సాక్షి ప్రతినిధి, చెన్నై: శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి పళనిస్వామి స్పష్టం చేశారు. దీనిపై పార్టీ ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నాలుగేళ్ల జైలుశిక్షను పూర్తిచేసుకుని ఈనెల 27న బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలవుతున్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా జైలు వర్గాల నుంచి ఉత్తరం అందినట్లు శశికళ తరఫు న్యాయవాది మంగళవారం ప్రకటించారు. శశికళపై ఎడపాడి, పన్నీర్‌సెల్వం నాయకత్వంలోని అన్నాడీఎంకే బహిష్కరణ వేటువేసింది. జైలు నుంచి శశికళ బయటకు రాగానే అన్నాడీఎంకేపై ప్రతీకారణ ధోరణికి పాల్పడగలదని అంచనా వేస్తున్నారు. పారీ్టలో చేర్చుకోవడం ద్వారా సామరస్యంగా ముందుకెళ్లే అవకాశాలూ లేకపోలేదని కొందరు వాదిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను మంగళవారం ఢిల్లీలో కలిసిన అనంతరం సీఎం ఎడపాడి మీడియాతో మాట్లాడారు. శశికళ జైలు నుంచి విడుదల పారీ్టపై ఎలాంటి ప్రభావం చూపదు. శశికళ పారీ్టలో చేరే అవకాశాలు వందశాతం లేవు. శశికళను చేర్చుకోరాదని పారీ్టలో ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాంమని సీఎం అన్నారు. శశికళ జైలు నుంచి విడుదలకాగానే అన్నాడీఎంకేను స్వాదీనం చేసుకుంటారని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత సీఆర్ సరస్వతి వ్యాఖ్యానించారు.
22న క్యాబినెట్ సమావేశం : ముఖ్యమంత్రి పళనిస్వామి ఈనెల 22న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. చెన్నై సచివాలయంలో జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి తప్పనిసరిగా మంత్రులంతా హాజరుకావాలని మంగళవారం ఆయన ఆదేశాలు జారీచేసారు. చెన్నై మెరీనాబీచ్‌లో నిర్మాణం పూర్తిచేసుకున్న జయలలిత స్మారక మండపాన్ని ఈనెల 27న ప్రారంభిస్తున్నట్లు మంగళవారం అధికారిక ప్రకటన విడుదలైంది. ప్రధాని మోదీ ఈ మండపాన్ని ఆవిష్కరిస్తారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా మంత్రులతో చర్చిస్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment