సాక్షి, చెన్నై(తమిళనాడు): చిన్నమ్మ శశికళ రాజకీయ దూకుడు పెరగడంతో.. అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. చిన్నమ్మ ప్రతినిధిగా ముద్ర పడ్డ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్‌తో పన్నీరుసెల్వం సోదరుడు రాజ భేటీ కావడం చర్చకు దారితీసింది. ఈ వ్యవహారాలతో సేలంలో ఉన్న పళనిస్వామి హుటాహుటిన గురువారం రాత్రి చెన్నైకు చేరుకున్నారు. ఇక చిన్నమ్మ శశికళను పార్టీలోకి మళ్లీ ఆహ్వానించే విషయంపై అన్నాడీఎంకే సమన్వ య కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం చేసిన వ్యాఖ్యలకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది.
ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ, మాజీ మంత్రి సెల్లూరు రాజుతో సహా పలువురు అన్నాడీఎంకే నేత లు గురువారం ప్రకటనలు చేశారు. దీంతో చిన్నమ్మ వ్యవహారం అన్నాడీఎంకేలో హట్‌టాఫిక్‌గా మారింది. ఈ వ్యవహారాలు ఓ వైపు ఉంటే, మరోవైపు చిన్నమ్మ రాజకీయ మంతనాలు ఊపందుకున్నాయి. బుధవారం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు తంజావూరులో ఉన్న ఆమెను పలువురు నేతలు కలిసి మాట్లాడినట్టు తెలిసింది. దినకరన్ ఇంటి శుభ కార్యక్రమానికి చిన్నమ్మ హాజరు కావడం, అక్కడికి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో పాటుగా దక్షిణ తమిళనాడులో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు, సన్నిహితులు రావడం చర్చనీయాంశమైంది.
భేటీపై ఆసక్తి
తంజావూరు పర్యటన ముగించుకుని మదురైకు గురువారం మధ్యాహ్నం చిన్నమ్మ వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ముఖ్య నేతలతో శశికళ భేటీ అయ్యారు. దక్షిణ తమిళనాడులోని దేవర్ సామాజిక వర్గాన్ని ఏకం చేసే రీతిలో, తనకు సన్నిహితంగా, మద్దతుగా ఉన్న అన్నాడీఎంకే మాజీలతో ఈ సంప్రదింపులు జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ముందుగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా చిన్నమ్మ శశికళ వ్యూహాలకు పదును పెట్టారని చెప్పవచ్చు. తాను పయనిస్తున్న మార్గంలో రైతులతో ముచ్చటిస్తూ, పంట పొలాల్లోకి వెళ్లి పలకరిస్తూ ముందుకు సాగారు.
చెన్నైకు పళని స్వామి..
అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో కన్వీనర్ పళనిస్వామి సేలం నుంచి గురువారం రాత్రి చెన్నైకు చేరుకున్నారు. చిన్నమ్మ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సైతం వ్యూహ రచనల్ని వేగవంతం చేశారు. ఇక, చిన్నమ్మకు మద్దతు గళం పెరుగుతున్న నేపథ్యంలో దినకరన్‌తో పన్నీరు సోదరుడు రాజ భేటీ కావడాన్ని తీవ్రంగానే పరిగణించారు. అదే సమయంలో మనస్సు నొప్పించే విధంగా ఇతరులపై వ్యాఖ్య లు చేయవద్దు అని తన మద్దతు దారులకు పళని స్వామి హితవు పలికినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, పళనిస్వామి కేవలం వైద్య చికిత్స కోసం చెన్నైకు వచ్చారేగానీ, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టేందుకు కాదంటూ ఆయన వర్గీయులు పేర్కొనడం గమనార్హం.
చదవండి: మంత్రి వర్గంలో సంస్కార హీనులు
Comments
Please login to add a commentAdd a comment