చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే అవకాశముందా?.. తమిళనాడు రాజకీయాల్లో తాజాగా ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అన్నాడీఎంకే కన్వీనర్ పన్నీర్ సెల్వం చేసిన తాజా వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. చేసిన తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం కోరిన వారిని క్షమించాలని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు శశికళను ఉద్దేశించి చేశారని ప్రచారం మొదలైంది. అయితే శశికళను క్షమించేది లేదని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.
చెన్నైలోని లిటిల్ సిస్టర్స్ వృద్ధాశ్రమంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పార్టీ కో–కన్వీనర్ ఎడపాడి పళనిస్వామితో కలిసి పన్నీర్ సెల్వం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షమాగుణమే మంచి నాయకత్వానికి నిదర్శనమని పేర్కొంటూ ఒక చిన్న కథ చెప్పారు. అయితే శశికళను ఇరుకున పెట్టేందుకే పన్నీర్ సెల్వం ఇలా మాట్లాడారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మాజీ మంత్రి జయకుమార్ స్పందిస్తూ.. ‘శశికళ లేకుండా అన్నాడీఎంకే పార్టీ బాగా నడుస్తోంది. ఆమెను క్షమించే ప్రసక్తే లేదు. పన్నీర్ సెల్వం వ్యాఖ్యలు శశికళకు వర్తించవు’ అని స్పష్టం చేశారు. (చదవండి: ఎన్నికలొస్తున్నాయిగా.. మీకోసమే ఐయామ్.. వెయిటింగ్)
శశికళపై పోలీసులకు ఫిర్యాదు
ఇప్పటికీ అన్నాడీఎంకే నాయకురాలినని చెప్పుకుంటున్నారని శశికళపై పోలీసులకు జయకుమార్ ఫిర్యాదు చేశారు. పార్టీతో ఆమె ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ శశికళ తన అధికారిక ప్రకటనలలో 'ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ'ని ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై పన్నీర్‌సెల్వం ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. గత అక్టోబర్‌లోనూ శశికళపై అన్నాడీఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఎన్నికలుంటే ఇలా.. లేకుంటే అలా!)
Comments
Please login to add a commentAdd a comment