రెండాకులు ఒకటయ్యేనా?
♦ శశికళ ప్రమేయం లేకుండా రాజీబాట
♦ దినకరన్ వర్గం కస్సుబుస్సు
♦ మంత్రుల్లో సంతోషం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఎంతో చరిత్ర కలిగిన అఖిలభారత అన్నాడీఎంకే అంతర్థ్దానం కావడం, రెండాకుల చిహ్నం రాలిపోవడం జీర్ణించుకోలేక ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన రాజీ ప్రయత్నాలు ఫలించేనా, రెండాకులు మళ్లీ చిగురుతొడిగేనా అనే అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. అమ్మ మరణం తరువాత పార్టీ, ప్రభుత్వాలను చేజిక్కించుకోవడం ద్వారా శశికళ వర్గమే పైచేయిగా నిలిచింది. అయితే ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో శశికళ వర్గాన్ని అన్నాడీఎంకే నేతలుగా, రెండాకుల చిహ్నంపై పోటీ చేసేందుకు అర్హులుగా ఎన్నికల కమిషన్ భావించలేదు.
‘అన్నాడీఎంకే అమ్మ’ పేరున కొత్త పార్టీని స్థాపించి టోపీ గుర్తుపై పోటీచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంజీ రామచంద్రన్ స్థాపించి, జయలలిత హయాంలో ఒక బలమైన రాజకీయపార్టీగా ఎదిగిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం లేకుండా చేసిన అపప్రథను శశికళ వర్గం మూటకట్టుకుంది. తాత్కాలికంగా అధికారంలో ఉన్నా భవిష్యత్తులో రాజకీయ మనుగడ ఉండదనే సత్యాన్ని గ్రహించిన సీఎం ఎడపాడి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు.
శశికళ, దినకరన్ వల్ల ఏర్పడిన అప్రతిష్టను తొలగించుకోవడం, పార్టీ, చిహ్నాలను దక్కించుకోవడం ప్రధాన కర్తవ్యంగా భావించారు. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని, శాశ్వత ప్రధాన కార్యదర్శి హోదాలో జయలలిత చేత నియమింపబడిన తామే పార్టీకి అసలైన వారసులమని ఎన్నికల కమిషన్ వద్ద వాదిస్తున్న పన్నీర్‌సెల్వం వర్గాన్ని చేరదీయక తప్పదని సీఎం తీర్మానించుకున్నారు.
దినకరనే ప్రతిబంధకం: అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం కోల్పోవడం ఇరువర్గాలకు నష్టమేనని తెలుసుకున్నారు. సామరస్యపూర్వక వాతావరణంలో ఏకం అయ్యేందుకు సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం సిద్దమైనారు. అయితే శశికళ కుటుంబాన్ని దూరం పెట్టాలన్న పన్నీర్‌సెల్వం షరతులు విలీనానికి ప్రతిభందకంగా మారుతోంది. శశికళ జైలు కెళ్లేపుడు పార్టీ బాధ్యతలను తన అక్క కుమారుడు దినకరన్‌ను ఉప ప్రధానకార్యదర్శిగా నియమించారు.
అయితే దినకరన్ వైఖరితో ప్రభుత్వం అసంతృప్తి రగిలిపోతోంది. దినకరన్‌ను దూరం పెట్టడం వల్ల ప్రజల్లో ప్రతిష్టపెరగడం, పన్నీర్‌సెల్వం వర్గం ఏకం కావడం, రెండాకుల చిహ్నం దక్కడం వంటి లాభాలు ఉన్నాయని సీఎం ఆశతో ఉన్నారు. పన్నీర్‌సెల్వం డిమాండ్లకు అనుకూలంగా దినకరన్‌ను ఒప్పించాలని లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై నాయకత్వంలో 9 మందితో కూడిన మంత్రుల బృందాన్ని సీఎం సిద్దం చేశారు. అయితే పార్టీ బాధ్యతల నుండి తప్పుకునేందుకు దినకరన్ ససేమిరా అంటున్నారు. మాట వినకుంటే డిస్మిస్ చేయాల్సి వస్తుందని సీఎం వర్గ మంత్రులు చేసిన హెచ్చరికలకు జవాబుగా ప్రభుత్వాన్ని కూల్చివేయగల సత్తా తనకు ఉందని దినకరన్ వ్యాఖ్యానించారు.
రెండువర్గాల విలీన ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని పలువురు మంత్రులు మంగళవారం తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా పార్టీ పరంగా ఇంతటి కీలక పరిణామాల్లో శశికళ పేరు నామమాత్రం కూడా చోటుచేసుకోక పోవడం విశేషం. అన్నాడీఎంకేలో సాగుతున్న రాజీబాటలో ప్రయాణంలో సీఎం ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాలు ఒకటిగా నిలుస్తుండగా, దినకరన్ వైరి వర్గంగా మారిపోవడం విచిత్రకరమైన పరిణామం. మరి ఈ పరిస్థితిలో అన్నాడీఎంకే విలీనం సాధ్యమా అనే ప్రశ్నకు మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు.