మంతనాల్లో బిజీ
♦ చర్చలు షురూ..
♦ భద్రత పెంపు
♦ తొలి గెలుపుతో పన్నీరు జోష్
♦ టీటీవీకి భంగపాటు
♦ దూకుడు పెంచిన పళని
♦ ఏకం అయ్యేదెన్నడో
♦ పదవుల చర్చ..ప్రచార హోరు
టీటీవీ దినకరన్‌ను సాగనంపుతూ మంత్రులు చేసిన ప్రకటనతో అన్నాడీఎంకేలో రాజకీయ చర్చ తారాస్థాయికి చేరింది. బుధవారం పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ సాగింది. ఓ వైపు పన్నీరు శిబిరం, మరో వైపు సీఎంతో మంత్రులు, ఇంకో వైపు టీటీవీ దినకరన్ ఎవరికి వారు వేర్వేరుగా మంతనాల్లో బిజిబిజీ అయ్యారు. సీఎంకు చెక్ పెట్టే రీతిలో టీటీవీ నిర్ణయం తీసుకునేనా అన్న చర్చ ఊపందుకుంది. దీంతో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, ఊహాగానా లు, ప్రచారాలకు చెక్ పడినా, ఇక, పన్నీరుతో చర్చలు షురూ అని సీఎం టీం ప్రకటించడంతో రాజకీయ ఆసక్తి సాఫీగా సాగింది. అయితే, చర్చల్లో పదవుల పందేరాల వ్యవహారం చర్చ హోరెత్తే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది.
సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణం తదుపరి నిత్యం అన్నాడీఎంకేలో ఏదో ఒక వివాదం, చర్చ సాగుతూనే వస్తున్నది. చిన్నమ్మ శశికళ జైలు జీవితంతో పార్టీకి అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు షాక్ ఇచ్చే నిర్ణయాన్ని మంగళవారం మంత్రులు తీసుకోవడం మరో పెద్ద చర్చకు, ఉత్కంఠకు దారి తీసింది. ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీయనున్నాయో అన్న ఉత్కంఠ రాష్ట్రంలో బయలు దేరింది. సీఎంకు చెక్ పెట్టే రీతిలో దినకరన్ దూకుడు పెంచవచ్చన్న సంకేతాలతో అందరి దృష్టి అన్నాడీఎంకే పరిణామాల మీద పడింది. దీంతో శాంతి భద్రతలకు విఘాతం కల్గేనా అన్నంత ఉత్కంఠ బయలు దేరడంతో ఆగమేఘాలపై చెన్నైతో పాటు పలు నగరాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయం, సీఎం, మాజీ సీఎం, దినకరన్ ఇంటి పరిసరాల్ని అయితే, భద్రతా వలయంలోకి తెచ్చారు.
మంతనాల్లో బిజీ బిజీ... ఈ ఉత్కంఠకర పరిస్థితుల నేపథ్యంలో ఎవరికి వారు మంతనాల్లో బిజీ కావడంతో మీడియా దృష్టి అంతా అన్నాడీఎంకే వైపుగా మరలింది. రాష్ట్రంలో ఎక్కడచూసినా అన్నాడీఎంకే అంతర్గత సమరం చర్చే. ఈ పరిస్థితుల్లో తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు తగ్గట్టు ఉదయాన్నే దినకరన్ ప్రయత్నాల్లో పడ్డారని చెప్పవచ్చు. తనకు మద్దతుగా కనీసం యాభై మంది వరకు ఎమ్మెల్యేలు కదిలి వస్తారని ఆశించినా, భంగపాటు తప్పలేదు.
ఆరేడుగురు ఎమ్మెల్యేలు మాత్రం ప్రత్యక్షం కావడంతో వారితో మంతనాల్లో దినకరన్ మునిగారు. చివరకు మీడియా ముందుకు వచ్చి ఉత్కంఠకు తెర పడేలా చేశారు. పోలీసులకు కాస్త పని తగ్గినట్టు చేశారు. మీడియాతో మాట్లాడే సమయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడుతున్నానని, దూరం నిర్ణయం తనకు ఎలాంటి బాధను కల్గించలేదంటూ వ్యాఖ్యలు చేయడం విశేషం. అందరూ ఐక్యంగా ఉండాలన్నదే తన అభిమతం అని, పదవికి రాజీనామా అన్నది మాత్రం చిన్నమ్మ శశికళ నిర్ణయం మేరకే నంటూ ముందుకు సాగారు.
