్బ
అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళకు ఎదురు దెబ్బ తగిలింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉండే హక్కును కోరుతూ వీకే శశికళ వేసిన పిటిషన్‌ను చెన్నై కోర్టు కొట్టివేసింది. అన్నాడీఎంకేలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న వీకే శశికళకు ఎదురు దెబ్బ తగిలింది. 2017లో పార్టీ నుంచి తనను మహిష్కరిస్తూ అన్నాడీఎంకే పార్టీ సాధారణ మండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. పార్టీ కో-ఆర్డినేటర్ పన్నీర్‌సెల్వం, జాయింట్ కో-ఆర్డినేటర్ పళనిస్వామి, లీగల్ వింగ్ జాయింట్ సెక్రెటరీ ఏఎం బాబు మురుగవేల్ ఇంటర్లోక్యూటరీ(సంభాషణ) దరఖాస్తు దాఖలు చేయడంతో శశికళ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. 2017లో జరిగిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం.. అప్పటి ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించించింది. ఈ వేటుపై శశికళ గతంలో చెన్నై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పన్నీర్‌సెల్వం, పళనిస్వామి నేతృత్వంలోని అప్పటి విడివిడి వర్గాల విలీనం తర్వాత ఈ కౌన్సిల్ భేటీ జరిగి.. శశికళను పార్టీ నుంచి వెలేస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: చిన్నమ్మకు ‘పన్నీరు’ క్లీన్ చిట్ -
శశి‘కలకలం’.. రీఎంట్రీ కోసం చిన్నమ్మ చిచ్చు?
సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలన్నా.. బలోపేతం చేయాలన్నా చిన్నమ్మ శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం మేలన్న అభిప్రాయాన్ని పన్నీర్ సెల్వం వర్గం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వర్గ పోరు చిచ్చు రాజుకుంది. అన్నాడీఎంకే బలోపేతానికి శశి‘కళ’ అనివార్యమనే గళం గట్టిగా వినిపిస్తోంది. వరుస పరాజయాల నుంచి గట్టెక్కాలంటే శశికళను పార్టీలో చేర్చుకోవడం మినహా గత్యంతరం లేదని తన అనుచరులద్వారా పన్నీర్‌సెల్వం సంకేతాలు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే తేని జిల్లా పెరియకుళం కైలాసపట్లిలో పలువురు నేతలు సమావేశమై శశికళ రీ-ఎంట్రీ తీర్మానం చేశారు. అయితే వాళ్లు పాల్గొన్న వేదిక.. అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్ సెల్వానికి చెందిన ఫామ్‌హౌస్ కావడం విశేషం. ఎడపాడి అలక? బుధవారం శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ రీఎంట్రీకి తీర్మానం చేయడం, ఇందుకు ఎడపాడి పళనిస్వామి విముఖత ప్రదర్శించడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. అన్నాడీంకేను అన్నీతానై నడిపించిన జయలలిత 2016 డిసెంబర్లో కన్నుమూసిన తరువాత పన్నీర్‌సెల్వం సీఎం బాధ్యతలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్నారు. అయితే సీఎం పదవిపై కన్నేసిన శశికళ ఆ కుర్చీ నుంచి పన్నీర్‌సెల్వంను బలవంతంగా తప్పించి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలువకపోవడం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడడంతో శశికళ ఆశలు అడియాశలయ్యాయి. జైలు కెళ్లేముందు ఎడపాడి పళనిస్వామిని ఆమె సీఎం కుర్చీలో కూర్చోబెట్టి పార్టీ బాధ్యతలను మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు అప్పగించింది. శశికళపై తిరుగు బాటు చేసి సొంతపార్టీ పెట్టుకున్న పన్నీర్‌సెల్వం.. మరలా ఎడపాడితో జట్టుకట్టి(సొంత పార్టీని విలీనం చేసి) ఉప ముఖ్యమంత్రిగా మారారు. పార్టీ కన్వీనర్, కో– కన్వీనర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈపీఎస్, ఓపీఎస్ ఇద్దరూ కలిసి శశికళ, టీటీవీ దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఓటమి తరువాత ఎడముఖం.. పెడముఖం గడిచిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఒకరికొకరుగా సాగిన ఎడపాడి, పళనిస్వామి, పార్టీ పరాజయం తరువాత ఎడముఖం, పెడముఖంగా మారిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, డీఎండీకే, పీఎంలను కూటమిలో కలుపుకుని పోటీకి దిగినా అన్నాడీఎంకేకు కేవలం ఒక్కస్థానమే దక్కింది. ఇక గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం చేజారిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పరాజయం వెంటాడింది. జనాకర్షణ లేకనే పార్టీ వరుస పరాజయాల ఎదుర్కొంటోందని కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్‌సెల్వం అధ్యక్షతన బుధవారం తేనీలో జరిగిన పార్టీ సమావేశంలో శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకోవాలని తీర్మానం చేయడం కలకలం రేపింది. ఈ నిర్ణయంపై ఎడపాడి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత రెండేళ్లుగా పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశాల్లో ‘శశికళ వర్గంతో సంబంధం పెట్టుకుంటే వేటు తప్పదు’ అని ఎడపాడి, పన్నీర్ హెచ్చరికలు జారీచేశారు. మరిప్పుడు సాక్షాత్తూ పార్టీ కన్వీనర్ పన్నీర్‌సెల్వమే చినమ్మ, దినకరన్‌కు స్వాగతం పలకడాన్ని కొందరు జీర్ణించుకోలేకున్నారు. మరి కొందరు సమర్ధిస్తున్నారు. పార్టీ అధిష్టానం తీసుకు నే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని మాజీ మంత్రి కడంబూరు రాజా, శశికళ ప్రవేశం వల్ల పార్టీలో మ రింత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయని అ న్నాడీఎంకే ఎమ్మెల్యే అరుణ్మొళి దేవన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే సారథ్యం సరిగా లేదు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో విలీనమై పార్టీని దినకరన్ నడిపించాలని మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టి సూచించారు. పళనివర్గం అత్యవసర సమావేశం పార్టీలో చకచకా మారుతున్న పరిణామాలను గమ నిస్తున్న ఎడపాడి పళనిస్వామి మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో సేలంలో గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగా బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బంది వారిని అడ్డుకుని పంపివేశారు. పార్టీలో సమ ఉజ్జీలుగా సాగుతున్న ఎడపాడి, పళనిస్వామి మధ్య గత కొంతకాలంగా సాగుతున్న విభేదాలు తాజా పరిణామాలతో మరింత రాజుకునే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణ ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం మేలన్న అభిప్రాయాన్ని అటు నేతలు, ఇటు కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. పన్నీర్ సెల్వం సమక్షంలో ఆమోదించిన ఈ తీర్మానంపై ఎడప్పాడి వర్గం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం జిల్లా కార్యనిర్వాహక మండలి సమావేశం జరుగుతుండగా.. పళని వర్గం ప్రత్యేకంగా సమావేశమై చర్చించనుంది. ఈ విషయంలో ఎడప్పాడి వర్గం సానుకూలంగా స్పందించి శశికళను తిరిగిపార్టీలోకి తీసుకుంటే తమిళ రాజకీయాలు మళ్లీ వేడెక్కడం ఖాయం. -
శశికళ, ఇళవరసికి సమన్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలులో ఖరీదైన జీవితం చిన్నమ్మ శశికళను మళ్లీ కష్టాలపాలు చేసింది. జైలు పక్షిలా కారాగారానికి పరిమితం కాకుండా జల్సా కోసం చేసిన పని ఆమెను చిక్కుల్లో పడేసింది. అంతేకాదు ఆమెతోపాటూ జైలు అధికారులు, వైద్యుడు సైతం కోర్టు బోనెక్కే పరిస్థితి నెలకొంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్ నాలుగేళ్ల శిక్షాకాలాన్ని పూర్తి చేసుకుని బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడులయ్యారు. శిక్షాకాలంలో శశికళ తన పలుకుబడిని వినియోగించి ప్రత్యేకసెల్, లగ్జరీ వసతులతో కూడిన జీవితాన్ని అనుభవించారు. తన వదిన ఇళవరసికి సకల సౌకర్యాలు సమకూర్చడంతోపాటూ ఇరువురూ చెట్టాపట్టాల్ వేసుకుని బెంగళూరు నగరంలో షాపింగ్ చేసి గుట్టుగా జైలుకు చేరుకునేవారు. అయితే ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో విషయం బట్టబయలైంది. అప్పటి జైళ్లశాఖ డీఐజీ రూప తీగలాగడంతో డొంక కదిలింది. జైళ్లశాఖ ఉన్నతాధికారులకు రూ.2 కోట్లు లంచం ముట్టజెప్పి శశికళ తన దందాను నడిపినట్లు కర్ణాటక ప్రభుత్వానికి ఆమె నివేదిక పంపారు. దీంతో రిటైర్డు ఐఏఎస్ అధికారి వినయ్‌కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం దర్యాప్తు జరిపించగా డీఐజీ రూప చేసిన ఈ ఆరోపణలు నిజమయ్యాయి. షాపింగ్ ముగించుకుని శశికళ, ఇళవరసి జైల్లోకి వస్తుండగా సీసీ టీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలు ఇందుకు సంబంధించి చెన్నై ఆళ్వార్‌పేటకు చెందిన గీత అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టులో గత ఏడాది ఆగష్టు 25వ తేదీన తొలివిడత చార్జిషీటు దాఖలైంది. పోలీసులకు లంచం ఎరవేసిన వ్యవహారంలో శశికళ, ఇళవరసికి వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వ తరపు న్యాయవాది మన్మోహన్ తుది చార్జిషీటు దాఖలు చేశారు. తొలి నిందితునిగా (ఏ వన్)గా పోలీస్ అధికారి కృష్ణకుమార్, ఏ 2గా డాక్టర్ అనిత, ఏ 3గా సురేష్, ఏ 4గా గజరాజ్ మాకనూరు, ఏ 5గా శశికళ, ఏ 6గా ఇళవరిసిని చార్జిషీటులో చేర్చారు. అవినీతి కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి లక్ష్మీ నారాయణన్ భట్ ముందుకు శుక్రవారం ఇది విచారణకు వచ్చింది. చార్జిషీటులో చేర్చిన మొత్తం ఆరుగురూ మార్చి 1వ తేదీన కోర్టుకు ప్రత్యక్షంగా హాజరయ్యేలా సమన్లు జారీ చేయాల్సిందిగా న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు. అంటే చిన్నమ్మ, ఇళవరసి మరోసారి కోర్టు బోనెక్క తప్పదన్నమాట. -
పన్నీర్ సెల్వం కీలక వ్యాఖ్యలు; అన్నాడీఎంకేలో కలకలం
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే అవకాశముందా?.. తమిళనాడు రాజకీయాల్లో తాజాగా ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అన్నాడీఎంకే కన్వీనర్ పన్నీర్ సెల్వం చేసిన తాజా వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. చేసిన తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం కోరిన వారిని క్షమించాలని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు శశికళను ఉద్దేశించి చేశారని ప్రచారం మొదలైంది. అయితే శశికళను క్షమించేది లేదని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. చెన్నైలోని లిటిల్ సిస్టర్స్ వృద్ధాశ్రమంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పార్టీ కో–కన్వీనర్ ఎడపాడి పళనిస్వామితో కలిసి పన్నీర్ సెల్వం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షమాగుణమే మంచి నాయకత్వానికి నిదర్శనమని పేర్కొంటూ ఒక చిన్న కథ చెప్పారు. అయితే శశికళను ఇరుకున పెట్టేందుకే పన్నీర్ సెల్వం ఇలా మాట్లాడారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మాజీ మంత్రి జయకుమార్ స్పందిస్తూ.. ‘శశికళ లేకుండా అన్నాడీఎంకే పార్టీ బాగా నడుస్తోంది. ఆమెను క్షమించే ప్రసక్తే లేదు. పన్నీర్ సెల్వం వ్యాఖ్యలు శశికళకు వర్తించవు’ అని స్పష్టం చేశారు. (చదవండి: ఎన్నికలొస్తున్నాయిగా.. మీకోసమే ఐయామ్.. వెయిటింగ్) శశికళపై పోలీసులకు ఫిర్యాదు ఇప్పటికీ అన్నాడీఎంకే నాయకురాలినని చెప్పుకుంటున్నారని శశికళపై పోలీసులకు జయకుమార్ ఫిర్యాదు చేశారు. పార్టీతో ఆమె ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ శశికళ తన అధికారిక ప్రకటనలలో 'ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ'ని ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై పన్నీర్‌సెల్వం ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. గత అక్టోబర్‌లోనూ శశికళపై అన్నాడీఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఎన్నికలుంటే ఇలా.. లేకుంటే అలా!) -
తమిళనాట కొత్త ట్విస్ట్.. రజనీకాంత్‌తో శశికళ భేటీ.. అందుకోసమేనా?!
సాక్షి, చెన్నై: రాజకీయ పునరాగమనంపై దృష్టి సారించిన అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ సోమవారం సాయంత్రం చెన్నై పోయెస్ గార్డెన్‌లోని ఆయన నివాసంలో నటుడు రజనీకాంత్‌ను కలిశారు. శశికళ కొత్తపార్టీని స్థాపిస్తున్నారని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో రజనీకాంత్‌తో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తన పార్టీకి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగమే ఈ భేటీ అని వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. సంబంధిత వర్గాల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే శశికళ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో..'శశికళ రజనీకాంత్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో రజనీకాంత్ భార్య లత కూడా హాజరయ్యార'ని ఆ ప్రకటనలో తెలిపారు. కాగా, సోమవారమే అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్తగా పన్నీర్ సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టి, శశికళ మళ్లీ చక్రం తిప్పేందుకు ఎలాంటి అవకాశం లేకుండా చేయడంలో ఓపీఎస్, ఈపీఎస్ సఫలమయ్యారు. -
నేను జయలలిత కుమార్తెనే.. అమ్మ కంటే ఆస్తి పెద్దది కాదు: జయలక్ష్మి
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జీవించి ఉన్నప్పుడే కాదు గతించిన తరువాత కూడా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. జయ కుమార్తెను అని చెప్పుకుని గతంలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు హడావిడి చేసి.. ఆ తరువాత మిన్నకుండి పోయారు. ఈ క్రమంలో తాజాగా మరో మహిళ తెరపైకి వచ్చారు. తగిన ఆధారాలతో జయ కుమార్తెను అని త్వరలో నిరూపించుకుంటానని చెన్నైలో శనివారం స్పష్టం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: జీవితాంతం కుమారిగానే మెలిగిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఒక కుమార్తె ఉందని దశాబ్దాల తరబడి ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని జయ ఏనాడు ఖండించలేదు. అలాగని సమర్ధించనూ లేదు. జయ మరణం తరువాత తమను వారసులుగా గుర్తించాలంటూ ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే సమయంలో బెంగళూరు, మైసూరు నుంచి వేర్వేరుగా ఇద్దరు యువతులు, ఓ యువకుడు వచ్చారు. కొన్నాళ్లు పోరాడారు. అయితే వారి వాదన పెద్దగా నిలవక పోవడంతో తెరమరుగై పోయారు. నేనే జయ కుమార్తెను..: ఇదిలా ఉండగా, తాజాగా మరో మహిళ తెరపైకి వచ్చింది. చిన్నపాటి మందీ మార్బలంతో శనివారం సాయంత్రం చెన్నై మెరీనాబీచ్‌లోని జయ సమాధి వద్దకు చేరుకుని ఆమె నివాళులర్పించారు. సమాధికి ప్రదక్షిణ చేసి కన్నీరు పెట్టుకున్నారు. ఆమె హావభావాలు, కట్టూబొట్టూ, బాడీ లాంగ్వేజ్ అంతా జయను పోలినట్లుగా ఉండడంతో పరిసరాల్లోని వారు ఆశ్చర్యంగా అనుసరించారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధుల వద్ద జయ కుమార్తెగా పరిచయం చేసుకున్నారు.. ‘‘మాది మైసూరు. చెన్నై పల్లవరంలో స్థిరపడ్డాను. చాలా ఏళ్ల క్రితమే నేను జయ కుమార్తెను అని తెలుసు. అయితే ఇష్టం లేక, కొన్ని సమస్యల వల్లనే ఇన్నేళ్లూ బాహ్య ప్రపంచంలోకి రాలేదు. అమ్మ కంటే ఆస్తి పెద్దది కాదు, అందుకే అప్పట్లో రాలేదు. అమ్మను కోల్పోయిన షాక్ నుంచి బయటకు వచ్చేందుకు ఇంత సమయం పట్టింది. చదవండి: (Heavy Rains: మరో ఐదు రోజులు కుండ పోతే!) చెన్నై పోయస్ గార్డెన్ ఇంటిలో మొదటిసారి అమ్మతో మాట్లాడాను. ఆ తరువాత అపోలో ఆసుపతిలో కలిశాను. అమ్మ పీఏ అపోలో ఆసుపత్రి వెనుకమార్గం గుండా లోనికి తీసుకెళ్లారు. అమ్మతో నేరుగా మాట్లాడాను. చెక్కిలిపై ఆమె ముద్దు పెట్టుకుంది. ఉద్వేగానికి లోనై ఇద్దరం కన్నీరు పెట్టుకోవడంతో బేబీని తీసుకెళ్లండని అక్కడి సిబ్బందికి చెప్పింది. దీప, దీపక్ నాతో మాట్లాడేందుకు యత్నించారు, అయితే ఇష్టం లేక దూరంగా మెలిగాను. ఇప్పటికే కొందరు జయ కుమార్తెలు అని వచ్చారు, అయితే అందరికీ ఆమె అమ్మ కాలేదు కదా.. వారు ఫేక్ అని రుజువైంది కదా. జయ కుమార్తెను అని వైద్యపరంగా కూడా నిరూపణకు అన్ని ఆధారాలు ఉన్నందునే ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నాను. మంచి రోజు చూసి మీడియా వద్ద బహిరంగ పరుస్తాను. మైసూరులో నన్ను పెంచిన వారు ఇటీవలే మరణించారు. నాకు ఇప్పటికీ చిన్నమ్మ శశికళ మాత్రమే అండగా ఉంది. చిన్నమ్మతో కూడా ఇంకా మాట్లాడలేదు. మూడు నాలుగు రోజుల్లో శశికళను కలుస్తాను. అపాయింట్మెంట్ కూడా ఆమె ఇచ్చారు. రాజకీయాల గురించి ఇప్పుడు ప్రశ్నలు వేయవద్దు, త్వరలో రాజకీయం గురించి అన్ని విషయాలు చెబుతాను. నా పేరు ప్రేమ, అమ్మ నన్ను జయలక్ష్మి అని ముద్దుగా పిలుచుకునేది’’ అని ఆమె వివరించింది. -
AIADMK: అన్నాడీఎంకేలో ఉత్కంఠ
