శశికళపై ధ్వజమెత్తిన దీప
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారని వస్తున్న కథనాలపై జయలలిత మేనకోడలు దీపాకుమార్ స్పందించారు. 'ఇండియా టుడే'తో మాట్లాడిన ఆమె శశికళ తీరు సైనిక కుట్రను తలపిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నవారిని మార్చి తాను అకస్మాత్తుగా పగ్గాలు చేపడితే.. దానిని ప్రజలు ఒప్పుకోబోరని ఆమె పేర్కొన్నారు.
సీఎం పన్నీర్ సెల్వాన్ని గద్దె దించి శశికళ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారని, ఇందుకోసమే ఆదివారం అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కీలక భేటీ నిర్వహించబోతున్నారని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కథనాలపై దీప స్పందించారు. ఈ విషయంలో పలు కథనాలు వస్తున్నాయని, అయినా అన్నాడీఎంకే తుది నిర్ణయం తీసుకునేవరకు వేచిచూడటం మంచిదని చెప్పారు.
సీఎంగా శశికళ పగ్గాలు చేపట్టబోతున్నారన్న వార్తలపై స్పందిస్తూ.. 'ఇలా జరగాలని ప్రజలు కోరుకోవడం లేదు. తమిళనాడు ప్రజలకు అంతతి దుస్థితి వస్తుందని నేను కూడా అనుకోవడం లేదు. ఇది చాలా తప్పుడు నిర్ణయం. ప్రభుత్వాన్ని సైనిక కుట్రతో కూల్చడం లాంటిదే. ఆమె ప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన నేత కాదు' అంటూ పేర్కొన్నారు. జయలలిత సలహాదారు అయిన షీలాబాలకృష్ణన్ ను పక్కా ప్లాన్‌తోనే పదవి నుంచి తప్పించారని ఆమె ఆరోపించారు.