పన్నీరు జోష్ : దినకరన్‌కు వ్యతిరేకంగా మంత్రుల ప్రకటనతో పన్నీరు శిబిరంలో ఆనందం తాండవం చేసిందని చెప్పవచ్చు. ఇక, చిన్నమ్మ శశికళకు చెక్ పెట్టినట్టేనన్నంత ధీమాలో మునిగారు. ఉదయాన్నే గ్రీమ్స్ రోడ్డులోని ఆయన నివాసం వద్దకు మద్దతు నేతలు, కేడర్ తరలి రావడంతో ఆ పరిసరాలు చాలా రోజు అనంతరం మళ్లీ కిక్కిరిశాయి. ఈసందర్భంగా మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ధర్మయుద్ధంలో ఇది తొలి గెలుపుగా అభివర్ణించారు.
పళని దూకుడు : దినకరన్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదేని వ్యూహాలకు పదును పెట్టిన పక్షంలో తిప్పికొట్టేందుకు తగ్గ అస్త్రాల్ని సిద్ధం చేసుకునే రీతిలో ఉదయాన్నే సీఎం ఎడపాడి పళనిస్వామి సైతం మంతనాల్లో బిజీ అయ్యారు. ఇరవై మందికి పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన నివాసం వద్దకు చేరుకోవడంతో హడావుడి పెరిగింది. దూకుడు పెంచే రీతిలో తరచూ ఎవరో ఒక మంత్రి బయటకు వచ్చి మీడియా ముందు దినకరన్‌కు హెచ్చరికలు చేసి వెళ్లడం గమనార్హం. పార్టీ కార్యాలయం వైపుగా అడుగులు పెడితే తీవ్ర పరిణామాలు తప్పదన్నట్టుగా హెచ్చరికలు సైతం అందులో ఉండడం గమనార్హం. ఈ మంతనాల జోరుసాగుతున్న సమయంలో దినకరన్ మీడియాతో స్పందించి తీరును పరిగణించి ఇక విలీనం విషయంగా దూకుడు పెంచేందుకు పళని సిద్ధమయ్యారు.
చర్చలు షురూ : ఇక, అన్నాడీఎంకే ఒకే వేదిక అన్నట్టుగా నేతలు ముందుకు సాగే సమయం ఆసన్నం అవుతోన్నట్టు స్పష్టమైంది. గతంలో శశి అండ్ కోను అమ్మ జయలలిత సాగనంపితే, ప్రస్తుతం దినకరన్ అండ్ కోను సాగనంపుతూ తీసుకున్న నిర్ణయం పళనిస్వామి మీద ప్రజల్లో కాస్త క్రేజ్ పెంచినట్టు అయింది. పన్నీరు పంతనం నెగ్గడం, పళని దూకుడు పెంచడం వెరసి ఇక, అన్నాడీఎంకేకు మంచి రోజులు మళ్లీ వస్తాయా అన్న ఆశలు కేడర్‌లో మొలకెత్తుతున్నాయి. ఇక, శశికళ, దినకర్ అండ్ కోకు చెక్ పెట్టడాన్ని ఆహ్వానించే రీతిలో ప్రజల మధ్య చర్చలు సాగడం విశేషం.
ఈ పరిణామాల నేపథ్యంలో విలీనం విషయంగా చర్చలు సాగించేందుకు పన్నీరు, పళని శిబిరాలు సిద్ధం అయ్యాయి. గురువారం నుంచి సాగే చర్చల్లో ఎలాంటి ప్రతిపాదనలు, షరతులు తెర మీదకు రానున్నాయో అన్న కొత్త ఉత్కంఠ బయలు దేరింది. ముందుగా ఇరు పక్షాల ప్రత్యేక కమిటీలో సమావేశాలు సాగించి, చివరగా పళని, పన్నీరు ఒకే వేదిక మీదకు వచ్చేందుకు తగ్గట్టు కార్యచరణ సాగనుంది. అయితే, ఈ చర్చల్లో తెర మీదకు రానున్న అంశాలపై రక రకాల ప్రచారాలు, పుకార్లు అప్పుడే ఊపందుకున్నాయి. పన్నీరు సీఎం అన్నట్టుగా, కాదు..కాదు ప్రధాన కార్యదర్శి అంటూ ఓ వైపు, మరో వైపు పళనికి ఇక రెండు(పార్టీ, ప్రభుత్వం) చోట్లా డిప్యూటీ పదువులే అన్నంతగా చర్చలు సాగుతుండడం గమనార్హం. తమిళ మీడియా ఇదే అంశాలను తెర మీదకు తెచ్చే కథనాలు మొదలెట్టే పనిలో పడ్డాయి. అయితే, చర్చల్లో పై అంశాలు సాధ్యమేనా..? ఏకం అయ్యేదెన్నడో..?, విలీనం మూహూర్తం ఎప్పుడో అన్నది వేచి చూడాల్సిందే.