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సంస్థాగత ఎన్నికల ఉత్కంఠ నెలకొంది. వాయిదా వేస్తూ వస్తున్న ఎన్నికలను డిసెంబర్ 31వ తేదీలోగా ముగించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించడంతో ఆ పార్టీ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలను ఐదేళ్లకు ఒకసారి నిర్వహించాల్సి ఉంది. పార్టీ అధినేత్రి జయలలిత 2014లో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019లో ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా అది జరగలేదు. 2020లో కరోనా కారణంగా వాయిదా వేశారు. 2021లో కరోనా రెండోదశ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల వల్ల నిర్వహించలేదు. జయలలిత మరణం తర్వాత సంస్థాగత ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. సంస్థాగత ఎన్నికలను వెంటనే జరపాలని అన్నాడీఎంకే నాయకుడు ఒకరు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు డిసెంబర్ 31వ తేదీలోగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఎన్నికల నిర్వహణకు పార్టీ అధిష్టానం సమాయత్తమవుతోంది. చదవండి: (పోలీసులకు వీక్లీ ఆఫ్.. ఉత్తర్వులు జారీ) ముల్లైపెరియార్ జలాల వ్యవహారంలో తమిళనాడు హక్కులను కాపాడడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఈ నెల 9న తేని, దిండుగల్లు, మదురై, రామనాథపురం, శివగంగై జిల్లాల్లో అన్నాడీఎంకే ఆందోళన చేపట్టనుంది. ఈ ఆందోళన ముగియగానే పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం, కోకన్వీనర్ ఎడపాడి పళనిస్వామి పార్టీ ప్రధా న కార్యాలయానికి చేరుకుని సంస్థాగత ఎన్నికల తేదీని ప్రకటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ ప్రస్తుత పరిస్థితి ప్రకారం ప్రధానమైన రెండు పదవులకు కూడా ఎన్నికలు జరపాల్సి ఉంది. మరోవైపు శశికళను పార్టీలోకి తీసుకోవడమా, లేదా అనే చర్చ జరుగుతోంది. పార్టీలో శశికళకు స్థానం లేదని ఎడపాడి, అందరి అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటామని పన్నీర్ సెల్వం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం గందరగోళానికి దారితీసింది. అంతేగాక జోడు పదవులు వద్దని, ఏక నాయకత్వ మే ముద్దు అనే నినాదం కూడా ఎంతోకాలంగా సాగుతోంది. అలాగే పార్టీలో ప్రతి ఒక్క కీలక పదవికీ పోటీ నెలకొనే పరిస్థితి ఉత్పన్నమైంది. పోటీ విషయంలో ఎవరూ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేందుకు వీలులేదని పార్టీ హుకుం జారీచేసింది. శశికళ పునః ప్రవేశంపై ఇంకా ఏకాభిప్రాయం కుదరని పరిస్థితుల్లో సర్వసభ్య సమావేశం సవాలుగా మారింది. పార్టీ సర్వసభ్య, కార్యవర్గ సమావేశాలు జరపాలంటే సీనియర్ నేతలతో పన్నీర్ సెల్వం, ఎడపాడి ఒకేసారి సమావేశం నిర్వహించి ఒక అభిప్రాయానికి రావాల్సిన పరిస్థితి ఉంది. చదవండి: (మారియప్పన్‌కు సర్కారీ ఉద్యోగం: సీఎం స్టాలిన్) ఏడాదికి ఒకసారి జనరల్ బాడీ సమావేశం, రెండుసార్లు కార్యవర్గ సమావేశం జరపాలి. కరోనా కారణంగా గత ఏడాది జనరల్ బాడీ సమావేశం నిర్వహించకుండా ఎన్నికల కమిషన్ నుంచి గడువు పొందారు. డిసెంబరు 31వ తేదీన జనరల్ బాడీ సమావేశం జరపాలంటే ఈలోగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సంస్థాగత ఎన్నికలపై ఈ నెల 10వ తేదీన కచ్చితంగా అధికారిక ప్రకటన వెలువడుతుందని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నారు. -
అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ పయనం.. దినకరన్ మద్దతు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ శశికళ సాగిస్తున్న పయనానికి తమ మద్దతును అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ ప్రకటించారు. ఆమె పర్యటనలకు తమ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతారని తెలిపారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్క వనితామణి కుమారుడు దినకరన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నమ్మ ప్రతినిధిగానే ఆయన రాజకీయ పయనంలో ఉన్నారు. అన్నాడీఎంకేలో చీలికతో ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను ఏర్పాటు చేశారు. తొలుత చిన్నమ్మ ఈ కళగంకు ప్రతినిధిగా పేర్కొన్నా, చివరకు తానే ప్రధాన కార్యదర్శి ఆయన చాటుకున్నారు. అన్నాడీఎంకే కైవసంలో చిన్నమ్మకు కోర్టుల్లో చట్టపరంగా కొత్త చిక్కులు ఎదురు కాకూడదనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనేది జగమెరిగిన సత్యం. ఈ పరిస్థితుల్లో తాజాగా చిన్నమ్మ దూకుడు పెంచారు. అన్నాడీఎంకే కేడర్‌ను తన వైపుకు తిప్పుకుని పార్టీ కైవశంకు తగ్గ వ్యూహాలకు పదును పెట్టారు. చదవండి: (స్వగ్రామానికి రాజ్ కిరణ్ మృతదేహం.. సీఎం స్టాలిన్ రూ. పది లక్షల సాయం) శశికళ పర్యటన ఇలా.. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టిన్న చిన్నమ్మ శశికళ ఈనెల 27న తంజావూరులో , 28న మదురైలో, 29న రామనాథపురంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. పలు కార్యక్రమాలు, కేడర్‌తో పలకరింపుల దిశగా ఆమె పయనం సాగనుంది. ఈ పర్యటనల విజయవంతంతో పాటుగా ఆమెకు బ్రహ్మరథం పట్టేందుకు అమ్మమక్కల్ మున్నేట్ర కళగం సేనల్ని రంగంలోకి దించేందుకు దినకరన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా, చిన్నమ్మకు తన మద్దతు అని శనివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ప్రకటించారు. -
శశికళ చట్టానికి చిక్కేనా?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తనను తాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పేర్కొంటూ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన శశికళపై చట్టపరమైన చర్యలకు అన్నాడీఎంకే సిద్ధమైంది. ఈ విషయమై ఆపార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసుశాఖ న్యాయశాస్త్ర నిపుణులతో సమాలోచనలు జరుపుతోంది. అయితే చట్టం ఉచ్చులో ఆమె చిక్కక తప్పదని అన్నాడీఎంకే న్యాయనిపుణులు, సాధ్యం కాదని ఆమె న్యాయవాది వాదిస్తున్నారు. జయ మరణం తరువాత చోటుచేసుకున్న అనేక రాజకీయ పరిణామాల వల్ల అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదా నుంచి పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి, పార్టీ అగ్రనేతలంతా కలిసి శశికళ, టీటీవీ దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ చిహ్నమైన రెండాకుల గుర్తును సొంతం చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద శశికళ, దినకరన్ చేసిన పోరు చివరికి విఫలమైంది. పన్నీర్, ఎడపాడి నాయకత్వంలోని అన్నాడీఎంకేకు రెండాకుల చిహ్నం సొంతమని ఢిల్లీ హైకోర్టు సైతం అప్పట్లో తీర్పు చెప్పింది. దీంతో టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అనే పార్టీని స్థాపించి శశికళ కనుసన్నల్లోనే నడిపించారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష ముగించుకుని జైలునుంచి విడుదలైన శశికళ కొద్దినెలలు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా మెలిగినా ఇటీవల మరలా దూకుడు ప్రదర్శించారు. చదవండి: (స్టాలిన్ సర్కారు సరికొత్త పథకం) స్వర్ణోత్సవాల వేళ కలకలం అన్నాడీఎంకే స్వర్ణోత్సవాల సందర్భంగా ఈనెల 17వ తేదీన శశికళ తన అనుచరవర్గంతో కలిసి హడావుడి చేశారు. అన్నాడీఎంకే జెండాతో కూడిన కారులో చెన్నై మెరీనాబీచ్‌లోని ఎంజీఆర్, జయసమాధుల వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. మరుసటి రోజున ఎంజీఆర్ స్మారక మందిరం వద్దకు చేరుకుని ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అందులో ‘అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ’ అని పొందుపరిచి ఉంది. అక్కడి నుంచి చెన్నై రామాపురంలోని ఎంజీఆర్ గృహానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. శశికళ తీరు అన్నాడీఎంకే అధినాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పార్టీ హోదాను, పతాకాన్ని ఆమె అక్రమంగా వాడుకున్నారని ఆరోపిస్తూ చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. చెన్నై టీ నగర్లో శశికళ నివసిస్తున్నందున అదే పరిధిలోని మాంబళం పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి జయకుమార్, పార్టీ న్యాయసలహాదారు బాబు మురుగవేల్‌తో కలిసి బుధవారం రాత్రి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకేతో ఎలాంటి సంబంధం లేని శశికళ చట్టవిరుద్ధంగా వ్యవహరించినందున తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. న్యాయస్థానం, ఎన్నికల కమిషన్ ఆదేశాలను దిక్కరించిన శశికళపై చట్టపరమైన చర్యల సాధ్యాసాధ్యాలపై పోలీసు యంంత్రాగం న్యాయనిపుణులతో చర్చలు జరపడం ప్రారంభించింది. శశికళపై ఎఫ్ఐఆర్ నమోదు దిశగా పోలీస్‌శాఖ ముందుకు సాగుతున్నట్లు సమాచారం. అయితే ఈ చర్యలను ఆమె న్యాయవాది రాజా సెందూర్పాండియన్ ఖండించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిపై సివిల్ కోర్టులో కేసు విచారణలో ఉన్నపుడు శశికళపై చర్యలు తీసుకునేందుకు వీలుండదని ఆయన అన్నారు. న్యాయస్థానం ద్వారా శశికళపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుందని అన్నాడీఎంకే న్యాయసలహాదారులు చెబుతున్నారు. చదవండి: (నటుడు శింబుపై భారీ కుట్రలు) ఎడపాడి దిష్టిబొమ్మ దహనం ఇదిలా ఉండగా, శశికళ పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తిరునెల్వేలీ వన్నార్పేటలో ఆమె అభిమానులు అన్నాడీఎంకే పతాకాన్ని, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు. 26 నుంచి చిన్నమ్మ పర్యటన అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు సాగుతుండగా, చిన్నమ్మ శశికళ మాత్రం ఇవేమీ పట్టనట్లుగా రాజకీయ పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఈనెల 26వ తేదీన తంజావూరులో తన పర్యటనకు శ్రీకారం చుట్టి వారం రోజులపాటూ దక్షిణ జిల్లాలను చుట్టిరావాలని నిర్ణయించుకున్నారు. -
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి నేనే..
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తానేనని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మరోమారు చాటుకున్నారు. అన్నాడీఎంకే స్వర్ణోత్సవ వేడుకల శిలాఫలకంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తానే అని ప్రకటించుకున్నారు. అన్నాడీఎంకే నాయకత్వ పగ్గాలపై ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలో సమన్వయ కమిటీ ఓ శిబిరంగా, శశికళ నేతృత్వంలో మరో శిబిరంగా అన్నాడీఎంకే కేడర్ విడిపోయింది. చెన్నై మెరీనా తీరంలోని ఎంజీఆర్, జయలలిత సమాధులను శనివారం శశికళ సందర్శించి నివాళులరి్పంచిన విషయం తెలిసిందే. ఆదివారం అన్నాడీఎంకే 50వ వసంతంలోకి అడుగు పెట్టింది. పార్టీకి తానే ప్రధాన కార్యదర్శి అని చాటుకునే ప్రయత్నం శశికళ చేయడం పట్ల పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏకమవుదాం.. పార్టీని గెలిపిద్దాం పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి. శశికళ నేతృత్వంలో చెన్నై టీనగర్‌లోని ఎంజీఆర్ స్మారక మందిరంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ శిలాఫలకాన్ని శశికళ ఆవిష్కరించారు. ఇందులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అని రాసి ఉంది. అన్నాడీఎంకే జెండాతో కూడిన కారులో ఆమె ప్రయాణించారు. ఎంజీఆర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో గడిపారు. ముందుగా టీనగర్లో జరిగిన సేవా కార్యక్రమంలో శశికళ మాట్లాడారు. అందరం ఏకం అవుదాం.. అన్నాడీఎంకేను గెలిపిద్దాం అని పిలుపునిచ్చారు. ఎంజీఆర్, జయలలిత తమిళనాడును అన్నాడీఎంకే కంచుకోటగా మార్చారని, ఈ వైభవం మళ్లీ రావాలంటే అందరం ఒక్కటి కావాలి్సందేనని స్పష్టం చేశారు. తనను గతంలో సమస్యలు చుట్టుముట్టినా, అన్నాడీఎంకేకు చెందిన వారినే ప్రభుత్వ పాలనలో కూర్చోబెట్టానని పరోక్షంగా పళని స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమిళనాడు, తమిళ ప్రజలే తనకు ముఖ్యమని.. ఎంజీఆర్, అమ్మ ఆశయాల సాధనే లక్ష్యమని తేల్చిచెప్పారు. అయితే, శశికళ చర్యలను అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ ఖండించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వ్యవహారం కోర్టులో ఉందని గుర్తుచేశారు. శిలాఫలకంలో ఆమె పేరును ఎలా పొందుపరిచారు? అని ప్రశ్నించారు. ఇది కోర్టు ధిక్కార చర్య అని, చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అమ్మపార్టీలో మళ్లీ శశి‘కలకలం’
సాక్షి ప్రతినిధి,చెన్నై: అమ్మపార్టీలో మళ్లీ శశి‘కలకలం’ ప్రారంభమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్షపడిన తరువాత జైలుకెళుతూ జయ సమాధి వద్ద చిన్నమ్మ శశికళ శపథం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాలుగున్నరేళ్ల తరువాత శనివారం మళ్లీ అమ్మ సమాధి వద్ద నివాళులర్పించిన చిన్నమ్మ.. ఈసారి మౌనం పాటిస్తూ మళ్లీ శపథం చేశారా? అవును, నాటి శపథానికి ఇది కొనసాగింపు అంటున్నారు.. కొందరు రాజకీయ విశ్లేషకులు. ఇదీ నేపథ్యం.. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో నాలుగేళ్ల శిక్ష అనుభవించి ఈ ఏడాది జనవరి 27వ తేదీన శశికళ విడుదలయ్యారు. ఫిబ్రవరి 8వ తేదీన బెంగళూరు నుంచి చెన్నై వరకు రోడ్డు మార్గంలో ఆమె వచ్చినపుడు దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే ఆమె ఆశించినట్లుగా అన్నాడీఎంకే అగ్రనేతలు ఎవ్వరూ దరి చేరకపోవడంతో నిరాశచెందారు. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లు ప్రకటించి ఇంటికే పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి చెందడంతో రాజకీయాలపై మరలా దృష్టి సారించడం ప్రారంభించారు. చదవండి: (జయలలితకు నెచ్చెలి నివాళి) కారుకు పార్టీ జెండా కట్టుకుని.. ఈనెల 17వ తేదీన అన్నాడీఎంకే స్వర్ణోత్సోవాల సిద్ధమైన తరుణంలో శనివారం ఉదయం 10.30 గంటలకు చెన్నై టీ నగర్‌లోని వదిన ఇళవరసి ఇంటి నుంచి అమ్మ సమాధికి బయలుదేరారు. కారుకు అన్నాడీఎంకే పతాకాన్ని అమర్చుకోవడం, ఆమెను అనుసరించిన కార్యకర్తలు సైతం అదే పతాకాన్ని చేతబూని అనుసరించడం చర్చనీయాంశమైంది. 11.30 గంటలకు ఎంజీ రామచంద్రన్, జయ సమాధుల వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. జయ సమాధి వద్ద పది నిమిషాలు మౌనం పాటించి కన్నీళ్లు కార్చారు. గత కొన్నేళ్లు మోస్తున్న గుండెలోని భారాన్ని ఈరోజు దించుకున్నానని మీడియా వద్ద ఆమె అన్నారు. దీంతో ఆమె మాటల్లోని అంతరార్థం ఏమిటని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జైలు కెళ్లేముందు జయ సమాధిపై అరచేత్తో మూడుసార్లు గట్టిగా చరిచి పెదాలు కొరుకుతూ ఏదో శపథం చేస్తున్నట్లుగా ఆమె వ్యవహరించారు. జైలు నుంచి విడుదల కాగానే, ఆ తరువాత అనేక సందర్భాల్లో జయ సమాధి వద్దకు వెళ్లాలని శశికళ ప్రయత్నించినా వెళ్లలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అన్నాడీఎంకే చతికిలబడగా డీఎంకే ప్రభుత్వం దూసుకెళుతున్న పరిస్థితుల్లో అమ్మ పార్టీకి తానే దిక్కనే సంకేతాలను పంపుతున్నారు. ఈ నేపథ్యంలో జయ సమాధి వద్దకు శశికళ రాక కలకలం రేపింది. ఆదివారం ఉదయం 10 గంటలకు చెన్నై టీనగర్ లోని ఎంజీఆర్ స్మారక నిలయానికి, అక్కడి నుంచి చెన్నై రామాపురంలోని ఎంజీఆర్ నివాసానికి ఆమె వెళతారని సమాచారం. ఆదివారం ఆమె కార్యక్రమా లు అంతవరకే పరిమితమా లేక ఏదైనా దూకుడు ప్రదర్శిస్తారా అనే అనుమానాలు అన్నాడీఎంకే శ్రేణుల్లో నెలకొన్నాయి. అన్నాడీఎంకే కార్యాలయం వద్ద హడావుడి పార్టీని కైవసం చేసుకోవడంలో భాగంగా అమ్మ సమాధి నుంచి శశికళ నేరుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుంటారని ప్రచారం జరిగింది. దీంతో చెన్నై రాయపేటలోని పార్టీ మెయిన్ గేటు ప్రవేశద్వారం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉదయం 10 గంటలకే మాజీ మంత్రులు, అగ్రనేతలు, జిల్లాల కార్యదర్శులు కుర్చీలు వేసుకుని అడ్డుగా కూర్చున్నారు. అమ్మ సమాధి నుంచి శశికళ ఇంటికి చేరుకున్నారనే సమాచారం అందిన తరువాత మధ్యాహ్నం అందరూ వెళ్లిపోయారు. చిన్నమ్మ ఆస్కార్‌కు అర్హురాలు : మాజీ మంత్రి జయకుమార్ చిన్నమ్మ శశికళ ఒక మహానటి..ఆస్కార్ అవార్డుకు ఆమె అర్హురాలని మాజీ మంత్రి జయకుమార్ ఎద్దేవా చేశారు. చెన్నై మెరీనాబీచ్‌లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద శశికళ కన్నీ రు కార్చడంపై మీడియాతో ఆయన మాట్లాడారు. అంతా ఒక నాటకమని వ్యాఖ్యానించారు. జయ సమాధిని రోజూ లక్షలాది మంది సందర్శిస్తుంటా రు, శశికళ రాక కూడా అందులో భాగమేనని.. అంతకంటే ప్రత్యేకత ఏమీ లేదని ఆయన అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉందని, దాన్ని తన చేతుల్లోకి తీసుకుని నడిపిస్తానంటూ.. శశికళ అనడం అవివేకమన్నారు. అన్నాడీఎంకే అనేది ఒక గజరాజు, దానిపై ఒక దోమ కూర్చుని ఆ గజరాజును నేనే నడిపిస్తున్నానని భావించినట్లు శశికళ కూడా ప్రగల్భాలకు పోతున్నారని దుయ్యబట్టారు. నేడు 50 ఏళ్ల వేడుకలు అన్నాదురై శిష్యునిగా డీఎంకేలో కొనసాగిన ఎంజీ రామచంద్రన్ తన గురువు మరణం తరు వాత డీఎంకేలో ఇమడలేక పోయారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధితో విభేదించి 1972 అక్టోబర్ 17వ తేదీన అన్నాడీఎంకేను స్థాపించారు. రాజకీయాల్లో అప్రతిహతంగా సాగిన అన్నాడీఎంకే 49 ఏళ్లు పూర్తి చేసుకుని 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాయి. -
నేడు అమ్మ సమాధి వద్దకు శశికళ.. కీలక ప్రకటన చేసే అవకాశం..!
చెన్నై: దివంగత ముఖ్య మంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే శనివారం జయలలిత సమాధి దగ్గర నివాళులర్పించి అక్కడి నుంచే తన పొలిటికల్ రీ ఎంట్రీపై చినమ్మ ప్రకటన చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, అక్టోబర్ 17కి అన్నాడీఎంకే పార్టీ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఈ సమయాన్ని చిన్నమ్మ తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చదవండి: (నేడు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం) అయితే జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాలకు చిన్నమ్మ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో అన్నాడీఎంకే పతనంతో మళ్లీ వ్యూహాలకు పదునుపెట్టారు. తాజాగా కేడర్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు తగ్గ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా నమదు ఎంజీఆర్ పత్రిక ద్వారా రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో నేనొస్తున్నా అంటూ సంకేతాన్ని కేడర్‌లోకి పంపించారు. అన్నాడీఎంకే అందరిదీ అని, ఇందులో అందరూ సమానమే అని వ్యాఖ్యానించారు. పార్టీకి నేతృత్వం వహించే వారు తల్లితో సమానం అని, కేడర్‌ను బిడ్డల వలే చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చదవండి: (బ్రిటన్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హత్య) -
నేనొస్తున్నా.. అన్నాడీఎంకే అందరిదీ.. అందరూ సమానమే: శశికళ
సాక్షి, చెన్నై: ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వచ్చేందుకు దివంగత సీఎం జె.జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ సిద్ధమవుతున్నారు. నేనొస్తున్నా అంటూ కేడర్‌ను ఉద్దేశించి ఆమె ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాలకు చిన్నమ్మ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో అన్నాడీఎంకే పతనంతో మళ్లీ వ్యూహాలకు పదునుపెట్టారు. తాజాగా కేడర్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు తగ్గ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా నమదు ఎంజీఆర్ పత్రిక ద్వారా రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఈ మేరకు తాజా ప్రకటనలో నేనొస్తున్నా అంటూ సంకేతాన్ని కేడర్‌లోకి పంపించారు. అన్నాడీఎంకే అందరిదీ అని, ఇందులో అందరూ సమానమే అని వ్యాఖ్యానించారు. పార్టీకి నేతృత్వం వహించే వారు తల్లితో సమానం అని, కేడర్‌ను బిడ్డల వలే చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
శశికళకు మరో భారీ షాక్: రూ.వంద కోట్ల ఆస్తులు సీజ్
చెన్నె: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళకు మరో భారీ షాక్ తగిలింది. ఆమెకు సంబంధించిన వంద కోట్ల ఆస్తులను ఆదాయపు పన్ను విభాగం జప్తు చేసింది. బినామీ లావాదేవీల చట్టం కింద బుధవారం ఆమెకు సంబంధించిన 11 ఆస్తిపాస్తులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నె శివారులోని పయ్యనూర్‌లో ఉన్న ఆస్తులను ఐటీ విభాగం సొంతం చేసుకుంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1991-1996 మధ్య 24 ఎకరాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కోర్టు ఆదేశాల మేరకు ఐటీ విభాగం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ అప్పట్లో రూ.20 లక్షలు ఉండగా ఇప్పుడు దాని విలువ ఏకంగా రూ.100 కోట్లకు చేరింది. ఆస్తిపాస్తుల జప్తు ఇలా.. చెన్నెలో శశికళకు సంబంధించిన 65 ఆస్తులను గతేడాది ఐటీ అటాచ్ చేసింది. 2019లో రూ.1,600 కోట్ల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. 2017లో 187 ఆస్తులపై తనిఖీలు జరిగాయి. రూ.1,430 కోట్ల పన్ను చెల్లించలేదని శశికళపై అభియోగాలు ఉన్నాయి. 1991 జూలై నుంచి ఏప్రిల్ 1996 వరకు శశికళ బంధువు ఇళవరసి, వీఎన్ సుధాకరన్ పేర్ల భారీగా ఆస్తుల కొనుగోళ్లు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. 66 ఏళ్ల శశికళ 2017 ఫిబ్రవరిలో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలు నుంచి శశికళ విడుదలవడంతో తమిళనాడులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్రమాస్తుల కేసులో ఇంకా ఆమెపై విచారణ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని అందరూ ఊహించగా అనూహ్యంగా ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆమె మళ్లీ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది. చదవండి: Tamil Nadu: మా వల్ల కాదు బాబోయ్.. 15వ తేదీలోపు ఎన్నికలు అసాధ్యం! -
VK Sasikala: చిన్నమ్మకు ఐటీ ఝలక్
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు ఆదాయ పన్నుశాఖ ఝలక్ ఇచ్చింది. జైలు శిక్ష పడిన వ్యక్తికి ఐటీ బకాయిల్లో మినహాయింపు వర్తించదని ఐటీ వర్గాలు కోర్టుకు స్పష్టం చేశాయి. 2008లో ఏసీబీ సమర్పించిన నివేదిక మేరకు ఆస్తులకు సంబంధించి రూ. 48 లక్షలు పన్ను చెల్లించాలని ఐటీ వర్గాలు చిన్నమ్మను ఆదేశించా యి. దీనిని వ్యతిరేకిస్తూ ఐటీ ట్రిబ్యునల్‌ను శశికళ ఆశ్రయించారు. ఆ పన్ను చెల్లింపు నుంచి గట్టెక్కారు. అయితే ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ ఐటీ వర్గాలు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో గత ఏడాది శశికళ తరపున కోర్టులో కొత్త పిటిషన్ దాఖలైంది. ఈ పిటì షన్ల విచారణ గురువారం హైకోర్టు న్యాయమూర్తులు టీఎస్ శివజ్ఞానం, శక్తికుమార్ బెంచ్ ముందుకు వచ్చింది. శశికళ తరపు న్యాయవాదులు వాదిస్తూ.. ఇటీవల ఐటీ చెల్లింపు, బకాయిలు, జరిమానా విషయంగా కేంద్రం ఇచ్చిన మినహాయింపులకు సంబంధించిన ఉత్తర్వుల్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ మొత్తాన్ని శశికళ చెల్లించాల్సిన అవసరం లేదని వాదించారు. కాగా అక్రమాస్తుల కేసులో శిక్ష పడ్డ శశికళకు ఈ మినహాయింపు వర్తించదని, బకాయిలు చెల్లించాల్సిందేనని ఐటీశాఖ తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. వాదనల అనంతరం శశికళ తరపు వాదనల్ని పిటిషన్ రూపంలో కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ కేసును సెప్టెంబరు 8వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: Bandaru Dattatreya: నేనూ పేద కుటుంబం నుంచే వచ్చా -
అమ్మ సమాధి నుంచే రాజకీయ ప్రయాణం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మరలా రాజకీయ ప్రవేశ సంకేతాలు ఇస్తున్నారు. ఈనెల 5వ తేదీ తరువాత లాక్డౌన్ ఎత్తివేయగానే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించబోతున్నట్లు సెల్‌ఫోన్ ద్వారా శనివారం కొందరికి చెప్పినట్లు సమాచారం. అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు కామరాజ్, పార్దిబన్, శివగంగై జిల్లాకు చెందిన ఉమాదేవన్, దిండుగల్లుకు చెందిన అరుస్వామి, చెన్నై తాంబరానికి చెందిన నారాయణన్‌లతో శశికళ శనివారం సెల్‌ఫోన్ ద్వారా సంభాషణ ఇలా సాగిందని తెలుస్తోంది. ‘ఎంజీ రామచంద్రన్, జయలలిత మనల్ని విడిచివెళ్లినా వారి ఆత్మ మనందరినీ గమనిస్తూనే ఉంది. అన్నాడీఎంకే శ్రేణుల నుంచి గత నాలుగేళ్లగా నాకు ఉత్తరాలు అందుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తరువాత కూడా వస్తున్న ఉత్తరాలను చదివినపుడు ఎంతో ఆవేదన కలుగుతోంది. అన్నాడీఎంకేను అమ్మ జయలలిత ఎలా నడిపించారో అలానే నడిపించాలని ఆశిస్తున్నాను. ఈనెల 5వ తేదీతో లాక్డౌన్ ముగుస్తుందని అంటున్నారు. లాక్డౌన్ ఎత్తివేయగానే చెన్నై మెరీనా బీచ్‌లోని జయ సమాధి వద్దకు వెళ్లి అక్కడి నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభిస్తాను’అని వారితో చెప్పినట్లు తెలుస్తోంది. -
శశికళ వ్యాఖ్యలపై తమిళనాట కలకలం
-
శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకోబోం: ఏఐఏడీఎంకే
కృష్ణగిరి: దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, బహిష్కృత నేత వీకే శశికళను తిరిగి పార్టీలోకి తీసుకోబోమని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టిం చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపిం చింది. ఏఐఏడీఎంకేను తిరిగి గుప్పిట్లోకి తెచ్చు కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై ఈ మేరకు సోమ వారం ఆ పార్టీ నాయకత్వం స్పందించింది. ఎట్టి పరిస్థితు ల్లోనూ శశికళను తిరిగి ఏఐఏడీఎంలోకి రానివ్వ బోమని, పార్టీ శ్రేణులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ కో ఆర్డినేటర్ మునుస్వామి స్పష్టం చేశారు. ‘శశికళకు ఏఐఏడీఎంకేతో ఎలాంటి సంబంధం లేదు, ఆమె పార్టీకి చెందిన వ్యక్తి కాదు’ అని మునుస్వామి తేల్చిచెప్పారు. పార్టీ కేడర్ దృష్టి మరల్చి, వారిలో అయోమయం సృష్టించేందుకు శశికళ సాగిస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవన్నారు. పార్టీకి చెందిన ఏ ఒక్క నేత కూడా ఆమెతో ఫోన్లో మాట్లాడలేద న్నారు. ఒక్క కార్యకర్త కూడా ఆమె వలలో చిక్కుకోరని తెలిపారు. ఏఐఏండీఎంకేపై తిరిగి పట్టు సాధిస్తానంటూ శశికళ తన అనుయా యులతో అన్నట్లుగా ఉన్న ఆడియో క్లిప్పింగులు ఆదివారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: (పార్టీ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోలేను.. త్వరలోనే వస్తా!) -
AIADMK: పార్టీని విచ్ఛిన్నం చేయడానికే..శశికళ రాజకీయ ప్రవేశం
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలు అందించారు. దీంతో ఏఐఏడీఎంకేలో నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఆమె పార్టీని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఆమె రాజకీయ ప్రవేశంతో పార్టీకి మేలు జరకపోగా..కీడు జరుగుతుందని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. శశికళ రాజకీయ ప్రవేశం డీఎంకేకు మరింత మేలు చేసే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక తమిళనాడులోని రాజకీయ వర్గాలు ఇప్పుడు శశికళ తదుపరి చర్యపై నిశితంగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా శశికళ తన అనుయాయులైన ఇద్దరు నేతలతో చేసిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్పులు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. (చదవండి: చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేను: మమతా బెనర్జీ) -
VK Sasikala: పార్టీ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోలేను.. త్వరలోనే వస్తా!
చెన్నై: దివంగత ముఖ్య మంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలు అందించారు. గతంలో ఏఐఏడీ ఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఆమె ఆ పార్టీపై తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు. త్వరలోనే మంచి నిర్ణయం ప్రకటిస్తానంటూ తనకు మద్దతుగా నిలిచిన పార్టీ నేతలతో పేర్కొనడం ఈ అంచనాలకు బలం చేకూరుస్తోంది. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక లకు ముందు శశికళ..అంతర్గతపోరు కారణంగా పార్టీ నాశనమైపోవడం తాను చూడలేననీ, రాజకీ యాల నుంచి దూరంగా ఉంటానని ప్రకటించారు. ఆమె ఆ సమయంలో స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ, ఏఐఏడీఎంకే నాయకత్వం కోసం అగ్ర నేతలు పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య విభేదాల గురించేనని స్పష్టమైంది. తాజాగా, శశికళ తన అనుయాయులైన ఇద్దరు నేతలతో చేసిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్పులు చర్చనీయాంశంగా మారాయి. మొదటి వీడియోలో శశికళ ‘పార్టీని కచ్చితంగా గాడిలో పెడదాం, నేను తప్పక వస్తాను’అని అన్నట్లుగా ఉంది. రెండో ఆడియోలో ఏఐఏడీఎంకేను ఉద్దేశించి.. ‘నాతోపాటు అనేక మంది నేతల కృషితోనే పార్టీ ఏర్పడింది. ఆ ఇద్దరి మధ్య పోరుతో పార్టీ నాశనమై పోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. కరోనా వేవ్ తగ్గాక మద్దతుదారులతో మాట్లాడతా. ఆందోళన వద్దు. త్వరలోనే వస్తా. పార్టీని బలోపేతం చేస్తా్త’అని శశికళ అన్నట్లుగా ఉంది. ఈ ఆడియో క్లిప్పులు చర్చనీయాంశమయ్యాయి. శశికళ ఏఐఏ డీఎంకేపై మళ్లీ పట్టుబిగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తానంటూ సంకేతాలు ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు. జయలలిత మరణా నంతరం 2016లో శశికళ ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి అయ్యారు. అక్రమాస్తుల కేసులో 2017 ఫిబ్రవరిలో అరెస్టయి జైలుకు వెళ్లిన శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ పార్టీపై పట్టు కోల్పోయారు.