సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయంగా అస్త్రసన్యాసం చేసిన చిన్నమ్మ శశికళను అన్నాడీఎంకేలోకి రావమ్మా అని పార్టీ సమన్వయకర్త, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఆహ్వానించడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. మాటమాత్రమైనా తనతో చెప్పకుండా పన్నీర్ చేసిన ప్రకటనపై సహ సమన్వయ కర్త, సీఎం ఎడపాడి పళనిస్వామి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష ముగించుకుని జైలు నుంచి విడుదలైన శశికళ తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తారని అందరూ అనుకున్నారు. బెంగళూరు నుంచి చెన్నైలోని ఇంటికి చేరుకున్న తరువాత కొన్నాళ్లు అదే తరహాలో వ్యవహరించినా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించారు. అంతేగాక ప్రస్తుతం ఆలయాల చుట్టూ తిరుగుతూ ఆధ్యాత్మిక పర్యటనలతో గడుపుతున్నారు.
ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేలో చేర్చుకునేందుకు సిద్దమని ఆ పార్టీ సమన్వయకర్త, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఇటీవల సంచలన ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అధ్యక్ష విధానం ఎంజీఆర్‌తో, ప్రధాన కార్యదర్శి హోదా జయలలితతో ముగిసింది. సమన్వయకర్త, సహ సమన్వయకర్త హోదాల్లో పన్నీర్, ఎడపాడి పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. ఇదే తరహా కొనసాగేందుకు శశికళ సమ్మతిస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని ఒకసారి, పరిశీలిస్తామని మరోసారి పన్నీర్ అన్నారు. శశికళతో తనకు విబేధాలు, మనస్తాపాలు లేవు, అమ్మ మరణించినపుడు కొన్ని సందేహాలు ఉండేవని పన్నీర్ చెప్పారు. పన్నీర్ చేసిన ప్రకటన అన్నాడీఎంకేలో తీవ్ర చర్చనీయాంశమైంది. పన్నీర్ చేసిన వ్యాఖ్యలకు ఓటర్లు ఏ విధంగా ప్రభావితం అవుతారోనని ఎడపాడికి బెంగపట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎడపాడికి గెలుపు కోసం ఈనెల 24వ తేదీ నుంచి పన్నీర్‌సెల్వం ప్రచారం చేస్తున్నారు.
అంతకు ముందు వీరిద్దరూ శశికళ అంశంపై రహస్యంగా మంతనాలు చేసినట్లు సమాచారం. అన్నాడీఎంకే గెలుపు అవకాశాలు, టీటీవీ దినకరన్ పార్టీ అభ్యర్థుల వల్ల ఓట్ల చీలిక, ఉత్తర, దక్షిణ తమిళనాడులో అన్నాడీఎంకే పరపతి, కొంగుమండలంలోని అన్నా డీఎంకే ఓట్ బ్యాంకు అంశాలపై కూడా ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. శశికళను అన్నాడీఎంకేలో ఆహ్వానించడంపై ఎడపాడి, పన్నీర్ మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయనే ప్రచారం కూడా జరిగింది. అదేమీ లేదని ప్రజలకు, పార్టీ నేతలకు సంకేతాలు ఇవ్వడమే ఎడపాడి, పన్నీర్ ఏకాంత చర్చల వెనుక అసలు ఉద్దేశమని వాదిస్తున్నారు.
చదవండి: తమిళనాడులో హీట్ పెంచిన ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment