
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళను జైలు నుంచి బయటకు తీసుకొస్తామని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. జైళ్ల శాఖకు విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికలో చిన్నమ్మ పేరు లేదని, దీన్ని బట్టి చూస్తే ఆమెకు క్లీన్‌చిట్ ఇచ్చినట్టు స్పష్టం అవుతోందన్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళ సత్‌ప్రవర్తన కారణంగా ఈ ఏడాది చివరి నాటికి జైలు నుంచి బయటకు రాబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ఆనందంతో ఉన్న సమయంలో సత్ ప్రవర్తన జాబితాలో చిన్నమ్మ పేరు లేదన్నట్టుగా రెండు రోజుల క్రితం సమాచారాలు వెలువడ్డాయి.
దీంతో వారి ఆశలు అడియాశలయ్యారు. శశికళ విడుదల ఇక, ఇప్పట్లో లేనట్టేనని, శిక్షా కాలం పూర్తిగా ఆమె జైలుకు పరిమితం కావాల్సిందేనా అన్న చర్చ జోరందుకుంది. అయితే, ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని న్యాయవాది రాజచెందూర్ పాండియన్ వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం దినకరన్ మీడియాతో మాట్లాడుతూ చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం తథ్యం అని ధీమా వ్యక్తంచేశారు. దీపావళి రోజున ఆమె బయటకు వస్తారని ఎవ్వరూ చెప్పలేదే అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆమెపై ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేదని స్పష్టం చేశారు. జైలులో అందరి ఖైదీలకు వర్తిసున్న నిబంధనలు చిన్నమ్మ కూడా పాటిస్తున్నారని, వస్త్రధారణలోనూ సమానమేనని పేర్కొన్నారు. ఆమె జైలు నుంచి బయటకు వెళ్లి వచ్చినట్టుగా ఆరోపణలు వచ్చాయని, అయితే, విచారణ కమిషన్ నివేదికలో ఆమె పేరు అన్నది అసలు లేదని వ్యాఖ్యానించారు.
ఈ దృష్ట్యా, చిన్నమ్మ ఏ తప్పూ చేయలేదని క్లీన్‌చిట్ ఇచ్చనట్టేగా అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. చిన్నమ్మను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తగ్గ చర్యలు చేపట్టి ఉన్నామని, ఆమె తప్పకుండా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆమె బయటకు రాకుండా రాజకీయాలు చేసే వాళ్లుచేస్తుంటారని, వాటన్నింటినీ అధిగమించి బయటకు చిన్నమ్మ వచ్చి తీరుతారని పేర్కొన్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు రాజకీయ పార్టీ గుర్తింపు వ్యవహారం మీద విచారణ ముగిసి ఉన్నదని, త్వరలో ఈసీ అధికారిక ప్రకటన చేయ వచ్చని చెప్పారు. ఉప ఎన్నికల్లో ధనబలం, డీఎంకే చేత గాని తనం వెరసి అన్నాడీఎంకేను గెలిపించాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే గెలిచినంత మాత్రాన అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు లేదని , పేర్కొన్నారు. ఇది ఎన్నికలకు రెఫరెండం మాత్రం కాదన్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తుందని, తమకు అంతలోపు ఎన్నికల కమిషన్ గుర్తింపు వస్తుందన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment